NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏ రోజు ఏ టికెట్లు విడుదల చేస్తారంటే..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలని చూస్తున్న భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం.. ఎందుకంటే.. వరుసగా వివిధ దర్శనలు, సేవల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇవాళ ఉదయం 9 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.. జనవరి 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సంబంధించిన ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు అధికారులు.. ఇక, ఈ నెల 11వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.. తిరుపతిలో 4 కేంద్రాల వద్ద వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. ఇక, ఎల్లుండి ఆన్ లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.. జనవరి 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరియు ఫిబ్రవరి మాసానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారు.. మరోవైపు ఈ నెల 10వ తేదీన వసతి గదులు కోటాను విడుదల చేయబోతోంది టీటీడీ.. జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సంబంధించిన గదుల కోటాను విడుదల చేయనున్నారు.. ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో పెట్టనున్నారు.. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 45,883 మంది భక్తులు.. వారిలో 17,702 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ఇక, హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లుగా ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).

గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు..
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఇప్పటివరకు గ్రూప్‌ 2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించేశారు.. ఈ మేరకు శుక్రవారం జీవో 6ను విడుదల చేసింది ప్రభుత్వం.. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రభు­త్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమో­దిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది… అయితే, గతంలో గ్రూప్‌ 2 స్క్రీనింగ్‌ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్‌లో పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ ఉండేది. అలాగే మరో రెండు పేపర్లుండేవి. పేపర్‌కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు జరగనున్నాయి.. గతంలో మెయిన్స్‌లో పేపర్‌1గా ఉన్న జనరల్‌ స్టడీస్‌ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్‌ టెస్టుకు మార్చారు అధికారులు.. దీనిని గతంలో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌ను రెండు పేపర్లకు తగ్గిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులు ఉండనున్నాయి.. ఏపీ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, భారత రాజ్యాగం పేపర్ 1గా 150 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించనున్నారు.. మరో 150 మార్కులకు రెండో ప్రశ్నాపత్రంగా భారత, ఏపీ ఎకానమి, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నాపత్రం తయారు చేస్తారు.. ఈ మేరకు మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆర్ధికశాఖ మానవ వనరుల విభాగం..

నేడు బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనం.. వర్చువల్​గా మాట్లాడనున్న జేపీ నడ్డా, బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఏంటి? పోలింగ్‌ బూత్‌ కేంద్రంగా కమలనాథులు ఏం చేస్తున్నారు? తమకు బలమని చెబుతున్న బూత్‌ కమిటీలు ఎంత వరకు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవాళ బీజేపీ నేతలకు దొరకనుంది. తెలంగాణలో 34 వేలకుపైగా పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 250కిపైగా పోలింగ్‌ బూత్‌లు ఉంటాయి. వీటిపైనే దృష్టిపెట్టాయి బీజేపీ శ్రేణులు. వాస్తవానికి బీజేపీలో ఎన్నికల వ్యూహాలన్నీ పోలింగ్‌ బూత్‌ కేంద్రంగానే జరుగుతూ ఉంటాయి. బూత్‌ కమిటీలే తమ బలమని.. అవే తమను ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని భావిస్తారు నాయకులు. పోలింగ్‌ బూత్‌ను గెలిస్తే అసెంబ్లీని గెలిచినట్టేనని కమలనాథులు చెబుతారు. తెలంగాణలోనూ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది బీజేపీ. పోలింగ్‌ బూత్‌ కమిటీలు వేయడంపై కసరత్తు చేస్తున్నారు నాయకులు. కొన్ని నెలలుగా ఈ అంశంపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో.. అన్ని కమిటీలు వేశాం.. ఇన్ని కమిటీలు పూర్తయ్యాయి అని ఓ రేంజ్‌లో లెక్కలు వేసి.. బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు పంపించారు జిల్లా నాయకులు. వారు ఇచ్చిన గణాంకాల ప్రకారం పార్టీకి రాష్ట్రంలో 25 వేల పోలింగ్‌ బూత్‌ కమిటీలు కొలిక్కి వచ్చాయట. ఒక్కో పోలింగ్‌ బూత్‌ కమిటీలో 22 మంది ఉండాలి. ఒక అధ్యక్షుడు.. ఒక సోషల్‌ మీడియా కన్వీనర్‌తోపాటు.. 20 మంది సభ్యులు ఉండాలి. ఈ లెక్కన చూస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 4 వేల మంది బూత్ కమిటీ సభ్యులు ఉండాలి. ఇక రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ బూత్ స్థాయి కార్యకర్తల బలమే 5 లక్షలుగా లెక్క తేలుతోంది. చెప్పుకోవడానికి ఈ లెక్కలు ఘనంగా ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితిని తెలుసుకుని.. రాష్ట్రంలో తమ బలాన్ని అంచనా వేసుకోవడానికి చూస్తున్నారు కమలనాథులు.

శ్రీలంకతో నేడు అమీతుమీ
భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో నేడు నిర్ణయాత్మక పోరు జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు అయ్యేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ టీ-20 సిరీస్‌లో ఆఖరిపోరుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్ ఫలితం చూస్తే మెరుగైన జట్టు ఏది అంటే శ్రీలంక అనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, రాహుల్, షమి, భువనేశ్వర్ లాంటి సీనియర్లు టీ20 జట్టుకు దూరమైన స్థితిలో కుర్రాళ్లతో నిండిన జట్టు.. హార్దిక్ నాయకత్వంలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. హార్దిక్ సారథ్యంలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన జట్టు నిలకడగా ఆగి విజయతీరాలకు చేరుతుందో లేదో చూడాలి.

అయోధ్య ఆలయంలో రాముడి నూతన విగ్రహం
అయోధ్యలో తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న రామాలయం గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని, దాని కోసం అత్యుత్తమ శిల్పులను నిమగ్నం చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు శుక్రవారం తెలిపారు. 70 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర తీసిన రామ్ లల్లా విగ్రహాన్ని కొత్త ఆలయంలో ప్రతిష్టించబోమని ఆయన చెప్పారు. దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు, డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదును కూల్చివేసిన అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఆగస్ట్ 5, 2020న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. త్వరలో ప్రఖ్యాత శిల్పులు విగ్రహాన్ని రూపొందించే బాధ్యత తీసుకుంటారని వెల్లడించారు. విగ్రహం తయారీకి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రాతిని ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని, రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకేలా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వీరు సూచనలు చేస్తారని వివరించారు. గర్భగుడిలో 9 అడుగుల ఎత్తులో, ఉదయించే సూర్యుని కిరణాలు శ్రీరాముడి నుదుటిపైకి తాకే కోణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు.

నీది నోరా మున్సిపాలిటీ కుప్పతొట్టా ? రోజా పై నాగబాబు ఫైర్..
మంత్రి రోజాపై మెగా బ్రదర్‌ నాగబాబు ఫైర్‌ అయ్యారు. మెగా బ్రదర్స్‌ పైన రోజా చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్‌ అయ్యారు నాగబాబు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటించటం కాదని.. పర్యాటక శాఖను డెవలప్‌ చేయటమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏపీ పర్యాటక శాఖ18వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. పాలన ఏం మాట్లాడినా స్పందించలేదని దానికి ఒకటే ఒక కారణమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని నాగబాబు సూచించారు. పవన్‌ కల్యాణ్ ను విమర్శించే క్రమంలో మంత్రి రోజా మెగా బ్రదర్స్‌ ను ఉద్దేశించి సీరియస్‌ కామెంట్స్‌ చేసారు. దీనిపైన మోగా బ్రదర్స్‌ నాగబాబు ఒక వీడియో పోస్టు చేసారు. అందులో ఏపీలో టూరిజం శాఖ మంత్రి రోజాకు కొన్ని సూచనలు చేశారు. దేశంలో పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉందని కేరళ, అస్సాం, గుజరాత్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించారు. ఇక ఏపీ తరువాత స్థానాల్లో చత్తీస్‌ ఘడ్‌, జార్ఖండ్‌ ఉన్నాయని తెలిపారు. ఏపీలో పర్యాటక శాఖ పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి వేల మంది జీవిస్తున్నారని వివరించారు. ఇక.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి జీవితాలు మట్టొ కొట్టుకు పోయాయయని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.