Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

బెస్ట్ ఒరిజినల్ సాంగ్…
వెస్ట్రన్ గడ్డపై ఇండియన్ సినిమా జెండా ఎగిరింది. భారతదేశ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రని సృష్టించారు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ లు. ఇండియన్ సినిమా ప్రైడ్ గా గతేడాది మార్చ్ లో రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ ని సొంతం చేసుకుంది. రిహన్నా, లేడీ గాగా లాంటి సింగర్స్ ని వెనక్కి నెట్టి మన సాంగ్ ఆస్కార్ వేదికపై అవార్డుని గెలుచుకుంది. ఇండియన్ సినిమా సాదించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా ఈ అవార్డ్ నిలుస్తుంది. లిరిసిస్ట్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిలు వేదికపై వెళ్లి ఆస్కార్ అవార్డుని తీసుకున్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన “నాటు నాటు…”!
అసాధ్యం సుసాధ్యమయింది. తెలుగు సినిమాలకూ ఆస్కార్ వస్తుందా? అంటూ వెటకారం చేసిన స్వదేశీయులకే విదేశీయులు సైతం మెచ్చేలా సమాధానం ఇచ్చిన ఘనత నిస్సందేహంగా మన తెలుగువారికి దక్కింది. ప్రపంచం నలుదిశలా ఉన్న తెలుగువారు, భారతీయులు అందరూ ఆశించినట్టుగానే తెలుగుపాటకు ఆస్కార్ పట్టాభిషేకం చేసింది. ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఒపస్ ‘ట్రిపుల్ ఆర్’ చిత్రానికి ఎమ్.ఎమ్.కీరవాణి స్వరపరచిన బాణీలకు అనువుగా చంద్రబోస్ పలికించిన “నాటు నాటు…” పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ లభించింది. అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు. అందువల్లే ఆస్కార్ వచ్చింది అంటూ కొందరు కువిమర్శలు చేశారు. నిజానికి అక్కడ నామినేషన్ దక్కించుకున్న చిత్రాలకు ప్రచారం చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆస్కార్ సభ్యులకు మనం నామినేషన్ దక్కించుకున్న విభాగంలోని అంశాన్ని ప్రదర్శించడానికి, వారికి మన భాషను వివరించడానికి తదితర అంశాలకు కొంత ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆ ఖర్చు మన కరెన్సీలో అధికంగా కనిపించవచ్చు. అంతేకానీ, ఇదేదో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన అవార్డులు కావు. నిస్సందేహంగా ప్రతిభకు పట్టాభిషేకం చేసేవే ఆస్కార్ అవార్డులు! మన తెలుగు పాట “నాటు నాటు…” ఆస్కార్ నామినేషన్ పొందిన దగ్గర నుంచీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోట్లాది భారతీయులు ఆ పాటకే ఆస్కార్ పట్టాభిషేకం చేయాలని అభిలషించారు. ప్రార్థనలూ చేశారు. అందరి అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. ఆస్కార్ వేదికపై మన తెలుగు సంగీత దర్శకులు ఎమ్.ఎమ్.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆ పాటతో ఒక్క వెలుగు వెలిగారు. ఈ పాటతో పోటీపడ్డ పాటలేమీ తక్కువవి కావు. ఇది విమర్శలు చేసేవారు గమనించాల్సిన అంశం. ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’లో గాయని రిహానా ఆలపించిన “లిఫ్ట్ మీ అప్…” సాంగ్ అమెరికాలోని చార్ట్ బస్టర్స్ లోనూ, మరికొన్ని దేశాల్లోనూ ఎన్నో వారాలు టాప్ వన్ గా నిలచింది. ఇక ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’లోని “దిస్ ఈజ్ లైఫ్…” సైతం ఎంతగానో అలరించింది. ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్’లోని “అప్లాజ్…” పాట కూడా జనాన్ని పరవశింప చేసినదే. అన్నిటినీ మించి హాలీవుడ్ లో విశేషమైన క్రేజ్ ఉన్న లేడీ గగా ‘టాప్ గన్: మేవరిక్’లో పాడిన “హోల్డ్ మై హ్యాండ్…” పాట సైతం అమెరికన్లను ఓ ఊపు ఊపేసింది. ఇన్ని మంచి పాటలు బరిలో ఉన్నా, మన తెలుగు పాటకు పట్టాభిషేకం జరగడమంటే అది ప్రతిభకు పట్టం కట్టడమే కానీ, మరొకటి కాదని ఇప్పటికైనా విమర్శలు చేసేవారు గ్రహిస్తే మంచిది. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ తో పాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ సైతం ఆస్కార్ వేడుకలో పాలుపంచుకున్నారు. అయితే అవార్డు తీసుకోవడానికి వేదికపైకి కీరవాణి, చంద్రబోస్ వెళ్ళారు. కీరవాణి ఇంగ్లిష్ లో మాట్లాడగా, చివరలో ‘నమస్తే’ అంటూ చంద్రబోస్ తెలుగులో ముక్తాయింపు ఇవ్వడం తెలుగువారందరికీ ఆనందం పంచుతోంది.

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్
ది మమ్మీ, మమ్మీ రిటర్న్స్, జార్జ్ ఆఫ్ ది జంగిల్ సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు ‘బ్రెండన్ ఫ్రేసర్’. ఆస్కార్స్ 95లో ‘ది వేల్’ సినిమాకి గానూ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరిలో అవార్డ్ కోసం పోటీ పడుతున్న ‘బ్రెండన్ ఫ్రేసర్’ ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. అమెరికన్ సైకోలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ‘ది వేల్’ సినిమాలో ప్లే చేసిన ‘చార్లీ’ అనే పాత్రకి గాను బ్రెండన్ ఫ్రేసర్ కి ఆస్కార్ లభించింది. ఈ ఏడాది పోటీ చేసిన అన్ని అవార్డ్ ఈవెంట్స్ లోనూ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ‘బ్రెండన్’కే దక్కడం విశేషం.

తెలంగాణకు చల్లటి కబురు.. ఈనెల 15 నుంచి వానలు పడే ఛాన్స్
పశ్చిమ ప్రాంతంలోని ద్రోణి ఇప్పుడు బీహార్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు చత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ , ఉత్తర అంతర్గత కర్ణాటకల మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. మరో నాలుగు రోజుల్లో కర్ణాటక మీదుగా ఏర్పడే వాయుగుండం బలపడనుంది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రాలో వర్షాలు కురుస్తాయి. ఒక వైపు, ఈ సంగమం మీదుగా కొన్ని తేమ గాలులు వస్తాయి, మరోవైపు, పొడి గాలులు సంగమంలోనే ఉంటాయి. ఈ రెండింటి కలయిక వల్ల ఉరుములు, బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురువసున్నాయి. ఈ నెల 15న తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తన వాతావరణ శాఖ పేర్కొంది. 16న నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు కానీ.. ఇక్కడ ఇంటి దొంగ గుట్టును రట్టు చేశారు అధికారులు. టీఎస్ పీ ఎస్సీ పేపర్ లీకేజీ లో కీలక విషయాలు బయటకు వచ్చాయి. అమ్మాయి కోసమే టీఎస్పీఎస్సీ సెక్రెటరీ పీ ఏ ప్రవీణ్ ప్రశ్నా పత్రం లీక్ చేశారని, అది కూడా ఒక అమ్మాయికోసమని తెలియడంతో అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే ప్రవీణ్‌ ను అధికారులు అదుపులో తీసుకున్నారు. ఒక అమ్మాయికోసం ప్రవీన్‌ చేసిన పనికి పరీక్షలే వాయిదా పడే పరిస్థితి రావడంతో రాష్ట్రంలో చర్చకు దారితీసింది. అధికారులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ఇటీవల తరచుగా ఓ అమ్మాయి రావడాన్ని గమనించారు. ఆమె తరుచూ వచ్చేది ప్రవీణ్‌ కోసమే అని గుర్తించారు. ఆయువతి టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌ కుమార్‌కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈనేపథ్యంలో తనకు ఎగ్జామ్‌ పేపర్‌ ఇవ్వాలని కోరింది. తను కోరిన వెంటనే తను ఏమీ ఆలోచించకుండా ఆమె కోసమే ప్రవీణ్ పేపర్‌ లీక్‌ చేసినట్టు గుర్తించారు. ఆ..యువతి కోసమే టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌ లీకేజీ జరిగిందని అధికారులు గుర్తించారు. ఆ.. యువతి తమ్ముడు పరీక్ష రాస్తుండటంతో ప్రవీణ్ ను ప్రశ్నా పత్రం అడిగిందని కాన్ఫిడెన్సియల్ సిస్టం క్రెడెన్సియల్స్ సెక్రెటరీ పీ ఏ ప్రవీణ్ వెల్లడించాడు. దీంతో.. అడ్మినిస్ట్రేటివ్ సిస్టం పై పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కు ఇచ్చి అతని సిస్టం లో లాగిన్ అయ్యారని, ఆ సిస్టం లో ప్రశ్న పత్రాన్ని డౌన్ లోడ్ చేయకుండా నేరుగా ప్రవీణ్ మొబైల్ కు పంపుకున్నారు. దాన్ని ప్రవీణ్‌ ఆ అమ్మాయికి నేరుగా వాట్సప్‌కు పంపాడు.

తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాంకేతిక లోపం కారణంగా 20 మంది ఎయిర్‌మెన్‌లతో కూడిన ఎంఐ-17 ఐఏఎఫ్ హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం జోధ్‌పూర్‌లోని లోహావత్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఎంఐ-17 హెలికాప్టర్ జోధ్‌పూర్ ఎయిర్‌బేస్ నుంచి ఫలోడీ ఎయిర్‌బేస్‌కు బయలుదేరింది. కొంత సమయం తర్వాత ఆ హెలికాప్టర్‌ను జోధ్‌పూర్‌లోని పిల్వా గ్రామంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. “మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో, సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ పిల్వా గ్రామంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది” అని అధికారి తెలిపారు. ఆర్మీ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత లోపాలను సరిదిద్దడంతో హెలికాప్టర్ మళ్లీ బయలుదేరింది. కొంతసేపటి తర్వాత హెలికాప్టర్ సురక్షితంగా బయలుదేరి ఫలోడి విమానాశ్రయానికి చేరుకుంది. హెలికాప్టర్ దాని గమ్యస్థానానికి సుమారు గంట ఆలస్యం తర్వాత టేకాఫ్ చేయగలిగింది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్ టీమ్‌కు సహాయం చేసి, జనాన్ని అదుపు చేశారని ప్రసాద్ తెలిపారు.

పసిడి ప్రేమికులకు బ్యాడ్‌ న్యూస్‌..
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్‌ న్యూస్‌ చెబుతూ.. పైపైకి ఎగబాబుకుతోంది పసిడి ధర గత మూడు రోజుల్లోనే వెయ్యి రూపాయలకు పైగా పైకి కదిలింది బంగారం రేటు.. ఇక, ఇవాళ కూడా మరింత పెరిగింది.. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 100 పెరిగితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50పైకి ఎగిసింది.. మరోవైపు పసిడి దారిలోనే వెండి కూడా పెరిగింది.. కిలో వెండి ధర ఈ రోజు రూ.100 పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,160కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.56,890 దగ్గర కొనసాగుతోంది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 68,800గా పలుకుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,160గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 56,890 దగ్గర కొనసాగుతోంది. భారత్‌లో ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,040గా ట్రేడ్‌ అవుతోంది.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,710గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500గా పలుకుతోంది.. ఇక, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,200గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,940గా ట్రేడ్‌ అవుతోంది.. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అహ్మదాబాద్‌లో రూ. 52,210గా.. జైపూర్‌లో రూ. 52,310, లక్నోలోరూ.52,310, భువనేశ్వర్ లో రూ. 52,210గా ఉంది. ఇక విదేశాల్లో బంగారం ధరలు చూస్తే.. మలేషియా: 2,700 రింగ్గిట్ (రూ.48,967), దుబాయ్: 2095 దిర్హామ్ (రూ46,755), అమెరికా: 575 డాలర్ (రూ47,130), సింగపూర్: 784 సింగపూర్ డాలర్ (రూ.47,639), ఖతార్: 2,165 ఖతార్ రియాల్ (రూ.48,738), కువైట్: 179 కువైట్ దినార్ (రూ.47,786)గా ఉన్నాయి.

Exit mobile version