NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు…
అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు లభించింది.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు.. అన్నవరం సత్యదేవుని ఆలయం 1891లో ప్రతిష్టించబడింది.. అప్పటినుంచి భక్తులకు గోధుమ రవ్వ ప్రసాదాన్ని అందిస్తున్నారు.. అన్నవరం ప్రసాదం అంటే భక్తులకు ఎంత ప్రీతి ప్రాతమో చెప్పనవసరం లేదు.. భారత ఆహార ప్రమాణాల సంస్థ తాజాగా ఈ ప్రసాదానికి గుర్తింపు ఇచ్చింది. ఏటా రెండు కోట్లకు పైగా ప్రసాదాలు విక్రయాలు జరుగుతూ ఉంటాయి.. ఒక ప్రసాదం ద్వారానే దాదాపు 40 కోట్ల ఆదాయం వస్తుంది.. కోట్లాదిమంది మనసులు దోచే అన్నవరం ప్రసాదం తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. స్థానికంగా దొరికే దినుసులతో ప్రసాదం తయారు చేయరు.. మధ్యప్రదేశ్ నుంచి మల్వరాజ్ గోధుమలను దిగుమతి చేసుకుంటారు.. వాటిని గ్రైండ్ చేయడానికి ప్రత్యేక యంత్రాలు వాడుతారు.. గతంలో ఈ ప్రసాదానికి ఐఎస్ఓ గుర్తింపు కూడా లభించింది.. సత్య దేవుడి ప్రసాదం ఇప్పటికీ విస్తరాకుల్లోనే భక్తులకు అందిస్తున్నారు.. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్లాస్టిక్ కవర్లలో కాకుండా విస్తరాకులే వినియోగిస్తున్నారు.. అత్యంత వేడి కలిగిన ఈ ప్రసాదం విస్తరాకులలో వేయగానే ఆవిరి సుగంధద్రవ్యాలతో ఆకు మధురంగా మారుతుంది.. ఈ విస్తరాకులను ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొస్తారు.. బయట ఈ ప్రసాదం తయారీ ట్రై చేసిన ఆ రుచి మాత్రం రాదు.

భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా జలాశయాలు నిండుకుండలా మారాయి.. ఏజెన్సీలో వాగులు గడ్డలు ఉప్పొంగాయి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని, వాగులు గడ్డలు దాటే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విశాఖలో కుండపోత వర్షానికి గవర కంచరపాలెం, ఆనందపురం ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలిపోవడం వల్ల వాహనాలు పలు ధ్వంసం అయ్యాయి.. అల్లూరి జిల్లా ఏజెన్సీలో అత్యధికంగా వై రామవరం 68.4 ముంచంగిపుట్టులో 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి మండలం వంచుల పంచాయితీ చామగడ్డ లో ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోయింది.. దీంతో బాహ్య ప్రపంచంతో 30 గ్రామాలు సంబంధాలు తెగిపోయాయి… ఆసుపత్రికి వెళ్లే మార్గం లేకపోవడంతో అంటు రోగాలు అధికమవుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాతో పాటు.. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈ రోజు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఆయా జిల్లా కలెక్టర్లు..

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద తుది దశకు కౌంటర్ వెయిట్ల పనులు..
ప్రకాశం బ్యారేజీపై కౌంటర్ వెయిట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.. హైదరాబాద్ నుంచి తెప్పించిన కౌంటర్ వెయిట్ లు ప్రకాశం బ్యారేజీ 67 ,69 గేట్లకు బిగిస్తున్నారు… గడిచిన వారం రోజులుగా వరదల నేపథ్యంలో, ఇసుకతో నిండిన పడవలు ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టడం, బ్యారేజీకి సంబంధించిన కౌంటర్ వెయిట్ లు దెబ్బ తినటం, వంటి అంశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.. ఒక్కొక్క కౌంటర్ వెయిట్ 17 టన్నుల బరువు ఉండే రెండు పిల్లర్‌లను వారం రోజుల్లో తయారు చేపించి ప్రకాశం బ్యారేజీకి తెప్పించారు.. నిన్న, నేడు కౌంటర్ వెయిట్ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి.. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ ల స్థానంలో కొత్త కౌంటర్ వెయిట్ లు ను బిగిస్తున్నారు నిపుణులు.. మొత్తం 35 మంది కార్మికులు మూడు షిఫ్ట్ లుగా రేయింబవుళ్లు పనిచేసి, బ్యారేజీ గేట్లకు కౌంటర్ వెయిట్ లను అనుసంధానం చేస్తున్నారు.. బరువుగా ఉన్న బోట్లు వచ్చి, ఢీకొనడంతో కౌంటర్ వెయిట్‌లు దెబ్బ తినటం జరిగిందని.. దీనికి తోడు కృష్ణ పరివాహక ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుకు జరగబోయే నష్టాన్ని గమనించిన ప్రభుత్వం..యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ వెయిట్‌లను అత్యంత వేగంగా తయారు చేపించింది.. వాటిని ప్రకాశం బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి అమర్చే పనిలో పడ్డారు నిపుణులు.. బ్యారేజీ నిర్మాణ పనుల వ్యవహారాల్లో, నిష్ణాతులైన కార్మికులను, ఇంజనీర్లను రప్పించి, వాటిని బిగిస్తున్నారు.. నేడు కౌంటర్ వెయిట్‌లు బిగించడం పూర్తి అయిన నేపథ్యంలో, రేపు నిపుణుల పర్యవేక్షణలో వాటిని పరిశీలిస్తారు… గేట్లు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, వంటి అంశాలలో కౌంటర్ వెయిట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.. అలాంటి పిల్లర్ లను సమర్థవంతంగా పరీక్ష చేసిన, తర్వాత ప్రాజెక్ట్ గేట్లకు అనుసంధానం చేస్తారు.. 67, 69 గేట్ల సామర్థ్య పరీక్షలు పూర్తయిన తర్వాత ,70 గేటు నిర్మాణ సామర్థ్యంపై కూడా పరీక్షలు జరుపనున్నారు నిపుణులు.. మొత్తంగా రేపు కూడా ప్రకాశం బ్యారేజ్ పై నిపుణుల పర్యవేక్షణలో ప్రకాశం బ్యారేజ్ గేట్ల కొద్దిగా పనులు జరగనున్నాయి.

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం..
వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఏడుగురు అధికారులతో కూడిన కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్‌కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులతో చర్చించి ప్రత్యక్ష పరిశీలనకు జిల్లాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరద నష్టాన్ని నేరుగా పరిశీలించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వెళ్లారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పరిశీలించారు. నష్టాలు భారీగా ఉన్నందున బాధితులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందేలా అన్ని వివరాలు సేకరించి నివేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విపత్తు కింద ఇచ్చే నిధులను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా బాధితులకు ఖర్చు చేసేందుకు వీలుగా కఠిన నిబంధనలను కూడా సడలించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

నేడు సచివాలయంలో వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను మరింత ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సచివాలయంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం, వరద నష్టంపై అధికారులతో సమావేశం చేయనున్నారు. రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు అందించాల్సిన సహాయం పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. భారీ వర్షాలు వరదల వల్ల సంభవించిన నష్టాలపై సోమవారం మధ్యాహ్నం లోపు కలెక్టర్స్ కు నివేదిక ఇవ్వాలని సీఎస్ కోరింది. ఇప్పటికే 25 జిల్లాలకు మూడు కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ఇక రాష్ట్రంలో 29 జిల్లాలను వరద జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించనుంది. సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్​ సిటీపై సమీక్షా సమావేశం.. ఇక రాత్రి 8 గంటలకు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ & సభ్యులకు మర్యాద పూర్వకంగా సచివాలయంలో విందులో పాల్గొననున్నారు.

నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం..
తెలంగాణ రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం పర్యటించనున్నారు. నిన్న సాయంత్రం రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం చైర్మన్​ అరవింద్​పనగారియా, ఇతర సభ్యులు చేరుకున్నారు. నేడు, రేపు రాష్ట్రంలో సంఘం చైర్మన్ అర్వింద్ పణగారియా, సభ్యులు పర్యటించనున్నారు. నేడు ఉదయం ప్రజాభవన్ లో ఆర్థిక సంఘం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ప్రజాభవన్‌లో పట్టణ స్థానికసంస్థల ప్రతినిధులు, గ్రామీణ స్థానికసంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌/సభ్యులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనుంది. ఆ తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు, సంస్థలతోపాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశం కానుంది. కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంఘాన్ని కోరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయాలని.. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలి నిర్ణయించనట్లు సమాచారం. ఇవాళ రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఈ బృందానికి విందు ఇవ్వనున్నారు. రేపు ప్రజాభవన్ లో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, చీప్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులతో ఆర్థిక సంఘం భేటి కానున్నారు.

నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సమర్పించే ఛాన్స్
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన జరిగి నేటికి తొమ్మిది నెలలు గడుస్తున్నా న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించనుంది. దేశవ్యాప్తంగా వైద్యుల ఆగ్రహావేశాలు, నిరసనల నేపథ్యంలో కోల్‌కతా కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది. కేసు దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని ఆగస్టు 20న సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈరోజు సీబీఐ స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవరులో సమర్పించవచ్చు.

సూడాన్‌లోని సెన్నార్‌లో పారామిలటరీ బలగాలు జరిపిన కాల్పుల్లో 21 మంది మృతి
ఆగ్నేయ సూడాన్‌లోని సెన్నార్‌లోని మార్కెట్‌లో షెల్లింగ్‌లో 21 మంది మరణించారు, 67 మంది గాయపడ్డారు. పారామిలటరీ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. ఏప్రిల్ 2023లో యుద్ధం ప్రారంభమైన తర్వాత స్థాపించబడిన సుడాన్ డాక్టర్స్ నెట్‌వర్క్ ఇలాంటి మరణాలను నివేదించింది. అయితే గాయపడిన వారి సంఖ్య 70 కంటే ఎక్కువ అని పేర్కొంది. పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) షెల్లింగ్‌కు పాల్పడింది. మహ్మద్ హమ్దాన్ డాగ్లో నేతృత్వంలోని ఆర్ఎస్ఎఫ్ దేశం వాస్తవ పాలకుడు అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ ఆధ్వర్యంలోని సూడాన్ దళాలతో పోరాడుతోంది. ఆర్‌ఎస్‌ఎఫ్ క్రమపద్ధతిలో పౌరులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని ప్రభుత్వం గతంలో ఆరోపించింది.

టెస్టుల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్టార్ జో రూట్!
టెస్ట్ క్రికెట్‌లో వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను అధిగమించాడు. ప్రస్తుతం జో రూట్‌ ఖాతాలో 12,402 పరుగులు ఉన్నాయి. 146వ టెస్ట్‌లో కుమార సంగక్కర రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. సంగక్కర 134 టెస్ట్‌ల్లో 12,400 పరుగులు బాదాడు. రూట్‌ మరో 83 పరుగులు చేస్తే.. టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఐదవ స్థానంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్‌ కుక్‌ ఉన్నాడు. కుక్‌ టెస్ట్‌ల్లో 12,472 పరుగులు చేశాడు. రూట్ ఫామ్ చూస్తుంటే.. త్వరలోనే కుక్‌ రికార్డు బ్రేక్ అవుతుంది. వచ్చే నెలలో అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రత్యర్థి టీమ్ మీటింగ్‌లో పంత్.. ప్లాన్స్ అన్నీ వినేశాడుగా! వీడియో వైరల్
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్‌ ట్రోఫీ 2024లో ఇండియా-బి శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఇండియా-ఎపై విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా-ఎ 53 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్‌ రాహుల్‌ (57; 121 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. ఇండియా-బి విజయంలో పేసర్లు ముకేశ్‌ (2/50), దయాళ్‌ (3/50), సైనీ (2/41) కీలక పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (61; 47 బంతుల్లో 9×4, 2×6) దూకుడుగా ఆడడంతో ఇండియా-బి పోరాడే స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆట చివరి రోజైన ఆదివారం ఆట ప్రారంభానికి ముందు ప్రత్యర్థి జట్టు ఇండియా-ఏ టీమ్ మైదానంలో హడల్ (మీటింగ్) నిర్వహించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఆటగాళ్లకు గేమ్ ప్లాన్స్ వివరించాడు. ఆ సమయంలో పంత్ ప్రత్యర్థి టీమ్ మీటింగ్‌లోనే ఉండి.. వారి ప్లాన్స్ అన్నీ వినేశాడు. హడల్ అనంతరం ఆటగాళ్లంతా ఫీల్డింగ్ చేసేందుకు వెళుతుండగా.. పంత్ డగౌట్‌కు బయల్దేరాడు.

దుల్కర్ సల్మాన్.. రానా దగ్గుబాటి.. ‘కాంత’..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు తెరకు సుపరిచితమే. గతంలో దుల్కర్ నటించిన అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయి విజయం సాధించాయి. ఆ మధ్య మహానటిలో జెమినీగణేశన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. ఆలా తెలుగులో దుల్కర్ లీడ్ రోల్ లో వచ్చిన మొదటి సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ ఉత్సహంతో మరొక సినిమాకు సైన్ చేసాడు ఈ మలయాళ హీరో. ధనుష్ ను టాలివుడ్ కు పరిచయం చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అక్టోబర్ 31న రిలీజ్ కానుంది ఈ సినిమా. తాజాగా మరొక  తెలుగు సినిమాను పట్టాలెక్కించాడు దుల్కర్ సల్మాన్.  సెల్వమణి సెల్వరాజ్  దర్శకత్వంలో  ” కాంతా” అనే సినిమాను స్టార్ట్ చేసాడు.  ఇటీవల మిస్టర్ బచ్చన్ లో అలరించిన భాగ్యశ్రీబోర్స్ దుల్కర్ సరసన ఆడిపాడనుంది. గడచిన ఆదివారం ఈ సినిమా షూటింగ్ ను పూజ కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.  టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ , దుల్కర్ సొంత ప్రొడక్షన్ వేఫారెర్ బ్యానర్స్ కలిసి  రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో తీసుకురానున్నారు. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ గతంలో  “ది హంట్ ఫర్ వీరప్పన్”కి రచయిత, ఒక ఎపిసోడ్ కి దర్శకత్వం వహించారు.  “లైఫ్ ఆఫ్ ఫై” కోసం ఆన్-సెట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ కూడా చేసాడు.