సర్కార్ గుడ్‌న్యూస్.. ఆ పన్నులపై రాయితీ..
ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించేవారికి గుడ్‌న్యూస్ చెప్పారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేష్.. వడ్డీ లేకుండా పన్ను చెల్లింపునకు అవకాశం ఇచ్చినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించినట్టు తెలిపారు.. కోవిడ్ నేపథ్యంలో అపరాధ రుసుము చెల్లించలేక ఎంతోమంది పన్ను చెల్లింపుదారులు బకాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఎన్నో ఏళ్లుగా బకాయిలు చెల్లించని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపు దారులు వడ్డీ లేకుండా పన్ను చెల్లించవచ్చు… ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాత బకాయితో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర బకాయిని కూడా ఏక మొత్తంగా ఈ నెల 31వ తేదీ లోపుగా చెల్లిస్తే ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ వర్తింస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు కమిషనర్ రమేష్.. ప్రభుత్వ రాయితీ వల్ల కాకినాడ నగరపాలక సంస్థలోని పన్ను చెల్లింపు దారులకు 10 కోట్ల రూపాయల వరకు భారం తగ్గుతుందని.. ఇది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో.. మొండి బకాయిదారులంతా పన్నులు మొత్తం చెల్లిస్తే 8 కోట్ల రూపాయల వరకు పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ఆదాయంతోనే కాకినాడ నగర అభివృద్ధి సాధ్యమని.. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని పొందాలని తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేష్.
నేడు మహిళ కమిషన్ ముందుకు బండి సంజయ్..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఇవాల ఉదయం 11 గంటలకు మహిళ కమిషన్ ముందుకు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ హాజరు కానున్నారు. బీజేపీ లీగల్ సెల్, మహిళ న్యాయవాదులతో కలిసి కమిషన్ కు బండి సంజయ్ వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ కవిత పై చేసిన కామెంట్స్ వ్యక్తిగతంగా హాజరు అయ్యి వివరణ ఇవ్వాలని మహిళ కమిషన్ నోటీస్ లో పేర్కొంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మార్చి 15న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కానీ దీనిపై స్పందించిన బండి సంజయ్.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 15న విచారణకు హాజరు కాలేనని మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు లేఖ రాశారు. విచారణను 18వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్ ఈ నెల 18న ఉదయం 11 గంటలకు స్వయంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈనేపథ్యంలో.. ఇవాల బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్నారు. అయితే బండి సంజయ్, మహిలా కమిషన్ లకు ఏం సమాధానం ఇవ్వనున్నారో అనే విషయం పై ఉత్కంఠ నెలకొంది.
ఇన్‌స్టాలో పరిచయం.. ఆపై సహజీవనం.. చివర్లో పెద్ద ట్విస్ట్
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని నివసిస్తున్న ఓ యువతి (22).. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ అమ్మాయికి 2020లో వరంగల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ బూక్యా కల్యాణ్(25)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. తరచూ చాటింగ్ చేసుకోవడంతో.. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరు కలిసి షికార్లు కొట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని కల్యాణ్ నమ్మించడంతో.. అతనితో ఆ యువతి శారీరక సంబంధాలు కొనసాగించింది. ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పగా.. అతడు ఊహించని షాక్ ఇచ్చాడు. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ‘ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా.. అబార్షన్ ఎందుకు?’ అని ఆ అమ్మాయి నిలదీస్తే.. అప్పుడు కల్యాణ్ తన అసలు రంగు బయటపెట్టాడు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, కేవలం సరదా తీర్చుకోవడం కోసమే కలిసి ఉంటున్నానంటూ బాంబ్ పేల్చాడు. తాను చెప్పినట్టు అబార్షన్ చేయించుకోకపోతే.. యాసిడ్ పోసి చంపేస్తానని కల్యాణ్ బెదిరించాడు. అంతేకాదు.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, స్పందించకుండా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో బాధితురాలు నేరుగా కల్యాణ్ స్వగ్రామానికి వెళ్లింది. అక్కడికి వెళ్లి అతడ్ని ఆరా తీసింది. అప్పుడు మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. అప్పటికే అతనికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు తేలింది. ప్రేమ పేరుతో తనని ఎందుకు మోసం చేశావని ప్రశ్నిస్తే.. రూ.10 లక్షలు కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెట్టాడు. దాంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 493, 420, 417,313 506, వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
భలే ఐడియా.. లవ్ బ్రేకప్‌తో డబ్బులు
ప్రేమ ఎప్పుడు..? ఎలా..? ఎందుకు? పుడుతుందో కూడా తెలియదు.. దానికి కులం, గోత్రం, మతం, ప్రాంతం, దేశం.. ఇలా దేనితో సంబంధం లేదు.. అయితే. ఇటీవలి కాలంలో ప్రేమలో పడడం సంగతి అటుంచితే.. బ్రేకప్‌లు కూడా అంతే ఈజీగా జరిగిపోతున్నాయి.. ప్రేమికుల మధ్యలోకి ఎవరైనా కొత్త వ్యక్తి ఎంట్రీ ఇస్తే చాలు.. బ్రేకప్ చెప్పుకుని మరో వ్యక్తితో కలిసిపోతున్న ఘటనలు ఈ మధ్య ఎన్నో వెలుగు చూశాయి.. వీటితో కొందరు దేవదాసులుగా, దేవదాసిలుగా మిగిలిపోతే.. కొందరు మాత్రం.. ఆ పెయిన్ లేకుండా.. గడిపేస్తున్నారు. అయితే, ఓ ఐడియా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. బ్రేకప్ అయిన తర్వాత ఓ యువకుడి డబ్బులు వచ్చాయి? సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేయడంతో.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.. ఆ న్యూస్.. ఇంతకీ, లవ్ బ్రేకప్ అయితే.. డబ్బులు రావడం ఏంటి? అది ఎలా సాధ్యం.. ఇన్సూరెన్స్ చూశాం, హెల్త్ ఇన్సూరెన్స్ చూశాం.. ఈ లవ్ బ్రేకప్ ఇన్సూరెన్స్ ఏంటి? కొత్తగా ఉంది.. అనే వివరాల్లోకి వెళ్తే.. ప్రేమలో పడిన ఓ జంట ముందుగానే జాగ్రత్త పడింది. వారు ఓ నిబంధన పెట్టుకున్నారు.. దానికి హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ అని పేరు కూడా పెట్టేశారు.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది.. @Prateek_Aaryan అనే వ్యక్తి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల ప్రకారం.. ప్రతీక్ కొద్ది రోజుల క్రితం ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రిలేషన్‌ను మొదలు పెట్టేముందే ప్రతీక్, అతని ప్రేయసి మధ్య ఓ ఒప్పందం జరిగింది.. ఆ నిబంధన ప్రకారం ప్రతి నెలా ఇద్దరూ కలిసి రూ.500 ఓ ఖాతాలో జమ చేయాలి. భవిష్యత్తులో ఎవరైతే మోసపోతారో వారికి ఆ డబ్బు మొత్తం దక్కేలా కండీషన్స్‌తో.. `హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్` పేరుతో డబ్బులు జమ చేస్తూ వచ్చారు.. కానీ, ఇటీవల ప్రతీక్‌ను అతడి ప్రేయసి గుడ్‌బై చెప్పేసింది. మరో యువకుడికి క్లోజ్‌గా మూవ్ అయ్యింది.. దీంతో.. అప్పటి వరకు వారిద్దరూ కలిసి దాచుకున్న మొత్తం రూ.25 వేలు ప్రతీక్‌కు దక్కాయి. ఈ విషయాన్ని ప్రతీక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. దానిపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. గొప్ప ఐడియా అంటూ కొందరు పొగిడేస్తుంటే.. లవ్‌పై కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ ఉందా? అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బంగారం కొంటున్నారా?.. కొత్త రేట్లు తెలుసుకోండి
భారతీయులకు బంగారు ఆభరణాల పట్ల మక్కువ ఎక్కువ. పండుగైనా,పెళ్లి అయినా సరే ప్రతిసారీ కస్టమర్లు బంగారు ఆభరణాలను తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. పండుగలు, వేడుకల సందర్భంగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు కూడా బంగారం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, దానికంటే ముందు దాని కొత్త రేట్లు తెలుసుకోవడం అవసరం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అలాగే జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మరోవైపు ఈరోజు భారత మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం, భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగింది. యుఎస్‌తో సహా గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రం కావడంతో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వరుసగా ఆరవ సమావేశానికి వడ్డీ రేట్లను పెంచడంతో ఉదయం ట్రేడింగ్‌లో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. గత నెలలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 58,847 రికార్డు స్థాయిలో నమోదైంది. ఈ రోజు బంగారం ధర రూ.250 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,690కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,690 వద్ద కొనసాగుతోంది. కాగా, బంగారం ధరలు US డాలర్‌తో పోలిస్తే రూపాయి యొక్క విలువ సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.
ఇమ్రాన్‌ఖాన్ పార్టీని తీవ్రవాద సంస్థగా పరిగణించాలి..
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎమ్‌ఎల్-ఎన్) వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరారు. లాహోర్‌లో విలేకరుల సమావేశంలో మరియం నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థతో ప్రభుత్వం వ్యవహరించే విధంగానే పీటీఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌తోనూ వ్యవహరించాలని అన్నారు. “నిషేధిత సంస్థ, ఉగ్రవాద సంస్థపై ప్రభుత్వం, రాష్ట్రం ఎలా వ్యవహరిస్తుందో.. ఇమ్రాన్‌ఖాన్‌పై కూడా అదే విధంగా వ్యవహరించాలి. దానిని (పీటీఐ) రాజకీయ పార్టీగా భావించి, రాజకీయ పార్టీగా వ్యవహరించడం అంతం కావాలి.” అని ఆమె చెప్పింది. తన వ్యూహాలన్నీ విఫలమైన తర్వాత పీటీఐ ఛైర్మన్ ఇప్పుడు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొంది. ఉగ్రవాదులతో ప్రభుత్వం వ్యవహరించే విధంగానే వారితోనూ వ్యవహరించాలని ఆమె అన్నారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసినందుకు మాజీ ప్రధానిపై ఆమె విరుచుకుపడ్డారు. తోషాఖానా కేసులో ఖాన్ అతని అరెస్టును ప్రతిఘటించడం, అతని జమాన్ పార్క్ నివాసం లోపల వందలాది మంది మద్దతుదారులు చుట్టుముట్టడంతో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. “విదేశీ నిధుల కేసు తరువాత ఇమ్రాన్ పాకిస్తాన్‌లో పౌర అశాంతి, అరాచకాలను వ్యాప్తి చేయడాన్ని ప్రారంభించాడనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు” అని మరియమ్ అన్నారు. ఉగ్రవాద సంస్థల్లో మాత్రమే గుహలో దాక్కుని ఆదేశాలు ఇవ్వబడుతాయని, జమాన్ పార్క్ వద్ద కూడా అదే జరుగుతోందని ఆమె అన్నారు. తోషాఖానా కేసులో ఖాన్‌ను అరెస్టు చేసేందుకు పాకిస్థాన్ పోలీసులు జమాన్ పార్క్‌లోని ఖాన్ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత పలు చోట్ల నిరసనలు చెలరేగాయి.
‘పీఎస్2’కి ఊహించని షాక్.. అక్కడ తప్ప మిగతా భాషల్లో నిల్?
సాధారణంగా సీక్వెల్ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడుతాయి. వాటి థియేట్రికల్ హక్కులకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ప్రేక్షకుల్లోనూ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ.. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విషయంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదని సమాచారం. తమిళంలో తప్ప.. మిగతా భాషల్లో ఈ చిత్రానికి సరిగ్గా బిజినెస్ జరగట్లేదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పీఎస్2 హక్కుల్ని కొనేందుకు ఇంతవరకు ఎవ్వరూ ముందుకు రాలేదట. దీంతో.. మణిరత్నంని రంగంలోకి దింపి, బయ్యర్స్‌ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట! అప్పటికీ హక్కులు అమ్ముడుపోకపోతే.. ఓన్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్. అటు.. బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రంపై ఏమాత్రం హైప్ లేదు. ఇందుకు.. పీఎస్1 ఇతర రాష్ట్రాల ఆడియెన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాకపోవడమే. చెప్పుకోవడానికి పొన్నియిన్ సెల్వన్ రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టగలిగింది కానీ, ఇతర రాష్ట్రాల్లో అంతగా ఆదరణ పొందలేకపోయింది. ఇదో హిస్టారికల్ మూవీ అయినప్పటికీ.. తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించిందని, ఈ సినిమా పెద్దగా సినిమాటిక్ అనుభూతి ఇవ్వలేదని కామెంట్లు వినిపించాయి. క్రిటిక్స్ కూడా తొలి భాగానికి ఆశాజనకమైన రివ్యూలు ఇవ్వలేదు. అందుకే.. రిలీజ్ దగ్గరపడుతున్నా, ‘పీఎస్2’కి పెద్దగా క్రేజ్ ఏర్పడటం లేదని తెలుస్తోంది. కాగా.. తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా రెండు భాగాల్లో రూపొందింది. ఇందులో కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిషా మొదలైన స్టార్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక్క కోలీవుడ్‌లోనే రూ.200 కోట్లు కొల్లగొట్టి, ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన తొలి తమిళ చిత్రంగా అక్కడ రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.
అది వెబ్ సిరీస్ కాదు, బ్లూ ఫిలిమ్.. సీనియర్ నటుడు ఫైర్
ఎవరేమనుకున్నా సరే.. ఓటీటీలు వచ్చాక అడల్ట్ కంటెంట్ బాగా పెరిగిపోయిందన్న మాట మాత్రం వాస్తవం. సెన్సార్ ఫార్మాలిటీస్ లేకపోవడం వల్ల.. వెబ్ సిరీస్‌లలో ఎలాంటి పరిమితులు లేకుండా బూతు సన్నివేశాల్ని జోడించేస్తున్నారు. కంటెంట్ పేరుతో శృంగార సీన్లను సైతం చిత్రీకరిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ఎందరో గళం విప్పారు. ఇప్పుడు ఆ జాబితాలోకి తాజాగా సీనియర్ నటుడు శివకృష్ణ చేరిపోయారు. ఓటీటీలొచ్చాక అడల్ట్ కంటెంట్, అభ్యంతరకర సన్నివేశాలతో వెబ్ సిరీస్‌లు ఎక్కువ అయ్యాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రీసెంట్‌గా తాను ఓ వెబ్ సిరీస్ (రానా నాయుడుని ఉద్దేశించి) చూశానని, అది దాదాపు బ్లూ ఫిలిమేనని మండిపడ్డారు. ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాలని అన్నారు. శివకృష్ణ మాట్లాడుతూ.. ‘‘రీసెంట్‌గా నేను ఒక వెబ్ సిరీస్ చూశాను. అది మరీ దారుణంగా ఉంది. ఆల్ మోస్ట్ అది ఓ బ్లూ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి దారుణమైన వెబ్ సిరీస్ చూడలేదు. ఇది మన సంసృతి, కల్చర్ కాదు. అసలు అది ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన వెబ్ సిరీసే కాదు’’ అంటూ పైర్ అయ్యారు. భార్యభర్తలు పడుకోవడానికి బెడ్‌రూమ్ ఉంటుందని.. అయితే ఆ బెడ్‌రూమ్ తలుపులు తీసి ఉంచడం, పిల్లలు అది చూడటం, మన సాంప్రదాయమేనా? అని ప్రశ్నించారు. దేశం ఆర్థికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది కానీ.. సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడటం కష్టమవుతుందన్నారు. సినిమాల్లో బూతు ఉంటే, అది థియేటర్స్‌కి వచ్చిన వారికి మాత్రమే తెలుస్తుందని.. కానీ వెబ్ సిరీస్‌లు అలా కాదని అన్నారు. ఈమధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లేనని.. కాబట్టి ఓటీటీకి కచ్ఛితంగా సెన్సార్ ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.