NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పోలవరంలో మూడో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం.. మరోసారి ప్రాజెక్టు వద్ద లోతుగా అధ్యయనం చేస్తోంది.. అందులో భాగంగా నేడు పోలవరంలో మూడవ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగనుంది.. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి చర్చించనున్నారు.. డయా ఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా..? లేదా..? అనే విషయంపై అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం.. ప్రాజెక్టు అధికారులు, కేంద్ర జల సంఘం చైర్మన్ తో విడివిడిగా సమావేశం కానున్నారు.. అయితే, రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం రోజు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించి చర్చించింది నిపుణుల బృందం.. వీలైనంత వేగంగా డ్యాం ఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని సూచించింది.. మరోవైపు.. నేడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులపై ఫోకస్‌ పెట్టనున్నారు.. డయా ఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా..? లేదా..? అనే విషయంపై ఇరిగేషన్‌ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం.. ప్రాజెక్టు అధికారులు, కేంద్ర జల సంఘం చైర్మన్ తో విడివిడిగా సమావేశమై.. దీనిపై చర్చించనున్నారు.. ఇక, రేపు నాణ్యత నియంత్రణ అంశాలపై అధికారులతో చర్చించనుంది విదేశీ బృందం..

మూడో రోజు గ్రంధి శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ సోదాలు
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఇన్కమ్ టాక్స్ అధికారుల సోదాలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి.. రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాపార సంస్థల్లో, భాగస్వాముల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు ఈ రోజు కూడా కొనసాగనున్నాయి. మొదటిరోజు గ్రంధి శ్రీనివాస్ నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు.. అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగించారు.. ఇక, తర్వాత రోజు ఆయన వ్యాపార సంస్థల్లో జరిగిన లావాదేవీలపై దృష్టి పెట్టారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు.. అయితే, మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ సోదాలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఐటీ అధికారులు రికార్డుల పరిశీలన అనంతరం ఏం తేల్చబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే అంతే.. ఎస్పీ సీరియస్‌ వార్నింగ్‌..
ఇప్పుడు సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై పెద్ద రచ్చే జరుగుతోంది.. అధికార కూటమి, ప్రతిపక్షం మధ్య.. సోషల్‌ మీడియాలో వార్‌ నడుస్తోంది.. అయితే, ఇది కొన్నిసార్లు శృతిమించిపోయి.. వ్యక్తిగత జీవితాలపై.. పోస్టుల వరకు వెళ్తోంది.. అయితే, దీనిపై సర్కార్‌ సీరియస్‌గా ఉంది.. ఇక, సోషల్ మీడియా లో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న.. సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారంచేసిన, అసభ్యకరమైన పోస్టులు పెట్టిన, అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు ఎస్పీ రత్న.. ఈ మేరకు గురువారం జిల్లా ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా, వ్యక్తిగత పేరుపైన ఫోటోలు మార్ఫింగ్ చేసిన, మాన అభిమానాలు దెబ్బ తినే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా మతపరమైన, సున్నిత అంశాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే.. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై సైబర్ సెల్ సోషల్ మీడియా విభాగం నందు ప్రత్యేక నిఘా ఉంచామని, సదరు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్నారు. అవాస్తవ ప్రచారాలను ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని సూచించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి లేదా ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా ఉంచామని, నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై, షేర్ చేసే వారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ రత్న..

నేడు సీఎం పుట్టినరోజు.. యాదాద్రిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టతో పాటు వలిగొండ మండలం సంగెం అండర్ బ్రిడ్జి వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. వలిగొండ మండలం సంగెం వద్ద భీమలింగానికి పూజలు చేసిన అనంతరం పునరుజ్జీవం యాత్ర చేపడతారు. ఈ మేరకు భీమలింగం వరకు రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ధర్మారెడ్డి కాలువ మీదుగా సీఎం యాత్ర చేపట్టనున్నారు. భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం దర్శనార్థం విష్ణుపుష్కరిణి, అఖండ దీపం, తూర్పు రాజగోపురం మీదుగా ఆలయంలోకి సీఎం భద్రతా సిబ్బంది వెళ్లి స్వయంభువుల దర్శనం, వేద ఆశీర్వాద మండపం, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాలను పరిశీలించారు. సీఎం పూజలు చేసే భీమలింగం వరకు సీఎం వాహనం ట్రయల్ రన్ నిర్వహించారు.

ఆ లింక్‌ క్లిక్ చేయకండి.. రాష్ట్ర ప్రజలకు సైబర్‌ సెక్యూరిటీ సూచన..
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్‌ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే బుధవారం నుంచి మొదలైన విషయం తెలిసిందే. అయితే దీనిని ఆధారంగా చేసుకుని కొందరు సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సూచించింది. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఎవరైనా సైబర్ నేరగాళ్లు OTP లు అడిగే తెలపకూడదని తెలిపింది. రాష్ట్ర ప్రజలు ఇటువంటి వారి నుంచి జాగ్రత్త ఉండాలని తెలిపింది. సమగ్ర సర్వే పేరుతో ఎటువంటి లింకులు వచ్చిన వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు. సమగ్ర విచారణ ఇంటింటికి నియమించిన అధికారులే వస్తారని పేర్కొంది. మొత్తం సర్వే పూర్తి చేసేందుకు ప్రభుత్వం 94,750 మంది ఎన్యూమరేటర్లు, 9,478 మంది సూపర్‌వైజర్లను నియమించిందని గుర్తు చేశారు. ఎటువంటి అనుమానం వచ్చినా సైబర్‌ క్రైమ్‌ నెంబర్‌ 1930కు డయిల్‌ చేయాలని కోరారు. ఇటీవల సైబర్‌ నేరగాళ్ల వలలో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే పడుతున్నారు. కష్టపడి కొందరు, వడ్డీలకు డబ్బులిచ్చి మరికొందరు..రోజంతా ఆఫీసులో కూర్చొని.. ఇలా అందరూ ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ.. ఇళ్ల మీద పడి డబ్బులు, నగలు దోచుకెళ్లడం ఓల్డ స్టైల్ అయిపోయింది. దర్జాగా సిస్టమ్​ ముందు కూర్చుని లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు సైబర్ నేరగాళ్లు. డబ్బుల కోసం నిరుద్యోగులను, అమాయక ప్రజలను తమ వలలో పడేంత వరకు మాటలు మాట్లాడి నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆతరువాత డబ్బులను దోచుకునే పనిలో పడతారు. అంతేకాదు.. తాజాగా సైబర్ కేటుగాళ్లు రాజకీయ, పోలీసుల వాట్సప్ డీపీ ఫోటోలు పెట్టి కూడా ప్రజలను భయపెట్టి డబ్బులను గుంజుకున్న దాఖలాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమగ్ర సర్వే పేరుతో ఎవరైనా ఫోన్ చేసినా, లింక్ లు పంపినా నమ్మవద్దని తెలిపారు. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దని ముందగానే రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు.

మిడిల్‌ ఈస్ట్‌కు అమెరికా ఫైటర్‌ జెట్‌ విమానాలు..!
పశ్చిమాసియాలో ఉద్రిక్త నేపథ్యంలో అమెరికా మోహరింపులు వేగవంతమయ్యాయి. తాజాగా ఎఫ్‌-15 ఫైటర్‌జెట్‌లను అక్కడికి తరలించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ఇరాన్‌ దుందుడుకు చర్యలను కట్టడి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ఈ రోజు (శుక్రవారం) అమెరికా వాయుసేన 492వ ఫైటింగ్‌ స్క్వాడ్రన్‌కు చెందిన ఎఫ్‌-15 స్ట్రైక్‌ ఈగిల్స్‌ను మిడిల్‌ ఈస్ట్‌కు తరలించామని వెల్లడించారు. ఇవి ఇప్పటికే అక్కడి సెంట్రల్‌ కమాండ్‌కు చేరుకొన్నాయని ఆ దేశ సైన్యం సోషల్‌ మీడియాలో తెలిపింది. ఇప్పటికే అమెరికా బీ-52 బాంబర్లు కూడా గల్ఫ్‌లోని సైనిక స్థావరాలకు చేరిపోయాయని చెప్పుకొచ్చారు. వీటికి అండగా ట్యాంకర్‌ విమానాలు, బాలిస్టిక్‌ క్షిపణులు, డెస్ట్రాయర్స్‌ను తరలించామని యూఎస్ వెల్లడించింది. కాగా, అంతకు ముందే థాడ్‌ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అక్కడ మోహరించింది. ఇరాన్‌, దాని రహస్య ముఠాలు అమెరికా మిలటరీ లేదా ప్రయోజనాలను దెబ్బ తీయాలని ట్రై చేస్తే అడ్డుకొని మా వారిని రక్షించుకోవడానికే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇటీవల వాషింగ్టన్‌ వార్నింగ్ జారీ చేసింది. ఇరాన్‌ అతి త్వరలో తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ సంస్థలు నివేదికలు ఇచ్చింది. ఇరాక్‌ వైపు నుంచి జరగొచ్చని సమాచారం అందించింది. దీంతో అలర్టైన అమెరికా ఇరాక్‌ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు జరిగిన తర్వాత ఎదురైయ్యే పరిణామాలను బాగ్దాద్‌ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆరోపణలను మాత్రం ఇరాక్‌ తప్పుబట్టింది. అక్టోబర్‌ 1న ఇరాన్‌ దాదాపు 200 బాలిస్టిక్‌ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఇరాన్‌ ఇప్పుడు ఏమైనా దుందుడుకు చర్యలు చేపడితే.. అమెరికా స్పందన ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.

తన ప్రచార సారథి వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించిన ట్రంప్
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్‌ సూసీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపిక చేశాడు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్‌ను విజయ తీరాలకు చేర్చడంలో ఆమె కీ రోల్ పోషించింది. ఎంతో పకడ్బందీగా, అత్యంత క్రమశిక్షణతో ట్రంప్‌ తన ప్రచారాన్ని నిర్వహించడం వెనుక ఆమె చాలా కష్టపడినట్లు సంబంధిత వర్గాల్లో పేరు పొందారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ సూసీ కానుంది. ట్రంప్‌ తన విక్టరీ స్పీచ్ లో ఆమెకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇచ్చినా.. నిరాకరించింది. కాగా, సూసీ వెల్స్ వినూత్న ఆలోచనలు కలిగిన వ్యక్తి అని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవం, ప్రశంసలను పొందారని చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తారని పేర్కొన్నారు. దేశం గర్వపడేలా ఆమె పని చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాగా, ఫ్లోరిడాకు చెందిన సూసీ.. దీర్ఘకాలంగా రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్తగా పని చేశారు. 2016, 2020ల్లో రాష్ట్రంలో ట్రంప్ ప్రచార బాధ్యతలను ఆమె తీసుకున్నారు.

సేవింగ్స్ అకౌంట్‭లో పరిమితికి మించి నగదు డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసు షురూ
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కచ్చితంగా కలిగి ఉంటుంది. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అంతేకాకుండా, ఇది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. దీని కారణంగా ప్రతి వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. పొదుపు ఖాతాలో మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంకా ఎప్పటికప్పుడు బ్యాంకు ఈ డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీని కూడా ఇస్తుంది. నిబంధనల ప్రకారం, జీరో బ్యాలెన్స్ ఖాతా మినహా అన్ని ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచడం అవసరం. లేకపోతే, బ్యాంక్ మీకు పెనాల్టీని వసూలు చేస్తుంది. కానీ పొదుపు ఖాతాలో గరిష్టంగా ఎంత డబ్బు ఉంచవచ్చనే దానిపై చర్చ లేదు. నిబంధనల ప్రకారం, మీరు మీ సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బునైనా ఉంచుకోవచ్చు. దీనికి పరిమితి లేదు. అయితే మీ ఖాతాలో జమ చేసిన మొత్తం ఎక్కువై అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే.. ఆ ఆదాయ మూలాన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇది కాకుండా, బ్యాంకు శాఖకు వెళ్లి నగదు డిపాజిట్ చేయడానికి, నగదు ఉపసంహరించుకోవడానికి పరిమితి ఉంది. కానీ చెక్కు లేదా ఆన్‌లైన్ ద్వారా, మీరు సేవింగ్స్ ఖాతాలో రూ. 1 నుండి వేల, లక్షలు, కోట్ల వరకు ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేయవచ్చు. ఇకపోతే, రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును బ్యాంకులో డిపాజిట్ చేస్తే.. దానితో పాటు మీ పాన్ నంబర్‌ను కూడా అందించాలని నిబంధన చెబుతోంది. మీరు ఒక రోజులో రూ. 1 లక్ష వరకు నగదు డిపాజిట్ చేయవచ్చు. అలాగే, మీరు మీ ఖాతాలో క్రమం తప్పకుండా నగదు జమ చేయకపోతే, ఈ పరిమితి రూ. 2.50 లక్షల వరకు ఉంటుంది. ఇది కాకుండా, ఒక వ్యక్తి తన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.10 లక్షల నగదు జమ చేయవచ్చు. ఈ పరిమితి మొత్తం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలతో పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది.

నేడే దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. రాత్రి 8.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొనడం సవాలే. అందులోనూ ప్రొటీస్ సొంత గడ్డపై అంటే మాములు విషయం కాదు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. పెద్దగా అనుభవం లేని యువ జట్టు సఫారీలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని భారత జట్టులో ఎక్కువ మంది ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన ఆటగాళ్లే ఉన్నారు. టీ20 జట్టులో కుదురుకునే ప్రయత్నం చేస్తున్న యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌ మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే.. దక్షిణాఫ్రికా పిచ్‌లపై రాణిస్తే.. ప్రపంచంలో ఎక్కడైనా ఆడగలరు. అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌లు ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. ఈ ఇద్దరు తమదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ తర్వాతి స్థానాల్లో ఆడుతారు. కుర్రాళ్లు తడబడ్డా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన బాధ్యత హార్దిక్, సూర్యల మీద ఉంది. అర్ష్‌దీప్‌తో కలిసి అవేష్, యశ్‌ దయాళ్‌ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. అక్షర్, చక్రవర్తి స్పిన్‌ కోటాలో ఆడుతారు.

యమజోరు మీదున్న ప్రభాస్.. ఎట్ ఏ టైంలో స్పిరిట్ కూడా !
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ పెంచాడు. తన లైనప్ లో ఇప్పుడు ఏకంగా అరడజన్ కు పైగా సినిమాలున్నాయి. బాహుబలితో ఐదేళ్లు రెండు సినిమాలకే పరిమితమయ్యాడన్న కామెంట్స్ రావడంతో అప్పటి నుంచి వరుస సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో రచ్చ కొనసాగిస్తున్నాడు. గతేడాది సలార్ తో వరుస ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టి.. కల్కి 2898 ఏడితో అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు త్వరలోనే కల్కి 2 సినిమా పనులు కూడా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. అయితే తాజాగా ప్రభాస్ స్పిరిట్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఆయన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. యానిమల్ తర్వాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ మేకర్ భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‎గా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే స్పిరిట్ డిసెంబర్ నుంచి మొదలు పెడితే ప్రభాస్ కూడా తన డేట్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఫౌజి కూడా ప్రస్తుతం సెట్ల మీద ఉంది. ఈ సినిమాలతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. కల్కి 2, ఫౌజి, స్పిరిట్ ఈ మూడు సినిమాలతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన మాస్ స్టామినా చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు.

దేవాలయాల పవిత్రత కాపాడే ‘అఖండ’.. ఈ పాయింట్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందే !
ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. గతేడాది వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఆయన వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో తన అభిమానులను అలరించేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి సినిమాను సూపర్ హిట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. సూపర్ హిట్ మూవీ అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 అని ఈ మధ్యనే గ్రాండ్ గా అనౌన్స్ కూడా చేశారు. అయితే బాలయ్య బాబు చేస్తున్న అఖండ 2 సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఒక న్యూస్ బయటకు లీక్ అయి సంచలనంగా మారింది. ఇందులో ఆయన దేవాలయాల పవిత్రత కాపాడే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు హిందు గ్రంథాల జోలికి వచ్చి.. వాటిని హేళన చేసే వారి భరతం పడతాడట. అఖండ సినిమాలో బాలయ్య బాబు అఘోర లుక్ తో ఆడియన్స్ ని మెప్పించారు. అఖండ 2 లో కూడా అలాంటి పవర్ ఫుల్ పాత్రలో అలరిస్తారని తెలుస్తుంది. బాలయ్య బోయపాటి కాంబో అంటేనే సూపర్ హిట్ అన్నది గత సినిమాలతో ప్రూప్ అయిన సంగతి తెలిసిందే. సింహాతో మొదలైన వారి కాంబో వరుస సినిమాలను చేస్తూ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నారు. అఖండ తర్వాత మళ్లీ అఖండ 2 తోనే మరో సంచలనానికి సిద్ధం అయింది ఈ దిగ్గజ ద్వయం. అఖండ 2 కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదని తెలుస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ కూడా నిర్మి్స్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్యూటీ ఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. అఖండ 2 సినిమా కోసం బాలయ్య తన మేకోవర్ కూడా సంసిద్ధం చేసుకుంటున్నారు. సినిమా ఓపెనింగ్ రోజే పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య సినిమాలో అలాంటి డైలాగ్స్ కోకొల్లలు ఉండేలా చూసుకుంటున్నారట. మొత్తానికి అఖండ 2 ఫ్యాన్స్ ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారో దానికి మించి ఉండేలా చూస్తున్నారు మేకర్స్. ఈ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తుందంటే అఖండ 2 పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డులను నమోదు చేయడం ఖాయమనే చెప్పాలి. అఖండ 2 సినిమాలో కూడా బాలయ్య డ్యుయల్ రోల్ లో నటించే ఛాన్స్ ఉంది.

మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు!
ప్రస్తుత రోజుల్లో వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. మూవీ లవర్స్‌ ఓటీటీల వైపు చూస్తున్నారు. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్‌ సిరీస్‌లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్లాట్​ఫామ్స్ కూడా మూవీస్, వెబ్‌ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్‌కు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. నేడు రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్‌ చిత్రం ‘దేవర-పార్ట్ 1’. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సముద్రం బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన దేవర.. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రికార్డులు నెలకొల్పిన దేవర.. ఓటీటీలో కూడా కొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం. సూపర్ స్టార్ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్‌’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్‌ 10న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ మూవీ కూడా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. రెండు హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చాయని తెలిసి.. మూవీ లవర్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Show comments