NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఏపీకి చేరుకున్న కొత్త గవర్నర్‌.. స్వాగతం పలికిన సీఎం వైఎస్‌ జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రాష్ట్రానికి చేరుకున్నారు.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. నూతన గవర్నర్ కు ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌తో పాటు సీఎస్‌ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌, మంత్రి జోగి రమేష్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు స్వాగతం పలికారు.. ఇక, కొత్త గవర్నర్‌కు విమానాశ్రయంలో నేతలను, అధికారులను పరిచయం చేశారు సీఎం జగన్.. అనంతరం పోలీసు గౌరవవందనం స్వీకరించిన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌.. ఆ తర్వాత సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.. కాగా, ఎల్లుండి అంటే ఫిబ్రవరి 24వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే.

కార్యకర్తలకు బీమా.. పవన్‌ కల్యాణ్ రూ.కోటి విరాళం
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యం అందిస్తోంది జనసేన పార్టీ.. రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు బీమా సదుపాయం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2022-23 సంవత్సర కాలానికి జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను పవన్ కల్యాణ్ చెల్లించారు. ఇక, వార్షిక సంవత్సరం ముగిసిన కొత్త 2023-24 ఫైనాన్షియల్‌ ఇయర్‌ ప్రారంభం కానుండడంతో.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో రూ.కోటి చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, కోశాధికారి కేవీ రత్నంకు అందజేశారు.. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద బీమా చేయించే నిమిత్తం గత రెండేళ్లుగా ఏటా రూ.కోటి చొప్పున విరాళాన్ని అందజేస్తూ వచ్చారు పవన్‌ కల్యాణ్‌… ఇక, మూడో ఏటా తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చారు.. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు.. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాక్షించారు జనసేన అధినేత వపన్‌ కల్యాణ్. కాగా, జనసేనతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం విదితమే. మరోవైపు.. ఫోన్‌ ద్వారా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది జనసేన పార్టీ.. కొత్తగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, క్రియాశీలక వాలంటీర్లుగా బాధ్యత చేపట్టాలనుకునేవారు 08069932222 నంబర్‌కు కాల్‌ చేసి.. బీప్ సౌండ్ తరువాత మీ పేరు, నియోజకవర్గం పేరు చెప్పాలని జనసేన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

పోలీస్‌ స్టేషన్లలో సీసీటీవీలు తప్పనిసరి.. ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు
పోలీసు స్టేషన్‌లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను నెల రోజుల్లోగా పాటించాలని సూచించింది. న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 29 వరకు తమ సమ్మతి అఫిడవిట్‌లను దాఖలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. అయితే పాటించని పక్షంలో సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఆదేశాలు పాటించకపోతే కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హోం కార్యదర్శులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సహా దర్యాప్తు సంస్థల కార్యాలయాలలో సీసీటీవి కెమెరాలు, రికార్డింగ్ పరికరాలను అమర్చాలని 2020లో న్యాయస్థానం నిర్దేశించింది. ఈ విషయంలో అమికస్ క్యూరీగా నియమితులైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంకా సమ్మతి నివేదికలను దాఖలు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. వచ్చే నెలాఖరులోగా ఇక్కడి సీబీఐ ప్రధాన కార్యాలయంతో పాటు బ్రాంచ్ కార్యాలయాల్లోనూ సీసీటీవీలను ఏర్పాటు చేస్తామని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అన్ని కార్యాలయాలు ఇప్పటికే నిబంధనలను పాటించాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఎన్‌ఐఏ కార్యాలయాల్లో స్థాపనల కోసం సీసీటీవీల సేకరణకు ఆమోదం లభించిందని, ఈ ఏడాది చివరి నాటికి కసరత్తు ముగుస్తుందని కూడా తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో మిగిలిన కార్యాలయాల్లో సీసీటీవీల ఏర్పాటుకు మే వరకు సమయం కావాలని కోరింది. ఢిల్లీలోని పోలీస్ స్టేషన్ల విషయానికొస్తే, మరో 2,000 సీసీటీవీల అవసరం ఉందని, ప్రస్తుతం 1,941 సీసీటీవీలను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని కేంద్రం తెలిపింది.

ప్రియుడితో కలిసి శృంగార కేళి.. అడ్డుగా ఉన్నాడని భర్తను..
తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి పక్కన చంద్రవిలాసపురం పంచాయతీ పరిధిలోని సుందరరాజపురం గ్రామానికి చెందిన యువరాజ్ (29) శ్రీపెరంబుదూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇతనికి మేనమామ కూతురు గాయత్రి(25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న గాయత్రి ఒక్కసారిగా కేకలు వేసింది. ఆమె అరుపులకు వచ్చిన ఇరుగుపొరుగు వారు యువరాజ్ మృతదేహం వేలాడుతూ ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. అయితే తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని తండ్రి ఆరుముగం ఆర్కేపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయమై యువరాజ్ భార్య గాయత్రిని పోలీసులు విచారించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. ఆమెను పోలీస్‌స్టేషన్‌ను తరలించి విచారణ చేపట్టారు పోలీసులు. విచారణలో పలు విస్మయకర సమాచారం వెల్లడైంది. ఈ విషయమై పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శ్రీనివాసన్‌ అనే వ్యక్తితో గాయత్రి ప్రేమలో పడింది. అయితే.. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన యువరాజ్‌ మామ హడావుడిగా గాయత్రికి యువరాజ్‌తో వివాహం జరిపించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత శ్రీనివాసన్‌తో ప్రేమను మరచిపోలేక మళ్లీ శ్రీనివాసన్‌తో లైంగిక సంబంధం పెట్టుకుంది గాయత్రి. అయితే.. గాయత్రిపై అనుమానం వచ్చిన భర్తకు ఓరోజు విషయం తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

6వేల పట్వారీ జాబ్‌లకు 12లక్షల అప్లికేషన్లు.. డాక్టరేట్ హోల్డర్లతో సహా..
ఇంజినీర్లు, డాక్టరేట్ హోల్డర్‌లతో సహా 12 లక్షలకు పైగా అభ్యర్థులు మధ్యప్రదేశ్‌లో దాదాపు 6,000 పట్వారీ స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నిరుద్యోగం గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పట్వారీ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి గ్రాడ్యుయేట్ డిగ్రీ సరిపోతుంది. ఇంజనీరింగ్, సైన్స్, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు వంటి అధునాతన డిగ్రీలు ఉన్న చాలా మంది విద్యార్థులు పట్వారీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. పట్వారీ పోస్టుల కోసం పరీక్ష మార్చి 15న జరగాల్సి ఉంది. రెండు సెషన్లలో జరుగుతుంది. పట్వారీ ఉద్యోగాల కోసం రాష్ట్రం చివరిసారిగా 2017-18లో పరీక్షలు నిర్వహించింది. ఈ సంవత్సరం, 12.79 లక్షల మంది అభ్యర్థులలో, 1,000 మంది డాక్టరేట్లు, 85,000 మంది ఇంజినీరింగ్ డిగ్రీలు, 1 లక్ష మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, 1.8 లక్షల మంది ఆర్ట్స్, సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగి ఉన్నారు. థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం జనవరిలో మధ్యప్రదేశ్ నిరుద్యోగిత రేటు 1.9 శాతంగా ఉన్న రాష్ట్రాలలో అత్యల్పంగా ఉండగా, పట్వారీ ఉద్యోగాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు ఆందోళన చెందడానికి కారణం కావచ్చు. 29 ఏళ్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రవీణ్ శర్మ వంటి అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి కష్టతరమైన అవకాశంగా భావిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే తాము సెటిల్‌ అయినట్లు భావిస్తారు.

కొత్త సర్వీస్‌కు జొమాటో శ్రీకారం..
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టింది.. జొమాటో ఎవ్రీడే పేరు ప్రారంభించిన ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్‌ను అందిస్తోంది.. రియల్ హోమ్ చెఫ్‌లతో రూపొందించిన తాజా హోమ్లీ మీల్స్‌ను సరసమైన ధరలకు డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.. జొమాటో ఎవ్రీడే ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది.. ఈ సర్వీస్‌ ద్వారా హోమ్లీ మీల్స్‌ ప్రారంభ ధర కేవలం రూ. 89.. ఆ తర్వాత ఎంపికను బట్టి రేటు మారిపోతోంది.. ఎప్పటికప్పుడు తమ ఇన్‌స్టంట్ సర్వీస్‌ను రీమోడలింగ్ చేయడంలో భాగంగా ఈ కొత్త సర్వీసు ప్రారంభించినట్టు జొమాటో సీఈవో దీపేంద్ర గోయల్.. బుధవారం రోజు 2022-23 క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించారు జొమాటో సీఈవో దీపేంద్ర గోయల్.. ఈ సందర్భంగా ఈ కొత్త సర్వీస్ తీసుకువస్తామని తెలిపారు. “మీ ఇంటి వద్దకే అందజేసే సరసమైన గృహ భోజన సౌకర్యాన్ని అనుభవించండి. నిజమైన హోమ్ చెఫ్‌లచే రూపొందించబడిన మెనులతో, ఇది మీకు.. మీ ఇంటిని గుర్తు చేస్తుందని మేం ఆశిస్తున్నాం” అని గోయల్‌ వెల్లడించారు.. ఆహార భాగస్వాములు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి హోమ్ చెఫ్‌లు కృషి చేస్తారు.. “కేవలం మెనుని బ్రౌజ్ చేయండి, మీ భోజనాన్ని ఆర్డర్‌ చేయండి మరియు నిమిషాల్లో మీ ఇంటి వద్దకే వేడి వేడి, రుచికరమైన ఆహారాన్ని పంపిణీ చేస్తాం అంటున్నారు.. జొమాటో ప్రకారం భారతదేశం వంటి మార్కెట్‌లో ఇది చాలా పెద్ద అవకాశం,, కంపెనీ జనవరిలో జొమాటో గోల్డ్ అనే బ్రాండ్-న్యూ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. జొమాటో గోల్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం ‘ఆన్ టైమ్ గ్యారెంటీ’. గోల్డ్ మెంబర్‌లు పీక్ సమయాల్లో మరిన్ని రెస్టారెంట్‌లకు ప్రాధాన్య యాక్సెస్‌ను పొందుతారు.. డెలివరీ మరియు డైనింగ్ అవుట్ రెండింటిలోనూ అనేక రెస్టారెంట్‌ల నుండి ఆఫర్‌లను పొందుతారు.

అన్నా.. నీకు దండం పెడతాం.. నువ్వు సినిమాలు మానేయ్ అన్నా.. ప్లీజ్
కోలీవుడ్ హీరో విశాల్ ఇటీవలే లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం విశాల్.. మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. పీరియాడిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై లోని ఓ ఫ్యాక్టరీలో జరుగుతుండగా.. అక్కడ ప్రమాదం సంభంవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి దెబ్బలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో విశాల్ తో పాటు పదుల మంది విలన్స్ సీన్ చేస్తున్నారు. ఇంతలోనే ఒక వ్యాన్ వెనుక నుండి వచ్చి అదుపు తప్పి ఎదురుగా ఉన్న గోడను గుద్దుకొని ఆగిపోయింది. ఇక అనుకోని ఘటనకు సెట్ లో ఉన్నవారందరూ అవాక్కయ్యారు. విశాల్ సైతం పక్కకు తప్పుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని విశాల్ అభిమానులతో తెలుపుతూ.. తృటిలో పెను ప్రమాదం తప్పింది.. కొంచెం ఉంటే ప్రాణం పోయేది.. నాకేమి జరగలేదు.. ఆ షాక్ నుంచి తేరుకొని మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం విశాల్ సినిమాలు మానేయాలని పట్టుబడుతున్నారు. అందుకు కారణం.. విశాల్ కు ఈ ప్రమాదాలు కొత్త కాదు.. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ఎన్నోసార్లు సెట్ లో విశాల్ గాయాల పాలయ్యాడు. ఎన్నో రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. దీంతో అన్నా.. నీకు దండం పెడతాం.. నువ్వు సినిమాలు మానేయ్ అన్నా.. ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. సినిమాల కన్నా ప్రాణాలు ముఖ్యమని, విశాల్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments