NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పారిశ్రామిక వేత్తల చూపు.. విశాఖ వైపు.. నేటి నుంచి జీఐఎస్‌..
పారిశ్రామిక దిగ్గజాల చూపు.. ఇప్పుడు విశాఖపై పడింది.. విశాఖపట్నం వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)ను నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. నేటి నుంచి రెండు రోజుల పాటు జగనున్న ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వచ్చే అతిథులను ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది సర్కార్. పారిశ్రామిక వేత్తల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు పరిశ్రమలు సిద్ధమవుతున్నాయి. సీఎం జగన్‌ సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‍కి 35 మంది టాప్ పారిశ్రామిక వేత్తలు, 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్‌లు తరలిరానున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సమ్మిట్ కోసం‌ 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే.. పారిశ్రామిక వర్గాల నుంచి స్పందన ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, జీఐఎస్‌లో తొలిరోజు కార్యక్రమాల విషయానికి వస్తే.. ఇవాళ ఉదయం 9.45 గంటలకు అతిథుల ఆహ్వానం, పరిచయ కార్యక్రమంతో సదస్సు ప్రారంభం కానుంది. రేజర్‌ షో, మా తెలుగు తల్లికి.. గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆ తర్వాత ఆడియో విజువల్‌ ప్రజెంటేషన్‌ ఉంటుంది. అనంతరం నాఫ్‌ సీఈఓ సుమిత్‌ బిదాని, భారత్‌ ఎఫ్‌ఐహెచ్‌ లిమిటెడ్‌ కంట్రీ హెడ్‌ అండ్‌ ఎండీ జోష్‌ ఫాల్గర్, టొరే ఇండస్ట్రీస్‌(ఇండియా)ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ మసహీరో హమగుచి, కియా ఇండియా నుంచి కబ్‌ డోంగి లీ, ది ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ ఎన్‌.శ్రీనివాసన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆడియో విజువల్‌ ప్రజెంటేషన్‌ ఉంటుంది. అనంతరం అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతిరెడ్డి, శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ హరి మోహన్‌ బంగూర్, సెంచురీ ఫ్లైబోర్డ్స్‌ చైర్మన్‌ సజ్జన్‌ భజంకా, టెస్లా ఇంక్‌ కో ఫౌండర్‌ అండ్‌ మాజీ సీఈఓ మార్టిన్‌ ఎబర్‌హార్డ్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ ప్రసంగిస్తారు.

ఆడపిల్ల పుట్టిందని ఏడేళ్లుగా ఇంటికి రానివ్వలేదు.. ఆమె చేసిన పాపమేంటి?
ప్రస్తుత సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రతి రంగంలోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. పురుషులను మించి కూడా ఉద్యోగాల్లో మహిళలు రాణిస్తున్నారు. మహిళలు సాధికారిత వైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కూడా ఆడపిల్ల పుట్టడాన్ని పాపంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులు. ఆడపిల్ల పుడితే బయట చెత్తలో పడేసి వెళ్లడం, ఆడపిల్ల పుట్టిందని భార్యను భర్త, అత్తమామలు ఇంటి నుంచి వెలేయడం లాంటివి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని ఏడేళ్లుగా ఇంటికి రానివ్వలేదు ఆ ఇల్లాలి భర్త, అత్తమామలు. దీంతో భర్త ఇంటి ముందు బాధితురాలు ధర్నా చేపట్టింది. నేను చేసిన నేరం ఏమిటంటూ భర్త, అత్తమామలను నిలదీసింది. ఈ సంఘటన అంబర్‌పేట్‌లోని ఆర్‌కే నగర్‌లో జరిగింది. భర్త ఇంటి ముందు కూతురితో కలిసి బాధితురాలు మాధవి బైఠాయించింది. ఏడేళ్లుగా మాధవి న్యాయపోరాటం చేస్తోంది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త కిరణ్‌కుమార్‌, అత్తమామలు ఇంటి నుండి గెంటేసినట్లు వాపోతోంది. గత మూడు రోజులుగా భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. కానీ భర్త, అత్తమామలు ఆమెను పట్టించుకోలేదు. తనను, కూతురిని ఇంట్లోకి అనుమతించే వరకు అక్కడే ఉంటానని కూతురితో కలిసి బైఠాయించింది. తనకు తన కూతురికి న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. మాధవికి పలు మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.

అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసు.. ఏడు రోజుల కస్టడీకి నిందితుడు
తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకూ ప్రతిరోజూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నిందితుడు హరిహరకృష్ణ, అతని స్నేహితుడు హసన్‌, నిహారికను పోలీసులు విచారించారు. అయితే ఒక్కరంటే ఒక్కరూ విచారణకు సహకరించకట్లేదని పోలీసులు చెబుతున్నారు. బుధవారం నాడు నవీన్ హత్య దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. హత్య తరువాత నిందితుడు తన స్నేహితుడు హసన్, స్నేహితురాలు నిహారిక, తండ్రికి ఘటన గురించి చెప్పాడని పోలీసులు తేల్చారు. నవీన్‌ హత్య కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లోని కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కాపీని హయత్‌నగర్‌ కోర్టుకు సమర్పించారు. దాని ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఐడియల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివే సమయంలో నవీన్‌, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు. ఆ తర్వాత గొడవలు జరగడంతో.. రెండేళ్ల కిందట విడిపోయారు. ఈ సమయంలో హరిహరకృష్ణ ఆ అమ్మాయికి ప్రపోజ్‌ చేయగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. తర్వాత నవీన్‌, ఆ అమ్మాయికి తరచూ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుండేవాడు. దీంతో నిందితుడు నవీన్‌పై కక్ష పెంచుకుని.. అతణ్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడని హయత్‌నగర్‌ కోర్టుకు సమర్పించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు పేర్కొన్నారు. నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసిన తీరు గురించి కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు.

వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించాడని.. వ్యక్తిపై కాల్పులు
ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకే దాడులకు పాల్పడడం, దారుణంగా వ్యవహరించడం రోజురోజుకు పెరిగిపోతోంది. చిన్న విషయాలకే నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ గురిచేస్తోంది. వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించినందుకు ఓ వ్యక్తిపై ముగ్గురు కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లో కుక్కల మరణంపై మాటల యుద్ధం తర్వాత పెంపుడు జంతువుల యజమానుల వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించబడిన ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి గాయపరిచారని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన ఫిబ్రవరి 26న జరిగింది. రాజ్‌కమల్ అనే బాధితుడి చేతికి, కడుపులో గాయాలయ్యాయి. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.నిందితులను జావెలిన్ త్రోయర్ హితేష్ అలియాస్ డేవిడ్ (23), నోయిడాలో టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆనంద్ కుమార్ (26), టోల్ ప్లాజా ఉద్యోగి భూపేందర్ అలియాస్ భీమ్ (30)గా గుర్తించారు. వారి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు రెండు కాట్రిడ్జ్‌లు, స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక నెల క్రితం ఆనంద్ కుమార్ కుక్క డాగ్‌ఫైటింగ్ సమయంలో చనిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని వ్యంగ్య సందేశాలు షేర్ చేయబడ్డాయి. దాని వల్ల మాటల యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత రాజ్‌కమల్ ఆనంద్‌కుమార్‌ను వాట్సాప్‌ గ్రూప్ నుంచి తొలగించాడు. దీంతో ఆనంద్ రాజ్‌కమల్‌పై పగ పెంచుకున్నాడు. ఫిబ్రవరి 26న, వారు బస్పదంక గ్రామంలో కలుసుకున్నప్పుడు, నిందితులు రాజ్‌కమల్‌ను కాల్చారు. బుల్లెట్ రాజ్‌కమల్ చేతికి, కడుపులో తాకిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పటౌడీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

బీజింగ్ రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తే.. చైనాకు అమెరికా హెచ్చరిక
రష్యాకు చైనా ఆయుధాలను సరఫరా చేయడాన్ని అమెరికా పరిశీలిస్తోందని, ఇది సంబంధాలను ప్రభావితం చేస్తుందని, తీవ్రపరిణామాలు ఉంటాయని యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణకు దాని మద్దతుకు సంబంధించి తాము మొదటి నుంచి చైనాకు చెబుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో రష్యాకు సాయాన్ని అందిస్తే చైనాపై ఆంక్షలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఈ విషయమై ముఖ్యంగా జీ7 సముహంలోని దేశాల మద్దతు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా ఏవిధమైన ఆంక్షలు విధించాలనుకుంటదనేది స్పష్టం కాలేదు. ఇటీవల రష్యాకు ఆయుధాలు అందించడానికి చైనా యత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపణలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. అలాగే ఈవిషయమై అమెరికా ఎలాంటి ఆధారాలను చూపలేదు. చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్‌యిని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. రష్యాకు ఆయుధాలను సరఫరా చేయాలని చైనీయులు ఆలోచిస్తున్నారనే సమాచారంపై ఆయన వద్ద తమ ఆందోళనను లేవనెత్తానని బ్లింకెన్‌ చెప్పారు. ఇలా ఆయుధాలు సరఫరా చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం భారత్‌కు వచ్చిన బ్లింకెన్ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కూడా కలిశారు. జైశంకర్, బ్లింకెన్ సంబంధాలను సమీక్షించారు. ప్రపంచ సమస్యలపై చర్చించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో క్లుప్తంగా మాట్లాడినట్లు కూడా బ్లింకెన్‌ ధృవీకరించారు.

ఆఫర్లే ఆఫర్లే.. వాటిపై 80 శాతం డిస్కౌంట్‌
ఈ కామర్స్‌ సంస్థలు పండుగలను.. ప్రత్యేక రోజులను పురస్కరించుకుని భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. కొనుగోలుదారులకు శుభవార్త చెబుతూ.. ఆఫర్ల పండుగ తెచ్చింది.. హోలీని పురస్కరించుకుని బిగ్‌ బచత్‌ సేల్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక సేల్‌.. ఇవాళ్టి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనుంది.. ఈ ప్రత్యేక సేల్‌లో 1000కి పైగా కంపెనీలకు చెందిన లక్షప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని ఈ కామర్స్‌ దిగ్గజం ప్రకటించింది.. మొబైల్స్‌, ల్యాప్‌ ట్యాప్స్‌, ట్యాబ్లెట్స్‌, దుస్తులు, టీవీలుపై ఆకట్టుకునే స్థాయిలో ఆఫర్లు తీసుకొచ్చింది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023 రాబోయే హోలీ పండుగను పురస్కరించుకుని ఇవాళ అనగా మార్చి 3న ఈ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది.. ఫ్లిప్‌కార్ట్, ఇ-కామర్స్ దిగ్గజం తన హోలీ బిగ్ బచత్ ధమాల్ సందర్భంగా 80 శాతం వరకు తగ్గింపులను అందిస్తోంది. ఇది మార్చి 5న ముగుస్తుంది. సేల్ సమయంలో, కస్టమర్‌లు 1 లక్షకు పైగా ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. 1,000 కంటే ఎక్కువ బ్రాండ్లు అందుబాటులో ఉండనున్నాయి.. ఈ సేల్ మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, దుస్తులు మరియు టెలివిజన్‌ల వంటి విభిన్న ఉత్పత్తులపై డిస్కౌంట్‌లు మరియు ప్రత్యేక షాపింగ్ అనుభవాలను వాగ్దానం చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఇంకా అన్ని ఒప్పందాలను వెల్లడించలేదు, అయితే వారు ఇప్పటికే విక్రయం కోసం అంకితమైన మైక్రోసైట్‌లో పుష్కలంగా తగ్గింపులు మరియు ఆఫర్‌లను అందించారు.

ప్రభాస్ డైరెక్టర్ తో ఐకాన్ స్టార్… రచ్చలేపే కాంబినేషన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప ది రైజ్ సినిమాతో 350 కోట్లు రాబట్టిన అల్లు అర్జున్, ఈసారి పుష్ప 2 సినిమాతో టాప్ 5 రికార్డ్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా ఏంటి అన్ పక్కాగా సమాధానం చెప్పలేని పరిస్థితి. బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ సినిమా ఉందని, కొరటాల శివతో ఇప్పటికే అనౌన్స్ అయిన సినిమా స్టార్ట్ చేస్తాడని, ఈ ఇద్దరూ కాదు త్రివిక్రమ్ తోనే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉంటుందని, ఐకాన్ ఫిల్మ్ కూడా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని… ఇలా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతున్నారు కానీ అఫీషియల్ గా అల్లు అర్జున్ నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని సందీప్ రెడ్డి వంగతో అనౌన్స్ చేశాడు. టీ-సీరీస్ అఫీషియల్ గా ప్రకటించిన ఈ అనౌన్స్మెంట్ ఒక క్రేజీ సినిమాని పునాది అనే చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి, ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ‘అనిమల్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అయిపోగానే సందీప్ రెడ్డి వంగ-ప్రభాస్ కాంబినేషన్ లో ‘స్పిరిట్’ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది. స్పిరిట్ అయిపోయిన వెంటనే అల్లు అర్జున్-సందీప్ రెడ్డి వంగ సినిమా స్టార్ట్ అవ్వనుంది. అయితే పుష్ప 2 అయిపోయే సమయానికి సందీప్, అనిమల్ షూటింగ్ ని మాత్రమే పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా ఉంది కాబట్టి స్పిరిట్ అయ్యాకే అల్లు అర్జున్ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈలోపు అల్లు అర్జున్ వేరే ఎవరైనా డైరెక్టర్ తో సినిమా చేస్తాడేమో చూడాలి.