NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశి వేళ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు.. వైష్ణవాలయాలు తెల్లవారుజామునుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలైన తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి, రెండు రాష్ట్రాల్లోని టీటీడీ ఆలయాలు సహా అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది.. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు… ఈ సమయంలో వీఐపీ భక్తుల తాకిడి కూడా తిరుమలలో పెరిగింది.. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, కర్నాటక గవర్నర్ థాహర్ చంద్ గ్లేహట్, జమ్ము గవర్నర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, అంబటిరాంబాబు, విశ్వరూప్‌, తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, గంగుల, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, పీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి… సహా ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు.

ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్‌ పోటీ.. కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తాం..
పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. తిరుమలలో ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలవరం పూర్తి కాలేదు.. ప్రత్యేక హోదా సాధించలేదన్నారు.. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్‌ని గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు మల్లారెడ్డి. మరోవైపు బీఆర్ఎస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని తెలిపారు మంత్రి మల్లారెడ్డి.. 8 సంవత్సరాల కాలంలో తెలంగాణలో చేసిన అభివృద్దిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారన్న ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ నుంచి 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయం.. అంతేకాదు విజయం సాధించడం కూడా ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి మల్లారెడ్డి.

ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న హరిరామ జోగయ్య..
మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయా నేత హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తున్నారు. అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లు కాపులకు ఐదు శాతం కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై డిసెంబర్ 30 తేదీ వరకు ప్రభుత్వానికి జోగయ్య సమయం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో జోగయ్య ఈరోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. దీక్ష ఆలోచన విరమించుకోవాలని పోలీసులు సూచించారు. జోగయ్య నిన్న రాత్రి నుంచి దీక్షలో ఉన్నట్టు ప్రకటించారు. దీంతో పాలకొల్లులో జోగయ్య ను అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.. అయితే, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు నా దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు హరిరామ జోగయ్య.. జీవో నెంబర్ 60 రద్దు చేయాలని.. యాక్ట్14, 15 అమలులోకి తీసుకు రావాలంటున్నారు.. ఇక, నిన్న సాయంత్రం ఏడు గంటలకి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు.. అప్పటినుంచి నేను నిరాహార దీక్షలో ఉన్నానని వెల్లడించారు హరిరామ జోగయ్య.. మరోవైపు.. దీక్షలో ఉన్న హరిరామ జోగయ్య షుగర్ లెవెల్స్ పడిపోయాయి, బీపీ పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు.

టీపీసీసీ రేవంత్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌
ఇవాళ ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది. గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అయితే.. దీంతో ఈరోజు ఉదయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా ఉన్న నేపత్యంలో ధర్నాలో పాల్గొనకుండా చేసేందుకు హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నా అనుమతి కోసం టీపీసీసీ దరఖాస్తు చేసుకుంటే అనుమతిని పోలీసులు నిరాకరించారు. అనుమతి నిరాకరించినా ధర్నా చేస్తామని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. రేవంత్‌ రెడ్డితో పాటు మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి తదితరులు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

యాదాద్రికి పోటెత్తిన భక్తులు..
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆలయాలు భక్తులు వేకువజామునుంచే పోటెత్తారు. దీంతో హరి నామస్మరణతో ఆలయాల్లో మారుమ్రోగుతున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామి వారు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కావడంతో భక్తి జనం పోటెత్తారు. 6గంటల 48 నిమిషాలకు భక్తులకు శ్రీ లక్ష్మీనరసింహుడు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. అయితే.. ఉత్తర ద్వార దర్శనంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు.

కీవ్‌పై విరుచుకుపడిన రష్యా.. మిసైళ్లు, డ్రోన్లతో అటాక్..
కొత్త ఏడాదిలో రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. మిసైళ్లు, ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై సోమవారం తెల్లవారుజామున వరసగా దాడులు చేస్తోంది రష్యా. దీంతో ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని పౌరులను అలర్ట్ చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. కీవ్ పై వైమానిక దాడి..రాజధానిలో ఎయిర్ అలర్ట్ ఆన్ లో ఉందని టెలిగ్రామ్ లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు షెల్టర్ జోన్లలో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.

పెద్ద నోట్ల రద్దుపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఎన్డీయే ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఈ రోజు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును చెప్పనుంది. రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో 30కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. డిసెంబర్ 7న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా ఈ రోజు తీర్పును చెప్పనుంది. శీతాకాలం సెలవుల తర్వాత జనవరి 2న సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానుంది.

పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ రైలు..
ముంబై-జోధ్‌పూర్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని పాలి ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై బాంద్రా టెర్మినల్ నుంచి బయలుదేరిని సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ జోధ్ పూర్ డివిజన్ లోని రాజ్ కియావాస్ -బోమద్ర సెక్షన్ మద్య తెల్లవారుజామున 3.27 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైలు 8 బోగీలు పట్టాలు తప్పాయి.