Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు వైఎస్‌ జగన్‌ కీలక భేటీ..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రతీ నెలలో కచ్చితంగా ఒకసారి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతూ ఫీడ్ బ్యాక్ అప్‌డేట్‌ చేస్తున్నారు.. నేతలతో వరుస సమావేశాల్లో భాగంగా ఇవాళ వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న జగన్.. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.. ఈనెల 9న తొలిసారి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరుబాటకు వైసీపీ సిద్ధమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇప్పటి వరకు కూటమి సర్కార్ వ్యతిరేక విధానాలపై వైసీపీ ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు వంటివి వివిధ రూపాల్లో చేస్తున్నా కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే హాజరవుతూ వచ్చారు.. 9వ తేదీన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రత్యక్ష పోరుకు ఆయన సిద్ధమయ్యారు.. దీంతో సమావేశంలో మెడికల్ కళాశాలల పీపీపీ అంశం, రాష్ట్రంలో నకిలీ మద్యం సహా పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉంది.. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశాల్లో జగన్ 2.0 తో డిజిటల్ బుక్ వంటి సంచలనాలకు తెర తీసిన జగన్.. ఇవాళ్టి సమావేశంలో నేతలకు ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది..

విజయవాడలో ఫ్యాప్టో (FAPTO) ఆందోళన.. డిమాండ్లు ఇవే..
ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కుల కోసం ఫ్యాప్టో (FAPTO) పిలుపు ఇచ్చింది.. ఇవాళ ఉదయం 10 గంటలకు ధర్నాచౌక్ లో FAPTO పోరుబాట నిరసన ధర్నా చేపట్టనుంది.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ధర్నాకు సిద్ధం అయ్యారు ఉపాధ్యాయులు.. విజయవాడ ధర్నా చౌక్ కు వేలాది మంది ఉపాధ్యాయులు తరలిరానున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని టీచర్లు విమర్శిస్తున్నారు..

ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. నేడు పైడితల్లి సిరిమానోత్సవం..
ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.. మరోవైపు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.. హుక్కుం పేటలో సిరిమానుకు పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారు భక్తులు.. పైడితల్లి అమ్మావారి సిరిమానోత్సవ సందర్భంగా నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. నగరపాలిక పరిధిలో బయో మరుగుదొడ్లు సిద్ధం చేశారు.. ఉత్సవాలు జరిగే వేదికలతో పాటు జాతరకు సంబంధించిన ప్రధాన కేంద్రాల వద్ద టాయిలెట్లను అందుబాటులో ఉంచారు అధికారులు.. పారిశుద్ధ్య పనులకు అదనంగా నియమించారు.. వీరంతా మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.. క్యూలైన్లలో భక్తుల కోసం ఎక్కడికక్కడ నీళ్లను అందిస్తున్నారు.. ఇక, పైడితల్లి సిరిమానోత్సవంలో భాగంగా.. ఇవాళ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు.. ఇక, చీకటి పడకముందే సిరిమానోత్సవాన్ని ముగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తు్న్నారు అధికారులు.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడిమాంబ సిరిమానోత్సవం తిలకించడం ఓ అనుభూతి. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు ఈ రోజు తొమ్మిదో సారి సిరిమానుపై నుంచి భక్తులను ఆశీర్వదించనున్నారు. హుకుంపేటకు చెందిన వెంకటరావు ఇప్పటి వరకు 8 సార్లు సిరిమాను అధిరోహించారు. ఇక, వెంకటరావు తండ్రి బంటుపల్లి బైరాగినాయుడు 27 సార్లు సిరిమానును అధిరోహించారు.. పూర్వం నుంచి పతివాడ, బంటుపల్లి వారసులే సిరిమానుపై కూర్చోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే..

నా పిల్లల్నే కొడతావా.. తండ్రి ప్రాణం తీసిన పిల్లల పంచాయితీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్ కేసర్ పరిధిలోని ఔషపూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లల పంచాయతీ వల్ల ఏకంగా తండ్రి బలి అయ్యాడు. అయితే, ఇద్దరు చిన్నారులు గొడవ పడడంతో అమీర్ అనే వ్యక్తి మందలించాడు. ఇక, తన కొడుకునే మందలించాడనే కోపంతో అమీర్ ఇంటి మీదకు వెళ్ళి మరీ అలీ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ సందర్భంగా ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా.. వారి కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. ఇక, గొడవ పడిన తర్వాత తనకు ఛాతీలో నొప్పి వస్తుందని అమీర్ తన భార్యకు చెప్పాడు. దీంతో అతడ్ని తీసుకుని హుటాహుటిన ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే, అమీర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, విషయం తెలుసుకున్న దాడికి పాల్పడిన అలీ స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అలీ దాడి చేయడంతోనే అమీర్ చనిపోయాడని అంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డు మీద కూర్చొని పెద్ద ఎత్తున నిరసన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేడు సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ..
తెలంగాణ కాంగ్రెస్‌లో నేడు ( అక్టోబర్ 7న) కీలక పరిణామాలు చోటు చేసుకోనుంది. ముఖ్యంగా, బీసీ నేతల అత్యవసర సమావేశం ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు జరగనుంది. రేపు ( అక్టోబర్ 8న) హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌పై రేపు వాదనలు జరగనున్న నేపథ్యంలో.. ఈ భేటీలో పార్టీ తరఫున తీసుకోవాల్సిన నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన బీసీ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. వీరి సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించిన అభ్యర్థి ఎంపిక, సమర్థవంతమైన ప్రచార వ్యూహం లాంటి కీలక అంశాలపై నేతలు డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలోనే పార్టీ తలపెట్టిన మరో ముఖ్య కార్యక్రమం ‘బస్తీ బాట’ నిర్వహణ తేదీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయ కార్యకలాపాలు మరింత స్పీడ్ కానున్నాయి.

భారత ఆత్మపై దాడి చేశారు.. గవాయ్‌పై దాడిని ఖండించిన కేజ్రీవాల్
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు. ఇక గవాయ్‌పై దాడి యత్నాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ఖండించారు.  ఇలాంటి దాడులను సహించబోమని మోడీ పేర్కొన్నారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలు పార్టీల నేతలు ఖండించారు. తాజాగా ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. భారత ఆత్మపై దాడిగా అభివర్ణించారు. సీజేఐ బీఆర్ గవాయ్‌పై దాడిని ఖండించారు. గవాయ్‌పై బూటు విసిరే ప్రయత్నం కేవలం ఒక న్యాయమూర్తిపై జరిగిన దాడి మాత్రమే కాదని.. భారతదేశ ఆత్మపై జరిగిన దాడి.. ఈ దేశ న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ‘‘ఒక దళిత కుమారుడు కష్టపడి పనిచేసి.. నిజాయితీ ద్వారా దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. దీనిని కొందరు సహించలేకపోతున్నారు. నిందితుడి మద్దతుదారులు సీజేఐను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఈ దేశం ఈ రకమైన రాజకీయాలను ఎప్పటికీ సహించదు.’’ అని ఎక్స్‌లో కేజ్రీవాల్ రాసుకొచ్చారు.

ఇజ్రాయెల్-హమాస్ శాంతి చర్చల్లో పురోగతి.. ఈజిప్టు చర్చలు ఫలించినట్లు సమాచారం!
ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తొలి రౌండ్ పరోక్ష చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి హమాస్-ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. దీంతో సోమవారం ఈజిప్టు రిసార్ట్‌లో పరోక్ష చర్చలు జరిగాయి. దీనికి హమాస్‌ బృందానికి ఖలీల్‌ అల్‌ హయ్యా నేతృత్వం వహించగా.. ఇజ్రాయెల్‌ బృందానికి నెతన్యాహు సన్నిహితుడు రాన్‌ డెర్మర్‌ నాయకత్వం వహిస్తున్నారు. కాల్పుల విరమణ, బందీల విడుదల, పాలస్తీనా ఖైదీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్‌ దళాల పాక్షిక ఉపసంహరణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ చర్చలు ఎర్ర సముద్ర తీరంలోని షర్మ్‌ ఎల్‌-షేక్‌ రిసార్టులో జరిగాయని ఈజిప్టు అధికారి తెలిపారు. అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్, ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సోమవారం ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినట్లుగా అల్-ఖేరా న్యూస్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు దాడులు ఆపాలని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం దాడులు ఆపలేదు. గత 24 గంటల్లో కనీసం 19 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 అక్టోబర్‌ 7 నుంచి మొత్తం 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు మంత్రిత్వ శాఖ నివేదించింది.

నేటితో గాజా-ఇజ్రాయెల్ వార్ రెండేళ్లు పూర్తి.. కొలిక్కిరాని ట్రంప్ శాంతి చర్చలు
అక్టోబర్ 7, 2023 ఎవరూ మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు. హమాస్ ముష్కరులు ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,200 మందిని చంపి దాదాపు 251 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇజ్రాయెల్‌నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఇక అంతే వేగంగా ఇజ్రాయెల్ కూడా ప్రతి స్పందించి హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టింది. ఈ క్రమంలో వందలాది మంది పాలస్తీనీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాడు మొదలైన యుద్ధం.. నేటికీ కొనసాగుతోంది. ఈరోజుతో (07-10-2025) గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై రెండేళ్లు పూర్తైంది. గాజా ప్రస్తుతం శవాల దిబ్బగా మారింది. ఎటుచూసినా కూలిన బిల్డింగ్‌లతో కళావిహీనంగా మారింది. ప్రస్తుతం ట్రంప్ శాంతి ఒప్పందానికి 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. బందీలందరినీ ఒకేసారి విడుదల చేసేందుకు హమాస్ ఒప్పుకుంది. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. సోమవారం ఈజిప్టు వేదికగా శాంతి చర్చలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ బందీలను మాత్రం హమాస్ విడుదల చేయలేదు.

ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి గడ్కరీ గుడ్ న్యూస్..
ఢిల్లీలో 20వ FICCI ఉన్నత విద్యా సదస్సు 2025లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వెహికిల్స్ ధరకు సమానంగా మారతాయని తెలిపారు. మరో ఐదేళ్లలోపు, భారత్ లోని ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా మార్చడమే మా టార్గెట్ అన్నారు. నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడూ ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లుగా ఉండేది.. ఇప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.22 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.78 లక్షల కోట్లు ఉందని అంచనా వేయగా, చైనా రూ.47 లక్షల కోట్లు, భారత్‌ రూ.22 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే, ఉదాహరణకు టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ.731,890 నుంచి స్టార్ట్ అవుతుంది.. అదే సమయంలో టాటా నెక్సాన్ ఈవీ రూ.12.49 లక్షల నుంచి మొదలుకానుంది.. ఈ రెండు కార్ల మధ్య గణనీయమైన వ్యత్యాసాన్ని గమనించవచ్చు.. SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలు లాంటి ఇతర విభాగాలలో కూడా ఇదే విధమైన ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఈవీల ధరలు అధికంగా ఉంటాయి. కానీ, తాజాగా నితిన్ గడ్కరీ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది.

వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ కొడుకు
టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ క్రికెట్‌లో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నాడు. అండర్-19 వన్డే టోర్నమెంట్ అయినా వినూ మన్కడ్ ట్రోఫీ కోసం ప్రకటించిన కర్ణాటక జట్టుకు అన్వయ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక, యువ క్రికెటర్లకు తమ సత్తాను నిరూపించుకోవడానికి వినూ మన్కడ్ ట్రోఫీ ఒక వేదిక అని చెప్పాలి. ఈ టోర్నమెంట్‌లో అన్వయ్‌కు కెప్టెన్సీ దక్కడం అతను స్థిరమైన ప్రదర్శనను తెలియజేస్తోంది. 18 ఏళ్ల అన్వయ్ గత సీజన్‌లో కర్ణాటకకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇటీవలి కాలంలో అన్వయ్ ద్రవిద్ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అతను వరుసగా రెండో సీజన్‌లో కూడా కర్ణాటక రన్ ఛార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 459 పరుగులు చేసి, 91.80 సగటుతో అద్భుతంగా రాణించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అన్వయ్ స్థిరమైన బ్యాటింగ్ తో కర్ణాటక క్రికెట్లో కీలకంగా మారిపోయాడు. అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స్, ఎస్. మణికంఠ్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి. వైభవ్, కులదీప్ సింగ్ పురోహిత్, రతన్ బి.ఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాలవీయ, సన్నీ కంచి మరియు రెహాన్ మహమ్మద్ (వికెట్ కీపర్).

అది నా రెండో ఇల్లు.. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ, కొత్త విషయాలను పంచుకుంటుంది. ఫ్యాన్స్‌కి ఎప్పుడూ ప్రేరణాత్మకంగా, పాజిటివ్‌ మెసేజ్‌లు ఇస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ . ఈ క్రమంలో ఒక ఫ్యాన్ “మీ జీవితాన్ని మార్చిన కొటేషన్ ఏది?” అని అడిగినప్పుడు, సమంత “మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి విషయం మనకు పాఠాలు నేర్పిస్తుంది. అలాంటి వాటి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడం చాలా ముఖ్యం” అని తెలిపింది. ఇంకా ఫ్యాన్స్ ఆమె తదుపరి తెలుగు ప్రాజెక్ట్ గురించి అడిగారు. సమంత “మా ఇంటి బంగారం” చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభమవుతుంద‌ని స్పష్టం చేసింది. గతంలో ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం సినిమా‌ల నుంచి విరామం తీసుకున్న సమంత, ఇప్పుడు మళ్లీ యాక్టివ్‌గా ఉందని చెప్పడం, ఆమె అభిమానులను ఆనందపరిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా సమంత ప్రొడక్షన్ హౌస్ పేరుతో నూతన కథానాయికలను పరిచయం చేస్తూ, మరిన్ని అనుభూతులు పంచనుంది. అదేవిధంగా, “ఈశా ఫౌండేషన్ అంటే ఎందుకు ఇష్టం?” అనే ప్రశ్నకు సమంత జవాబు ఇ‌స్తూ, “అది నా రెండో ఇంటి లాగే ఉంది. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది” అని తెలిపింది. ఫ్యాన్స్ కోసం తన నిజమైన భావాలను పంచుకుం‌టూ, సమంత మళ్లీ తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నది. ఆరోగ్య సమస్యల తరువాత మళ్లీ చురుకైన, పాజిటివ్‌ సమంతను చూసి ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోతున్నారు.

‘లోక’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్  నిర్మించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్ లీడ్ రోల్స్ లో నటించిన  ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా ‘కొత్త లోక’ సినిమాటిక్ యూనివర్స్ లోని ఫస్ట్ పార్ట్ గా తెరకెక్కింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ‘కొత్త లోక చాఫ్టర్ 1’ తోలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. డే 1 నుండే రికార్థులు కొల్లగొట్టడం మొదలు పెట్టింది లోక. ఇటీవల రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ను దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కలెక్షన్లతో మలయాళ ఆల్ టైమ్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ ను దాటి న్యూ మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది లోక చాప్టర్ 1. ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ తో సూపర్బ్ గా రన్ ఆవుతోంది లోక. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన లోక ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు అవుతోంది. ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపద్యంలో ఈ బ్లాక్‌బస్టర్ సినిమాను అక్టోబర్ 20 స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగుతో పాటు అన్ని పాన్ ఇండియా భాషలలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో తెస్తుంది హాట్ స్టార్. థియేటర్ లో రికార్డులు కొల్లగొట్టిన లోక ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

జక్కన్న స్పెషల్ ప్లాన్.. మహేశ్ -ప్రియాంక చోప్రా ఫోక్ సాంగ్ రెడీ!
సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై ఫ్యాన్స్‌కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకూ మహేశ్ ను ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. మహేష్ కెరీర్‌లోనే ఇది గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఫోక్ సాంగ్ ప్లాన్ చేసారట. మ్యాజిక్ మ్యూజిషియన్ ఎం.ఎం. కీరవాణి దీనికి మాస్ బీట్ ఇస్తుండగా, టాప్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ పాటకు స్టెప్స్ వేశారట. మరి ఈ పాటలో మహేష్ బాబుతో పాటు హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా స్క్రీన్ షేర్ చేయబోతున్నది. మహేష్ – ప్రియాంక కాంబోలో ఎప్పుడూ చూడని ఎనర్జిటిక్ స్టెప్స్ ఉండబోతున్నాయని టాక్. ఈ స్పెషల్ సాంగ్ స్క్రీన్‌పై పడితే థియేటర్స్‌లో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version