Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఆ భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్‌.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..
కాకినాడ సెజ్‌లో భూములు కోల్పోయిన రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కూటమి ప్రభుత్వం.. కాకినాడ సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంది.. అంతేకాదు, రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనుంది.. దీంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఇచ్చిన హామీకి కార్యరూపం దాల్చినట్టు అయ్యింది.. కాకినాడ సెజ్‌ రైతులకు కూటమి ప్రభుత్వం ఊరట.. కాకినాడ సెజ్‌కు రైతులు ఇచ్చిన భూములు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. రైతులు ఇచ్చిన 2,180 ఎకరాలు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. భూములను రైతులకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు. రైతుల వద్ద రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీలు వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి.. అయితే, ఎన్నికల వేళ రైతులకు పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. హామీ నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్‌కి కృతజ్ఞతలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వం.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే.. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ మంత్రి నారా లోకేష్‌, గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్ సహా పలువురు గూగుల్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఇక, విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌పై ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. విశాఖ.. దేశంలోని మొదటి AI సిటీగా మారబోతోంది.. గూగుల్‌ 15 బిలియన్‌ AI డేటా సెంటర్‌తో విశాఖకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీ నుంచి వికసిత్ భారత్ దిశగా చారిత్రాత్మక అడుగు పడింది.. ఈ ప్రాజెక్ట్ అందరకీ ఉపయోగపడుతుంది. యువత, రైతులు, వైద్యులు, మత్స్యకారులు, వ్యాపారవేత్తలు, మహిళలు, విద్యార్థుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు పవన్‌..

చిన్నప్పుడు చందమామ కథలు వింటే.. ఇప్పుడు చంద్రబాబు కథలు వినాల్సి వస్తుంది..
చిన్నప్పుడు చందమామ కథలు వింటే.. ఇప్పుడు చంద్రబాబు కథలు వినాల్సి వస్తుంది అంటూ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినవారిని స్వాగతిస్తాం.. కానీ, వాటి వల్ల జరిగే ప్రయోజనాల మీద చర్చ జరగాలి అన్నారు.. ఏపీ ప్రభుత్వం-గూగుల్‌ మధ్య ఎంవోయూపై ఆయన స్పందిస్తూ.. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడం ప్రపంచ వ్యాప్తంగా లేదన్నారు.. గూగుల్ పేరుతో తండ్రి, కొడుకు ప్రమోషన్ చేసుకుంటున్నారు అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై సెటైర్లు వేసిన.. డేటా సెంటర్‌తో పాటు డెవలప్‌మెంట్‌ సెంటర్ పెట్టాలని గూగుల్ నుంచి హామీ పొందాలి అని సూచించారు.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, యువతకు లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కీలకం అన్నారు.. రైడెన్ ఇన్ఫో టెక్ వల్ల వచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 200మంది మాత్రమే..

పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతులు.. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రావివారిపోడులో పవన్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది.. కాకినాడ సెజ్ అవార్డు భూములు 2,180 ఎకరాల తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్లు చేసేలా నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. సెజ్ పరిధిలోని 1,551 మంది రైతులకు చెందిన 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేయనున్నారు.. అయితే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చొరవతో రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించారని ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు.. రావిపాడులో పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు..

గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. శిల్పకళావేదికలో నియామక పత్రాల కార్యక్రమం
గ్రూప్-2 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 18న గ్రూప్-2 ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. మొత్తం 782 మంది అభ్యర్థులు ఈ సందర్భంగా తమ నియామక పత్రాలను స్వీకరించనున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్‌ల పరిశీలనను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రెవెన్యూ, హోమ్, జీఏడీ శాఖల మధ్య సమన్వయం కల్పించి, అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.

లైబ్రరీ గేటు బద్దలు కొట్టిన జాగృతి నాయకులు
హైదరాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిక్కడపల్లి సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద బీహెచ్‌ఆర్‌ఎస్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పోలీసులు అడ్డుపడ్డారు. గ్రూప్‌-1 పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నిరుద్యోగ సమస్యలపై విద్యార్థులతో చర్చించేందుకు కవిత లైబ్రరీకి వెళ్లగా, పోలీసులు ఆమెను ఆపేశారు. అయితే, లైబ్రరీలోకి అనుమతి ఇవ్వకపోవడంతో జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైబ్రరీ గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కవితతో పాటు ఉన్న జాగృతి కార్యకర్తలు విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు మాత్రమే వచ్చామని, అనవసరంగా అడ్డుకోవడం సరికాదని విమర్శించారు. పోలీసులు మాత్రం చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనతో చిక్కడపల్లి సిటీ సెంట్రల్‌ లైబ్రరీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అంతా మీ ఇష్టమేనా..? ఈడీపై బీఆర్ గవాయ్ ఆగ్రహం..
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ప్రభుత్వ సంస్థ అయిన TASMAC కి సంబంధించిన కేసని తెలిపారు. ప్రభుత్వ సంస్థపై ఎలా దాడులు చేస్తారని ప్రశ్నించారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లపై దాడులు జరిగాయని ఆయన కోర్టుకు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రభుత్వ సంస్థ కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇది దిగ్భ్రాంతికరమని వాపోయారు.

ఉత్తరకాశీలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. ఈ భూకంపం ఈరోజు సాయంత్రం 7:30:10 గంటలకు (IST) సంభవించింది. భూకంప కేంద్రం (లాట్, లాంగ్) 31.15, 77.99 వద్ద, 5 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. తీవ్రత తక్కువగా ఉండటం వల్ల, ప్రకంపనలు తీవ్రంగా లేవని అధికారులు తెలిపారు. ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 20, 1991న, ఉత్తరకాశిలో భూకంపం సంభవించింది. దీని వలన గర్హ్వాల్ హిమాలయ ప్రాంతం అపారమైన నష్టాన్ని చవిచూసింది. ఈ భూకంపం తరువాత, ఉత్తరకాశిలో రెండు నెలల పాటు ప్రకంపనలు సంభవించాయి, ఈ కాలంలో మొత్తం 142 భూకంపాలు సంభవించాయి. 1991 భూకంపం వల్ల గణనీయమైన ఆస్తి నష్టం, 768 మంది మరణించారు. అదనంగా, 5,066 మంది గాయపడ్డారు, 20,184 ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 74,714 మంది తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో పర్వత ప్రాంతాన్ని తాకిన భూకంపం చాలా తీవ్రంగా మారింది. ఈ భూకంపం వల్ల భాగీరథి, భిలంగన లోయలలో అనేక కొండచరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల గణనీయమైన నష్టం వాటిల్లింది.

ప్రపంచంలోనే అతి చిన్న AI కంప్యూటర్‌ను తీసుకువస్తున్న Nvidia.. లక్షల్లో ధర..
అమెరికన్ కంపెనీ NVIDIA ప్రపంచంలోనే అతి చిన్న AI కంప్యూటర్‌ను విడుదల చేయబోతోంది. ఆ కంపెనీ తన కొత్త AI కంప్యూటర్, DGX స్పార్క్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. DGX స్పార్క్ AI కంప్యూటర్ ధర $3,999 (సుమారు రూ. 3.55 లక్షలు). ఇది అక్టోబర్ 15 నుంచి NVIDIA వెబ్‌సైట్‌లో, ఎంపిక చేసిన స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ చిన్న హ్యాండ్ సెట్ బరువు 2.6 పౌండ్లు మాత్రమే. ఇది సాధారణ డెస్క్‌టాప్ కంప్యూటర్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది సాధారణ యూజర్ల కోసం తయారు చేయలేదు. ఇది ప్రత్యేకంగా డెవలపర్లు, శాస్త్రవేత్తలు, AI మోడళ్లపై పనిచేసే విద్యార్థుల కోసం రూపొందించారు. ఈ ప్రత్యేక కంప్యూటర్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో, దాని ధర ఎంతో ఇప్పుడు చూద్దాం. nvidia.com ప్రకారం, DGX స్పార్క్ NVIDIA కొత్త GB10 గ్రేస్ బ్లాక్‌వెల్ సూపర్‌చిప్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌లో 20-కోర్ ఆర్మ్-ఆధారిత గ్రేస్ CPU, బ్లాక్‌వెల్ GPU ఉన్నాయి. ఇది RTX 5070 గ్రాఫిక్స్ కార్డ్ మాదిరిగానే CUDA కోర్లతో అమర్చబడి ఉంటుంది. ఈ సూపర్‌చిప్ సెకనుకు 1000 ట్రిలియన్ ఆపరేషన్ల AI శక్తిని అందిస్తుంది. ఇది 5వ తరం టెన్సర్ కోర్లు, FP4 మద్దతును కూడా కలిగి ఉంది. ఇది మరింత శక్తివంతమైనదిగా చేస్తుంది. క్లౌడ్ లేకుండా వినియోగదారులు పెద్ద మోడళ్లను అమలు చేయడానికి NVIDIA దీనిని అభివృద్ధి చేసింది.

మీ ఫోన్ లైఫ్ టైమ్ ఎంతో తెలుసా?.. ఇలా తెలుసుకోండి!
ప్రతి వస్తువుకు గడువు తేదీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పొరపాటున గడువు తీరిన వస్తువులను వాడితే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. పాలు, బ్రెడ్ తో పాటు, ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా గడువు తేదీ ఉంటుంది. దీని అర్థం మొబైల్ ఫోన్లు ఒక నిర్దిష్ట కాలం మాత్రమే సరిగ్గా పనిచేస్తాయి. ఆ తర్వాత వాటికి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అయితే, చాలా మందికి తమ ఫోన్ గడువు తేదీని ఎలా తనిఖీ చేయాలో తెలియదు. కానీ, కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా ఫోన్ గడువు తేదీని తనిఖీ చేయవచ్చు. మీ ఫోన్ తయారీ, గడువు తేదీని ఎలా తనిఖీ చేయాలో ఇప్పుడు చూద్దాం. USA Today నివేదిక ప్రకారం.. కొన్ని ఫోన్లు రెండేళ్లు మాత్రమే పనిచేస్తాయి. అయితే చాలా ఫోన్లకు మూడు నుండి నాలుగు సంవత్సరాలు మద్దతు ఉంటుంది. ఫోన్ హార్డ్‌వేర్ అరిగిపోవడం కాదు, కంపెనీ ఎంతకాలం అప్‌డేట్‌లు, మద్దతును అందిస్తుంది అనేది ముఖ్యం. మీ ఫోన్ జీవితకాలం మీరు కొనుగోలు చేసినప్పుడు కాదు, అది తయారు చేసిన రోజు నుండి ప్రారంభమవుతుంది. దీని అర్థం మీ ఫోన్ ఆరు నెలలు స్టోర్‌లో ఉంటే, దాని జీవితకాలం అప్పటికే ప్రారంభమైందని.

నాకు ఆ లగ్జరీ లేదు.. సంపాదించడమే నా కల
‘డీజే టిల్లు’ సిరీస్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు ‘తెలుసు కదా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానున్న సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘తెలుసు కదా’ కథ విన్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యానని, అయితే తన పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దిన తర్వాతే సినిమాను మొదలుపెట్టామని సిద్ధు తెలిపారు. “ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు వరుణ్. అతని ఆలోచనలు చాలా భిన్నంగా, రాడికల్‌గా ఉంటాయి. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని ఒక కొత్త అనుభూతిని ఈ పాత్ర ఇస్తుంది. నా నటన కచ్చితంగా అందరినీ షాక్ చేస్తుందని నమ్మకంగా చెప్పగలను,” అని అన్నారు. ట్రైలర్‌లో చూసింది కొంతేనని, సినిమాలో 80% సన్నివేశాలు абсолютно కొత్తగా ఉంటాయని, ఈ సినిమా విడుదలయ్యాక దీనికంటూ ఒక ప్రత్యేకమైన జానర్ ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘మీసాల పిల్ల’ అదుర్స్.. మెగా గ్రేస్!
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం నుండి మొదటి పాట వచ్చేసింది. ఇప్పటికే అద్భుతమైన స్పందనతో రికార్డు వ్యూస్ సాధించిన ప్రోమో తర్వాత, ‘మీసాల పిల్ల’ పూర్తి లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట సంగీత ప్రియులను, మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ‘మీసాల పిల్ల’ పాట పవర్‌ఫుల్ ఎలక్ట్రానిక్ బీట్స్, పంచ్ బాస్ లైన్స్‌తో మాస్, మెలోడీ కలగలిపిన ఓ అద్భుతమైన ట్రాక్‌గా నిలిచింది. భాస్కరభట్ల అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ గొంతు కలపడం ఈ పాటలో అతిపెద్ద హైలైట్‌. ఆయన నోస్టాల్జిక్ వాయిస్ పాటకు కొత్త వైబ్ ఇచ్చింది. శ్వేతా మోహన్ గాత్రం మరింత మాధుర్యాన్ని జోడించింది.

Exit mobile version