NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఆ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. రతన్‌ టాటా పోస్ట్‌ వైరల్‌
రతన్ టాటా పరిచయం అవసరం లేని పేరు.. టాటా గ్రూప్‌ను రూపొందించిన రతన్ టాటా.. వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలోనే ఎంతో పేరు పొందారు.. ఆయనకు సోషల్ మీడియాలో పెద్ద అభిమానుల ఫాలోయింగ్‌ను కూడా కలిగి ఉన్నారు.. ఆయన అనేక త్రోబాక్ పోస్ట్‌లను పంచుకుంటూ ఉంటారు.. అయితే, ‘టాటా ఇండికా’ను ప్రారంభించిన 25 సంవత్సరాలు అవుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఓ భావోద్వేగ పోస్టును చేశారు టాటా.. ఇండికాతో ఉన్న ఒక చిత్రాన్ని పంచుకున్న ఆయన.. “ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, టాటా ఇండికాను ప్రారంభించడం భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పుట్టుక. ఇది మధురమైన జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది.. నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది” అంటూ రాసుకొచ్చారు.. ఇండికా టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రారంభించింది. భారతదేశంలో రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన ఈ కారు 1998లో ప్రారంభించబడింది.. ఇండిగో నుండి విస్టా మరియు మాంజా మోడళ్ల వరకు కంపెనీ శ్రేణిలో అనేక చిన్న కార్లకు కూడా తర్వాత కాలంలో వచ్చాయి.. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాలలో విజయవంతమైంది. దాని ఫీచర్లు మరియు అందుబాటు ధరల కారణంగా త్వరలో ఇష్టపడే బ్రాండ్‌గా మారిపోయింది.. అయితే, ఇరవై సంవత్సరాల తర్వాత, టాటా మోటార్స్ ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కొన్న తర్వాత 2018లో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖలో అపూర్వ స్వాగతం.. మంగళ వాయిద్యాలు, పూల వర్షం
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కల నెరవేరింది.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖలో అపూర్వ స్వాగతం లభించింది.. రాత్రి 10.45 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ కు చేరుకుంది ఈ ప్రత్యేక రైలు.. జాతీయ జెండాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు రైల్వే అధికారులు.. వందేభారత్ రైలుపై పూల వర్షం కురిపించారు భారతీయ జనతా పార్టీ నేతులు, కార్యకర్తలు.. ఇక, ఈ ట్రైన్ లో అనకాపల్లి నుంచి విశాఖ వరకు ప్రయాణించారు ఎంపీ సత్యవతి.. కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం పట్టాలెక్కింది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు.

కన్నుల పండువగా ప్రభల ఉత్సవం..
మకర సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఉదయం పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీదుల ప్రభల ఊరేగింపు కొత్తపేట ప్రధాన పురవీధుల్లో సాగింది. ఈ మూడు ప్రధాన వీధుల ప్రభలను అనుసరిస్తూ చిన్న ప్రభలను ఊరేగించారు. ప్రభల ముందు సంగీత నాదస్వర మేళాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు బాణా సంచా కాల్పుల నడుమ ఊరేగింపు ముందుకు సాగింది. ప్రభలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొలువు దీర్చారు. వేలాది సంఖ్యలో ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చారు. ఎక్కడికక్కడ రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిషిపోయాయి. విశేష సంఖ్యలో భక్తులు దేవత మూర్తులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు వీధుల వారు నిర్వహించిన పోటా పోటీ బాణా సంచా కాల్పులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. మరోవైపు.. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

గంగా విలాస్ కొత్తదేం కాదు.. 17 ఏళ్ల పాతది
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే! దీనిపై తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నౌక కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూనే ఉందని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు అందులో మద్యం అందుబాటులో ఒక బార్‌ని కొత్తగా తెచ్చారని ఆరోపణలు చేశారు. పాతవాటిని మళ్లీ కొత్తగా ప్రారంభించే సంప్రదాయం బీజేపీకే చెల్లిందని కౌంటర్ వేశారు. అందులో బార్ ఉందో? లేదో? అనే విషయంపై బీజేపీనే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయ్‌బరేలీలో మీడియాతో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఆ గంగా విలాస్ గత 17 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఈ విషయాన్ని నాకు కొందరు తెలియజేశారు. దానికి కేవలం కొన్ని మార్పులు మాత్రమే చేసి.. ఏదో కొత్త నౌకను లాంచ్ చేసినట్టు దాన్ని మేము ప్రారంభించామని బీజేపీ వాళ్లు ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలు చేసుకోవడం, అబద్ధాలు చెప్పుకోవడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. మరో దారుణమైన విషయం ఏమిటంటే.. ఎంతో పవిత్రమైన గంగా నదీలో ప్రయాణించే ఆ నౌకలో ఇప్పుడు మద్యం అందించే బార్లు కూడా ఉన్నట్లు నాకు సమాచారం అందింది. ఇప్పటివరకు గంగాలో హారతి మాత్రమే ఇస్తారని మనం వినేవాళ్లం. మరి ఆ నౌకలో బార్‌ ఉందో లేదో బీజేపీ వాళ్లే స్పష్టం చేయాలి’’ అని వ్యాఖ్యానించారు.

శ్రీలంకపై కోహ్లీ సెంచరీ.. నమోదైన రికార్డులివి.. వరల్డ్‌లోనే తొలి ఆటగాడిగా..
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్స్ మైదానం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎలా విజృంభించాడో అందరూ చూశారు. తొలుత నిదానంగా తన ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ.. సెంచరీ చేశాక ఒక్కసారిగా చెలరేగిపోయాడు. ఎడాపెడా షాట్లతో బౌండరీలు బాదుతూ పరుగుల వర్షం కురిపించాడు. దీంతో.. 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 8 సిక్స్‌లో సహాయంతో 166 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడు కొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ శతకంతో అతడు స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు 20 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ పేరిట ఆ రికార్డ్ ఉండేది. ఇప్పుడు కోహ్లీ 21 సెంచరీలతో ఆ రికార్డ్‌ని బద్దలుకొట్టాడు. శ్రీలంకపై కోహ్లీకి ఇది 10వ వన్డే సెంచరీ కావడంతో.. ఆ జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా విరాట్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సచిన్‌ టెండ్కూలర్‌ (9) పేరిట ఉండగా.. తాజా సెంచరీతో కోహ్లీ దాన్ని బ్రేక్ చేశాడు. అదేవిధంగా స్వదేశీ గడ్డపై వ‌న్డేల్లో అత్యధిక ప‌రుగులు చేసిన మూడో క్రికెట‌ర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 పరుగులతో స‌చిన్ మొద‌టి స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ 5521 పరుగులతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 5303 ర‌న్స్‌తో మూడో స్థానంలో నిలిచారు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి చరిత్రపుటలకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 12754 పరుగులు చేశాడు. ఈ దెబ్బకు శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650) రికార్డ్ బద్దలైంది. ఈ జాబితాలో సచిన్‌ (18426) అగ్రస్థానంలో ఉంటే, రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర 14234 పరుగులతో ఉన్నాడు.

ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డ్.. తొలి భారతీయ సినిమాగా..
తన థియేట్రికల్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యాక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ సినిమా.. తన ఖాతాలో ఒకదాని తర్వాత మరొక అవార్డ్‌ని వేసుకుంటోంది. ఇటీవల బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే! ఈ అవార్డ్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రపుటలకెక్కింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌ని సొంతం చేసుకుంది. ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అర్జెంటీనా 1985’, ‘బార్డో’, ‘ఫాల్స్ క్రానికల్ ఆఫ్ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్’, ‘క్లోజ్’, ‘డిసిషన్ టు లీవ్’ వంటి సినిమాలపై ఆర్ఆర్ఆర్ పోటీ పడి.. ఈ అవార్డ్‌ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ట్విటర్ మాధ్యమంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ పురస్కారాన్ని గెలిచిన అనంతరం తన తనయుడు కార్తికేయతో కలిసి గౌరవంతో ఫోటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్ చేసింది. అభిమానులు కూడా ఓ ఇండియన్ సినిమా ఈ అవార్డ్ అందుకున్నందుకు చాలా గర్వపడుతున్నారు. అంతర్జాతీయంగా భారతీయ చిత్రసీమ ఖ్యాతిని చాటుతున్నందుకు రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా.. ఈ సినిమాలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా నటించగా.. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, శ్రియా శరణ్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ కీలక పాత్రలు పోషించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌పై తాండవం చేసి రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టింది. అటు జపాన్‌లోనూ ఇది రప్ఫాడించేస్తోంది.