NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచి భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై అధిక ప్రభావం..
ఎండలు మండిపోతోన్న వేళ చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.. వరుసనగా నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ విభాగం (ఐఎండీ).. ఇప్పుడు ఒకరోజు ముందుగానే.. అంటే ఇవాళ్టి నుంచే వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది.. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. ఇక, ఏ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాలను కూడా వేసిండి వాతావరణశాఖ.. 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదా­వరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూ­రు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పలు­చోట్ల వర్షాలు కుస్తారని పేర్కొంది.. ఇదే సమయంలో.. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.. ఈ సమయంలో.. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు­గాలు­లు వీచే అవకాశం ఉందని తెలిపింది.. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యి కొత్త రికార్డులు సృష్టించాయి.. ఎండలు మండిపోతోన్న వేళ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.. అయితే, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

ఢిల్లీకి వెళ్లిన కవిత.. నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మరియు ఇతరులతో బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం న్యూఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు దేశ రాజధానిలోని ఓ హోటల్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు కవిత కార్యాలయం తెలిపింది. కవిత నేతృత్వంలోని సాంస్కృతిక సంస్థ భారత్ జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి కవిత బయలు దేరారు. అయితే.. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్టాలని డిమాండ్ చేస్తూ ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలతో కవిత ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. అన్ని పార్టీలను కవిత ఏకతాటిపైకి తెస్తున్నారని, అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని అంటున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దేశంలోని మహిళల సమస్యలపై కూడా చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. రేపు మరోసారి ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ నెల 11న కూడా ఆమె ఈడీ ముందు హాజరయ్యారు. ఆమెను తొమ్మిది గంటల పాటు ఈడీ విచారించింది. అయితే.. రేపు ఈడీ విచారణలో ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరింత పైకి ఎగబాకిన పసిడి ధర.. ఈ రోజు ఎంతంటే..?
బంగారం ధరలు మరింత పైకి ఎగబాకాయి.. ఇండియన్ బులియన్ జువెలర్స్ వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు మరింత పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,300 నుంచి రూ.53310కి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,130 నుంచి రూ.58,140కి పెరిగింది.. దీంతో.. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ 10 రూపాయాలు పెరిగింది.. వెండి ధర స్థిరంగా కొనసాగుతూ.. కిలో ధర రూ.68,500 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.. భారతదేశంలో బంగారం మరియు వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్‌లో ట్రేడింగ్ ద్వారా నిర్ణయించబడుతుంది. ట్రేడింగ్ రోజు చివరి ముగింపు మరుసటి రోజు మార్కెట్ ధరగా పరిగణించబడుతుంది. అయితే, కొన్ని ఇతర ఛార్జీలతో పాటు వివిధ నగరాల్లో రేటును నిర్ణయించి, ఆపై రిటైలర్ మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తూ ఆభరణాలను విక్రయిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ట్రేడ్‌ అవుతున్నాయో ఓసారి పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,910గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,810గా.. కిలో వెండి ధర రూ.72000గా ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,160గా, 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.57,990గా.. కిలో వెండి ధర రూ.68,500గా కొనసాగుతోంది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.53,160గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,040గా.. కిలో వెండి ధర రూ.68,500గా అమ్ముడుపోతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,210గా, 24 క్యారెట్ల ధర రూ.58,040గా.. కిలో వెండి ధర రూ.72,000గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,160గా.. 24 క్యారెట్ల ధర రూ.57,990గా.. కిలో వెండి ధర రూ.72వేలుగా ట్రేడింగ్‌లో ఉంది. కేరళ, పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,160గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,990గా, కిలో వెండి ధర రూ.68,500గా ఉంది.

కస్టమర్లకు షాకిచ్చిన ఎస్బీఐ.. నేటి నుంచే అమల్లోకి..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ).. తన కస్టమర్లకు షాకిచ్చింది.. వడ్డీ రేట్లను మరోసారి వడ్డిస్తూ నిర్ణయం తీసుకుంది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR)ని 70 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) లేదా 0.7 శాతం నుండి 14.85 శాతానికి పెంచేసింది.. ప్రస్తుత బీపీఎల్‌ఆర్‌ 14.15 శాతంగా ఉండగా.. అది 14.85 శాతానికి పెరగనుంది.. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ లెండర్ కూడా బేస్ రేటును 9.40 శాతం నుండి 10.10 శాతానికి 70 బీపీఎస్‌లు పెంచనుంది. దీంతో వీటి ఆధారంగా బ్యాంక్‌ ఇచ్చే గృహ, వాహన, విద్య, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీరేట్లు మరింత పెరగనున్నాయి. ఎస్బీఐ తన బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటుతో పాటు బేస్ రేటును గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ సవరించిన విషయం విదితమే.. తాజాగా పెరిగిన వడ్డీ రేట్లను ఇవాళ్టి నుంచి అమలు చేయనున్నట్టు పేర్కొంది ఎస్బీఐ. అయితే పబ్లిక్ లెండర్, ఫండ్స్ ఆధారిత రుణ రేట్ల మార్జినల్ కాస్ట్‌ను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఎంసీఎల్‌ఆర్‌ అంటే బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇచ్చే రేటు. ఎస్బీఐ చివరిసారిగా ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 15న 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం పెంచింది. ప్రస్తుతం, ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ 7.95 శాతంగా ఉండగా, నెలవారీ ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.10 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు మరియు ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేటు వరుసగా 8.10 శాతం మరియు 8.40 శాతంగా ఉన్నాయి. ఒక సంవత్సరం రుణాలు, రెండేళ్ల రుణాలు మరియు మూడేళ్ల రుణాలకు ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు వరుసగా 8.50 శాతం, 8.60 శాతం మరియు 8.70 శాతంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫిబ్రవరి 8న ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చిన తర్వాత ఎస్బీఐ తన కస్టమర్లకు రుణాలు ఇచ్చే రేటును పెంచింది.

మార్కెట్లోకి కోమాకి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే..
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ కోమకి తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కోమాకి ఇండియా తన అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీని పేరు ఎల్‌వై ప్రో. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,37,500గా నిర్ణయించారు. ఇందులో కంపెనీ డ్యూయెల్ బ్యాటరీస్‌ను అమర్చింది. ఈ రెండింటినీ రిమూవ్ చేయొచ్చు. అంటే డీటాచబుల్ బ్యాటరీలు అని చెప్పుకోవచ్చు. డ్యూయెల్ చార్జర్‌తో వీటిని చార్జ్ చేసుకోవచ్చు. దాదాపు 5 గంటల్లో బ్యాటరీలు ఫుల్ అవుతాయి. LY ప్రో డ్యూయల్ ఛార్జర్‌తో పాటు డ్యూయల్ బ్యాటరీ సెటప్‌ను పొందుపరిచారు. అదనంగా, ఇది గరిష్టంగా 62 kmph వరకు వేగాన్ని అందుకోగలదు. LY ప్రో గురించి చెప్పాలంటే, ఇది Komaki LYపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, డిజైన్ ఒకేలా ఉంటుంది. ఫీచర్ కూడా దాదాపు అదే. Komaki మూడు రైడింగ్ మోడ్‌లతో LY ప్రోని అందిస్తోంది. ఈ మోడ్‌లు – ఎకో, స్పోర్ట్స్ & టర్బో. అదనంగా, ఇది ఆన్‌బోర్డ్ నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, కాలింగ్ ఆప్షన్‌లు , ఇతర రెడీ-టు-రైడ్ ఫీచర్‌లతో కూడిన డిజిటల్ డిస్‌ప్లేను కూడా అందిస్తోంది. అదే సమయంలో 3000 వాట్ హబ్ మోటార్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో యాంటీస్కిడ్ టెక్నాలజీ ఉంది. హిల్స్‌పై ఈ స్కూటర్ స్కిడ్ కాకుండా ఉంటుంది. అలాగే ఇందులో 12 ఇంచుల ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3000 వాట్ హబ్ మోటార్ ఉంది. 38 ఏఎంపీ కంట్రోలర్స్ ఉన్నాయి. పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కేవలం 4 గంటల 55 నిమిషాల్లో ఏకకాలంలో 0-100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీల కారణంగా, LY ప్రో 58 నుండి 62 kmph (మోడ్‌ని బట్టి) గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇది 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు కొండలలో ప్రమాదాలను నివారించడానికి యాంటీ-స్కిడ్ సిస్టమ్‌ను కూడా పొందుపరిచారు.

చావాలని 56షేవింగ్ బ్లేడ్లను మింగాడు.. కానీ
రాజస్థాన్‌లోని జలోర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఓ యువకుడి కడుపులో రెండు కాదు ఏకంగా 56 షేవింగ్ బ్లేడ్‌లను తొలగించారు. ఆత్మహత్య చేసుకునేందుకు యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇతడు సంచార్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. యువకుడి పేరు యశ్‌పాల్‌రావు. బాలాజీ నగర్‌లో నలుగురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఉద్యోగ సమస్యల కారణంగా డిప్రెషన్‌లో ఉన్నాడు. ఎలాగైనా చనిపోవాలని నిర్ణయించుకుని బ్లేడ్ ముక్కలను మింగాడు. వెంటనే రక్తపు వాంతులు చేసుకోవడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో అతని కడుపు ఎక్స్-రే తీశారు వైద్యులు. అప్పుడు అతని కడుపులో షేవింగ్ బ్లేడ్ ముక్కల కుప్ప కనిపించింది. ఆ తర్వాత డాక్టర్ ఎండోస్కోపీ చేసి ఆపరేషన్ చేసి 56 షేవింగ్ బ్లేడ్ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి అతని కడుపులో నుంచి తొలగించారు.

గర్భం లోపల శిశువుకు ఆపరేషన్ చేసిన ఎయిమ్స్ డాక్టర్లు
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. గర్భం లోపల శిశువుకు రిస్కీ హార్ట్ సర్జరీ చేశారు. 28 ఏళ్ల మహిళ గతంలో మూడుసార్లు గర్భం కోల్పోవడంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పిండంలోని శిశువు గుండె పరిస్థితి గురించి తెలియజేశారు. గుండెలో రక్త ప్రవాహం జరుగకుండా వాల్వ్ మూసుకుపోయిందని తెలిపారు. పిండంలోనే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రక్రియకు సమ్మతించిన తర్వాత తల్లిదండ్రులు ప్రస్తుత గర్భాన్ని కొనసాగించాలని కోరుకున్నారు. ఎయిమ్స్‌లోని కార్డియోథొరాసిక్ సైన్సెస్ సెంటర్‌లో ఈ ఆపరేషన్ జరిగింది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, ఫీటల్ మెడిసిన్ నిపుణుల బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది. AIIMSలోని ప్రసూతి & గైనకాలజీ విభాగం (ఫిటల్ మెడిసిన్)తో పాటు కార్డియాలజీ, కార్డియాక్ అనస్థీషియా విభాగానికి చెందిన వైద్యుల బృందం ఆపరేషన్ తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారని ప్రకటించింది. వైద్యుల బృందాలు పెరుగుదలను పర్యవేక్షిస్తున్నాయి. శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడే కొన్ని రకాల గుండె జబ్బులను గుర్తించవచ్చు. వాటిని కడుపులోనే చికిత్స చేయడం వలన పుట్టిన తర్వాత శిశువు సాధారణ అభివృద్ధికి అది తోడ్పడుతుందని వైద్య బృందం తెలిపింది.

రౌడీ హీరో చెయ్యలేనిది… నాని చెయ్యగలడా?
తెలుగు నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయిపొయింది. ఇకపై వీరి నుంచి వచ్చే ఏ సినిమా అయినా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది, అన్ని ఏరియాల్లో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తుంది. వీరి తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ని, పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి యంగ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాతో నార్త్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టాడు కానీ కార్తికేయ 2 కలెక్షన్స్ ని నిఖిల్ ఖాతాలో మాత్రమే వెయ్యలేము. అడివి శేష్ ‘మేజర్’ సినిమాతో నార్త్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇది అతనికి పర్మనెంట్ మార్కెట్ గా మారాలి అంటే నెక్స్ట్ చెయ్యబోయే ‘గూఢచారి 2’ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అప్పుడే అడివి శేష్ పాన్ ఇండియా హీరో అవ్వగలడు. అయితే యంగ్ హీరోల్లో అందరికన్నా ముందు పాన్ ఇండియా హీరో అవుతాడు అనుకున్న విజయ్ దేవరకొండ మాత్రం అందరినీ డిజప్పాయింట్ చేశాడు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు, విజయ్ దేవరకొండ లాంటి అగ్రెసివ్ హీరో కలిస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుందని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. లైగర్ మూవీ ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ ఆ రేంజులో చేశారు. తెలుగు నుంచి కొత్త పాన్ ఇండియా హీరో వచ్చేసాడని ప్రతి ఒక్కరూ డిసైడ్ అయిపోయారు. ఆ రేంజ్ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఊహించని ఈ ఫ్లాప్ అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా ఎదగలేక పోయాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. రా అండ్ రాస్టిక్ ఎన్విరాన్మేంట్ తో తెరకెక్కించిన దసరా సినిమాతో నాని పాన్ ఇండియా హీరో అవుతాడని ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టీజర్, ట్రైలర్ లు కూడా దసరా సినిమాపై పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశాయి. శ్రీకాంత్ ఓడెల తన మేకింగ్ తో దసరా సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ లో అంచనాలని పెంచేసాడు. మరి ఈ అంచనాలని అందుకోని నాని దసరా సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చి పాన్ ఇండియా హీరో అవుతాడా లేక విజయ్ దేవరకొండలా ప్రమోషన్స్ కి మాత్రమే పరిమితం అయ్యే సినిమా చేశాడా అనేది చూడాలి. ఇప్పటికైతే దసరా సినిమా షూర్ షాట్ హిట్ అని సినీ అభిమానులంతా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నాని ఎంతవరకూ నిలబెడతాడో తెలియాలి అంటే మార్చ్ 30 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.