NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

జీవో నంబర్‌ 1.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది.. బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉం­డేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.. వివాదాస్పద జీవో నెంబర్ 1పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ జీవోపై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీ కూడా ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్నారు. రోడ్లు, రహదారులపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ.. ఏపీ సర్కార్‌ జారీ చేసిన జీవో నెంబర్ 1ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే.. ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందని ఆరోపించారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, జీవోను జనవరి 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది… ఇక, తదుపరి విచారణ జనవరి 20కి తేదీకి వాయిదా వేసింది. కానీ, జీవో విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఈ జీవో జారీచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో కొందరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఈ జీవోను విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది.. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతో.. ప్రజల ప్రాణాలు కాపాడడానికే జీవో జారీ చేశామని, ప్రజలకు అసౌకర్యం కల్గని ప్రాంతాల్లో సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.. కానీ, నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవోలో పేర్కొంది. అయితే, ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో.. అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.

గొల్లపూడిలో ఉద్రిక్తత.. వివాదాస్పద స్థలం నుంచి టీడీపీ ఆఫీస్‌ తరలింపు..!
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. గొల్లపూడిలోని వివాదస్పద స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. అక్కడి నుంచి టీడీపీ కార్యాలయ తరలింపు పనులు ప్రారంభించారు పోలీసులు.. కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు.. కార్యాలయంలోని కంప్యూటర్లును కూడా తరలించారు పోలీసులు.. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. టీడీపీ కార్యాలయంతో పాటు.. గొల్లపూడిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. మరోవైపు టీడీపీ నేతలను కట్టడి చేస్తున్నారు.. మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హౌస్‌ అరెస్ట్ చేశారు… ఇక, మొన్న రాత్రి నుంచి టీడీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. అయితే, ఈ నెల 28వ తేదీలోగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని టీడీపీ నేత ఆలూరి చిన్నాకు స్థానిక తహసీల్దారు నోటీసులు ఇచ్చారు.. ఇంకా గడువు పూర్తి కాకముందే.. పోలీసులు చర్యలు చేపడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు.. వివాదస్పద స్థలాన్ని.. స్థల యజమానికి అప్పగించామని చెబుతున్నారు పోలీసులు. ఇక, స్థల యజమాని ఆలూరి శేషారత్నం మాట్లాడుతూ.. మా స్థలం వద్ద దేవినేని ఉమ అల్లరి చేయడం తగదన్నారు.. తల్లి కొడుకుల సమస్యలోకి దేవినేని ఉమ ఎందుకు తలదూరుస్తారు..? చంద్రబాబు.. ఉమకు ఇదే నేర్పించారా..? మేమేమైనా పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చామా..? అని ప్రశ్నించారు.. పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చేంత ఆస్తులు మాకు లేవని.. దేవినేని ఉమలాగా మేం ఆస్తులు సంపాదించుకోలేదని మండిపడ్డారు. తల్లికొడుకుల మధ్య ఉమ వచ్చి తగాదాలు పెడుతున్నారు.. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. నా కొడుకు చిన్నా మంచివాడే.. కానీ, నా కూతురుకేం లేకుండా చేస్తున్నారనేదే నా బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు.. కలెక్టర్ ఆర్డర్ ఇస్తే ఉమకు ఏం ఇబ్బంది..? అని ఫైర్‌ అయిన శేషారత్నం.. దేవినేని ఉమ వల్లే మా కుంటుంబం ఇలా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.. నా ఇంటి ముందు ఉమ ధర్నా చేయడమేంటీ..? ఉమ ఇంటి ముందు నేను ధర్నా చేస్తే ఊరుకుంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అష్టదిగ్బందంలో జగిత్యాల.. మాస్టర్ ఫ్లాన్ పై నిరసనలు
జగిత్యాలలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్బందంకు గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. మాస్టర్ ప్లాన్ వద్దని కాంగ్రెస్ బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా నిలిచారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలకు రైతుల ప్రణాళికలు సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని గ్రామాల్లో గ్రామ సభలు నిరసనలు వెళ్లువెత్తాయి. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా గ్రామ పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. తిమ్మపూర్ గ్రామ సభకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై రైతులకు మద్దతు తెలిపారు. పలు గ్రామాల ఏకగ్రీవ తీర్మానాలను గ్రామస్థులు మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. మాస్టర్ ఫ్లాన్ పై నిరసనలు ఉదృతం ఏర్పాటుకు చేసేందుకు రైతులు, రైతు జేఏసీ సన్నద్ధం అవుతున్నారు. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ విలీన గ్రామాల రైతులు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా జగిత్యాల రైతులు కూడా ఆందోళనలు చేపట్టారు. అంతకుముందు జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న జగిత్యాల-నిజామాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

తోటి ఉద్యోగినికి బూతు మెసేజ్‌లు.. ఆపై చోరీ..
అతడు ఒక ఉపాధ్యాయుడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో, తానూ బుద్ధిగా ఉండాల్సిందిగా పోయి.. చెడు వ్యసనాలకు బానిసై, వక్రమార్గం పట్టాడు. తోటి ఉద్యోగినికి బూతు మెసేజ్‌లు పంపాడు. అంతటితో ఆగకుండా.. చోరీకి సైతం పాల్పడ్డాడు. చివరికి అడ్డంగా దొరికిపోయి, కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ దుండగుడి పేరు సార సంతోష్. జోగిపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. తొలుత అందరితోనూ సఖ్యతగానే వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తోటి ఉద్యోగినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో మంచిగా ఉన్నట్టు వ్యవహరించి, ఆ తర్వాత నిజస్వరూపం చూపించాడు. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. మొదట్లో అలాంటివి పంపించొద్దని వార్నింగ్ ఇచ్చింది. అప్పటికీ మారకపోవడంతో.. పై అధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో.. అతడ్ని సస్పెండ్ చేశారు. తనకు బుద్ధి వచ్చిందని చెప్పడంతో.. ఇటీవలే తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పోనీ.. అప్పటినుంచైనా సంతోష్ పూర్తిగా మారాడా? అంటే అదీ లేదు. చోరీకి పాల్పడి జైలుకెళ్లాడు. ఈనెల 10వ తేదీన విద్యుత్ శాఖ ఉద్యోగి అయిన రాములు ఓ బ్యాంకులో రూ. 1.50 లక్షలు డ్రా చేశాడు. భార్యతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఇది గమనించిన సంతోష్.. వారిని ఫాలో అవుతూ వచ్చాడు. మార్గమధ్యంలో కూరగాయల కోసం రాములు, అతని భార్య ఆగారు. ఇదే సరైన సమయం అని భావించి.. సంతోష్ రాములు వద్దనున్న డబ్బులు తీసుకొని, అక్కడి నుంచి ఉడాయించాడు. అతడ్ని వెంబడించినా, కనుచూపు మేర కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంతోష్ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈనెల 17వ తేదీన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకొని, రాములకు తిరిగి ఇచ్చారు. సంతోష్‌ను రిమాండ్‌కు పంపారు. అతడో ఉపాధ్యాయుడు అనే విషయం తెలిసి.. పోలీసులు విస్తుపోయారు.

నేడు కంటి వెలుగు రెండో విడత.. ఆధార్‌, రేషన్‌, ఆరోగ్యశ్రీ తప్పనిసరి
తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణకు ప్రభుత్వం వెలుగుల యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలోని ప్రజలందరికీ గురువారం నుంచి కంటి పరీక్షలు చేయనున్నారు. తెలంగాణలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా అంధత్వ నివారణకు ఉచిత కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ సెంటర్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈవాల్టి నుంచి జూన్ 30 వరకు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మొత్తం 241 ప్రాంతాల్లో 100 రోజుల పాటు 5058 శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ కంటి వెలుగు శిబిరాలు నేడు అమీర్‌పేటలోని వివేకానందనగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు, వెంగళరావునగర్‌ డివిజన్‌లోని మధురానగర్‌ కమ్యూనిటీ హాల్‌లో 10 గంటలకు మంత్రులు హరీశ్‌రావు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభిస్తుండగా, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మల్కారంలో మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరంలోనే ప్రతిరోజూ దాదాపు 15,525 మందికి కంటివెలుగు ద్వారా సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు కంటివెలుగు శిబిరాలకు 3,81,445 రీడింగ్ గ్లాసులను కూడా పంపించారు. కంటి పరీక్షల నిమిత్తం శిబిరానికి వచ్చే తేదీ, సమయం, శిబిరానికి సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను అందజేయాలన్నారు. శిబిరానికి వచ్చే పక్షంలో ఆధార్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ లేదా రేషన్ కార్డు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలి. కంటి సమస్యలు ఉన్నవారు ఉచిత కంటి పరీక్ష శిబిరాలకు వెళ్లి పరీక్షలు పూర్తయిన తర్వాత ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేస్తున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేస్తారు. సమీప, దూర దృష్టి ఉన్న వారిని 15 రోజుల్లో ఇంటికి పంపిస్తామని అధికారులు తెలిపారు. అలాగే దృష్టిలోపానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు లిఖితపూర్వకంగా తెలియజేసి అద్దాలపై స్పష్టంగా ముద్రిస్తారు. వివరాల కోసం తమ పరిధిలోని ఆష్ వర్కర్లు ఏఎన్‌ఎంలను సంప్రదించాలన్నారు.

అచ్చం ప్రభుత్వ పోర్టల్‌లాగే నకిలీ వెబ్‌సైట్.. మోసగాళ్ల ముఠా అరెస్ట్
పింఛనుదారుల కోసం లైఫ్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి 1,800 మందికి పైగా మోసగించిన నలుగురు మోసగాళ్ల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. నిందితులను అమిత్ ఖోసా, కనవ్ కపూర్, బినోయ్ సర్కార్, శంకర్ మోండల్‌లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. కొందరు మోసగాళ్లు ప్రభుత్వ పోర్టల్‌ను పోలిన https://jeevanpraman.online/ వెబ్‌సైట్‌ను సృష్టించారని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. కంటెంట్‌లో ఎక్కువ భాగం వాస్తవ ప్రభుత్వ పోర్టల్ నుండి కాపీ చేయబడింది. వారు జీవన్ ప్రమాణ్ సేవల కోసం కస్టమర్ల నుండి ఈ నకిలీ వెబ్‌సైట్ ద్వారా చెల్లింపులను అంగీకరిస్తున్నారు. జీవన్ ప్రమాణ్ నవంబర్ 10, 2014న ప్రారంభించబడిన భారత ప్రభుత్వ చొరవ అని పోలీసులు తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి కోటి మంది పింఛనుదారులకు బయోమెట్రిక్-ఆధారిత డిజిటల్ సేవ. https://jeevanpraman.online వెబ్‌సైట్ ద్వారా నిందితులు జీవన్ ప్రమాణ్ కోసం ఫారమ్‌ను పూరించాలని దరఖాస్తుదారుని కోరారని, ఒక్కో దరఖాస్తుదారునికి రూ.199 రిజిస్ట్రేషన్ రుసుము అందుకున్నారని విచారణలో తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ సెల్) ప్రశాంత్ గౌతమ్ తెలిపారు. జీవన్ ప్రమాణ్ పేరుతో సామాన్య ప్రజలను మోసం చేసింది.

పెళ్లి వేడుకల్లో అపశృతి.. డ్యాన్స్‌ చేస్తూనే కుప్పకూలిన యువకుడు
గ్రామాల్లో పెద్దలు అప్పట్లో ఓ సామేత చెప్పేవారటల.. వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు.. ప్రాణం ఎప్పుడు పోయేది తెలియదు.. అయితే.. ఆధునిక సమాజంలో టెక్నాలజీ ఎంతో పెరిగింది.. వర్షం ఎప్పుడు వస్తుంది.. ఏ ప్రాంతంలో ఎంత సమయం కురుస్తుంది అనేది ముందే పసిగడుతున్నారు.. ఇక, ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించి.. సదరు వ్యక్తిఎంత కాలం జీవిస్తారు అనేది కూడా ముందే చెబుతున్నారు.. కానీ, కొందరు సరదాగా గడుపుతూ.. డ్యాన్స్‌లు వేస్తూ.. పాటలు పాడుతూ.. ఇంకా ఏదో పనిలో ఉంటూ.. కుప్పకూలి ప్రాణాలు వదిలిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తాజాగా.. ఓ 32 ఏళ్ల యువకుడు.. పెళ్లి వేడుకల్లో జోష్‌గా డ్యాన్స్‌ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కాన్పూర్‌కు చెందిన 32 ఏళ్ల అభయ్‌ సచాన్‌.. తన బంధువుల వివాహం కోసం మధ్యప్రదేశ్‌ రేవాకు వచ్చాడు. మంగళవారం రాత్రి వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్‌లు చేశాడు. అలా గంతులేస్తూనే ఉన్నట్లుండి.. నెమ్మదిగా కుప్పకూలిపోయాడు.. అది గమనించిన బంధువుల.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే, కార్డియాక్‌ అరెస్ట్‌తో అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. పెళ్లి వేడుకల్లో.. మద్యం తాగి జోష్‌గా డ్యాన్స్‌లు వేస్తుంటారు.. కానీ, ఇక్కడ షాకింగ్‌ విషయం ఏంటంటే.. అతను మద్యం సేవించిందిలేదు.. పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు.. ఆరోగ్యవంతుడైనా ఆ యువకుడు.. ఇలా కన్నుమూయడాన్ని కుటుంబసభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు.. మొత్తంగా ఈ ఘటన పెళ్లింటి విషాదాన్ని నింపింది.. అయితే, పెళ్లి వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ.. యువకుడు కుప్పకూలిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది..

వచ్చే నెలలో రాజీనామా చేస్తా.. న్యూజిలాండ్ ప్రధాని ప్రకటన
వచ్చే నెలలో తాను రాజీనామా చేయనున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ గురువారం ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్‌ పార్టీ సమావేశంలో అన్నారు. లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్‌ జరుగుతుందని చెప్పారు. సాధారణ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌ 14న జరుగుతాయని తెలిపారు. దీంతో ఆర్డెర్న్‌ పదవీ కాలం ఫిబ్రవరి 7 తర్వాత ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి లేబర్‌ పార్టీ గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో జసిండా ఆర్డెర్న్ మొదటి సారిగా ప్రధానిగా ఎన్నికయ్యారు. సంకీర్ణ పక్షాలతో కలిసి ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మూడేండ్ల తర్వాత 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలో లేబర్‌ పార్టీ సాధారణ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే అనుకున్నంతగా రాణించలేకపోయింది. 49 శాతం ఓట్లతో మొత్తం 120 సీట్లకు గాను 64 స్థానాల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. ఇటీవలి ఎన్నికలలో ఆమె పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ పడిపోయింది. ఉప ప్రధాన మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్ తన పేరును ముందుకు తీసుకురావడం లేదని చెప్పారు. ఆమె రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదని ఆర్డెర్న్ అన్నారు. ఆమె రాజీనామా ఫిబ్రవరి 7 తర్వాత అమల్లోకి వస్తుందని, జనవరి 22న లేబర్ కాకస్ కొత్త నాయకుడిపై ఓటు వేయనున్నట్లు ఆర్డెర్న్ తెలిపారు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ హషీం ఆమ్లా సంచలన ప్రకటన చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తాను వైదొలుగుతున్నట్లు కుండబద్దలు కొట్టాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆమ్లా.. ఇప్పుడు మిగతా ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక ఇంగ్లండ్‌ కౌంటీల్లో సర్రే జట్టుకు ఆమ్లా ఆడుతున్నాడు. అయితే.. ఈ ఏడాది కౌంటీ సీజన్‌ బరిలోకి దిగడం లేదని స్పష్టం చేశాడు. తన రిటైర్మెంట్‌ ప్రకటనలో సర్రే టీమ్‌ స్టాఫ్‌ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపిన ఆమ్లా.. సర్రే డైరెక్టర్‌ అలెక్‌ స్టివర్ట్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ధన్యవాదాలు తెలియజేశాడు. గతేడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా లాంకషైర్‌తో తన చివరి మ్యాచ్‌ ఆడేసిన ఆమ్లా.. ఆ సీజన్‌లో దాదాపు 40 సగటున 700కు పైగా పరుగులు చేశాడు. అంతేకాదు.. తన జట్టును (సర్రే) ఛాంపియన్‌గా నిలిపాడు. కాగా.. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆమ్లా, తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. 55 సెంచరీల సహాయంతో 18,000కు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత 10, 15, 16, 17, 18, 20, 25, 27 శతకాలు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. సౌతాఫ్రికా టెస్ట్‌ టీమ్‌ కెప్టెన్‌గానూ వ్యవహరిం‍చిన ఆమ్లా.. టెస్ట్‌ల్లో ట్రిపుల్‌ హండ్రెడ్‌ (311 నాటౌట్‌)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో ఇతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 159. ఎన్నోసార్లు కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకొని, గెలుపు దిశగా తీసుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. టెస్ట్ ప్లేయింగ్ జట్లపై ఆమ్లా వన్డే సెంచరీలు చేసి, ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు.

Show comments