Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో విశిష్టంగా నిర్వహించే ఈ మహోత్సవాలు, ఈసారి కూడా ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ అమ్మవారు శాకంబరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించి, ప్రకృతి మాతగా పూజలందుకుంటున్నారు. మొదటి రోజైన ఈరోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ నిమిత్తంగా సుమారు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల సహకారంతో ఈ కూరగాయలు సేకరించబడ్డాయి. ఈ రోజు నుంచి ప్రారంభమైన ఉత్సవాలు జూలై 10వ తేదీతో ముగియనున్నాయి. ఈ మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి విరాళంగా కూరగాయలు సమర్పిస్తూ, శ్రద్ధాభక్తులతో భక్తులు ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ దర్శనలు రద్దు చేశారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా కూరగాయలతో కళకళలాడేలా తీర్చిదిద్దారు.

నేడు శ్రీశైలం పర్యటనకు సీఎం చంద్రబాబు.. నాగార్జున సాగర్‌కు నీటి విడుదల
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు. కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టులోకి లక్షా 62వేల క్యూసెక్కులు దాటి ఇన్‌ఫ్లో వస్తోంది. ఇంకా వరద పెరుగుతూ ఉండటంతో ఈరోజు నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి విడుదల చేయనున్నారు. మరోవైపు.. సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. శ్రీశైలం పర్యటన కోసం విజయవాడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 11 గంటలకు శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకుంటారు.. ఇక, సున్నిపెంట హెలిప్యాడ్ నుండి ప్రత్యేక కాన్వాయ్ లో రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకోనున్నారు.. 11 గంటల నుండి 11:35 వరకు శ్రీస్వామి అమ్మవార్లని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు.. 11:50 నుండి మధ్యాహ్నం 12:10 వరకు శ్రీశైలం జలాశయం వద్ద జలహారతిలో పాల్గొంటారు.. 12:25 నుండి 1:10 వరకు నీటి వినియోగదారుల సంఘంతో సంభాషిస్తారు.. మధ్యాహ్నం1:30 కు తిరిగి సున్నిపెంట హెలిప్యాడ్ నుండి హెలికాప్టర్ లో అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జగన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.. ఇక, ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం తల్లి విజయమ్మను ప్రేమగా పలకరించారు జగన్.. ఈ సందర్భంగా జగన్ ను ఆశీర్వదించారు తల్లి విజయమ్మ.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలలో వైఎస్‌ కుటుంబ సభ్యులు.. ఉమ్మడి కడప జిల్లాలోని వైసీపీ నేతలు.. అభిమానులు ఇలా పెద్ద ఎత్తున తరలివచ్చారు..

తెలంగాణ డిగ్రీ ప్రవేశాల్లో నిరాశ.. 32 శాతం సీట్లు మాత్రమే భర్తీ
తెలంగాణలో డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే, ఈ ఏడాది డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ ఆశించిన స్థాయిలో జరగలేదు. రాష్ట్రంలోని మొత్తం 957 డిగ్రీ కళాశాలల్లో ఉన్న 4,36,947 సీట్లకు గాను, కేవలం 1,41,590 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇది మొత్తం సీట్లలో కేవలం 32 శాతమే కావడం గమనార్హం. ఈ పరిణామం డిగ్రీ విద్య పట్ల విద్యార్థుల ఆసక్తి తగ్గిందా, లేక ప్రవేశ ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోవడంతో, ఉన్నత విద్యా మండలి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి , ఎక్కువ మంది విద్యార్థులకు డిగ్రీ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి, త్వరలో ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.

యువకుడితో టాయిలెట్‌లో నీళ్లు తాగించిన పోలీసులు..!
మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న ఓ 19 ఏళ్ల యువకుడి గెట్‌విన్‌ను మానసికంగా, శారీరకంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిని హింసించడంతో పాటు, టాయిలెట్‌లోని నీళ్లు త్రాగాల్సిన స్థితికి తీసుకెళ్లారన్న ఆరోపణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై అధికారికంగా విచారణ ప్రారంభమైంది. బాధితుడు గెట్‌విన్‌ తల్లి మిల్డ్రెడ్ జైర్వా, జిల్లాకు చెందిన ఎస్పీ వివేక్ సియెంకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి న్యాయం జరగాలన్నదే తన కోరికని ఆమె పేర్కొన్నారు. జూలై 3న ఓ యువకుడితో జరిగిన గొడవ ఘటనకు సంబంధించి పోలీసులు గెట్‌విన్‌ను అన్వేషిస్తూ వచ్చినట్లు ఆమె తన ఫిర్యాదులో వివరించారు.

హిడ్మాను చుట్టుముట్టిన భద్రత బలగాలు.. లొంగిపోతారా..? లేక చచ్చిపోతారా…?
ఛత్తీస్‌గఢ్ బస్థర్ లో 31 మార్చి 2026 వరకు మావోయిస్ట్ లను అంతమొందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే భద్రతబలగాలు హిడుమ.. బార్సే దేవను బలగాలు చుట్టుముడుతున్న.. తప్పించుకుంటున్నారని అనుక్షణం వాళ్ళ లొకేషన్ మారుతుందని అయినప్పటికీ వాళ్లు తమ కనుసన్నల్లోనే ఉన్నారని వారు ఇరువురిని లొంగిపోవాలని లేనిపక్షంలో వారికి చావు తప్పదని బస్టర్ ఐజీ సుందర్ రాజ్ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా నారాయణపూర్ జిల్లా అబూజ్ మాడ్, ఇంద్రావతి నది పరిసర అటవీ ప్రాంతాల్లో అలాగే నేషనల్ పార్క్ ఏరియాల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. గత కొద్ది రోజులుగా ముఖ్యంగా.. మావోయిస్టు పార్టీ జాతీయ సెక్రటరీ నంబాల కేశవరావును అంతమొందించిన అనంతరం.. నేషనల్ పార్క్ ఏరియాలో మరి కొంతమంది ముఖ్య నాయకులను హతమార్చారు.

104కి చేరిన టెక్సాస్ వరద మృతుల సంఖ్య.. కుటుంబాలకు కుటుంబాలే మృత్యువాత
ఆకస్మిక వరదలు టెక్సాస్‌ నగరాన్ని ఘోరంగా దెబ్బకొట్టింది. ఊహించని రీతిలో వరదలు సంభవించడంతో టెక్సాస్ అతలాకుతలం అయిపోయింది. నెలల తరబడి కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల్లోనే కురవడంతో నిమిషాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తేశాయి. పైగా వాతావరణ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ముందు హెచ్చరికలు కూడా లేవు. దీంతో టెక్సాస్ నగర వాసులు ఊహించని ప్రళయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్కసారిగా జలప్రళయం వచ్చినట్లు విపత్తు సంభవించడంతో కుటుంబాలకు కుటుంబాలే వరదల్లో కొట్టుకుపోయాయి. అర్ధరాత్రి కావడంతో తప్పించుకునే మార్గం లేక ప్రాణాలు పోయాయి.

‘రాజాసాబ్’ లోకి మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. మాస్ ఆడియెన్స్‌కు పండుగే !
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎన్నో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆ లిస్టులో ‘ది రాజాసాబ్’ ఒకటి. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ జానర్‌ చిత్రం పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై హైప్‌ పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ పాట కోసం పలు టాప్ హీరోయిన్‌లను చిత్ర యూనిట్ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, చివరకు తమన్నాని ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. తమన్నా ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌కి హాట్ ఫేవరెట్. బాలీవుడ్‌లో అయితే ప్రత్యేకంగా ఆమెను ఐటమ్ నంబర్‌లకు పిలిపించడం కామన్ అయిపోయింది. ఆమెకి ఉన్న డ్యాన్స్ టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను హైలైట్‌గా నిలిపేలా చేస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం తమన్నా ఎంట్రీ కన్ఫర్మ్ అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సమాచారం నిజమైతే ‘ది రాజా సాబ్’ లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్, సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవడం ఖాయం.

‘8 వసంతాలు’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..!
తాజాగా విడుదలైన ‘8 వసంతాలు’ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్లో లవ్ స్టోరీగా యూత్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్, రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా. వీరి నటనకు ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు.. ఒక మహిళ జీవన ప్రయాణంలో ఎదురయ్యే వివిధ మలుపులను ఆవిష్కరించే చిత్రంగా నిలిచింది. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ హృదయానికి హత్తుకునే ట్యూన్స్ ఇచ్చారు. కొన్ని పాటలు ఇప్పటికే యువతను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.

సెకండాఫ్ సమరానికి స్టార్స్ రెడీ.. బోణి కొట్టబోతున్న పవర్ స్టార్
ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ సో సో గా సాగింది. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోల సినిమాలు రాలేదు. ఇక ఇప్పడు సెకండ్ హాఫ్ పైనే డిస్ట్రిబ్యూటర్స్  ఆశలన్నీ. సెకండ్ హాఫ్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నాడుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 24న హరిహర వీరమల్లు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే వారం గ్యాప్ లో జులై 31న కింగ్డమ్ తో వస్తున్నాడు విజయ్ దేవరకొండ.  ఇక కూలీ వస్తున్న ఆగస్ట్ 14నే ఎన్టీఆర్‌, హృతిక్‌ ‘వార్‌2’ రిలీజ్‌ అవుతోంది.  రెండిటిపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ ఓపెనింగ్ కూడా ఉండబోతుంది. ఇక  హనుమాన్‌ తర్వాత యంగ్‌ హీరో తేజ్‌ సజ్జా నటిస్తున్న చిత్రం ‘మిరాయ్‌’ సెప్టెంబర్ 5న వస్తోంది. అదే నెలలో బాలయ్య- బోయపాటి ల బ్లాక్ బస్టర్ అఖండ 2 వస్తోంది. అదే నెలలో పవర్ స్టార్ OG, మెగాస్టార్ విశ్వంభర కూడా ప్లానింగ్ లో ఉంది. ఇక అక్టోబర్‌2న కాంతార 2 రిలీజ్‌ అవుతోంది. కన్నడలో రూ. 18 కోట్లతో తీసిన కాంతార వరల్డ్‌వైడ్‌ రూ. 300 కోట్లకు పైగా రాబట్టింది. రెండేళ్లుగా సీక్వెల్‌ కథను రాసుకున్న రిషబ్‌శెట్టి ఫుల్‌ ఎఫెక్ట్‌ పెడుతున్నాడు. బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌ కావడంతో ఓపెనింగ్స్‌ మామూలుగా వుండదు. ఇక టీజర్‌ రిలీజ్‌ రాజాసాబ్‌కు హైప్‌ తీసుకొచ్చింది. సినిమా డిసెంబర్‌ 5న రిలీజ్‌ అవుతోంది. లవ్‌ టుడే.. డ్రాగన్‌ వంటి వరుస హిట్స్‌తో దూకుపోతున్న ప్రదీప్‌ రంగనాథ్‌కు తెలుగులో మంచి మార్కెట్‌ అందుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రదీప్‌తో తీస్తున్న డూడ్‌ మూవీ దీపావళికి రిలీజ్‌ అవుతోంది.యూత్‌లో క్రేజ్‌ వున్న ప్రదీప్‌ మంచి ఓపెనింగ్స్ రాబడతాడు. ఫస్టాఫ్ కాస్త నిరాశ పరిచిన సెకండాఫ్ కాస్త ఆశలు పెంచుతోంది. మరి వీటిలో హిట్ అయ్యేది ఎవరో చూడాలి.

Exit mobile version