Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. అజెండా ఇదే..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. రాజధాని లో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్.. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలపనుంది.. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి ఇవ్వనుంది కేబినెట్‌.. మరోవైపు, హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు ఏర్పాటుపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం, మంత్రులు.. ఇక, అమ‌రావ‌తిలో ప‌లు సంస్థల‌కు భూ కేటాయింపులకు అమోదం తెలపనుంది కేబినెట్‌.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారి.. కేంద్రం వరకు చేరిన బనకచర్ల ప్రాజెక్ట్ కు సంబంధించి కూడా కేబినెట్‌లో ప్రత్యేకంగా చర్చించనున్నారు.. మరోవైపు, సుపరిపాలన… తొలి అడుగు ఫీడ్ బ్యాక్ పై కేబినెట్‌ తర్వాత మంత్రుల తో చర్చించనున్నారట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

నేడు చిత్తూరు పర్యటనకు జగన్‌.. ఆంక్షలతో ఉత్కంఠ..!
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనపై హైటెన్షన్‌ నెలకొంది. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.. అంతేకాదు, ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎస్పీ మణికంఠ తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బెంగుళూరు నుంచి చిత్తూరు జిల్లా పర్యటనకు రాబోతున్నారు వైఎస్‌ జగన్?. మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారిని పరామర్శించేందుకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌లో నేరుగా రైతులతో మాట్లాడబోతున్నారు.. ఈ పర్యటన కోసం.. ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 11 గంటలకు బంగారుపాళ్యం మండలం కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు వైఎస్‌ జగన్?. 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్ కు చేరుకుంటారు.. 11.20 గంటల నుంచి 12.20 వరకు రైతులతో ముఖాముఖి మాట్లాడుతారు.. మధ్యాహ్నం 12.35 తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని బెంగుళూరుకు తిరుగు ప్రయాణంకానున్నారు.. మధ్యాహ్నం 2 గంటలకు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకోవడంతో జగన్‌ పర్యటన ముగియనుంది..

రెండో రోజు శాకంబరీ దేవి ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై అమ్మకారికి కూరగాయలు సమర్పిస్తున్న భక్తులు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు మంగళవారం రోజు ప్రారంభం కాగా.. ఈ నెల 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. రెండవ రోజు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక, రేపటితో ఈ శాకంబరీ మహోత్సవాలు ముగియనున్నాయి.. శాకంబరీ దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మకు కూరగాయలతో విశేష అలంకారం చేశారు.. ఇక, అమ్మవారికి విరాళంగా కూరగాయలను సమర్పిస్తున్నారు భక్తులు.. హరిత వర్ణంలో ఇంద్రకీలాద్రి శోభిల్లుతోంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.. మొదటి రోజున ఆలయ అలంకరణ, కదంభం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయల వినియోగించారు.. ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, మహా మండపంలో ఉత్సవ మూర్తి, ఉపాలయాలల్లో దేవతామూర్తులంతా హరిత వర్ణంతో విరాజిల్లుతున్నారు. ఇక, భక్తుల రద్దీ దృష్ట్యా.. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు ప్రత్యేక, అంతరాలయ దర్శనం రద్దుచేశారు అధికారులు.. ఉదయం 8లకు సప్తశతీ పారాయణం, మహావిద్యా పారాయణము మరియు హోమాలు నిర్వహించనున్నారు.. సాయంత్రం 5కి మూల మంత్రహవనములు, మండప పూజ, హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ జరగనుంది.. ఆషాఢ సారె సమర్పణ బృందాలు, శాకంభరీ దేవి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు..

నాకు అండగా నిలబడినవారికి కృతజ్ఞతలు.. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌కి ప్రత్యేక ధన్యవాదాలు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఎపిసోడ్‌ ఒక్కసారిగా నెల్లూరు పాలిటిక్స్‌లో హీట్‌ పెట్టింది.. ప్రశాంతి రెడ్డి.. ప్రసన్నకుమార్‌పై విమర్శలు చేయడం.. దాని కౌంటర్‌ ఇస్తూ ఆయన చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి.. ఈ ఎపిసోడ్‌లో కూటమి నుంచి ప్రశాంతి రెడ్డి.. వైసీపీ నుంచి ప్రసన్నకు మద్దతు లభించింది.. అయితే, సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలబడిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిజయేశారు ప్రశాంతి రెడ్డి.. అలాగే మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సహచర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ జిల్లా అధ్యక్షులకు, వివిధ హోదాల్లో ఉన్న ఎందరో నేతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన ఆమె.. నా కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన మహిళామణులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మీద అభిమానంతో మేమున్నామంటూ జిల్లావ్యాప్తంగా తరలివచ్చి నాకు సంఘీభావం ప్రకటించిన వీపీఆర్‌ అభిమానులకు, కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.. అలాగే నాకు నైతిక మద్దతు అందించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్నారు.. మీ అందరి మద్దతుతో మనోధైర్యాన్ని కూడగట్టుకుని ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు సర్వదా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..

జీడిమెట్లలో రెచ్చిపోయిన దొంగలు.. గంటలో మూడు ATMలు కొల్లగొట్టిన కేటుగాళ్లు..!
హైదరాబాద్‌ జీడిమెట్లలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలోని HDFC ATM సెంటర్ లో దుండగులు గంటపాటు అందులోనే ఉండి మూడు ఏటీఎం యంత్రాలను పూర్తిగా కట్ చేసి, అందులోని భారీగా నగదును అపహరించి పరారయ్యారు. జూలై 8 రాత్రి ముగ్గురు దుండగులు ATM సెంటర్‌ లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో మూడు ATMలను కొల్లగొట్టారు. ఆ తర్వాత మిషన్లలోని నగదును అపహరించడానికి దుండగులు ఒక గంట సమయం తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ముఖానికి మాస్క్, తలపై క్యాప్ ధరించి కనిపించిన దొంగలు పూర్తి ప్రణాళికతో చోరీకి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ATM సెంటర్ లోని అలారం దొంగలు ప్రవేశించిన ఒక గంట తరువాత మోగింది. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో క్లూస్ టీమ్ లను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

నేడు భారత్ బంద్.. సమ్మెలో ఎవరు పాల్గొంటున్నారంటే..?
దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు 25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ బంద్‌లో పాల్గొనబోతునట్లు సమాచారం. ఈ బంద్‌ పిలుపు 10 ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చాయి. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతుల అభ్యున్నతికి విరుద్ధంగా ఉన్న నిర్ణయాలు, కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలకు నిరసనగా ఈ బంద్‌ చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల వేదిక ఒక ప్రకటనలో కోరింది. బ్యాంకింగ్, బీమా, పోస్టల్, మైనింగ్, నిర్మాణ రంగాలతో పాటు రాష్ట్ర రవాణా, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. అనధికారిక లేదా అసంఘటిత రంగాల యూనియన్లు కూడా ఈ సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం అవుతాయని ప్రకటించారు. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత అమర్‌జిత్ కౌర్‌ ప్రకారం.. రైతులు, గ్రామీణ కార్మికులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా రాబోతున్నారు.

అమెరికా మరోసారి టారిఫ్ ఆయుధంతో దూకుడు.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన భారీ దిగుమతి టారిఫ్‌ల నిర్ణయాలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇందులో ముఖ్యంగా భారతదేశానికి కాస్త భారీగానే ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశముంది. ట్రంప్ తాజాగా కాపర్‌పై 50 శాతం దిగుమతి టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించగా.. ప్రజల మందులపై 200 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా.. ఈ రోజు కాపర్‌ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాం. దీని మీద టారిఫ్ 50 శాతం ఉండేలా చేస్తాం అని ట్రంప్ క్యాబినెట్ సమావేశంలో వెల్లడించారు. ఆయన ప్రకటన అనంతరం కాపర్ ధరలు భారీగా పెరిగాయి. ఇక ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ప్రకారం.. ఈ కొత్త టారిఫ్ జూలై చివర లేదా ఆగస్టు 1న అమల్లోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, అమెరికా దిగుమతులపై పరిశీలనల క్రమంలో ఔషధాలు, సెమీకండక్టర్లు, లాంబర్, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాలపై భవిష్యత్తులో మరింత టారిఫ్‌లు విధించే అవకాశముందని సూచించారు. ఒక సంవత్సరం లోపల ఉత్పత్తిదారులు తమ కార్యకలాపాలను అమెరికాలోకి తరలించాలి. తర్వాత వారిపై 200 శాతం టారిఫ్‌లు అమలవుతాయని ట్రంప్ హెచ్చరించారు.

హరిహర వీరమల్లు ప్రీ రిలిజ్ ఈవెంట్.. పవన్ స్పీచ్ పై ఉత్కంఠ
మొత్తనికి అనేక వాయిదాలు, అనేక వివాదాల అనంతరం హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. అప్పటివరకు ఎదో అలా అలా ఉన్న బజ్ కాస్త ట్రైలర్ తర్వాత పెరిగింది. దాంతో పాటుగా థియేట్రికల్ రైట్స్ కూడా డిమాండ్ ఏర్పడింది. అదే అదనుగా కాస్త రేట్లు పెంచి మరి బేరాలు చేస్తున్నాడు నిర్మాత రత్నం. అయితే హరిహర వీరమల్లు భారీ ఓపెనింగ్ రాబట్టాలంటే ఈ క్రేజ్ సరిపోదు. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే డిస్కషన్ జరగాలి. అలా చేయాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాలి. ఇప్పడు ఆ దిశగానే ప్లానింగ్ జరుగుతోంది. అందుకోసం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ నెల 20న ఈవెంట్ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల టాలీవుడ్ లో జరిగిన కొన్ని పరిణామాలు పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు టాలీవుడ్ సినీ పెద్దలు ఏపీ సీఎం ను కలవకపోవడం పట్ల కూడా పవర్ స్టార్ కాస్త అసంతృప్తి గానే ఉన్నారు. మరి వీటన్నిటికి గురించి హరిహర వేదికపై స్పందిస్తారా అనే చర్చ టాలీవుడ్ లో జరుగుతోంది. మరో 10 రోజుల్లో జరగబోయే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version