NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు.. టెన్షన్‌ పెడుతోన్న ఆ నిబంధన
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. ఈ ఏడాది 6,64,152 మంది విద్యా­ర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్‌ అభ్యర్థుల సంఖ్య 6,09,070గా ఉంది.. మిగతావారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప.. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.

నేటి నుంచి ఒంటిపూట బడులు.. ఆ స్కూళ్లకు మాత్రం సెలవులు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.. ఓవైపు ఇవాళ్టి నుంచే టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే కాగా.. ఒంటిపూట బడులు కూడా ఈ రోజు నుంచి ఆరంభం అవుతున్నాయి.. 1వ తరగతి నుండి 10వ తరగతులకు ఉదయం 7.45 నుండి 12.30 వరకు ఒంటిపూట పాఠశాలలను ప్రకటించింది విద్యాశాఖ.. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో ఇవాళ్టి నుంచి అంటే 03-4-2023 నుండి చివరి పని దినం వరకు అంటే 30-4-2023 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.. ఇదే సమయంలో .. ప్రత్యేకంగా ఎస్ఎస్‌సీ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో, పరీక్ష రోజుల్లో (మొత్తం ఆరు రోజులు) ఎలాంటి తరగతులు నిర్వహించారు.. ఈ పాఠశాలలు 03.04.23 నుండి 30.04.23 వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో ఆరు రోజుల పాటు పరిహార తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.. పరిహార తరగతులు కూడా హాఫ్ డే షెడ్యూల్‌ను అనుసరించాల్సి ఉంటుంది.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే కాగా.. ఆ పాఠశాలల్లో పరీక్షల రోజుల్లో ఎలాంటి క్లాస్‌లు నిర్వహించరు. మరోవైపు.. ఏప్రిల్ నెలలో 2వ శనివారాన్ని పని చేసేదిగా పరిగణించాలి. అన్ని పాఠశాలల్లో తగినంత తాగునీరు అందించాలని.. బహిరంగ ప్రదేశాల్లో/ చెట్ల కింద తరగతులు నిర్వహించరాని విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది.

ఏపీలో వర్షాలు.. అరుదైన రికార్డు నమోదు..!
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఈ సారి వర్షాలు అరుదైన రికార్డు నమోదు చేశాయి.. గత 10 సంవత్సరాలలో మార్చిలో కురిసిన వర్షాల్లో ఈసారి మార్చి కూడా ఒకటిగా నిలిచింది.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్షపాతం సాధారణం కంటే దాదాపు 300 శాతం ఎక్కువగా నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అందులో బాపట్ల జిల్లాలో అత్యధికంగా 870 శాతం వర్షపాతం నమోదైంది. తిరుపతి మరియు విశాఖపట్నం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సాధారణంగా ఏపీలో మార్చిలో 10-20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది.. కానీ, ఈసారి చాలా ఎక్కువగా అంటే 60-70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. ఇది చాలా అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.. ఇక, ఇదే సమయంలో.. కోనసీమ జిల్లాలో 733 శాతం, విశాఖపట్నంలో 623 శాతం, శ్రీకాకుళంలో 429 శాతం, అనకాపల్లిలో 439 శాతం, కాకినాడలో 523 శాతం, కృష్ణా జిల్లాలో 564 శాతం, నెల్లూరులో 553 శాతం, కడపలో 646 శాతం, తిరుపతిలో 671 శాతం, అన్నమయ్య జిల్లాలో 386 శాతం, ఏలూరులో 353 శాతం వర్షపాతం మార్చి నెలలో నమోదు అయ్యింది.. అత్యల్పంగా అంటే ప్రకాశం జిల్లాలో 6 శాతం మాత్రమే నమోదైంది.. కర్నూలులో 16 శాతం, అనంతపురం 35 శాతం, శ్రీ సత్యసాయి జిల్లా 110 శాతం, నంద్యాల 123 శాతంలో వరుసగా చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా, మార్చిలో కురిసిన అకాల వర్షాలతో భారీ పంట నష్టం జరిగిన విషయం విదితమే..

నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు
నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఎక్సామ్స్ రాయనున్నాయి. వీరిలో రెగ్యూలర్ స్టూడెంట్స్ 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి ఫెయిల్ అయిన వారు కాగా.. ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది అంటే 3,78,794 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కాగా.. 98,726 మంది తెలుగు మీడియం, 7,851 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 11 పేపర్లు ఉండగా.. ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానిక కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సహా పరీక్ష హాల్లో ఎవరూ వాడానికి కానీ.. తీసుకెళ్లేందుకు కానీ అనుమతి లేదు. పేపర్ లీగ్ చేసే అవకాశం ఉన్న ఎలాంటి పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అంతేకాదు, ఆయా పాఠశాలల కరస్పాండెట్లను కూడా అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది.

కరోనా టీకా వికటించి ఆస్పత్రుల్లో వారిలో తెలంగాణ సెకండ్..
కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల వల్ల తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చ్ 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత జరిగిన దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెల్లడించింది. నివేదిక ప్రకారం టీకా తర్వాత దుష్ప్రభావాల కారణంగా దేశంలో 92,479 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అందులో తెలంగాణలోనే 10,370 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఈ తరహా కేసుల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా.. మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 10,513 ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ లో 10,127 ఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే పదివేలకు పైగా ఇటువంటి ఘటనలు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 8,212, పశ్చిమబెంగాల్ లో 8,130, కర్ణాటకలో 6,628, మంది ఆస్పత్రుల పాలయ్యారు. కాగా.. టీకా అనంతరం దేశంలో మొత్తం 1,156 మంది మరణించారు. అందులో అత్యధికంగా కేరళలో 244 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 102, ఉత్తరప్రదేశ్ లో 86 మంది మరణించారు. మధ్యప్రదేశ్ లో 85, కర్ణాటకలో 75, పశ్చిమబెంగాల్ లో 70 మంది, తెలంగాణలో 37 మంది మరణించారు. కాగా ఛత్తీస్ గఢ్ లో ఒకరే మరణించారు.

స్టేషన్‌లో చెప్పు జారిపోయిందని ప్రయాణికుడి ట్వీట్.. రికవరీ చేసిచ్చిన రైల్వే అధికారులు
రైలు ఎక్కేటప్పుడు చెప్పులు జారిపోవడం కామన్ గా ట్రైన్ ప్రయాణికులు ప్రతీ ఒక్కరికి ఇది అనుభవమని ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణం అంతా చిరాకుతో గడవడం.. గమ్యస్థానానిక చేరిన తర్వాత ముందుగా ఏ చెప్పుల షాపు కనబడితే అందులోకి దూరి ఏదో ఒక చెప్పులు కొనుక్కుని ఆ తర్వాత ముందుకు సాగుతుంటారు. కానీ కాజీపేట రైల్వే పోలీసులు మాత్రం అలాంటి ఇబ్బంది అవసరం లేదంటున్నారు. రైలు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయిన ఓ ప్రయాణికుడి చెప్పును తిరిగి అందించి.. తమ పనితీరును చాటుకున్నారు. ఈ ఘటన కాజీపేటలో జరిగింది. వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజంగా జరిగింది. బంగారం పోతేనే రికవరీ చేయడం కష్టమైన ఈ రోజుల్లో.. చెప్పును రికవరీ చేశారని తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. పోలీసుల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. శనివారం జనగామ జిల్లా చిలుకూరు పల్లగుట్టకు చెందిన రాజేశ్ అనే యువకుడు సికింద్రాబాద్ వెళ్లాలనుకున్నాడు. దీనికోసం స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే రైలు కదులుతుండడంతో.. కదులుతున్ రైలు ఎక్కబోయాడు.. రైలు అయితే ఎక్కగలిగాడు.. కానీ అతడి కాలికున్న చెప్పు ఒకటి జారి పట్టాల మధ్యలో పడిపోయింది. అది అతడిని బాధించింది. ఎంతో ఇష్టపడి కొనుకున్న చెప్పులు అలా జారిపోవడంతో.. రైల్వే అధికారులకు నాకు చాలా ఇష్టమైన చెప్పులు అవి కొత్తవి జారిపోయాయి..అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు సికింద్రాబాద్ డివిజనల్ భద్రతాధికారి దేబాస్మిత్ స్పందించారు. వెంటనే చెప్పును రికవరీ చేయాల్సిందిగా కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు
ఏంటి హెడ్డింగ్ చూడగానే మద్యం ప్రియులంతా పెద్ద షాక్ గురైయ్యే ఉంటారు. ఇది నిజం కానీ మద్యం ధర పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదు.. ఉత్తరప్రదేశ్ లో.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎక్సైజ్ పాలసీలో ఏప్రిల్ 1 నుంచి బీరుతో సహా లిక్కర్ ధర 10 శాతం పెరిగింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యం, బీర్ల ధరలు పెరిగాయి. బీరు ధర రూ.5-7 పెరిగింది. అదే సమయంలో దేశీ మద్యంపై రూ.5, ఫారిన్ మద్యం బ్రాండ్లపై రూ.10 చొప్పున పెంచారు. సీఎం యోగి ప్రభుత్వం రూపొందించిన కొత్త ఎక్సైజ్ పాలసీకి ఈ ఏడాది జనవరిలో కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ విధానంలో ఎక్సైజ్ శాఖ ఆదాయ లక్ష్యాన్ని పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ విధానాన్ని అనుసరించి ప్రభుత్వం ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు రూ.45 వేల కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి మద్యం ప్రభుత్వ కాంట్రాక్టును అమలు చేస్తున్న దుకాణదారులందరూ 10 శాతం అధికంగా (యూపీ మద్యం ధర తాజా) విక్రయించాలని నిబంధన పెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు నోయిడా, ఘజియాబాద్, లక్నో మునిసిపల్ కార్పొరేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న క్లబ్‌లు, హోటళ్లలో లైసెన్స్ ఫీజును భారీగా పెంచారు.

రైలులో తోటి ప్యాసింజర్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వ్యక్తి.. ముగ్గురి మృతి
కేరళలోని కోజికోడ్‌లో ఆదివారం అర్థరాత్రి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ, కదులుతున్న రైలులో ఒక వ్యక్తి ప్రయాణికులపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఇందులో మహిళలతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. అలప్పుజా నుండి కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లోని డి1 కోచ్‌లో ఈ ఘటన జరిగింది. రైలు ఎక్కే విషయంలో నిందితులు గొడవ పడ్డారని చెబుతున్నారు. అతనికి సీటు రాకపోవడంతో బోగీలో ఉన్న మహిళతో గొడవ పడి మరికొందరు ప్రయాణికులు మహిళకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆగ్రహించిన నిందితులు మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. డీ1 కోచ్‌లో ఉన్న లతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రచొక్కా ధరించిన ఓ వ్యక్తి ముందుగా పెట్రోల్‌ చల్లుకుని అగ్గిపెట్టె వెలిగించాడు. దీంతో కోచ్‌లో మంటలు చెలరేగి ఎనిమిది మంది గాయపడ్డారు.అందరూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. గాయపడిన వారిలో కొందరిని కన్నూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రకాష్, రూబీ మరియు జ్యోతీంద్రనాథ్‌లుగా గుర్తించారు. గాయపడిన మిగతా వారి పేర్లు ఇంకా తెలియరాలేదు. పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గేమ్ చేంజర్ 2024 సమ్మర్ కి షిఫ్ట్ అయ్యిందా? కారణం అతనేనా?
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మరోసారి పాన్ ఇండియా రేంజులో చరణ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి స్టార్ కాస్ట్, భారి బడ్జట్, భారి అంచనాలు… ఇలా ప్రతి విషయంలో హ్యూజ్ గా కనిపిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి ఇటివలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్, సినిమాపై అంచనాలని పెంచింది. ఈ మూవీ 2024 సంక్రాంతి రిలీజ్ అవ్వనుందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలు చూస్తుంటే ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్ 2024 సమ్మర్ కి షిఫ్ట్ అయినట్లే కనిపిస్తోంది. ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్ వాయిదా వెనకున్న అతిపెద్ద కారణం ‘ఇండియన్ 2’ మాత్రమే. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమాని తెరకెక్కిస్తున్న శంకర్, ఈ మూవీని నవంబర్ నెలలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట. జూన్ నెల నాటికి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేలా శంకర్ ప్లాన్ చేసుకున్నాడట. నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టిన రోజు ఉంది, నవంబర్ 12న దీపావళి పండగ ఉంది. ఈ రెండు అకేషన్స్ ని బాలన్స్ చేస్తూ ఇండియన్ 2 సినిమాని నవంబర్ 10న రిలీజ్ చెయ్యడానికి శంకర్ రెడీ అవుతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇండియన్ 2 రిలీజ్ అనేది నిజమే అయితే శంకర్, ‘గేమ్ చేంజర్’ని పక్కా వాయిదా వేస్తాడని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే శంకర్ తన సినిమా ప్రమోషన్స్ కోసం భారి ప్లానింగ్ వేసుకుంటాడు, రాజమౌళిలా అన్ని ప్రాంతాలకి తిరుగుతాడు. ఇలాంటి సమయంలో ‘గేమ్ చేంజర్’ సినిమాపై శంకర్ దృష్టి పెట్టే అవకాశం ఉండదు, పైగా నవంబర్ నెలలో ఇండియన్ 2 రిలీజ్ మిస్ అయితే 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూనే ఇండియన్ 2 రిలీజ్ కావాల్సి ఉంది. అలాంటి సమయంలో తన సినిమాపై తనే పోటీకి దిగడు కాబట్టి శంకర్, ‘గేమ్ చేంజర్’ సినిమాని సమ్మర్ కి పుష్ చేసే అవకాశం ఉంది. మరి ఈ మేకింగ్ మాస్టర్ ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి.