NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

విజయవాడలో జయహో బీసీ మహాసభ..
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన కేబినెట్‌లో బీసీలకు భారీగా అవకాశాలు కల్పించారు.. కిందిస్థాయిలో కూడా బీసీలకు పెద్దపీఠవేశారు.. ఇక, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాల ప్రజలను ఏం చేశామని చెప్పేందుకు సిద్ధం అవుతోంది వైసీపీ.. దీనికోసం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియం వేదికగా నేడు జయహో బీసీ మహాసభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైసీపీ నిర్వ హించిన బీసీ గర్జనలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌.. తన మూడున్న రేళ్ల పాలనలో చిత్తశుద్ధితో అమలుచేసి చూపిస్తున్నా రు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాలకు అధిక ప్రయోజనం చేకూర్చాన మంత్రలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట.. ఇక, ‘జయహో బీసీ’ మహాసభ వేదికగా తాము బీసీల కోసం తెచ్చిన పథకాలు, వాళ్లకు కల్పించిన ప్రాధాన్యత అన్ని చెప్పుకురానున్నారు.. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా ఇవాళ ఉదయం 10 గంటలకు జయహో బీసీ మహాసభ ప్రారంభంకానుంది.. ఈ మహాసభలో వైఎస్సా ర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు.

జగిత్యాలకు కేసీఆర్
సీఎం కేసీఆర్‌ జగిత్యాల జిల్లాలో నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకుంటారు. 12 గంటల 30 నిమిషాలకు జగిత్యాల జిల్లాలో సమీకృత అధికారుల కార్యాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ కు వచ్చి… 12 గంటల 40 నిమిషాలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. ఒంటి గంటకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాలకు శంకుస్థాపన.. 1.15 నిమిషాలకు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం చేస్తారు సీఎం కేసీఆర్‌. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత అక్కడే లంచ్ ఏర్పాటు ఉంటుంది. 3 గంటల 10 నిమిషాలకు రోడ్ వే ద్వారా ప్రత్యేక బస్సులో జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు అవుతారు సీఎం కేసీఆర్‌. 4 గంటల 15 నిమిషాలకు జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం కేసీఆర్‌.

ముంచుకొస్తున్న తుఫాన్‌..
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తీరం వైపు దూసుకొస్తుంది.. దక్షిణ అండమాన్‌లో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి నిన్న ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారిపోయింది.. ఇవాళ సాయంత్రానికి తుఫాన్‌గా మారుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.. పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి రేపు ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో తీరం దిశగా రాబోతోంది.. ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగానే పయనిస్తూ ఈనెల 9వ తేదీ రాత్రి లేదా 10న తెల్లవారుజామున ఉత్తర తమిళనాడులో చెన్నైకు దక్షిణాన తీరం దాటుతుందని ఐఎండీ చెబుతోంది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవబోతున్నాయి.. దీంతో, ప్రభుత్వ యంత్రాంగం తుఫాన్‌నుంచి ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. రేపటి నుంచి దక్షిణ కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం అప్రమత్తం చేసింది.. తుఫాన్‌ తీరం దిశగా వచ్చే క్రమంలో ఈ నెల 9వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాలు, ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు.. ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.. ఇక, 10వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీనుంచి అతిభారీ, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది..

ఈ మ్యాచ్‌లోనైనా గెలుస్తారా?
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్‌ నేడు ఢాకా వేదికగా జరగనుంది. తొలి వన్డేలో ఒక వికెట్‌ తేడాతో గెలిపొందిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని భారత్ కోరుకుంటోంది. ఈ కీలక మ్యాచ్‌ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైతే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్‌ సిరీస్‌ను చేజార్చుకోనుంది. ఈ కీలక పోరులో సత్తా చాటాలని రోహిత్ సేన కోరుకుంటోంది. భారత్‌ను ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాటింగ్ వైఫల్యాలు వెంటాడుతున్నాయి. స్పిన్నర్లను ఆడటంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా బంతితో రాణించి గట్టెక్కేలా కనిపించింది. కానీ గెలుపు ముంగిట బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఒక్క వికెట్‌ తీయలేక భారత్ పరాజయాన్ని చవిచూసింది. మెహదీ హసన్‌, ముస్తాఫిజుర్‌ చివరి వికెట్‌కు ఏకంగా 51 పరుగులు జోడించి బంగ్లాను గెలిపించారు. ఆ ఒక్క వికెట్‌ తీయలేకపోవడంలో బౌలర్ల వైఫల్యం నిజమే కానీ.. స్టార్లతో నిండిన బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బాధ్యత తీసుకోవాల్సివుంది. చివరిగా ధోనీ సారథ్యంలో 2015లో బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను 1-2తో భారత్‌ కోల్పోయింది. ఆ సిరీస్‌లో మూడో వన్డేలో మాత్రమే భారత్ నెగ్గింది. ఆ చరిత్ర పునరావృతం కాకుండా టీమిండియా జాగ్రత్తపడుతోంది.

అనిరుధ్ కోసం పవన్ ఫాన్స్ యుద్ధం….
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. డీవీవీ దానయ్య ప్రొడక్షన్స్ లో రూపొందనున్న ఈ మూవీలో అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే పవన్ ఫాన్స్ లో జోష్ తెచ్చింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎలక్షన్స్ అయ్యే వరకూ పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్ అవ్వడం కష్టమే. ఈ విషయం పవన్ ఫాన్స్ కి కూడా తెలిసే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా #DVVWeWantAnirudhForOG అనే హాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమాకి అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని మెగా అభిమానులు ప్రొడక్షన్ హౌజ్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అనిరుధ్ ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తే అది హిట్ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. హీరోకి ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టడంలో అనిరుధ్ దిట్ట. ‘పేట’, ‘కత్తి’, ‘మారీ’, ‘విక్రమ్’ లాంటి సినిమాల్లో అనిరుధ్ అద్భుతాలు చేశాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో అనిరుధ్, స్టార్డమ్ ని పీక్ స్టేజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాకి, అనిరుధ్ ని తీసుకోని రావాలని అభిమానులు అడగడం #PSPK29కి కలిసొచ్చే విషయమే.

స్విస్‌ జట్టు చిత్తు
ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ గోల్స్‌తో స్విస్‌ జట్టును చిత్తు చేసింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో పోర్చుగల్ 6-1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించగా, గొంకలో రామోస్ హ్యాట్రిక్ సాధించగా, పెపే, రాఫెల్ గెరిరో, రాఫెల్ లియో ఒక్కో గోల్ చేశారు. 21 ఏళ్ల పోర్చుగల్ ఆటగాడు గొంకలో రామోస్ ఏకంగా మూడు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 58వ నిమిషం వద్ద స్విస్ ఆటగాడు మాన్యువల్ అకంజీ గోల్ చేయడంతో స్విట్జర్లాండ్ ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్‌లో స్విస్ తరఫున మాన్యుయెల్ అకంజీ ఏకైక స్కోరర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ మొరాకోతో తలపడనుంది. పోర్చుగల్ ఆటగాళ్లు మరింతగా చెలరేగి దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థి జట్టును ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోర్చుగల్ కంటే ఎక్కువ పాస్‌లు అందుకున్నప్పటికీ గోల్స్ చేయడంలో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ ఓటమితో స్విట్జర్లాండ్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. పోర్చుగల్‌ తన తదుపరి మ్యాచ్‌ మాజీ ఛాంపియన్‌ స్పెయిన్‌ను అనూహ్యంగా ఓడించిన మొరాకోతో తలపడనుంది.

కింగ్‌ చార్లెస్‌పై కోడిగుడ్లతో దాడి..

లండన్‌లోని యార్క్ నగరాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై దుండ‌గులు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కింగ్‌ చార్లెస్ నడుస్తున్న సమయంలో గుడ్లు విసిరినట్లు ఆరోపణలు రావడంతో.. 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు యూకే పోలీసులు తెలిపారు. ఉత్తర ఇంగ్లండ్‌లోని యార్క్‌ను సందర్శించినప్పుడు చక్రవర్తి తన దిశలో గుడ్లు కొట్టడాన్ని తృటిలో తప్పించుకున్న ఒక నెలలోపే లండన్‌కు ఉత్తరాన ఉన్న లుటన్‌లో దుండగుడిని అరెస్టు చేశారు. కింగ్ చార్లెస్ కమ్యూనిటీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలను కలవడానికి, కొత్త సిక్కు ఆలయాన్ని తెరవడానికి, కొత్త ప్రజా రవాణా వ్యవస్థను సందర్శించడానికి లూటన్‌లో ఉన్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని లూటన్ టౌన్ హాల్ వెలుపల అదుపులోకి తీసుకుని విచారణ కోసం తీసుకెళ్లినట్లు బెడ్‌ఫోర్డ్‌షైర్ పోలీసులు తెలిపారు. నవంబర్ 9న యార్క్‌లో గుడ్లు విసురుతున్నప్పుడు ఆ వ్యక్తి “ఈ దేశం బానిసల రక్తంతో నిర్మించబడింది.. నా రాజు కాదు ” అని గ‌ట్టిగా అరిచాడు. అనంతరం కింగ్ చార్లెస్, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై గుడ్లు విసిరాడు. అయితే అక్కడ ఉన్న ప్రజ‌లు మాత్రం “గాడ్ సేవ్ ది కింగ్” అని నినాదాలు చేస్తూనే ఉన్నారు. అనంతరం గుడ్లు పడిన ప్రాంతం నుంచే కింగ్ చార్లెస్ నడుచుకుంటూ వెళ్లారు. నవంబర్‌ 9న చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ II విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చార్లెస్, కెమిల్లా యార్క్ నగరానికి చేరుకున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. అనంతరం నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు.