Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..
ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. మరికాసేపట్లో ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా మామండూరు అటవి ప్రాంతానికి వెళ్లి, ఎర్రచందనం గోడౌన్లను పరిశీలిస్తారు. తర్వాత మంగళంలో ఉన్న ఎర్రచందనం నిల్వ గోదాములను సందర్శించనున్న పవన్‌ కల్యాణ్‌.. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. నిల్వలో ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించనున్నారు. అలాగే శేషాచల కొండల్లో ఉన్న అరుదైన వన్యప్రాణులు, వృక్ష సంపదను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనున్నట్లు సమాచారం. కాగా, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది.. ఈ రోజు తిరుపతి జిల్లా ఎర్రచందనం డిపో పరిశీలన.. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై సమీక్షలో పాల్గొననున్నారు పవన్‌ కల్యాణ్.. ఇక, రేపు.. అనగా ఈ నెల 9వ తేదీన పలమనేరులోని కుంకీ ఏనుగుల సంరక్షణ, ఏనుగుల మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పరిశీలించనున్నారు.. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి.. వారితో ఒప్పందాలు కుదుర్చుకుని.. కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రప్పించిన విషయం విదితమే..

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు
తిరుమలలో కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు పెంచింది.. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక నిందితుడుగా ఉన్న A-16 అజయ్‌ కుమార్‌ సుగంధ్‌‌ను అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. అజయ్‌ కుమార్‌ మోన్‌ గ్లిసరైడ్స్‌, అసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కెమికల్స్‌ను పామాయిల్‌ తయారీలో వినియోగించి, అదే పామాయిల్‌ను నెయ్యి పేరుతో తిరుమల లడ్డూల తయారీ కోసం సరఫరా చేసినట్టు.. ఆ నెయ్యినే లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు సిట్ గుర్తించింది. దీంతో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం వరకు పామాయిల్‌ ఉన్నట్లు వెల్లడైంది. గత ఏడేళ్లుగా బోలే బాబా కంపెనీకి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్‌ను అజయ్‌ కుమార్‌ సరఫరా చేస్తున్నట్లు సిట్ పేర్కొంది. ఇక, అజయ్‌ కుమార్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్‌ అధికారులు… దీంతో, అజయ్‌ కుమార్‌కు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం..

వైఎస్‌ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది.. ఈ కేసులో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు సిబ్బందిపై తాజాగా చర్యలు ప్రారంభమయ్యాయి. వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్, అలాగే సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ పై తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ ఇద్దరు అధికారులు.. ఏఎస్సై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి. వీరిపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తప్పుడు కేసులపై పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ దర్యాప్తు చేపట్టారు. ఎనిమిది నెలల విచారణలో మొత్తం 22 మంది సాక్షులను విచారించి, తప్పుడు కేసులపై క్లోజర్ రిపోర్ట్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తీర్పు వెలువరించగా.. ఆ తర్వాత ఇద్దరు పోలీసులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ పరిణామంతో వైఎస్‌ వివేకా హత్య కేసు కీలక మలుపు తీసుకున్నట్టు అయ్యింది..

పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు మృతి, ఏడుగురికి సీరియస్‌..
ఆంధ్రప్రదేశ్‌లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది.. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం సమీపంలో నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది… పెళ్లికారు సృష్టించిన బీభత్సంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రగాయాలు పాలయ్యారు.. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక పెళ్లి కారు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అన్నవరం వద్ద పెళ్లి కార్యక్రమం ముగించుకుని జగ్గంపేటకు తిరిగి వెళ్తుండగా, కారుకు ఫ్రంట్ టైర్ పేలడంతో అది నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ప్రజలపై దూసుకెళ్లింది.. దీంతో, ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.. గాయపడిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. వారిని తక్షణం సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.. ఇక, ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. బాధితులను పరామర్శించారు.

కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఆధ్యాత్మిక మహా సమ్మేళనం కొనసాగుతోంది.. భక్తి టీవీ నేతృత్వంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఇప్పటికే విజయవంతంగా ఏడు రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించారు.. ప్రతీ రోజూ విశేష పూజలు.. కల్యాణాలు.. ప్రవచనాలు, వాహన సేవలతో భక్తులను కట్టిపడేస్తోంది కోటి దీపోత్సవం వేడుక.. ఇక, ఈ కోటి దీపాల పండుగలో భాగంగా ఎనిమిదవ రోజు అంటే ఈ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. హల్దీపురం మఠాధిపతి, వైశ్య కుల గురువులు పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ చే అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనామృతం అందించనున్నారు.. వేదికపై కాజీపేట శ్వేతార్క మహాగణపతికి కోటి గరికార్చన నిర్వహించి.. ఉజ్జయిని మహాకాళునికి భస్మహారతి ఇవ్వనున్నారు.. మరోవైపు, భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన జరిపించనున్నారు.. కోటి దీపోత్సవం వేదికగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం జరిపించనున్నారు.. ఈ రోజు నంది వాహన సేవ నిర్వహిస్తారు.. ఇక, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి..

వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ
దేశంలో మరో 4 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వారణాసిలో ప్రధాని మోడీ జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి. ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందించనున్నాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడనున్నాయి. వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి మతపరమైన, సాంస్కృతిక నగరాలను కలుపుకుని వెళ్లుంది. ఇది ప్రస్తుత రైళ్లతో పోలిస్తే సుమారు 2 గంటల 40 నిమిషాలు ఆదా చేస్తుంది. ఈ రైళ్లు యాత్రికులు, పర్యాటకులకు ఖజురహో వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది. ఈ ప్రయాణాన్ని దాదాపు 7 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేయడానికి సహాయపడుతుంది. దాదాపు 1 గంట సమయం ఆదా అవుతుంది. ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారాన్‌పూర్‌లను కలుపుతుంది. రూర్కీ ద్వారా హరిద్వార్‌కు కూడా సులభంగా చేరుకోవచ్చు.

ఇక గూగుల్‌ మ్యాప్స్‌లో ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్..
ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే.. ముందుగా గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి.. మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం ఎంత దూరం..? ఏ రూట్‌లో వెళ్తే త్వరగా చేరుకుంటాం..? ఏ రూట్‌లో ఎన్ని గంటల సమయం పడుతుంది? లాంటి విషయాలు తెలుసుకుంటాం.. ఇక, అక్కడే బస్సు టికెట్లు బుక్‌ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా.. గూగుల్ మ్యాప్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అనుసంధానం కానున్నాయి.. దీని ద్వారా ప్రయాణికులు నేరుగా గూగుల్ మ్యాప్స్ నుంచే ఆర్టీసీ బస్సు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే, ఇప్పటి వరకు ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, అధికారిక వెబ్‌సైట్ లేదా వివిధ యాప్‌ల ద్వారా ఆర్టీసీ టికెట్లను బుక్‌ చేసుకుంటుండగా.. ఈ జాబితాలో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కూడా చేరనుంది.. అంటే, ఎవరైనా యూజర్ గూగుల్ మ్యాప్స్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నం లేదా మరో ప్రాంతానికి వెళ్లాలని సెర్చ్ చేస్తే.. ఇప్పటి వరకు కనిపిస్తోన్న కాలి నడక, కారు, బైక్, రైలుతో పాటు బస్సు ప్రయాణ వివరాలు కూడా కనిపించనున్నాయి.. అక్కడ బస్ సింబల్‌పై క్లిక్ చేయగానే, ఆ మార్గంలో అందుబాటులో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల వివరాలు, అవి బయలుదేరే టైం, గమ్యస్థానానికి చేరే టై వంటి వివరాలు కనిపించనున్నాయి.. దీంతో, సదరు యూజర్‌ తనకు నచ్చిన బస్సును ఎంపిక చేసుకొని.. బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, అది నేరుగా ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లనుంది.. దీంతో ప్రయాణికుల అక్కడ తమ వివరాలు నమోదు చేసి, ఆన్‌లైన్ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకునే వీలు ఉంటుంది.. అయితే, ఈ విధానాన్ని సుమారు 3 నెలల క్రితమే విజయవాడ – హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా పరీక్షించగా.. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించే విధంగా కసరత్తు సాగుతోంది..

పాక్-ఆప్ఘన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం.. యుద్ధం తప్పదా?
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం అయ్యాయి. ఇస్తాంబుల్‌ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ఇక చర్చల ప్రారంభానికి ముందు ఖవాజా మాట్లాడుతూ.. ఈసారి మాత్రం చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదని హెచ్చరించారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ సరిహద్దులో దాడులు కొనసాగితే పాకిస్థాన్ ప్రతిస్పందిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వ్రాతపూర్వక ఒప్పందంపై సంతకం చేయడానికి తాలిబన్ ప్రతినిధి బృందం నిరాకరించిందని.. మౌఖిక అవగాహన కోసం పట్టుబట్టడంతో అకస్మాత్తుగా చర్చలు ముగిశాయని ఖవాజా తెలిపారు. ఇస్తాంబుల్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరుగుతాయని భావించాం కానీ.. అర్థాంతరంగా ముగిశాయని చెప్పారు.

నేడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య ఐదో టీ20.. సిరీస్ గెలిచేనా..?
ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు ఐదో మ్యాచ్‌ జరగనుంది. ఇందులో విజయం సాధిస్తే భారత్‌ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఓడినా సిరీస్‌ సమం అవుతుంది. మరోవైపు ఆతిథ్య ఆసీస్ మాత్రం తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. స్వదేశంలో సిరీస్‌ కోల్పోకూడదని ఆ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో కంగారూల శైలికి తగినట్లు చక్కటి బౌన్స్‌ ఉండే గాబా మైదానంలో ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుభ్ మన్‌ గిల్‌ వన్డే, టీ20 ఫాంపై తీవ్ర చర్చ కొనసాగింది. నిజంగానే అతను తడబడ్డాడు. రెండు ఫార్మాట్‌లలో 7 ఇన్నింగ్స్‌లు కలిపి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇలాంటి పరిస్థితిలో బాగా ఆడి ఘనంగా ముగింపు పలకాలని గిల్‌ అనుకుంటున్నాడు. మరో ఓపెనర్‌ అభిషేక్ శర్మ దూకుడును ఆడుతుండగా, సూర్య కుమార్‌ యాదవ్ ఫామ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. గత 18 ఇన్నింగ్స్‌లలో సూర్య ఒక్కసారి కూడా అర్థ శతకం చేయలేదు. అలాగే, తిలక్‌ వర్మ కూడా తనదైన శైలిలో రెచ్చిపోయి ఆడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో భారత్‌ చక్కటి బౌలింగ్‌ ప్రదర్శనతో గెలిచిన, మన బ్యాటింగ్‌లో వైఫల్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు అక్షర్, సుందర్‌లతో పాటు శివమ్ దూబే రెండు విభాగాల్లోనూ మంచి ప్రదర్శన కనబర్చుతున్నాడు.

లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో రాధిక ఆప్టే.. సాలీ మొహబ్బత్ రిలీజ్ అప్‌డేట్!
సంవత్సరానికో సినిమా చేస్తూ ప్రేక్షకులను రాధిక ఆప్టే అలరిస్తోంది. హిట్ ష్లాప్ అని ఆలోచించకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. గత ఏడాది లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సిస్టర్ మిడ్‌నైట్’ వచ్చిన తర్వాత ఆమె ప్రస్తుతం వరుస చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం రాధిక ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సాలీ మొహబ్బత్’.. ఇందులో ఆమె పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుండగా.. టిస్కా చోప్రా డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈచిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించి ప్రశంసలు అదుకున్నారు. కాగా, జియో స్టూడియోస్ సమర్పణలో స్టేజ్‌5 ప్రొడక్షన్ బ్యానర్‌ కింద జ్యోతి దేశ్‌పాండే, మనీష్ మల్హోత్రా, దినేశ్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గత ఏడాది ప్రారంభమైనప్పటికీ విడుదలకు ఇంకా నోచుకోలేదు. దీంతో అంతా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకున్నారు.. కానీ, తాజాగా, చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ‘సాలీ మొహబ్బత్’ థియేటర్స్‌లోకి కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతుందని ప్రకటించారు. త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్ కానుందన్నారు. అయితే, రిలీజ్ డేట్ రివీల్ చేయకుండా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న సినీ లవర్స్ నిరాశ చెందుతున్నారు.

మణిరత్నం లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి-రుక్మిణి?
మణిరత్నం తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రీసెంట్‌గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్‌ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్‌ మూవీని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో చిన్న గ్యాప్‌ తీసుకున్న ఆయన తాజాగా ఒక లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. అంతేకాదు ఇందులో నటుడు దృవ్‌ విక్రమ్‌ హీరోగా నటించనున్నట్లు ప్రచారం ఒకవైపు, శింబుతో సినిమా తీయబోతున్నడని మరోవైపు వార్తలు వచ్చాయి. ఆయనకు కథను కూడా వినిపించినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, శింబు ప్రస్తుతం వెట్రిమారన్‌ డైరెక్షన్ లో నటిస్తున్న అరసన్‌ మూవీలో నటిస్తూ బిజీగా ఉండడంతో ఆయనకు బదులుగా యాక్టర్ విజయ్‌ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే, మణిరత్నం దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి ఇంతకు ముందు నవాబ్‌‌ అనే సినిమాలో కీ రోల్ పోషించారు. తాజాగా సెకండ్ టైం మణిరత్నం, విజయ్ కాంబో రిపీట్‌ కాబోతుందని సమాచారం.

Exit mobile version