శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజే ఆ టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. తిరుమల శ్రీవారికి రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేసింది టీటీడీ.. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు.. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన టికెట్లను ఈనెల 27వ తేదీన అంటే ఈ రోజు విడుదల చేయనుంది టీటీడీ.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించి టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. శ్రీవారి దర్శన టికెట్లకు ఎప్పుడైనా ఫుల్ డిమాండ్ ఉంటుంది.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తి అవుతుంది.. ఇక, వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ నెల కోటా టికెట్లకు భారీ ఎత్తున డిమాండ్ ఉండే అవకాశాలు ఉంది.. దీంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలి.. ఇక, ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలనుకునే భక్తులు మొదట టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అనంతరం సంబంధిత వివరాలను ఎంటర్ చేయడం ద్వారా టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది..
నేడు కారుమంచికి సీఎం వైఎస్ జగన్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.. కొండేపి వైసీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తల్లి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు సీఎం జగన్… వరికూటి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు టంగుటూరు కారుమంచి వెళ్లనున్నారు ఏపీ సీఎం.. ఇక, ఈ పర్యటన కోసం ఉదయం 10 గంటలకు తాడేపల్లి సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 10.05 గంటలకు హెలీప్యాడ్ చేరుకుంటారు. 10.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10.55 గంటలకు కారుమంచి జెడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. ఉదయం 11.05 కు కారుమంచిలోని వరికూటి అశోక్ బాబు నివాసానికి చేరుకుని ఆయన తల్లి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.. అక్కడి నుంచి తిరిగి హెలీప్యాడ్ వద్దకు చేరుకుని స్థానిక నేతలను కలుస్తారు.. అనంతరం 12.10 కారుమంచి హైస్కూల్ హెలీప్యాడ్ నుంచి మధ్యాహ్నం 1.05 చేరుకుంటారు. ఆ తర్వాత తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.
మరో రెండు రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాలపై ప్రభావం.. ఎల్లో అలెర్ట్ జారీ..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.. అయితే, మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.. తమిళనాడు నుంచి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వరకు ద్రోణి విస్తరించి ఉంది.. దీని ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల కారణంగా ఆదివారం కోస్తాలోని పలు ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా ఆవరించాయి. పలుచోట్ల ఉరుములు, ఈదురు గాలులు, పిడుగులతో వర్షాలు కురుశాయి.. ఇక, ఇవాళ, రేపు కూడా అదే పరిస్థితి కొనసాగనుంది.. సోమవారం, మంగళవారాల్లోనూ కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. అలాగే రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ శాఖ.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. ఈ సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, ఈ నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 24న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు కవిత పిటషన్‌పై సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే.. ఈ కేసులో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని కవిత ఈ నెల 23న దాఖలు చేసిన పిటిషన్‌లో సవాలు చేశారు. అంతేకాకుండా.. ఈడీ తనపై తదుపరి బలవంతపు చర్యలు తీసుకోకుండా జారీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు కవిత. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్‌లో కోరారు. ఈడీ నోటీసులను రద్దు చేయాలని, మహిళగా తనను ఇంట్లోనే విచారించాలని కవిత పిటిషన్‌లో కోరారు. అయితే.. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం ముందుకు కవిత పిటిషన్ రానుంది. విచారణ జరిగిన వెంటనే ధర్మాసనం ఉత్తర్వులను జారీచేస్తుందా? లేక వాయిదా వేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
దేశంలో మళ్లీ కరోనా కలవరం.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమావేశం
దేశంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని చెబుతున్నారు. కరోనా కేసులు ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో రెండు వేలకు చేరవవుతున్నాయి. కొవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం ఐదు నెలల తర్వాత ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేంద్ర అప్రమత్తమైంది. ఇవాళ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం రాష్ట్రాలతో చర్చించనుంది. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది.
సావర్కర్ మా దేవుడు.. రాహుల్ గాంధీకి ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్
క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్ కాదు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక్ సావర్కర్‌ను అవమానించవద్దని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హెచ్చరించారు. సావర్కర్‌ను కించపరచడం విపక్ష కూటమిలో పగుళ్లు సృష్టిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌ను తాను తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఆయనను అవమానించడం మానుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ నాయకుడిని కోరారు. శివసేన (యుబిటి), కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అనే మూడు పార్టీల మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఏర్పడిందని, దాని కోసం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే టెక్స్‌టైల్ పట్టణం మాలెగావ్‌లో జరిగిన ర్యాలీలో ఠాక్రే మాట్లాడుతూ రాహుల్ గాంధీని రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సావర్కర్ మన ఆరాధ్యదైవం, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం కలిసి పోరాడవలసి వస్తే ఆయన అవమానాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. 14 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులార్ జైల్లో సావర్కర్ ఊహించలేని హింసను అనుభవించారని గుర్తు చేశారు.
జడేజా, బెన్ స్టోక్స్ ఫోటో వైరల్.. రొనాల్డో- మెస్సీతో పోల్చుతున్న నెటిజన్స్..
మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే నాలుగు సార్లు టైటిల్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్స్ తన తొలి మ్యాచ్ ని గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. అయితే ఇప్పుడు సీఎస్కే ఫ్రాంఛైజీ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. క్రికెట్ లో అత్యత్తమ ఆల్ రౌండర్స్ ఇద్దరు ఒకే చోటు కూర్చున్నారు. అదేనండి రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ చెన్నై తరపున ఆడుతున్నారు. CSK జట్టులో స్టార్‌గా ఉన్నా రవీంద్ర జడేజా.. T20 లీగ్ యొక్క 16వ ఎడిషన్‌కు ముందు వేలం సమయంలో బెన్ స్టోక్స్ ను సీఎస్కే కొనుగోలు చేసింది. ఒక శిక్షణా సెషన్‌లో, ఫుట్‌బాల్ క్రీడాకారులు లియోనెల్ మెస్సీ మరియు క్రిస్టియానో రొనాల్డో ఒకే జట్టులో ఉన్నట్లుగా అభిమానులకు అనుభూతి చెందడంతో.. జడేజా, బెన్ స్టోక్స్ ఇద్దరు కలిసి కూర్చున్న ఫోటో వైరల్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్‌లో ఈ ఫోటోను పంచుకుంది. కొంతమంది అభిమానులు స్టోక్స్‌ను భవిష్యత్ కెప్టెన్సీ అభ్యర్థిగా కూడా చూస్తున్నారు.. కాగా, MS ధోని తర్వాత సీఎస్కే ఫ్రాంచైజీని విడిచిపెడతారని తెలుస్తోంది. గత సీజన్‌లో రవీంద్ర జడేజాకు జట్టు బాధ్యతలు ఇచ్చినప్పటికి అతను నాయకుడిగా, ఆటగాడిగా విఫలం కావాడంతో తను కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో 2022 సీజన్ మొత్తానికి జడేజా గాయం కారణంగా దూరం అయ్యాడు.
మెగా అభిమానులకు అలర్ట్.. RC15 టైటిల్ రివీల్
మెగా అభిమానులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా RC15. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. అభిమానులు చాలా నెలలుగా ఎదురుచూస్తున్న వార్త ఎట్టకేలకు వచ్చింది. మావెరిక్ దర్శకుడు శంకర్ షణ్ముగంతో గ్లోబల్ స్టార్ ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, ఆర్‌సి 15 నిర్మాతలు ఈ చిత్రానికి అధికారికంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)అని పేరు పెట్టారు. అలాగే సినిమాకు కాన్సెప్ట్ కు సంబంధించిన పవర్‌ఫుల్ వీడియోను కూడా విడుదల చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్‌తో కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్ మేక, అంజలి, నవీన్ చంద్ర మరియు ఇతరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత సంచలనం తమన్ గేమ్ ఛేంజర్‌కు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 03:06 గంటలకు విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలిపారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం… నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ తదితర పరిశ్రమలో ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖ నటులు కన్నుమూశారు. తాజాగా ప్రముఖ మలయాళ సినీ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ ఇన్నోసెంట్ మరణించారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. గతకొద్ది రోజులుగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కరోనా సోకడంతోపాటు శ్వాసకోశ వ్యాధులు, వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఇన్నోసెంట్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇన్నోసెంట్‌కు 2012లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మూడేళ్ల తర్వాత, అతను ఆ వ్యాధిని అధిగమించానని ప్రకటించాడు. క్యాన్సర్‌తో తన యుద్ధం గురించి తన పుస్తకం ‘లాఫ్టర్ ఇన్ ది క్యాన్సర్ వార్డ్’లో రాశాడు. నటుడు ఇన్నోసెంట్లోక్సభ ఎంపీగా కూడా సేవలందించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇన్నోసెంట్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఇన్నోసెంట్ తన ప్రత్యేకమైన నటనా శైలితో ప్రజల హృదయాలను కొల్లగొట్టారని కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఇన్నోసెంట్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయన అద్భుతమైన, ప్రతిభావంతుడైన నటుడని కొనియాడారు.