NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ముగిసిన కూటమి శాసన సభాపక్ష భేటీ.. ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం..
కూటమి‌ శాసన సభాపక్ష సమావేశం ముగిసింది.. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసన సభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 150 రోజుల పాలనలో చేసిన అన్ని అంశాలపై చర్చ సాగింది.. మంత్రులు.. ఎమ్మెల్యేలకు అన్ని విషయాలలో సహకరించాలని సూచించారు.. ఎమ్మెల్యేలు అందరూ హుందాగా ఉండటం అలవాటు చేసుకోవాలన్న ఆయన.. ప్రతిపక్షం లేదని నిర్లక్ష్య ధోరణి వద్దు అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు.. మరింత జోరుగా ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని దిశా నిర్దేశం చేశారు.. పాలసీలు అన్నీ క్షేత్రస్ధాయిలో అమలయ్యేలా ఎమ్మెల్యేలు చూడాలన్నారు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యాటక అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు.. ఎమ్మెల్యేలు ప్రతీ సమస్యనూ కచ్చితంగా చర్చించాలన్న సీఎం.. ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీలో సమస్యలపై చర్చ జరగాలన్నారు. ఇక, ఇసుక విషయంలో అక్రమాలు జరగకూడదు.. ఇసుక పాలసీ అమలు విషయంలో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు..

ఏపీలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి.. కుదిరిన ఒప్పందం..
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు ప్రముఖ సంస్థ రిలయన్స్‌ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం – రిలయన్స్‌ మధ్య ఒప్పందం కుదిరింది.. ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులపై రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది.. రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనుంది. రూ.65 వేల కోట్ల పెట్టుబడులతో, 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు రిలయన్స్ బయో ఎనర్జీ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ బషీర్ షిరాజీ.. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, రిలయన్స్ సంస్థ ఎంఓయూ చేసుకోవడం, ఒక చారిత్రాత్మక ఘట్టం. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రీసెర్చ్ సెంటర్ పెడుతున్నారని తెలిసింది. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. రిలయన్స్‌తో ఎంఓయూ చేసుకుంది ఏపీ ప్రభుత్వం.. కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ కోసం ఎంఓయూ చేసుకున్నారు.. 500 CBG Plants కోసం ఎంఓయూ జరగగా.. 130 కోట్లతో ఒక్కో ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు.. అయితే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చేయాలి అన్నారు సీఎం చంద్రబాబు.. 25 ఏళ్లలో 57,650 కోట్ల బెనిఫిట్ ఉంటుంది.. ఒక్కొక ఫార్మర్ కు 30 వేల లీజ్ ఉంటుంది.. 500 ప్లాంట్లు పూర్తయితే రెన్యువబుల్ ఫ్యూయల్ 9.35లక్షల LCB లకు రీప్లేస్మెంట్ చేస్తారు.. 2.50 లక్షల ఉద్యోగాలు ఈ ప్రాజెక్టులోనే రావాలి.. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఇది ఒక భాగం అన్నారు. ప్రొడక్షన్‌ 39 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల సీబీజీ ఏడాదికి వ‌స్తుంది.. దీని వ‌ల్ల ఇండ‌స్ట్రీయ‌ల్ గ్రోత్ బారీగా జ‌ర‌గుతుంది.. 110 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానికి మెన్యూర్ వ‌ల్ల కెమికల్ ఫెర్టిలైజ‌ర్స్ వాడకం త‌గ్గుతుంది.. రాష్ట్రంలో నే క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీ 2024 ఇప్పటికే తీసుకువ‌చ్చాం.. 10 ల‌క్షల కోట్లు పెట్టుబ‌డులు ఈ పాల‌సీ ద్వారా ఆక‌ర్షించాల‌ని భావించాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

అలర్ట్: గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష మళ్లీ వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి.. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ గ్రూప్‌-2 అభ్యర్థుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ.. గ్రూప్-2 మెయిన్స్ ను రీషెడ్యూల్ చేస్తూ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది.. పాత షెడ్యూల్‌ ప్రకారం 2025 జనవరి 5వ తేదీన గ్రూప్‌ -2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. 2025 ఫిబ్రవరి 23వ తేదీకి గ్రూప్ -2 మెయిన్స్‌ వాయిదా వేసినట్టు ప్రకటించింది ఏపీపీఎస్సీ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను http://psc.ap.gov.in సందర్శించాలని పేర్కొంది ఏపీపీఎస్సీ.. కాగా, గతేడాది డిసెంబర్ 7న 897 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్‌-2కు 4 లక్షల 83వేల 535 మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4 లక్షల 4 వేల 37 మంది హాజరయ్యారు. వారిలో 92 వేల 250 మంది మాత్రమే ప్రధాన పరీక్షకు అర్హత సాధించిన విషయం విదితమే.. ఇక, ఈ ఏడాది జులై 28న మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండగా అభ్యర్థుల విజ్ఞప్తితో కూటమి సర్కారు జనవరి 5న గ్రూప్‌-2 మెయిన్స్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, మరోసారి అభ్యర్థుల నుంచి విజ్ఞప్తు వస్తుండడంతో.. 2025 జనవరి 5వ తేదీన జరగాల్సిన గ్రూప్‌ -2 మెయిన్స్‌ పరీక్ష.. ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్‌ వార్నింగ్..! అలా అయితే కష్టం..
మరోసారి ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా వార్నింగ్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు… అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటి అవకాశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహించారు.. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ లో మరింత ప్రాధాన్యత కల్పించారు… బడ్జెట్ పై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. అయితే, బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలి. మీకు వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోండి అంటూ సూచించారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలి.. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తాం.. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. నమ్మకం పెట్టుకున్నారన్నారు.. ప్రజల నమ్మకం మేరకు వారి సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలి అంటూ సూచించారు సీఎం… నేను 1978లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచాను 1980లో మంత్రి అయ్యాను.. ఇప్పటికి 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను…4 సార్లు సీఎం అయ్యాను అన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, వరుసగా విజయం సాధించడం అనేది మన పనితనం, పార్టీ నిర్మాణాన్ని బట్టి ఉంటుంది అన్నారు.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. టీడీపీ నుండి 61 మంది, జనసేన నుండి 15 మంది, బీజేపీ నుండి నలుగురు, వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు. మొత్తం 84 మంది కొత్తవారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండో సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు 30 మంది టీడీపీ నుంచి ఉన్నారని వివరించారు..

నేతన్నలు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం మీకు అండగా‌ ఉంటుంది
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయనను రాజీనామా చేయాలని మేము కోరలేదని, సిరిసిల్లలో దంపతుల అత్మహత్యకి భీమండిలో చేసిన అప్పులతో పాటు ఇల్లు కట్టుకోవడం వల్ల జరిగిన అప్పులు కారణమని మా దృష్టికి వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. నేతన్నలు అధైర్యపడవద్దు, ప్రభుత్వం మీకు అండగా‌ ఉంటుందని, కేటీఆర్ ఎమ్మెల్యే గా, నేను‌ఎంపిగా ఉన్న సమయంలో చేనేత‌ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసామన్నారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేయడం బాధకరమని, కావాలని కలెక్టర్ ని తప్పుత్రోవ పట్టించి దాడి చేసారన్నారు. కలెక్టర్ పై దాడి చేయ్యడం ‌ప్రజాస్వామ్యామా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్దతిలో, న్యాయవ్యవస్థ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని, బీఆర్ఎస్ ‌నాయకులు‌‌ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించునట్లు‌ ఉందని ఆయన విమర్శించారు. సర్వేకి వచ్చిన అధికారులకి‌ సమాచార సేకరణలో అడ్డంకులు సృష్టిస్తే చర్యలు తప్పవని, కావాలని బీఆర్ఎస్, బిజేపి సర్వే ని తప్పుత్రోవ పట్టిస్తున్నారన్నారు మంత్రి పొన్నం.

మీ పాపపు పరిపాలనపై మా సీఎం ప్రక్షాళన చేస్తున్నాడు..
మాజీ మంత్రి హరీష్ రావు పై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని తప్పయింది మేము రాజన్న కి ఇచ్చిన మాట తప్పాము అని క్షమించు అని ఆడుగుతాడు అనుకున్నామని, సోనియా తెలంగాణ ఇస్తేనే కదా కేసీఆర్ సీఎం అయ్యాడు, మీకు పదవులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీ పాపపు పరిపాలనపై మా సీఎం ప్రక్షాళన చేస్తున్నాడని, రాజన్న ఆలయం ను అభివృద్ది చేస్తనాని మోసం చేసిన మీరు.. నన్ను ఓడకొట్టడానికి 2018 లో కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కి శంకుస్థాపన చేసి నిర్మాణం చేయలేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికయినా మీ మామ కేసీఆర్ తరపున క్షమించు అని అడగాలని, కాళేశ్వరం కూలిపోయింది, ఫోన్ ట్యాపింగ్, గొర్ల, బర్ల స్కామ్ లు… ఈ ఫార్ములా కేసులు ఎవరివి… 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాట్లాడేది అని ఆది శ్రీనివాస్‌ ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాలేదని మండిపడ్డారు. ఇవాళ గురుకుల పాఠశాలలో కాస్మోటిస్క్స్ 200 శాతం పెంచామని, 20 ఏళ్ల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది మేము అని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని, 10 ఏళ్ళ పరిపాలన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఆది శ్రీనివాస్‌. దేశంలోనే చరిత్ర, ఏక కలలంలో రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్‌ది అని ఆయన అన్నారు.

సీఐఎస్ఎఫ్‌లో మహిళలు.. మహిళా బెటాలియన్‌కు కేంద్రం ఆమోదం
మహిళా సాధికారత కింద మోడీ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. సీఐఎస్ఎఫ్ తొలి మహిళా బెటాలియన్‌కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మహిళల సాధికారత, జాతీయ భద్రతలో వారి పాత్రను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు ఈ ఫోర్స్ ప్రాధాన్యత ఎంపిక అని.. ఫోర్స్‌లో వారి వాటా 7 శాతానికి పైగా ఉందని సీఐఎస్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు. మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన యువతులు ఈ ఫోర్స్ లో చేరి దేశానికి సేవ చేసేలా ప్రోత్సహిస్తుంది. దీంతో ఫోర్స్‌లో ఉన్న మహిళలకు కొత్త గుర్తింపు వస్తుంది. కాగా.. సీఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయం కొత్త బెటాలియన్ యొక్క ప్రధాన కార్యాలయానికి ప్రారంభ నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేసే పనిలో పడింది. వీఐపీ భద్రత, విమానాశ్రయాల భద్రత, ఢిల్లీ మెట్రో రైల్ విధుల్లో కమాండోలుగా నిర్వహించగల అద్భుతమైన బెటాలియన్‌ను రూపొందించేందుకు ప్రత్యేకంగా శిక్షణను రూపొందిస్తున్నారు. అయితే.. సీఐఎస్‌ఎఫ్ 53వ రైజింగ్ డే వేడుకల్లో కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు మొత్తం మహిళా బెటాలియన్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

మారిషన్ ప్రధానిగా నవీన్ రామ్‌గూలం విజయం.. మోడీ అభినందన..
మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్‌గూలం విజయం సాధించారు. పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అభినందించారు. రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన విశిష్టమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అతనితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నాటి పార్లమెంటరీ ఎన్నికల తర్వాత ప్రస్తుతం ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ తన ఓటమిని అంగీకరించారు. ఎల్ అలియన్స్ లెపెప్ భారీ ఓటమిని చవిచూసిందని ఆయన చెప్పారు. మీడియా నివేదికల ప్రకారం, అలయన్స్ ఆఫ్ చేంజ్ కూటమి నాయకుడు నవీన్ రామ్‌గూలం(77) హిందూ మహాసముద్ర ద్వీప సమూహానికి తదుపరి ప్రధాని కాబోతున్నారు. కొత్త ప్రధానికి మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ.. భారతదేశాన్ని పర్యటించాలని కోరినట్లు ఎక్స్‌లో వెల్లడించారు.

భారత్‌లో త్వరలో స్టార్‌లింక్..? జియో, ఎయిర్‌టెల్‌పై ఎఫెక్ట్..
భారతదేశంలో ఇంటర్నెట్, టెలికాం రంగంలోకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ ‘‘స్టార్‌లింక్’’ సేవలు త్వరలో ఇండియాలో కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే, అత్యధిక జనాభా కలిగిన, అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ వాడుతున్న దేశంలో గేమ్ ఛేంజర్ అవుతుంది. ఒక వేళ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇండియాలోకి వస్తే ముఖేస్ అంబానీ జియో, సునీల్ భారతి మిట్టల్ ఎయిర్‌లెట్ వంటి సంస్థలు జాగ్రత్త పడాల్సిందే. అయితే, ప్రస్తుతం భారత్‌లో బ్రాడ్ బ్యాండ్, వైఫై ధరలు ప్రపంచంతో పోల్చి చూసినప్పుడు తక్కువ ధరల్ని కలిగి ఉన్నాయి. ఈ ధరలను బట్టి చూస్తే ఎలాన్ మస్క్ జియో, ఎయిర్‌టెల్‌తో పోటీ పడగలడా..? అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్, తన స్టార్‌లింగ్ శాటిలైట్ వ్యవస్థ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నాడు. భూమికి సమీపంలో ఉన్న కక్ష్యలో వేల సంఖ్యలో శాటిలైట్లను మోహరించాడు. వీటి ద్వారా నేరుగా ఇంటర్నెట్ సేవలు అందుకోగలము. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, ఎడారుల్లో, మహాసముద్రాల్లో, దట్టమైన అడవుల్లో కూడా స్టార్‌లింగ్ ఇంటర్నెట్ సేవల్ని పొందగలం. భారతదేశంలో ఈ సేవల్ని అందించడానికి లైసెన్సుల కోసం అవసరమైన భద్రతాపరమైన అనుమతుల్ని కోరుతున్నట్లు సమాచారం. అధికారులు నిర్దేశించిన షరతులకు అనుగుణంగా అనుమతిని పొందవచ్చని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్యా సింథియా ఈ రోజు చెప్పారు.

గూగుల్ మ్యాప్స్‌లో గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసుకునే కొత్త ఫీచర్..
గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వివిధ ప్రదేశాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను తనిఖీ చేయవచ్చు. 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు కొత్త ఫీచర్ నుండి ప్రయోజనం పొందనున్నారు. గాలి నాణ్యత పర్యవేక్షణను అందరికీ సులభతరం చేసే ఉద్దేశ్యంతో ఈ ఫీచర్ లాంచ్ చేశారు. ఈ వారంలో 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. AQI ఫీచర్ ద్వారా.. ఇండియా, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలోని ఏ ప్రదేశం యొక్క డేటాను గంట ప్రాతిపదికన ట్రాక్ చేయవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో కనిపించే AQI రీడింగ్‌లు చాలా సులభంగా అర్థమయ్యే ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో.. వినియోగదారులు 0 నుండి 500 మధ్య రేటింగ్‌తో గాలి నాణ్యత స్థాయిని తనిఖీ చేయవచ్చు.

భారత్ వరుసగా రెండో విజయం.. దక్షిణ కొరియాపై గెలుపు
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో 3–2తో దక్షిణ కొరియాను ఓడించింది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణ కొరియాకు తొలి ఓటమి. టోర్నమెంట్‌లో తన మొదటి మ్యాచ్‌ను జపాన్‌తో 2-2 డ్రాగా ముగిసింది. బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున సంగీత కుమారి 3వ నిమిషంలో ఒక గోల్ చేసింది. దీపిక రెండు గోల్స్ 4వ నిమిషం, 56వ నిమిషంలో సాధించింది. ఈ మ్యాచ్‌లో దీపిక పెనాల్టీ స్ట్రోక్‌తో రెండో గోల్ చేసి భారత్‌ను మ్యాచ్‌లో ముందంజలో ఉంచింది. దక్షిణ కొరియా తరఫున యూరి లీ 34వ నిమిషంలో గోల్ చేయగా, 39వ నిమిషంలో చియోన్ యున్బీ పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ చేసింది. హాఫ్ టైమ్ వరకు మ్యాచ్ స్కోరు 2-0తో భారత్‌కు అనుకూలంగా ఉంది. కాగా.. భారత్ వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్ సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభమైంది. భారత్ వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్‌కు ముందు చైనా టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. చైనా 5-0తో మలేషియాను చిత్తు చేసింది. చైనా కేవలం 2 మ్యాచ్‌ల్లోనే 20 గోల్స్ చేసింది. మలేషియాపై భారత్ 4-0 తేడాతో టోర్నీని విజయంంతో ప్రారంభించింది. సలీమా టెటె నేతృత్వంలోని భారత జట్టు మొదటి, మూడు, నాలుగో క్వార్టర్లలో గోల్స్ చేసింది. భారత్ తరఫున సంగీత కుమారి రెండు గోల్స్ చేయగా, ప్రీతి దుబే, ఉదిత చెరో గోల్ చేశారు.

రాజసాబ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన భూషన్ కుమార్
ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది. ఇదిలా ఉండగా రాజా సాబ్ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ దాదాపు రూ. 25 కోట్లకు ఆడియో రైట్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమాపై టీ సిరిస్ అధినేత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. భూషణ్ కుమార్ మాట్లాడుతూ ” మేము రాజాసాబ్ ఆడియో రైట్స్ తీసుకున్నాం. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్, సాంగ్స్ విజువల్స్ చూసాను. నాకు హాలీవుడ్ సూపర్ బ్లాక్ బస్టర్ హ్యారీ పోటర్ సినిమా  వైబ్ కనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుంది’ అని  అన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  అత్యంత భారీ బడ్జెట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తుండగా యస్ యస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్.

ఆహా OTT డాన్స్ ఐకాన్ – 2 వచ్చేస్తోంది.. ఈ సారి హోస్ట్ ఎవరంటే..?
ప్రపంచవ్యాప్తంగా డ్యాన్సర్లందరికి ఆహ్వానం పలుకుతోంది ప్రముఖ ప్రాంతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా OTT.  డ్యాన్స్ IKON2 అంతర్జాతీయ ఆడిషన్స్ ను స్టార్ట్ చేస్తోంది ఆహా. డ్యాన్స్ స్టైల్‌పై ఎటువంటి పరిమితులు లేకుండా 6 నుండి 30 సంవత్సరాల వయస్సు గల డాన్సర్స్ కు ఆడిషన్ నిర్వహిస్తుంది. మీరు సోలో పెర్ఫార్మర్ అయినా, జోడిలో భాగమైనా లేదా గ్రూప్ (ఐదుగురు వరకు) సభ్యుడైనా, ఆహా డ్యాన్స్ IKON2 ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాన్సర్స్ ను ఆహ్వానిస్తోంది. కానీ డ్యాన్స్ వీడియో గరిష్టంగా 90 సెకన్లు మరియు గరిష్టంగా 50 MB పరిమాణంలో ఉండాలి. నవంబర్ 10 నుండి నవంబర్ 16, 2024 వరకు డ్యాన్సర్స్ ఆడిషన్ వీడియోస్ క్రింది లింక్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు: http://aha.video/dance-ikon-auditions. ఆహా OTT CEO రవికాంత్ సబ్నవిస్ మాట్లాడుతూ, “ఆహా OTT వద్ద, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులైన  డాన్సర్స్ తమ టాలెంట్ ను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. డాన్స్ IKON2తో కొత్త టాలెంట్ ను బయటకు తీస్తాం. ఈ సంవత్సరం థీమ్, ‘డ్యాన్స్ ఫర్ ఎ కాజ్’ పాల్గొనేవారికి ఒకటే చెప్తాం మీలో ప్రతిభ ఉంటె దాన్ని నిరూపించుకోవడానికి డ్యాన్స్ IKON2 అద్భుత అవకాశం’ అని అన్నారు.  హిప్-హాప్, క్లాసికల్ మరియు మరిన్నింటితో సహా అన్ని రకాల డాన్స్ లో అనుభవం ఉన్న లేదా జూనియర్ అయినా సరే, ఆహా డ్యాన్స్ IKON2 అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కళాకారులతో పరిచయం పొందడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి సరైన వేదిక. ఇంకెందుకు ఆలస్యం మీరు మంచి డ్యాన్సర్ అయితే ఆహా డ్యాన్స్ ఐకాన్ 2 కి అప్లై చేసేయండి.  మొదటి సీజన్ ను హోస్ట్ చేసిన ఓంకార్ ఇప్పుడు రాబోతున్న సీజన్ 2 ను హోస్ట్ చేయబోతున్నాడు.