దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు కొత్త వెలుగులు తేవాలి.. సీఎం భోగి శుభాకాంక్షలు..
తెలుగు లోగిళ్లు సంక్రాంతి సంబరాలుకు సిద్ధం అవుతున్నాయి.. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో.. రేపు అనగా బుధవారం రోజు భోగి పండుగ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్న ఆయన.. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అన్నారు… ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని… అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ, మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
నేను పిఠాపురంలోనే పుట్టా.. పిఠాపురంలోనే పెరిగా.. ఎవడైనా సొంత ఊరు వదిలి వెళ్లిపోతారా..? వర్మ హాట్ కామెంట్స్..
గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ (శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ) వార్తల్లో నిలిచారు.. మొదట సీటు కోసం పట్టుబట్టిన ఆయన.. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సర్దిచెప్పడంతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు.. ఇక, పవన్ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు.. అయితే, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం.. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆయన పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.. ఇప్పుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు శర్మ.. నియోజకవర్గ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటుగా స్పందించారు. తాను పిఠాపురాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్మ మాట్లాడుతూ.. “నేను పిఠాపురంలోనే పుట్టాను.. పిఠాపురంలోనే పెరిగాను. సొంత ఊరు వదిలి ఎవడైనా వెళ్లిపోతారా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం తనకు కేవలం రాజకీయ నియోజకవర్గం మాత్రమే కాదని, తన జీవితం, తన ఊరని పేర్కొన్నారు.. అయితే, పార్టీ అవసరాల మేరకు వేరే బాధ్యతలు అప్పగిస్తే అక్కడికి వెళ్లి పని పూర్తి చేసి తిరిగి తన సొంత ఊరైన పిఠాపురానికి వస్తానని స్పష్టం చేశారు. పార్టీ చెప్పిన బాధ్యతలను నిర్వర్తించడం తన కర్తవ్యమని స్పష్టం చేసిన ఆయన.. కానీ, పిఠాపురాన్ని మాత్రం ఎప్పటికీ వదలబోనని తెగేసి చెప్పారు.. అయితే, వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఏపీకి గుడ్‌న్యూస్.. రూ.567 కోట్లు విడుదల చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆఖరి విడతగా రూ.567 కోట్ల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది.. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత 19 నెలల కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 48 శాతం మేర వినియోగం జరిగిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిధుల వినియోగం గణనీయంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషికి కేంద్రం గుర్తింపు ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయిలో 15వ ఆర్థిక సంఘం నిధులను పొందిన మూడవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని వెల్లడించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇది రాష్ట్రానికి గర్వకారణమని, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిధులు కీలకంగా ఉపయోగపడతాయని చెప్పారు. అమరావతిలో జరిగిన సమీక్ష సమావేశంలో 2025–26 బడ్జెట్ వ్యయంపై మంత్రి సమీక్షించారు. మిగిలిన నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖతో వెంటనే చర్చలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయం సాధించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి, ఆసుపత్రుల బలోపేతం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర ఆరోగ్య రంగం మరింత ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు.. ఇక ఎక్కడ లిక్కర్ కొన్నా ఒకటే రేటు..!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కొనుగోలు చేసే వారికి, అలాగే బార్ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు చేస్తూ, బార్లపై విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై వైన్స్ అయినా.. బార్ అయినా.. ఎక్కడ లిక్కర్ కొనుగోలు చేసినా ఒకే రేటు అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అమల్లో ఉన్న ప్రత్యేక అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా బార్ వ్యాపారులకు పెద్ద ఊరట లభించనుంది. ఇప్పటివరకు ఒకే మద్యానికి రిటైల్ షాపుల్లో ఒక ధర, బార్లలో మరో ధర ఉండేది. తాజా మార్పులతో ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ధరల తేడా ఉండదు. అయితే, లిక్కర్ ధరల్లో సమానత్వం తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్‌ఎల్, ఎఫ్‌ఎల్‌పై ఇకపై అదనపు పన్ను విధించరాదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని, 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పుల అమలుకు డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, ఏపీఎస్‌బీసీఎల్ అధికారులు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తాజా ఎక్సైజ్ పాలసీ మార్పులు రాష్ట్రంలో మద్యం ధరల వ్యవస్థలో కీలక మలుపుగా మారనున్నాయి.
శంకుస్థాపనలు మీవి.. పనులు మావి.!
బీఆర్ఎస్ నాయకత్వంపై , గత ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే, ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, ప్రతి రూపాయిని పొదుపు చేస్తూ పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. “గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమైంది తప్ప, పనుల కోసం నిధులు కేటాయించలేదు. కానీ మా ప్రజా ప్రభుత్వం మాటల కంటే చేతలకు ప్రాధాన్యత ఇస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని ఆగమాగం చేశారని పొంగులేటి మండిపడ్డారు. కనీసం లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. “దశాబ్ద కాలంలో పేదలకు ఒక చిన్న ఇల్లు కూడా ఇవ్వలేని వారు, ఈరోజు మాట్లాడుతున్నారు. మేం పార్టీలతో సంబంధం లేకుండా, అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మిస్తున్నాం” అని ఆయన వివరించారు.
రాజకీయం తపస్సులా చేశాను..
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజకీయ రంగాన్ని తాను ఒక పవిత్రమైన యజ్ఞంలా , తపస్సులా భావిస్తానని చాటిచెప్పారు. అధికార దాహం కంటే ప్రజా సేవకే ప్రాధాన్యతనిస్తూ, గత దశాబ్దాలుగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు , రాజకీయ పార్టీలకు అతీతంగా తాను పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం సహజమని, అయితే తనపై రాజకీయంగా విమర్శలు చేసే శత్రువుల నియోజకవర్గాలు , గ్రామాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తాను పక్షపాతం లేకుండా నిధులు కేటాయించానని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ఆయనకు ఉన్న మక్కువను ప్రదర్శిస్తూ, ఈ జిల్లాను తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనేది తన జీవితాశయమని పేర్కొన్నారు. అది గిరిజన ప్రాంతమైనా, అటవీ ప్రాంతమైనా మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడకూడదనే పట్టుదలతో పని చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇరాన్‌లో నరమేధం.. ఎటుచూసినా శవాలే.. 12 వేల మంది చనిపోయినట్లుగా అంతర్జాతీయ కథనాలు!
ఇరాన్‌లో నరమేధం జరిగినట్లుగా అంతర్జాతీయ కథనాల్లో వెలువడుతున్నాయి. టెహ్రాన్‌లో ఎటుచూసినా నగర వీధుల్లో శవాలు పడి ఉన్నట్లుగా కథనాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా వేలాది మంది గాయాలు పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు వారాలకు పైగా ఇరాన్‌లో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 2 వేల మంది వరకు చనిపోయినట్లుగా అధికారిక సమాచారం అయినా.. ఆ సంఖ్య 12 వేల మంది వరకు ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంటే ఆందోళనలు అణిచివేసేందుకు భద్రతా దళాలు ఊచకోతకు తెగబడినట్లుగా సమాచారం. దీంతో ఎటుచూసినా శవాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇరాన్‌కు చెందిన ఒక వెబ్‌సైట్‌లో 10 వేల మంది చనిపోయినట్లుగా సంచలన కథనంలో పేర్కొంది. ఈ హత్యలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్‌లో హింస చోటుచేసుకుందని ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ కథనం తెలిపింది. తాజాగా జరిగిన అల్లర్లలో 12 వేల మంది చనిపోయినట్లుగా పేర్కొంది. పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షులు, వైద్య బృందం, తదితర వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ అంచనా వేసినట్లుగా స్పష్టం చేసింది. జనవరి 8, 9 తేదీల్లో ఈ మరణాలు సంభవించాయని తెలిపింది. ఇరాన్ చరిత్రలో ఇలాంటి హింస ఎప్పుడూ జరగలేదని కథనంలో వెల్లడించింది. ఇక అరెస్టైన వారిలో కూడా చాలా మంది మరణశిక్ష కూడా పడొచ్చని స్పష్టం చేసింది.
పాక్ నేతృత్వంలో ‘ముస్లిం నాటో’గా అడుగులు.. ఏఏ దేశాలంటే..! భారత్‌కొచ్చే ముప్పేంటి?
నాటో తరహాలో ఇప్పుడు ‘ముస్లిం నాటో’ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం పాకిస్థాన్-టర్కీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా-పాకిస్థాన్ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఎవరైనా ఒక దేశంపై దాడి చేస్తే తమపై కూడా దాడి చేసినట్లుగా భావించి ఇద్దరూ కలిసి శత్రువును ఎదుర్కొంటారు. తాజాగా అదే తరహాలో అన్ని ముుస్లిం దేశాలు నాటోగా ఏర్పడాలని టర్కీ తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుగా బ్లూమ్‌బెర్గ్ తన నివేదికలో పేర్కొంది. పాకిస్థాన్-సౌదీ నేతృత్వంలోని ముస్లిం నాటోలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టర్కీ సంకేతాలు ఇచ్చింది. టర్కీ, సౌదీ ఆర్థిక సాయం.. పాకిస్థాన్ అణుశక్తితో కలిసి ఈ దేశాలు ఒక కూటమిగా ఏర్పడొచ్చని పేర్కొంది. ఇందుకోసం టర్కీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్థాన్‌కు మద్దతు తెలిపింది. ఇప్పుడు ముస్లిం నాటో కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం టర్కీ రాజధాని అంకారాలో జరిగిన చర్చలు పురోగతిని ఇచ్చినట్లుగా సమాచారం. ముస్లిం నాటో కూటమి ఏర్పడే అవకాశం ఉందని తెలిసిన వ్యక్తుల నుంచి అందించబడిన వర్గాల ద్వారా తెలిసింది.
త్వరపడండి..! ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు..
పండుగ సీజన్‌లో తమకు నచ్చిన మొబైల్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేసే మంచి అవకాశం వచ్చేస్తోంది.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని డిస్కౌంట్ ధరలకు వివిధ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.. జనవరి 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ సేల్.. ఈ ఏడాది ఇది మొదటి అమెజాన్ సేల్.. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో పాటు.. బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్ డిస్కౌంట్లు మరియు ఇతర ప్రయోజనాలు కూడా ఉండనున్నాయి.. అయితే, ఈ సేల్ కు ముందే అమెజాన్ కొన్ని డీల్స్ ను ప్రకటించడం ప్రారంభించింది. ఇక్కడ, మీరు iPhone 15, OnePlus 15, Samsung Galaxy S25 Ultra సహా ఇతర టాప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.. మీరు ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్టు అయితే.. ఈ సేల్ ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు.. అమెజాన్ సేల్ సమయంలో మీరు ఐఫోన్ 15ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.59,900గా ఉన్న 128GB స్టోరేజ్ వేరియంట్ ఈ సేల్ సమయంలో రూ.50,249 వరకు అందుబాటులో ఉంటుంది. మీరు ఐఫోన్ 17 ప్రో సిరీస్ మరియు ఐఫోన్ ఎయిర్ లను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ.1,40,400కి లభిస్తుంది, అయితే ఇది రూ.1,49,900కి లాంచ్ అయింది. మరోవైపు, ఐఫోన్ 17 ప్రోను డిస్కౌంట్ తర్వాత రూ.1,25,400కి కొనుగోలు చేయవచ్చు. ఇక, అమెజాన్ సేల్ లో ఐఫోన్ ఎయిర్ కూడా డిస్కౌంట్‌తో లభిస్తుంది. రూ.99,900 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్.. ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత రూ.91,249 ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ధర వద్ద, ఈ స్మార్ట్‌ఫోన్ ఒక గొప్ప ఎంపికగా చెప్పవచ్చు..
చిరంజీవితో సినిమాపై డైరెక్టర్ మారుతి షాకింగ్ కామెంట్స్..
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం “రాజా సాబ్”. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని సక్సెస్ పుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతుంది. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో రూ.201 కోట్లకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్‌గా సొంతం చేసుకుంది. డైరెక్టర్ మారుతి టేకింగ్, గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో “రాజా సాబ్” సక్సెస్ హ్యాపీనెస్‌ను ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతి షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజా సాబ్” సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కుతోందని చెప్పారు. సంక్రాంతి హాలీడేస్ బిగిన్ కాకముందే ఈ సినిమా రూ.200 కోట్ల మార్క్ టచ్ చేయడం హ్యాపీగా ఉందని చెప్పారు. సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో కొత్త పాయింట్ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత టైమ్ పడుతుందని ముందే అనుకున్నామని, ప్రభాస్ గారు కూడా ప్రశాంతంగా ఉండు డార్లింగ్, మనం కొత్త ప్రయత్నం చేశాం అని చెప్పినట్లు తెలిపారు. రీసెంట్ గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ప్రభాస్‌కు మెసేజ్ చేశానని, ఆ సీన్స్ అన్నీ పర్పెక్ట్‌గా సెట్ అయ్యాయని చెప్పినట్లు తెలిపారు. చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తే తన లైఫ్ సర్కిల్ ఫుల్ అయినట్లు భావిస్తానని చెప్పారు. తాను చిరంజీవి అభిమానిని అని చెప్పారు. ప్రేక్షకులు తమ రాజాసాబ్ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారని, తాను కూడా ప్రశాంతంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు చెప్పారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో చాలా షాకింగ్ థింగ్ ఇదే..: అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదలై.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ రోజు చిత్ర బృందం థ్యాంకు మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఇదే షాకింగ్ థింగ్ అంటూ ఆయన ఒక విషయాన్ని రివీల్ చేశాడు. ఇంతకీ ఆ షాకింగ్ విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. చిత్ర రచయిత, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ” నిజానికి ఒక సినిమా స్క్రిప్ట్ రాయడానికి మూడు నెలలు, అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది.కానీ నా కెరీర్‌లోనే అత్యంత వేగంగా రాసిన స్క్రిప్ట్ ఇది. మొదటి భాగం 15 రోజుల్లో, రెండో భాగం 10 రోజుల్లో పూర్తి చేశాను. మొత్తంగా ఈ సినిమా స్క్రిప్ట్‌ను 25 రోజుల్లో పూర్తి చేశాం. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్ఫూర్తితోనే ఇంత త్వరగా స్క్రిప్ట్ రాయగలిగాను” అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయన ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. సినిమా చూసిన చిరంజీవి అభిమానులు తను కనిపిస్తే ముద్దు పెట్టాలని చూశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
