Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

విశాఖ గురించి వైఎస్‌ జగన్‌ చెప్పిందే.. చంద్రబాబు చెబుతున్నారు..
అన్నివైపులా విశాఖ అభివృద్ధిపై చర్చ సాగుతున్న వేళ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ అప్పుడు విశాఖ గురించి చెప్పిన విషయాలనే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని తొలి సారిగా వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు విశాఖ ప్రాధాన్యతను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. పరిశ్రమలు రావడం ఒక కొనసాగే ప్రక్రియ అని, దీన్నే ఇప్పుడు నూతనంగా చూపిస్తున్నారని విమర్శించారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పరిశ్రమలు విశాఖకు రావడం జగన్ కృషి ఉంది.. ఇన్ఫోసిస్ రాగానే సహజంగానే ఇతర ఐటీ సంస్థలు విశాఖ వైపు ఆకర్షితమయ్యాయని వివరించారు. టీసీఎస్ కూడా విశాఖకు రావడానికి జగన్ ప్రోత్సాహం కీలకం అని చెప్పారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎందుకు చౌకగా? ఇస్తున్నారు అంటూ.. ప్రభుత్వ భూవినియోగంపై అమర్నాథ్ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.. సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల విలువైన భూములు అతి తక్కువ ధరకు ఎందుకు కేటాయిస్తున్నారు అని ప్రశ్నించారు. మీకు నచ్చిన సంస్థలకు రూపాయి – అర్ధ రూపాయికే భూములు ఇస్తామంటే ఎలా? అంటూ మండిపడ్డారు. సత్వకు ఇచ్చిన భూమిలో రెసిడెన్షియల్ అపార్‌మెంట్లు, ప్లాట్లు నిర్మించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారు? అని నిలదీశారు.. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడమే కాదు, ప్రభుత్వ రాయితీలు కూడా ఇస్తారా? అని అడిగారు.

పంచాయతీరాజ్ పాలన మరింత బలోపేతం.. కీలక సంస్కరణలకు పవన్‌ శ్రీకారం..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంచాయతీరాజ్ పాలనను మరింత బలోపేతం చేస్తూ, గ్రామ స్వరాజ్య సాధన దిశగా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌.. గ్రామీణ స్థాయిలో పరిపాలన వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా క్యాంపు కార్యాలయంలో శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో .. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి హోదా, ఉద్యోగుల ప్యాట్రన్, పనితీరు వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తూ, భవిష్యత్ సంస్కరణల రూపురేఖలను మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కావాలని, ప్రజలలో సేవలపై మరింత సంతృప్తి పెరగాలంటే పరిపాలన వ్యవహారాలు మారాలని ఆయన వెల్లడించారు. స్వచ్చ రథం, మ్యాజిక్ డ్రెయిన్ వంటి పైలట్ ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ.. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఇలాంటి నూతన ఆలోచనలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించారు పవన్‌ కల్యాణ్.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య రంగాల్లో విస్తృత మార్పులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ పనులపై నిరంతర పర్యవేక్షణ కోసం సాంకేతికపరంగా శాఖను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా పథకాలు సమర్థంగా అమలు అవ్వాలని, నీటి నాణ్యత పరీక్షలు కచ్చితంగా జరుగాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ పనులను సమయానుకూలంగా చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

డీజీపీకి వైసీపీ లేఖ.. అనుమతి ఇవ్వండి..!
ఆంధ్రప్రదేశ్‌ డీజీపీకి లేఖ రాసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి, వాహనాల ర్యాలీకి అనుమతివ్వాలని డీజీపీకి వైసీపీ అధికారికంగా లేఖ ఇచ్చింది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి విజ్ఞప్తి చేశారు. జిల్లాల ఎస్పీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని తన లేఖలో కోరారు. వైసీపీ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల పత్రాలు ఈనెల 10న జిల్లా కేంద్రాలకు చేరాయి. వీటిని డిసెంబరు 15న తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకురావాల్సి ఉంది.. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లికి వాహనాల ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. వాహనాల ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా నిరవధికంగా సాగేందుకు అనుమతి అవసరమని, అందుకే డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ కోరింది. అంతేగాక, కోటి సంతకాల పత్రాలు విజయవాడకు చేరుకున్న అనంతరం, మాజీ సీఎం వైఎస్ జగన్ డిసెంబరు 18వ తేదీన గవర్నర్‌ను కలిసి వాటిని అధికారికంగా సమర్పిస్తారని లేఖలో పేర్కొంది ..

హైదరాబాద్‌లో మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. షెడ్యూల్ లో భాగంగా డిసెంబర్ 13 (శనివారం)న మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కోల్‌కతా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న 100 మంది అదృష్టవంతులతో స్టార్ ప్లేయర్ ముఖాముఖీగా మాట్లాడి, ఫోటోలు దిగనున్నాడు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్‌బాల్ జట్టుతో 15 నిమిషాలపాటు సంభాషించి, కొన్ని ఫుట్‌బాల్ మెళకువలు తెలపనున్నాడు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమం సహా పలు ఆకర్షణలు ఉంటాయి. 7.30కి ప్రత్యేక మ్యాచ్ జరుగనుంది. సింగరేణి RR జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా.. అపర్ణ మెస్సీ టీమ్ తరఫున మెస్సీ ఆడనున్నారు. మెస్సీతో పాటు అతని స్నేహితులైన రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు.

ఇకపై సినిమా టికెట్‌ రేట్లు పెంచేది లేదు
తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. నాకు తెలియకుండానే GO విడుదలైందని ఆయన తెలిపారు. నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరూ కూడా టికెట్ల ధరల పెంపు కోసం మమ్మల్ని సంప్రదించవద్దు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఒక కుటుంబం సినిమా చూడాలంటే టికెట్ల ధరలు తగ్గాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టికెట్ల ధర పెంచబోమని నేను గతంలో అసెంబ్లీలో కూడా చెప్పాను అని మంత్రి గుర్తు చేశారు. సినిమా టికెట్ల ధరల పెంపు కోసం ఎటువంటి దరఖాస్తులు తీసుకోకూడదని తాను ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి ఆదేశించానని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కూడా తెలియజేశానని ఆయన వెల్లడించారు. తాజాగా విడుదలైన ‘అఖండ 2’ సినిమా టికెట్ల ధరలు పెంచిన విషయం తనకు తెలియదని మంత్రి పేర్కొన్నారు. తాను గత కొన్ని రోజులుగా ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఏర్పాటు చేయనున్న ఫిల్మ్ సిటీ గురించి, తన నియోజకవర్గంలోని ఎన్నికల పనుల్లో బిజీలో ఉన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.

విమాన ఛార్జీలను మేం నియంత్రించలేం: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు
పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు లోక్ సభలో విమాన ఛార్జీలపై ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏడాది పొడవునా విమాన ఛార్జీలను పరిమితం చేయలేదని అన్నారు. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ఛార్జీలు పెరుగుతాయని అన్నారు. రద్దీగా ఉండే పండుగ సీజన్‌లో విమానయాన సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. అవసరమైనప్పుడు కేంద్రం ఛార్జీలను పరిమితం చేస్తుందన్నారు. మహా కుంభమేళా, పుల్వామా దాడి, ఇండిగో సంక్షోభం సమయంలో ధరలను నియంత్రించడానికి కేంద్రానికి ఉన్న అధికారాలను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఫేర్ టు లీజర్ పథకం కింద దేశవ్యాప్తంగా 25 రూట్లలో విమాన ఛార్జీలు నిర్ణయిస్తారని, వాటిని పెంచలేమని కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు పేర్కొన్నారు. లోక్ సభలో షఫీ పరంబ్‌బిల్ అనే ఒక ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టిన బిల్లుపై కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు. ఈ బిల్లు విమాన ఛార్జీలను నియంత్రించడానికి ప్రయత్నించింది. అయితే చర్చ అనంతరం షఫీ పరంబ్‌బిల్ దీనిని ఉపసంహరించుకున్నారు. రాజ్యసభలో జీరో అవర్ సమయంలో సభ్యులు ఇండిగో సంక్షోభం అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్ని మాట్లాడుతూ.. “65 శాతం విమాన రాకపోకలను రెండు విమానయాన సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఆరోపణలు చేయకుండా, ఇది అందరి బాధ్యతగా మనం చూడాలి. బ్యాంకులు, విద్యుత్ ప్లాంట్లు మొదలైనవి NPAలు లేదా NCLTలను ఎదుర్కొన్నప్పుడు, ప్రభుత్వం వాటిని పునర్నిర్మిస్తుంది, కానీ విమానయాన సంస్థల విషయంలో ఇది జరగలేదు. విమానయాన సంస్థకు ఏవైనా సమస్యలు ఉన్నా, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదు” అని ఆయన పేర్కొన్నారు.

వరసగా 6 ఎన్నికల్ని ఓడిపోయాం’’.. రాహుల్ గాంధీ, ఖర్గేలపై సోనియా గాంధీకి లేఖ..
కాంగ్రెస్ పార్టీ వరస వైఫల్యాలపై ఆవేదన చెందిన ఒడిశాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్‌కు చాలా సంస్కరణలు అవసమని ఆయన చెప్పారు. బారాబతి-కటక్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మొక్విమ్ డిసెంబర్ 8న సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ పంపారు. లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటములు, 2024 నుంచి బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఒడిశా పరాజయాలను ఆయన ప్రస్తావించారు. రాహుల్ గాంధీని కలిసేందుకు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా, అనుమతి లభించడం లేదని చెప్పారు. ఇది తన వ్యక్తిగత ఫిర్యాదు కాదని, భారతదేశం అంతటా కార్యకర్తలు ఇలాగే భావిస్తున్నారని అన్నారు. పార్టీకి యువత, కార్యకర్తలతో పెరుగుతున్న అంతరాయాన్ని మొక్విమ్ హైలెట్ చేశారు. శశిథరూర్, డీకే శివకుమార్, సచిన్ పైటల్, ప్రియాంకాగాంధీ వంటి నేతలు భవిష్యత్తులో పార్టీకి ప్రధాన నాయకత్వంగా నిలవాలని సూచించారు. మల్లికార్జుణ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత ఆయన యువతతో కలవలేకపోతున్నారని అన్నారు. మనం ఇప్పుడు మేల్కొనకపోతే, మనం వారసత్వంగా పొందిన కాంగ్రెస్ పార్టీని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పాక్ ప్రధాని షరీఫ్‌కు ఘోర అవమానం.. పట్టించుకోని పుతిన్..
పాకిస్తాన్, అంతర్జాతీయ పరువు పోగొట్టుకోవడం అనవాయితీగా మార్చుకుంది. ఆ దేశం నుంచి ప్రధానితో పాటు ఎవరూ విదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ అవమానం ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా, తుర్క్‌మెనిస్తాన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఇంటర్నేషనల్ పీస్ అండ్ ట్రస్ట్ ఫోరం సదస్సులో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల, భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఎంత సన్నిహితంగా ఉన్నారో చూశాం. కానీ, పాక్ ప్రధాని షరీఫ్‌ను కలిసేందుకు మాత్రం పుతిన్ ఆసక్తి చూపించలేదు. పుతిన్‌ను కలిసేందుకు షరీఫ్ నానా ప్రయత్నాలు చేసినా కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఏకంగా 40 నిమిషాల పాటు పుతిన్‌తో సమావేశం కోసం ఎదురుచూశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మీటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో షరీఫ్ తీవ్ర అసహనంగా ఉన్నారు. భారత పర్యటనకు వచ్చిన పుతిన్‌‌ను ప్రధాని మోడీ స్వయంగా ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతించారు. ఒకే కారులో మోడీ, పుతిన్ ప్రయాణించారు. 40 నిమిషాల నిరీక్షణ తర్వాత, ఇంకా మీటింగ్ ఎప్పుడు అవుతుంది అని షరీఫ్ అధికారుల్ని పదే పదే అడగడం వీడియోలో కనిపిస్తోంది. చివరకు పుతిన్ రాకపోవడంతో షరీఫ్, ఆయనను కలవకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇది పాక్ ప్రధానికి జరిగిన ఘోరమైన దౌత్య అవమానం. ఒక దేశాధినేతను పుతిన్ పట్టించుకోలేదు. పుతిన్ మాత్రమే కాదు, దివాళా అంచున ఉన్న, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది దేశాన్ని ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు.

యూఏఈ బౌలర్స్ పై Vaibhav Sooryavanshi శివతాండవం.. 234 పరుగుల తేడాతో భారీ విజయం..!
భారత్ U-19 జట్టు యూఏఈ U-19పై దుబాయిలోని ఐసీసీ అకాడమీలో భారీ విజయాన్ని నమోదు చేసింది. నేడు (డిసెంబర్ 12) జరిగిన మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం భారత్‌కు వరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో కేవలం 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 433 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరుకు ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్. అతను కేవలం 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 171 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. అతనికి ఆరోన్ వర్గీస్ (69), విహాన్ మల్హోత్రా (69), వేదాంత్ త్రివేది (38) బ్యాటర్ల నుంచి మద్దతు ఇచ్చారు. చివర్లో అభిజ్ఞాన్ కుందు (32 నాటౌట్), కనిష్క్ చౌహాన్ (28) కూడా చక్కటి ఫినిష్ ఇవ్వడంతో భారత్ భారీ స్కోరు దాటింది. లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ U-19 జట్టు ప్రారంభం నుంచే భారత బౌలర్లకి బలయ్యింది. టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ చేరడంతో పూర్తిగా ఒత్తిడిలో పడింది. మిడిలార్డర్‌లో ఉద్ధిష్ సూరి (78 నాటౌట్), పృథ్వీ మధు (50) పోరాడినా.. స్లో స్ట్రైక్ రేట్ కారణంగా మ్యాచ్‌ను కాపాడలేకపోయారు. యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 199 పరుగులకే పరిమితమైంది. భారత జట్టు బౌలర్లలో దేవేంద్రన్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. కిషన్ సింగ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా చెరో ఒక వికెట్ తీసి కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. దీనితో మొత్తంగా యూఏఈ పై 234 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. సంచలన ఇన్నింగ్స్‌తో పాటు బౌలింగ్‌ కూడా చేసిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ ఘన విజయం భారత్ U-19 జట్టు టోర్నమెంట్లో తమ ప్రయాణాన్ని శుభారంభంతో ప్రారంభించినట్టైంది.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘శశివదనే’..
‘పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ అట్లూరి హీరోగా, ‘హిట్’ సిరీస్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన కోమలి హీరోయిన్‌గా నటించిన కొత్త సినిమా ‘శశివదనే’. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. రవితేజ బెల్లంకొండ నిర్మించారు. నిజానికి మేకర్స్ ఈ చిత్రాన్ని ఒక విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. రాఘవ (రక్షిత్) గోదావరి లంక గ్రామంలో తన తండ్రి (శ్రీ మాన్)తో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. అనుకోకుండా రాఘవ పక్కూరికి చెందిన ఓ అమ్మాయి(కోమలి ప్రసాద్‌)ని చూసి, మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అలా, పేరు తెలుసుకునే క్రమంలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే, వారిద్దరి మధ్య ప్రేమ ఎంత దూరం వెళ్లింది, కులాలు వేరు కావడంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.

Exit mobile version