Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు.. రాత్రిపూట దాడులపై స్థానికులు ఏం చెబుతున్నారంటే..?
జమ్మూ కాశ్మీర్‌లోని రాత్రి పరిస్థితి ఒక స్థానికుడు వివరిస్తూ.. నిన్న రాత్రి పూర్తిగా బ్లాక్‌అవుట్ జరిగింది. ఆ తర్వాత, డ్రోన్‌లు ఎగరడం ప్రారంభించాయి.. రాత్రంతా కాల్పులు కొనసాగాయని తెలిపారు.. అయితే మన (భారత) దళాలు పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇస్తున్నాయి. మన ప్రధానమంత్రి మరియు మన సైన్యంపై మాకు నమ్మకం ఉంది. అన్ని డ్రోన్‌లను మన దళాలు కట్టడిచేస్తున్నాయి.. మన దేశం గురించి మనకు గర్వంగా ఉంది. సరిహద్దు దగ్గర ఉద్రిక్తత ఉంది.. కానీ మిగిలిన ప్రదేశాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపాడు.. మరో వ్యక్తి మాట్లాడుతూ.. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో, మేము 3-4 డ్రోన్లను చూశాం.. ప్రతీకార కాల్పులు జరిగాయి, అది రాత్రంతా కొనసాగింది. పాకిస్తాన్ చేసింది సరైంది కాదన్నారు.. మేం భయపడటం లేదు.. ఆర్మీపై మాకు నమ్మకం ఉందన్నారు.. అయితే, ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో.. ఇక్కడ పాఠశాలలు మూసివేసినట్టు వెల్లడించారు..

ఎల్‌వోసీ, ఐబీ వెంట పాక్‌ విఫలయత్నం.. 50కి పైగా డ్రోన్లను తుక్కు చేసిన భారత్
భారత్‌-పాకిస్థాన్‌ మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి.. ఓవైపు, పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతూనే.. మరోవైపు.. ఆ దేశంపై విరుచుకుపడుతోంది భారత్.. దీంతో, పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. నిన్న రాత్రి, పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) మరియు అంతర్జాతీయ సరిహద్దులు (IB) వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్లను పంపడానికి పాక్‌ విఫలయత్నం చేసింది.. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా మరియు పఠాన్‌కోట్ ప్రాంతాలలో పాక్‌ చర్యలకు భారత్ తిప్పికొట్టింది.. భారత ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలు ఉపయోగించి.. పెద్ద ఎత్తున కౌంటర్-డ్రోన్ ఆపరేషన్‌లో 50కి పైగా పాక్‌ డ్రోన్‌లను విజయవంతంగా తటస్థీకరించింది.. ఇక, పాకిస్తాన్‌ డ్రోన్ దాడులపై భారత్‌ ఆర్మీ కీలక ప్రకటన చేసింది.. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్‌ డ్రోన్లతో దాడిచేసింది.. జమ్మూకశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించింది.. పాక్‌కు గట్టిగా జవాబు ఇచ్చాం.. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం.. పాక్‌ కుట్రలన్నింటికీ దీటుగా జవాబిస్తాం అని భారత ఆర్మీ తన ప్రకటనలో పేర్కొంది..

పాక్‌ ఎప్పటికీ మరిచిపోలేని సమాధానం ఇస్తాం..
బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగాడంటే.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూరు.. సమయానుకూలంగా ట్వీట్లు చేస్తూ.. కొన్ని సార్లు నవ్వులు పూయిస్తారు.. ఆలోచించపజేస్తారు.. సూచనలు, సలహాలు.. ఇలా ఎన్నో ఉంటాయి.. అయితే, భారత్ – పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. పాకిస్తాన్‌కు సీరియస్‌ వార్నింగే ఇచ్చాడు ఈ టీమీండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌.. ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా పాక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్.. పాక్‌ యుద్ధం కోరుకుంది.. దానికి భారత్‌ సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నాడు.. ‘ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్‌ మౌనంగా ఉండాలి.. కానీ, ఆ అవకాశాన్ని వదులుకొని యుద్ధం కోరుకుంటుంది.. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడమే కాదు.. వారి గురించి ఎక్కువగా మాట్లాడటం చేశారు.. దానికి భారత భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది.. పాకిస్తాన్‌ ఎప్పటికీ మరిచిపోలేని రీతిలో ఉంటుంది’ అంటూ ట్వీట్‌ చేశారు వీరేంద్ర సెహ్వాగ్..

భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్తలు.. మరో 2 రోజులు విద్యాసంస్థలకు సెలవు
భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు కవ్వింపు చర్యలు.. మరోవైపు.. ప్రజల నివాసాలపై సైతం కాల్పులకు తెగబడుతోంది పాక్‌.. అయితే, పాక్‌ పన్నాగాలను తిప్పికొడుతూనే.. ముందుస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది భారత్.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో అంతటా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. జమ్మూతో పాటు కాశ్మీర్‌ అంతటా అన్ని పాఠశాలలు నేడు మరియు రేపు మూసివేయబడ్డాయి.. ముందు జాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు మే 9 మరియు 10 తేదీలలో మూసివేయబడతాయని ప్రకటించారు జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ విద్యా శాఖ మంత్రి..

భారత వైమానిక దళాల కౌంటర్ స్ట్రైక్.. పాక్ మిలిటరీ పోస్ట్‌లు ధ్వంసం.. వీడియో వైరల్
భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వెంట డ్రోన్‌లు, మిసైళ్ల ద్వారా విస్తృతంగా దాడులు చేసేందుకు యత్నించింది. అయితే భారత భద్రతా బలగాలు సకాలంలో అప్రమత్తమై ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ దాడులకు ప్రతిగా భారత సైన్యం ఎల్ఓసీ (Line of Control) వెంట పాకిస్తాన్ మిలిటరీ పోస్టులపై ధాటిగా ప్రతీకార దాడులు నిర్వహించింది. తాజాగా, భారత వైమానిక దళాలు నిఘా కెమెరాల్లో రికార్డ్ చేసిన ఓ పాకిస్తాన్ మిలిటరీ పోస్ట్ ధ్వంసమైన దృశ్యాన్ని తొలిసారిగా అధికారికంగా విడుదల చేశాయి. ఇది భారత్ ఇచ్చిన ఘాటైన సమాధానానికి నిదర్శనంగా నిలుస్తోంది. భారత సైన్యం ప్రకటనలో పేర్కొనబడినదాని ప్రకారం.. గురువారం రాత్రి సమయంలో పాకిస్తాన్ సాయుధ బలగాలు డ్రోన్‌లు, ఇతర మునిషన్లతో వెస్ట్రన్ బోర్డర్ మొత్తం దాడులకు పాల్పడ్డాయి. అదేవిధంగా, జమ్ము కశ్మీర్‌లోని ఎల్ఓసీ వెంబడి అనేక సీస్ఫైర్ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది. ఈ డ్రోన్ దాడులను భారత భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయని, పాక్ సీస్ ఫైర్ ఉల్లంఘనలకు.. సూటిగా, తగిన స్థాయిలో జవాబిచ్చామని భారత ఆర్మీ వెల్లడించింది. భారత దేశ స్వతంత్రతను, భూభాగ సమగ్రతను కాపాడటానికి భారత ఆర్మీ పటిష్టంగా ఉందని, పాకిస్తాన్ కుట్రలకు తగిన జవాబు ఇవ్వబడుతుందని ఆర్మీ స్పష్టం చేసింది.

భారత్-పాక్ వివాదంలో జోక్యం చేసుకోం.. అమెరికా ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పాక్-భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వంశవ్యవస్థ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై స్పష్టమైన వైఖరి ఉన్న జేడీ వాన్స్‌ ఈ వివాదంలో అమెరికా పాత్రపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో తమ దేశం ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఆయన మాటల్లో.. “ఇది అమెరికాకు నేరుగా సంబంధించిన విషయం కాదు. ఈ రెండు దేశాల మధ్య అభిప్రాయభేదాలు, సరిహద్దు సమస్యలు వారే పరిష్కరించుకోవాలి. మేము వాటిపై హస్తక్షేపం చేయాలనే ఉద్దేశం లేదు. మనం చేయగలిగేది ఒక్కటే.. శాంతికి, స్థిరతకు దోహదపడేలా, ఉద్రిక్తతలను తగ్గించుకునేలా ఆ దేశాలను ప్రోత్సహించడమే. కానీ, వారిద్దరి మధ్య నడుస్తున్న సంక్షోభంలో మేము ప్రత్యక్షంగా పాల్గొనము.”

భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన X.. ప్రభుత్వ ఆదేశాలపై స్పందన.!
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేయడం ప్రారంభించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే భారీ జరిమానాలు, దేశీయ ఉద్యోగులకు జైలుశిక్ష విధించబడతాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బ్లాక్‌ చేయబడిన ఖాతాల్లో అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖ సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఉన్నట్లు సమాచారం. X కంపెనీ ప్రకటనలో తెలిపిన ప్రకారం, “ప్లాట్‌ఫారమ్‌ను భారత్‌లో అందుబాటులో ఉంచడం చాలా కీలకం. కానీ, ఇది తేలికైన నిర్ణయం కాదు” అని పేర్కొంది. ఇందుకు సంబంధించి X ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే.. భారత ప్రభుత్వం ఇచ్చిన అనేక ఆదేశాల్లో ఏ ఖాతాలో ఏమి తప్పు జరిగిందన్న స్పష్టత లేదు. చాలా సందర్భాల్లో ఖాతాలను బ్లాక్ చేయడానికి సరైన ఆధారాలు లేదా వివరాలే ఇవ్వలేదని తెలిపింది. అదే విధంగా, పోస్ట్‌లను కాకుండా మొత్తం ఖాతాలను బ్లాక్ చేయడం అనవసరం. ఇది సెన్సార్‌షిప్‌తో సమానం. భవిష్యత్ కంటెంట్‌కూ ఈ ప్రభావం ఉంటుందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను పబ్లిక్ చేయడం పారదర్శకతకు కీలకం. వాటిని గోప్యంగా ఉంచడం వల్ల బాధ్యతారాహిత్యం పెరిగే అవకాశం ఉంది. అయితే, భారత చట్టాల పరిమితుల వల్ల కంపెనీ ఆదేశాలను పబ్లిష్ చేయలేకపోయిందని పేర్కొంది.

సూర్య 45 మూవీ టైటిల్ ఫిక్స్..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్‌గా రెట్రో మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో టాక్ విషయం పక్కన పెడితే తమిళంలో మాత్రం ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు సూర్య. అందులో ఒకటి ఆర్జే బాలాజీతో మూవీ . వైవిధ్యానికి పెద్ద పీటను ఎప్పుడూ వేసే సూర్య.. అదే కోవలో ఈ సినిమా చేస్తున్నారని సమాచారం. సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే మేకర్స్ సూర్య ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సూర్య 45 ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. ఏంటీ అంటే ఈ సినిమాకు ‘పెట్టైక్కరన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ‘వెట్టై కరుప్పు’ అనే టైటిల్‌ను లాక్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారట. ఇక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఆ సినిమాను, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్.ఆర్. ప్రకాష్ రాజ్, ఎస్.ఆర్. ప్రభు గ్రాండ్ గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సాత్విక, యోగి బాబు, నట్టి వంటి పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మలయాళ భామ అనఘా రవి.. ఆ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version