NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఈఏపీ సెట్‌లో మళ్లీ ఇంటర్‌ వెయిటేజీ..
కరోనా మహమ్మారి ఎంట్రీ తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.. మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. విద్య ఆన్‌లైన్‌కే పరిమితమైంది.. పరీక్షలు కూడా లేకుండా పై తరగతులకు ప్రమోట్‌ చేశారు.. ఇక, గతంలో ఉన్న మార్కుల వెయిటేజీ సైతం ఎత్తివేసింది ప్రభుత్వం.. కానీ, ఇప్పుడు సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మళ్లీ వెయిటేజీ తప్పనిసరి చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, అగ్రి­కల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌–2023లో ఇంటర్మీడియెట్‌ మార్కు­లకు వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు.. ఇంటర్‌ మార్కులకు 25 శాతం మేర వెయిటేజీ ఇచ్చి ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ర్యాంకులను కేటాయించనున్నారు.. అయితే, కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపివేసిన ఇంటర్‌ మార్కుల వెయిటేజీ.. మళ్లీ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. విద్యార్థులు కొత్త టెన్షన్‌ మొదలైంది.. అంటే, ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేయడానికి ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.. సెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు స్వీకరిస్తారు.. లేట్‌ ఫీతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.. ఇక, మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ విభాగం, మే 22, 23 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలను నిర్వహించనున్నారు.. కాగా, కోవిడ్‌కు ముందు వరకు ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉండేది. ఇందులో భాగంగా ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు. ఈ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. అయితే, కరోనా సమయంలో పరీక్షలు జరగని కారణంగా ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సర్కార్.. ఈఏపీసెట్‌లోని మార్కులనే పూర్తిగా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయిస్తూ వచ్చింది.. కానీ, ప్రస్తుతం ఇంటర్‌ తరగతులు సజావుగా సాగుతుండడంతో ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల మేరకు ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానాన్ని పునరుద్ధరించారు..

పోలవరం సత్వరమే పూర్తి చేయండి.. కేంద్రమే చొరవ తీసుకోవాలి..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.. నిర్వాసితులకు పునరావాసం అమలుపైనా దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిశారు.. ఏపీకి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని… రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక ప్రయోజనాలు అందిస్తుందని, ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బ తింటోందని షెకావత్ దృష్టికి తీసుకెళ్లాను పవన్‌ కల్యాణ్‌.. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో 3 శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖ పారిశ్రామిక జోన్ కు అవసరమైన నీటినీ, విశాఖ మెట్రో నగరానికి తాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లకపోవడంపై వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని షెకావత్ కి తెలిపారు. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్. అండ్ ఆర్. విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన శ్రద్ధ చూపడం లేదన్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు, మిగిలిన 24 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ మూలంగా విశాఖపట్నం, గోదావరి జిల్లాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలతోపాటు గోదావరి డెల్టాలోనే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా డెల్టాలోని రైతాంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు అందించడంతోపాటు ఈ నిర్మాణంలో విషయంలో కేంద్ర ప్రభుత్వ తక్షణ జోక్యం అవసరమని సూచించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

దెందులూరులో హైవేపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బోల్తా
ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలో జాతీయరహదారిపై ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది.. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి విజయనగరం వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దెందులూరు సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు.. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 25 మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తుండగా.. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.. మరికొందరికి స్వల్పగాయాలు అయ్యాయి.. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను అంబులెన్స్‌ సాయంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.. ఈ ప్రమాదంతో హైవేపై ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడగా.. దెందులూరు ఎస్ఐ వీర్రాజు నేతృత్వంలో ట్రాఫిక్ నియంత్రించడానికి బస్సును క్రెన్ ల సహాయంతో పక్కకు చేర్చారు.. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే, బస్సులో ఉన్న ప్రయాణికుల వివరాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. కారణం?
హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో 6 E 897 విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. వారనాసి నుండి బెంగుళూరు వెల్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారిమల్లించారు ఫైలెట్‌. బెంగుళూరు బయలుదేరిన విమానం హైదరాబాద్‌ లో ల్యాండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు గుండె ఆగినంత పని అయ్యింది. ప్రమాదంలో వున్నమా? అసలు సేఫ్‌ గా కిందికి దిగుతామా? అనే అనుమాణాలు, భయంతో కాసేపు ఏంజరుగుతుందో అన్న విధంగా ఉండిపోయారు విమానంలో ఉన్న ప్రయాణికులు. అయితే వారనాసి నుంచి బయలు దేరిన విమానంలో అప్పటి వరకు ఏలోపం లేకుండా బాగానే వున్నా.. కొద్ది గంటలకు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు సమీపంలో వున్నా మని భావించిన పైలెట్‌ ప్రయాణికులుకు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సేఫ్ గానే విమానం ల్యాండింగ్‌ కావడంతో విమానంలో వున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసినట్లు తెలుపడంతో.. ప్రయాణికులు, సిబ్బంది పైలెట్ ను ప్రసంసల జల్లు కురిపించారు. కాగా.. శంషాబాద్‌ లో విమానానికి మరమత్తులు చేయడంతో మళ్లీ అక్కడనుంచి బెంగుళూరు బయలుదేరింది.

సీబీఎస్ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు..
సీబీఎస్ఈ, ఉత్తర ప్రదేశ్ బోర్డులు మొఘలుల చరిత్రను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మొఘలులు చరిత్రకు సంబంధించిన పలు పాఠ్యాంశాలు సిలబస్ లో భాగం కావు. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి అత్యున్నత సలహా సంస్థ ఎన్‌సిఇఆర్‌టి చరిత్రలో పలు పాఠ్యాంశాలను సవరించింది. సీబీఎస్ఈ 12వ తరగతికి సంబంధించి మధ్యయుగపు పాఠ్యపుస్తకాల నుంచి ‘కింగ్స్ అండ్ క్రానికల్స్’ అండ్ ‘ ది మొఘల్ కోర్ట్స్’ అధ్యాయాలను తొలగించారు. విద్యార్థులకు ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను ఉపయోగించి బోధన చేస్తామని ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చెప్పారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్ ఆధారంగా పాఠాలు చెబుతామని యూపీ విద్యాధికారులు ప్రకటించారు. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో కూడా సిలబస్ మారింది ‘రైజ్ ఆఫ్ పాపులర్ మూవ్‌మెంట్స్’, ఇండియాలో సోషలిస్ట్, కమ్యూనిస్టుల పార్టీ పెరుగుదల, స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ పాలనకు సంబంధించిన చరిత్రను సవరించారు. 10,11వ తరగతి పాఠ్యపుస్తకాల్లో కూడా మార్పులు చేశారు. 10వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో ‘ప్రజాస్వామ్యం మరియు వైవిధ్యం’, ‘ప్రజాపోరాటాలు మరియు ఉద్యమాలు’’ అధ్యాయాలు, 11వ తరగతి చరిత్ర పుస్తకాల్లో నుంచి ‘సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్’, ‘సంస్కృతుల మధ్య ఘర్షణ’ అనే అధ్యాయాలను తొలగించబడ్డాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) దాని సిలబస్ ను మార్చాలని 2022లో భావించింది. దీనికి అనుగుణంగానే తాజాగా మార్పులు చోటు చేసుకున్నాయి.

అరుణాచల్‌కు కొత్త పేర్లు పెట్టిన చైనా.. భారత్ ఆగ్రహం..
జిత్తులమారి చైనా భారత్ తో స్నేహం అంటూనే తాను చేయాల్సిన పనులు చేస్తోంది. ఓ వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సృష్టిస్తూ భారత్ ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత భూభాగం అయిన అరుణాచల్ ప్రదేశ్ తమదిగా చెప్పుకుంటోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టింది. 11 ప్రాంతాలకు మూడో విడతగా చైనా పెట్టింది. చైనా, టిబెటన్, పిన్ యిన్ భాషల్లో పేర్లను విడుదల చేసింది. చైనా పౌర వ్యవహారాల శాఖ మంత్రి ఆదివారం ఈ పేర్లను విడుదల చేశారు. చైనా కేబినెట్ నిర్ణయం మేరకు ‘జాన్ నన్’ పేరుతో ఈ జాబితాను చైనా విడుదల చేసింది. కొత్తగా పేర్లు విడుదల చేసిన వాటిలో 2 భూభాగాలు, 5 పర్వతాలు, 2 నివాస ప్రాంతాలు, 2 నదులు ఉన్నట్లు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ పై తమకు హక్కు ఉందని చెపుకోవడానికి చైనా ఇలా చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా ‘దక్షిణ టిబెట్’గా పేర్కొంటోంది. గతంలో ఇలాగే రెండు సార్లు అరుణాల్ భూభాగాలకు పేర్లు పెట్టింది చైనా. 2017లో తొలిసారిగా 6 ప్రాంతాలకు, 2021లో రెండోసారి 15 ప్రాంతాలకు ఇలా పేర్లను విడుదల చేసింది. చైనా చర్య పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అరుణాచల్ ఎల్లప్పుడు భారత భూభాగమే అని, భారత్ లో అంతర్భాగంగా ఉంటుందని, పేర్లను పెట్టడం ద్వారా వాస్తవాన్ని మార్చలేని భారత్ పేర్కొంది.

నో బాల్ ఇచ్చాడని అంపైర్ నే చంపేశారు..
రెండు గ్రామాల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఘర్షణ జరిగింది. నో బాల్ సిగ్నల్ ఇచ్చినందుకు అంపైర్ ను కొట్టి కత్తితో పొడిచి చంపారు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్హిసలంద గ్రామంలో శనివారం శంకర్ పూర్, బెర్హంపూర్ కు సందర్భంగా అండర్ -18 క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మహిలాంద ప్రాంతానికి చెందిన 22 సంవత్సరాల లక్కీ రౌడ్.. అంపైర్ గా వ్యవహారించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా ఒకరు బౌలింగ్ చేయగా అంపైర్ గా ఉన్న లక్కీ రౌత్ నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇది గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అంపైర్ లక్కీ రౌడ్ ప్లయర్ జగ్ రౌత్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్ రౌత్ తన సోదరుడు మునా రౌత్ ను పిలిపించాడు. అక్కడకు వచ్చిన అతడు ఆగ్రహంతో లక్కీ రౌత్ ను కొట్టాడు. నో బాల్ సిగ్నల్ ఇచ్చిన ఆ అంపైర్ ను కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాగా.. తీవ్రంగా గాయపడిన లక్కీ రౌత్ ను ఎస్సీబీ వైద్య కాలేజీ హాస్పటల్ కు తరలించారు. అయితే ఆ యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్కీ రౌత్ చనిపోయిన వార్త తెలియడంతో ఆ గ్రామంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులను గ్రామస్థులు చుట్టుముట్టి నిరసన తెలిపారు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

క్యాచీ ఫ్యూజన్ మిక్స్ లో అదిరిపోయే సాంగ్ ఇచ్చారు…
నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ దర్శకత్వంలో, చిన్న రౌడీ ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘బేబీ’. వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మ్యూజిక్ బేబీ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తోంది. ఇప్పటికే బేబీ సినిమా నుంచి ‘ఓ రెండు మేఘాలిలా’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసి, బేబీ సినిమాకి హ్యూజ్ రీచ్ ని తెచ్చింది. లేటెస్ట్ గా బేబీ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘దేవరాజా’ అంటూ సాగే ఈ సాంగ్ తో ఆర్య ధాయల్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్ని స్టేజ్ షో పెర్ఫార్మెన్స్ లు ఇచ్చిన కేరళ సింగర్ ఆర్య ఆర్య ధాయల్ వాయిస్ ‘దేవరాజా’ సాంగ్ ని ప్రాణం పోసిందనే చెప్పాలి. ఫ్యూషన్ మిక్స్ తో క్యాచీ ట్యూన్ ని విజయ్ కంపోజ్ చేస్తే, కళ్యాణ్ రాసిన లిరిక్స్ దేవరాజా సాంగ్ ని ఒక మెట్టు ఎక్కిస్తే ఆర్య వాయిస్ మరో మెట్టు ఎక్కించింది. ముఖ్యంగా సాంగ్ థర్డ్ మినిట్ ఎండ్ అయ్యి ఫోర్త్ మినిట్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి పీక్స్ చూపించారు. ఆ సౌండ్ రెండరింగ్ వింటే ఎవరైనా ట్రాన్స్ లోకి వెళ్ళిపోవాల్సిందే. ఒక విలేజ్ అమ్మాయి కాలేజ్ కోసం సిటీకి వస్తే, తన మెంటల్ స్టేటస్ ఏంటి అనేది దేవరాజా సాంగ్ లో చూపించారు. సాంగ్ మొత్తం వైష్ణవీ చైతన్య చుట్టే తిరిగింది, తను ఓవరాల్ గా రెండు లుక్స్ లో కనిపించింది. విలేజ్ లుక్ లో సాంగ్ మొత్తం కనిపించి, ఎండ్ లో మోడరన్ లుక్ లో వైష్ణవీ చైతన్య సిటీ లుక్ లోకి వచ్చేసింది. హ్యూజ్ వేరియేషన్స్ చూపించే అవకాశం దొరికింది కాబట్టి బేబీ మూవీ వైష్ణవీ చైతన్యకి హీరోయిన్ గా సాలిడ్ డెబ్యు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా బేబీ సినిమా నుంచి వస్తున్న ప్రతి పాట ఒక క్లాసిక్ లా నిలుస్తుంది. సినిమా కూడా ఇదే రేంజులో ఉంటే కాస్ట్ అండ్ క్రూకి సాలిడ్ హిట్ దొరికినట్లే.