Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సోము వీర్రాజు సవాల్‌ను స్వీకరిస్తున్నా.. టైం, ప్లేస్‌ చెప్పాలని ఉండవల్లి ఛాలెంజ్
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపారు సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. టైం, ప్లేస్ చెబితే కచ్చితంగా బహిరంగ చర్చకు వస్తానంటూ సోము వీర్రాజుకు ప్రతి సవాల్ చేశారు ఉండవల్లి.. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానం, లేదా మీడియా సమక్షంలో బహిరంగ చర్చ జరుపుకుందాం.. మొదటి నుంచి బీజేపీలో ఉన్న సోము వీర్రాజుకు అన్ని విషయాలు కచ్చితంగా తెలుసు ఉన్నారు ఉండవల్లి.. కాగా, ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తికి ఓటు వేయొద్దని తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విజ్ఞప్తి చేయడంపై సోము వీర్రాజు ఫైర్ అయిన విషయం విదితమే.. అంతే కాదు, బహిరంగ చర్చకు రావాలని ఉండవల్లికి సవాల్ చేశారు. దీనిపై స్పందించిన ఉండవల్లి.. తాను చర్చకు రెడీ.. టైం, ప్లేస్‌ చెప్పాలని సోము వీర్రాజుకు సూచించారు.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తాను ఎందుకు వ్యతిరేకిస్తానో ఈ బహిరంగ చర్చ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. దీంతో ఇద్దరి మధ్య బహిరంగ చర్చ నిజంగానే జరగబోతుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తురకపాలెం లో ఏదో జరుగుతోంది.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలి..
గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏదో జరుగుతోంది.. ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్‌.. తురకపాలెం మెడికల్ క్యాంప్‌కు వచ్చిన హర్షకుమార్.. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్న హర్షకుమార్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తురకపాలెం మరణాలకు కారణాలు డాక్టర్లు చెప్పలేక పోతున్నారు.. ఐసీఎంఆర్ టీంలు వచ్చినా కారణాలు తేలలేదు. దళితులు ఉన్న ప్రాంతాలలోనే మరణాలు సంభవించాయి అని ఆరోపించారు… దొంగసారా వల్ల మరణాలు జరిగాయి అని గ్రామస్థులు అంటున్నారు. కొందరు నాయకులు దొంగ సారాకు కారణమయ్యారు. వారెవరో ప్రభుత్వం విచారించాలని కోరారు.. అయితే, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత మరణాలు సంభవించ లేదు.. కానీ, గ్రామంలో ఏదో జరుగుతోది… ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కోరారు మాజీ ఎంపీ హర్షకుమార్‌…

ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమించిన ప్రభుత్వం.. 12 జిల్లాల్లో పాతవారినే కొనసాగించిన ప్రభుత్వం.. ఎస్పీల పనితీరు, శాంతిభద్రతల కోణంలో బదిలీలు చేశారు.. ఇక, ఎస్పీల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్.. మరోవైపు.. జిల్లా ఎస్పీలతో సమావేశంలో సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు.. శాంతి భద్రతలకు ప్రాధాన్యం… పెట్టుబడులకు అదే కీలకం అని స్పష్టం చేశారు.. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి అని ఆదేశించారు.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య, సింగయ్య మృతి కేసు స్టడీలుగా చూడండి అని సూచించారు.. ఇక, ఇన్వెస్టిగేషన్‌లో టెక్నాలజీతో బెస్ట్ రిజల్ట్ చూపించవచ్చు అన్నారు.. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించండి అని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి.. అదే సమయంలో అసాంఘిక శక్తులు భయపడేలా పని చేయండి అని స్పష్టం చేశారు.. ఇంకో వైపు, సోషల్‌ మీడియా పోస్టులపై ఫోకస్‌ పెట్టండి.. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయండి అని జిల్లా ఎస్పీలతో సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు..

ఏపీపై బీజేపీ ఫోకస్‌.. రేపు విశాఖలో ‘సారథ్యం’ భారీ బహిరంగ సభ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. కూటమిలో భాగస్వామ్యంగా వుంటూనే సంస్ధాగతబలోపేతం కీలకమని భావిస్తోంది. ఈ దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసేందుకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ‘సారథ్యం’ పేరుతో రైల్వే గ్రౌండ్‌లో జరుగుతున్న మీటింగ్ కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. బీజేపీ ఏపీ నాయకత్వం మొత్తం ఇప్పటికే విశాఖకు చేరుకుంది. సభా ప్రాంగణంతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లు కాషాయమయం అయిపోయాయి. భారీ హోర్డింగ్స్, బీజేపీ జెండాల రెపరెపలాడుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్న NDA సాధించిన విజయాలు., ఏపీకి ఇస్తున్న ప్రాధాన్య తను ప్రధానంగా చెప్పబోతోంది బీజేపీ. అదే సమయంలో మారుతున్న రాజకీయ పరిస్ధితులకు అనుగుణంగా నాయకత్వం అనుసరించాల్సిన వ్యూహాలను నడ్డా నిర్ధేశించనున్నారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధమైన కార్యా చరణను ప్రకటించే అవకాశం వుంది. 2024 ఎన్నికల్లో కూటమి వైసీపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయపార్టీలకు ఏపీలో 43శాతం ఓట్లు నమోదయ్యాయి. ఏపీలో బలోపేతం అవ్వాలంటే విపక్షాల ఓట్లను తమవైపు తిప్పుకోవడం కీలకం అనేది బీజేపీ ఆలోచన. ఆ దిశగానే సారథ్యం సభ జరగనుంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి సత్యకుమార్ యాదవ్‌ పరిశీలించి నాయకత్వానికి సూచనలు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో భారీ ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరుతో ఇప్పటికే జిల్లాల పర్యటనలు పూర్తి చేశారు.

మహిళల కోసం సింగరేణి చరిత్రలో తొలిసారి ఓపెన్ కాస్ట్ మైన్స్ అవకాశం!
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ మహిళా ఉద్యోగులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు, సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్‌గా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇది సింగరేణి చరిత్రలో మహిళలకు ప్రత్యక్షంగా మైనింగ్ ఆపరేషన్‌లో భాగంగా చేరే తొలిసారి అవకాశం అని యాజమాన్యం పేర్కొంది. సింగరేణి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం మాట్లాడుతూ, మైనింగ్ రంగంలో మహిళల సాధికారతను పెంపొందించడం, సమాన అవకాశాలను కల్పించడం, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలకు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి, కనీసం ఏడవ తరగతి పాసు ఉండాలని యాజమాన్యం సూచించింది. అలాగే, శారీరకంగా సామర్థ్యం కలిగి ఉండాలి, ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆగస్టు 2024కి ముందే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తులు సంబంధిత గని మేనేజర్, శాఖాధిపతి లేదా జనరల్ మేనేజర్ వద్ద సమర్పించవచ్చని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు.

నువ్వు మగాడివైతే వెంటనే రాజీనామా చేయ్.. కడియం శ్రీహరికి సవాల్
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేసేందుకు తగిన సమయం ఆసన్నమని తాటికొండ పేర్కొన్నారు. తాటికొండ రాజయ్య వ్యాఖ్యల ప్రకారం, “కడియం శ్రీహరి వద్ద సిగ్గు, చీము, నెత్తురు లేదు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన MLA పదవికి వెంటనే రాజీనామా చేయాలి. వరంగల్ పౌరుషం ఉంటే, నువ్వు మగాడివైతే వెంటనే రాజీనామా చేసి రా,” అని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆగ్రహంగా కడియం శ్రీహరి 200 కోట్లకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆరోపించారు. “టాల్ మ్యాన్ అని చెప్పుకుంటావు కదా? ఏమైంది నీ పౌరుషం?” అని కూడా ప్రశ్నించారు. తాటికొండ రాజయ్య ఒక వైపు కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పడానికి భయపడుతున్నాడని చాటుకున్నారు. ఎంతవరకు స్పీకర్ చర్యలు తీసుకుంటారో చూడాలి, లేకపోతే స్పీకర్ ను న్యాయస్థానానికి లాగుతామని హెచ్చరించారు.

గోవులు జంతువుల్లా కనిపించవు..”జంతు ప్రేమికుల”పై ప్రధాని సెటైర్లు..
వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ‘‘జంతు ప్రేమికుల’’ నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీ ‘‘యానివల్ లవర్స్’’పై సెటైర్లు వేశారు. కేవలం ఒకే లైన్‌తో వారి కపటత్వాన్ని ఎత్తిచూపారు. శుక్రవారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. జంతుప్రేమికులతో ఇటీవల తన సమావేశం గురించి వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ‘‘ఇటీవల కాలం తాను కొంతమంది జంతు ప్రేమికులను కలిశాను’’ అని మోడీ అనడంతో, ఒక్కసారిగా ప్రేక్షకుల నుంచి నవ్వులు వచ్చాయి. దీనికి ప్రతిగా ‘‘ఎందుకు నవ్వుతున్నారు.? మన దేశంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. కానీ ఎక్కువ మంది గోవును జంతువుగా పరిగణించరు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఇటీవల వీధి కుక్కల తరలింపు అంశంతో లింక్ చేయబడ్డాయి.

ప్రధాని తల్లిపై ఏఐ వీడియో.. కాంగ్రెస్‌పై కేసు ఫైల్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి AI వీడియోపై అప్‌లోడ్ చేసిన కాంగ్రెస్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పార్టీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఐటీ సెల్‌ను ప్రధాన నిందితులుగా చేర్చారు. పలు సెక్షన్లు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 12న బీజేపీ ఢిల్లీ ఎన్నికల విభాగం కన్వీనర్ సంకేత్ గుప్తా పోలీసులకు ప్రధాని మోడీ తల్లి ఏఐ వీడియోపై ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో సెప్టెంబర్ 10న డీప్‌ఫేక్/AI జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేసిందని పేర్కొన్నారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, వారి చనిపోయిన తల్లితో చూపించారని, దీని ద్వారా ఆయన ఇమేజ్, గౌరవం దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటన భారతదేశ అత్యున్నత రాజ్యాంగాన్ని అవమానించడమేనని, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని, మాతృత్వాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ఇది ప్రజాస్వామ్య సంస్థలపై దాడి అని, సమాజంలో అశాంతి, ద్వేషం, అబద్ధాలను వ్యాప్తి చేసే ప్రయత్నం అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని, ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆయన కోరారు.

బరువు తగ్గండి.. లక్షల బోనస్ పొందండి.. ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్..
చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ అరాషి విజన్ ఇంక్. ఈ కంపెనీని ఇన్‌స్టా360 అని కూడా పిలుస్తారు. ఇది తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు బరువు తగ్గి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి ప్రత్యేకమైన మార్గాన్ని అవలంబించింది. ఈ కంపెనీ ఆగస్టు 12న వార్షిక ‘మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్’ను ప్రారంభించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సులభం. ఏ ఉద్యోగి అయినా పేరు నమోదు చేసుకోవచ్చు. ప్రతి అరకిలో బరువు తగ్గితే 500 యువాన్ల (సుమారు రూ. 6100) బోనస్ పొందుతారు. ఈ సంవత్సరం.. Gen-Z ఉద్యోగి షి యాకి 90 రోజుల్లో 20 కిలోలకు పైగా బరువు తగ్గి బరువు తగ్గించే ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమెకు 20,000 యువాన్లు (సుమారు రూ. 2.47 లక్షలు) నగదు బహుమతి లభించింది. ఆమె తన విజయానికి క్రమశిక్షణ, ఆహారం నియంత్రణ, ప్రతిరోజూ 1.5 గంటల వ్యాయామం కారణమని చెప్పింది. ఇది తన జీవితంలో అత్యుత్తమ అవకాశమని చెప్పింది. కంపెనీకి కృతజ్ఞతలు తెలిపింది. తన సహోద్యోగులకు స్ఫూర్తినిచ్చేందుకు గ్రూప్ చాట్‌లో ‘క్విన్ హావో బరువు తగ్గించే పద్ధతి’ని పంచుకుంది. ఈ డైట్ ప్లాన్ సహాయంతో చైనీస్ నటుడు క్విన్ హావో 15 రోజుల్లో 10 కిలోలు తగ్గారు. ఇందులో ఒక రోజులో సోయా పాలు మాత్రమే తాగడం, మరొక రోజు మొక్కజొన్న లేదా పండ్లు మాత్రమే తినడం వంటి కఠినమైన నియమాలు ఉన్నాయి. కాగా.. 2022 నుంచి కంపెనీ ఈ ఛాలెంజ్‌ను ఏడుసార్లు నిర్వహించింది. దాదాపు 2 మిలియన్ యువాన్ల (సుమారు రూ. 2.47 కోట్లు) విలువైన బహుమతులను పంపిణీ చేసింది. గత ఏడాది 99 మంది ఉద్యోగులు కలిసి 950 కిలోల బరువు తగ్గారు. ఒక మిలియన్ యువాన్ బోనస్‌ను పంచుకున్నారు.

ఆసియాకప్ చరిత్రలో ఇండియా – పాక్ జట్లు ఆసక్తికర ముచ్చట..
ఆసియాకప్ 17వ ఎడిషన్ ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానులకు పండుగ మొదలైంది. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌‌లు అంటే అభిమానుల ఆసక్తిని వర్ణించడం సాధ్యం కాదు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో జరిగే రెండో గ్రూప్ A మ్యాచ్‌లో టీమ్ ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ పాకిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 67 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఈసారి ఆసియా కప్ 2025 టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా 8 సార్లు విజేతగా నిలిచి రికార్డ్ సృష్టించింది. తర్వాత స్థానంలో ఆరుసార్లు శ్రీలంక, రెండు సార్లు పాకిస్థాన్ టైటిల్స్ సాధించాయి. ఈ టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ కూడా పాల్గొంటున్నప్పటికీ అవి ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. బంగ్లాదేశ్ చాలాసార్లు ఫైనల్ వరకూ చేరినా.. టైటిల్ మాత్రం చేజిక్కించుకోలేకపోయింది.

క్రికెట్‌లో పాక్‌.. హాకీలో చైనా.. సూపర్ సండే రోజు భారత్‌కు డబుల్ ‘పరీక్ష’..!
క్రీడా ప్రియులకు ఆదివారం ఒక పండగే. ఎందుకంటే.. రేపు భారత్ రెండు వేర్వేరు శత్రు దేశాల జట్లతో తలపడనుంది. ఒక వైపు, దుబాయ్‌లో జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లో టీం ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. మరోవైపు, మహిళల హాకీ ఆసియా కప్ టైటిల్ పోరు హాంగ్‌జౌ గడ్డపై జరుగుతుంది. భారత హాకీ జట్టు ఆతిథ్యం ఇచ్చిన చైనాతో తలపడనుంది. క్రికెట్, హాకీ రెండు వేర్వేరు ఆటలు అయినప్పటికీ.. ఆసియాలోని రెండు చారిత్రాత్మక ప్రత్యర్థుల మధ్య ఓకే రోజు ఆట ఉత్సాహభరితంగా మారునుంది. ఈ జట్లు తుఫానును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి ఉంది. దుబాయ్ మైదానంలో భారత్- పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. రెండు దేశాల జట్లు మొదటిసారిగా తలపడుతున్నందున ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనదిగా పరిగిణిస్తున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణపై వ్యతిరేకత సైతం తారాస్థాయికి చేరుకుంది. అయినప్పటికీ.. ఎప్పటిలాగే ఉత్సాహం మాత్రం తగ్గదు. ఆదివారం రాత్రి 8 గంటలకు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు దేశాలు T20 మ్యాచ్‌లలో 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 9 సార్లు గెలవగా.. పాక్ 3 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. ఆ మ్యాచ్‌లో భారత్ బాల్ అవుట్ రూల్ ద్వారా గెలిచింది. ఆసియా కప్ లోనూ భారత్‌దే పైచేయి. రెండు జట్లు టీ20 ఫార్మాట్ లో 3 సార్లు తలపడ్డాయి. భారత్ 2 సార్లు గెలిచింది.

భోళా శంకర్.. చిరంజీవిని బ్లేమ్ చేయడానికే అలా చేశారు..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ టైమ్ లో నిర్మాత అనిల్ సుంకర ఆస్తులు అమ్ముకుని చిరంజీవికి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటూ రకరకాల రూమర్లు క్రియేట్ అయ్యాయి. అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో వాటిపై క్లారిటీ ఇచ్చారు. మూవీ ప్లాప్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హిందీ వేదాలంను రీమేక్ చేయాలని ముందు అనుకున్నాం. కానీ మెహర్ రమేశ్ దగ్గర తమిళ రీమేక్ మూవీ రైట్స్ ఉన్నాయని చెప్పడంతో పాటు.. చిరంజీవి గారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో.. నాకు కూడా నమ్మకం కలిగి చేశాను. మూవీ రిలీజ్ అయిన రోజు అంతటా డిజాస్టర్ టాక్ నడుస్తోంది. ఆ టైమ్ లో రకరకాల రూమర్లు క్రియేట్ చేశారు. చిరంజీవికి రెమ్యునరేషన్ ఇవ్వడం కోసం అనిల్ సుంకర రాజుగారి తోట అమ్మేశారు అంటూ ప్రచారం చేశారు. కానీ చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి ‘డబ్బుల గురించి మర్చిపో.. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అని భరోసా ఇచ్చారు. ఆయన చాలా సపోర్ట్ చేశారు కాబట్టే దాని నుంచి బయటపడ్డాం. లేదంటే అంత ఈజీ అయ్యేది కాదు. కానీ చిరంజీవి గారిని బ్లేమ్ చేయడానికి నేను ఆస్తులు అమ్ముకున్నాను అంటూ తప్పుగా ప్రచారం చేశారు. ఆ మూవీ తర్వాత కూడా నన్ను కథలు రెడీ చేసుకో మనం మూవీ చేద్దాం అని హామీ ఇచ్చారు. ఆయన వల్ల ఎవరు ఇబ్బంది పడ్డా ఆయన భరించలేరు అని చెప్పుకొచ్చారు అనిల్ సుంకర.

1 నేనొక్కడినే ప్లాప్ అవుతుందని ముందే తెలుసు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. సుకుమార్ తీసిన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకర దీని వెనకాల ఉన్న విషయాలను పంచుకున్నారు. ఆయన తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. నేను మహేశ్ బాబుతో సినిమా తీయాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనతో దూకుడు సినిమా తీసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాను. ఆ తర్వాత మా కాంబోలో వచ్చిన మూవీ 1 నేనొక్కడినే. సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా హిట్ అవుతుందని అందరం అనుకున్నాం. కానీ పూర్తి ఔట్ పుట్ చూసిన తర్వాత నాకు ఎక్కడో తేడా కొట్టింది అంటూ చెప్పుకొచ్చారు అనిల్ సుంకర. కానీ మిగతా అందరూ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. నాకు ఒక్కడికే ప్లాప్ అవుతుందని అర్థమైంది. ఎందుకంటే అంత పెద్ద హీరోకు ఏదో ప్రాబ్లమ్ ఉందంటే ఫ్యాన్స్ తీసుకోగలరా అనిపించింది. ఆ మూవీ కోసం ట్రైలర్ రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ ఏదో యాక్షన్ సీన్లతో రిలీజ్ చేసేసరికి.. అది చూసిన వారంతా జేమ్స్ బాండ్ రేంజ్ లో ఊహించుకున్నారు. అంచనాలు భారీగా ఉండటం కూడా తేడా కొట్టింది. ఒకవేళ ట్రైలర్ లో హీరో లోపం గురించి చెప్పి ఉంటే ఫ్యాన్స్ ముందే ప్రిపేర్ అయి సినిమాకు వెళ్లేవారేమో. కానీ ఇప్పుడు ఆ సినిమా వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యేది అంటూ తెలిపారు అనిల్ సుంకర. మహేశ్ బాబుతో అనిల్ తర్వాత తీసిన ఆగడు మూవీ ప్లాప్ అయిన విషయం తెలిసిందే.

Exit mobile version