శరన్నవరాత్రులు… మహాచండీగా దుర్గమ్మ దర్శనం..
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి.. రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. ఇక, 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ అలంకాం ప్రత్యేకత ఏంటి? ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అలంకరించారంటే..? అనే విషయాల్లోకి వెళ్తే.. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి అయిన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఐదవరోజుకు చేరాయి. అందులో భాగంగా నేడు మహచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది.. చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు.. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే అంటున్నారు పండింతులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులు మారడం ఏ కోర్కెలకోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయనేది విశ్వాసం.
మద్యం షాపులకు మందకోడిగా టెండర్లు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. ప్రైవేట్ మద్యం షాపులకు టెండర్లు పిలిచింది.. అయితే, ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా దాఖలవుతున్నాయి టెండర్లు. ఆరు రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గానూ కేవలం 8,274 టెండర్లే దాఖలు అయ్యాయి.. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయంటోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు వస్తున్నట్టు అంచనావేస్తున్నారు.. మరో మూడు రోజుల్లో టెండర్ల దాఖలు గడవు ముగియనుంది.. ఇప్పటి వరకు అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలు కాగా.. అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లే దాఖలు చేశారు.. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. మద్యం టెండర్లల్లో సిండికేట్ కాకుండా చూసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది సర్కార్. ఈ మేరకు జిల్లా అధికారులకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సూచనలు చేశారు.. 15-20 వేల టెండర్లు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేయగా.. ఇప్పటి వరకు 9 వేలు కూడా దాటని పరిస్థితి ఉంది.. టెండర్లకు మరో మూడు రోజుల గడువు ఉండడంతో టెండర్లు ఎన్ని వస్తాయోనేది ఉత్కంఠగా మారింది.. కాగా, ఈ నెల 11 తేదీన ఉదయం 8 గంటలకు లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించనున్నారు అధికారులు. ఏ జిల్లాకు ఆ జిల్లాల్లోనే లాటరీ తీయనున్నారు.
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన కాకినాడ కస్టమ్స్ అధికారి..
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు కాకినాడ కస్టమ్స్ అధికారులు.. కాకినాడకి చెందిన శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి భరత్ నుంచి రూ.3,18,200 లంచం తీసుకుంటుండగా.. పోర్టు కస్టమ్స్ సూపరిడెంట్ వై శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు.. సూపరింటెండెంట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. పోర్ట్ అసిస్టెంట్ కమిషనర్, ఇతర కస్టమ్ అధికారుల నుంచి 27.74 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. మొత్తం పోర్ట్ అధికారుల నుంచి 31 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు.. ఈ కేసులో మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.. ఇక, విశాఖ సీబీఐ కోర్టులో నిందితులను హాజరుపరచగా రిమాండ్ విధించింది న్యాయస్థానం.. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని.. దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటన విడుదల చేశారు ఎస్పీ.. అరెస్ట్ అయినవారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్, ఇతర అధికారుల నుంచి 27.74 లక్షలు స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు.. అయితే, లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కడం సంచలనంగా మారింది..
నేడు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ, నవవాత్రి ఉత్సవాలు ఘటనంగా కొనసాగుతున్నాయి. ఊరూరా శోభాయమానంగా ఆడపడుచులు అంతా కలిసి కన్నుల పండువగా వేడుకలు జరుపుకుంటారు. మహిళలంతా ముస్తాబయి ఒకే చోట చేరి బతుకమ్మ ఆట పాటలతో ఆనందంగా జరుపుకుంటున్నారు. అయితే బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. కాగా.. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందని పూరాణ గాధ ఉంది.. అందుకని ఇవాళ బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కావున ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. ఇవాళ బతుకమ్మకు నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. దీంతో ఇవాళ ఆడపడచులందరూ కలిసి బతుకమ్మ అలక తీరాలని ప్రార్థిస్తారు. ఇక మళ్లీ ఏడోనాడు నుంచి అంగరంగ వైభవంగా బతుకమ్మ కొనసాగుతుంది… కాగా.. దుష్ట సంహారం కోసం నడుం బిగించిన అమ్మవారికి మేమంతా తోడుగా ఉన్నామని మహిళలు అందరూ ఆటపాటలతో.. చప్పట్లతో తోడుగా నిలుస్తారు. ఉత్సాహపరుస్తారు. ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్యతో బతుకమ్మ ప్రారంభమవుతుంది. తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. బతుకమ్మకు తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు ప్రత్యేకమైన ప్రసాదం అందిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. బతుకమ్మలో ప్రత్యేకంగా గౌరమ్మను కూడా తయారుచేస్తారు. ఆడబిడ్డలు ఒకరికొకరు వాయివాయినాలు కూడా ఇచ్చుకుంటారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో వున్న తెలంగాణ వాసులు కూడా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటూ ఆనందంగా గడుపుకుంటారు.
పెళ్లి ముహూర్తాలు షురూ.. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తేదీలు ఇవే..
ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవడానికి వరుడు, వధువు బంధుమిత్రులతో పాటుగా శుభముహూర్తాలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈనెల (అక్టోబర్) 5 నుంచే వివాహానికి శుభ ఘడియలు మొదలయ్యాయి. దీంతో నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. ఈ మూడునెలల (అక్టోబర్, నవంబర్, డిసెంబర్)లో మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్టు పురోహితవర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఐదేళ్లలో మూడు జిల్లాల్లో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా వచ్చే మూడు నెలల్లో దాదాపు 5 వేల పెళ్లిళ్లు జరగనున్నట్టు ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్‌హాళ్ల నిర్వాహకులు చెబతున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్ లు కూడా పెరిగాయని అంటున్నారు. ఈనెల (అక్టోబర్) పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైనదని రాష్ట్ర అర్చక సంఘం కన్వీనర్ శ్రీరంగం గోపీ కృష్ణమాచార్యులు తెలిపడంతో పెళ్లిళ్ల సన్నాహాలు మొదలుపెట్టేశారు. దీంతో అక్టోబర్ నెల రాకముందు నుంచే వివాహం కోసం ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్‌హాళ్లకు బుకింగ్‌లు మొదలయ్యాయి. అక్టోబరు 12,13,16,20,27 కాగా.. నవంబర్‌లో 3,,7,8,9,10,13,14,16,17, ఇక డిసెంబర్‌లో అయితే.. 5,6,7,8,11,12,14,15,26 ఇలా మూడు మాసాల్లో ముహూర్తాల తేదీలు వున్నాయి. అనగా.. ఇలా మూడు మాసాలు కలిపి సుమారు 25 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజా భజంత్రీలు, మండపాలను అలంకరించే వారికి, కేటరింగ్ వారికి కూడా ఓ రైంజ్ లో ఆర్డర్లు మొదలయ్యాయి. దీంతో దసరా ఉత్సవంతో పాటు శుభకార్యాలకు అనువైన నెల కావడంతో మార్కెట్‌లోనూ సందడి మొదలైంది…. కాగా వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాల్లో అమ్మకాలు కూడా భారీగానే పెరిగినట్టు వ్యాపార వర్గాలు తెలుపుతున్నారు. బంగారం ధర పెరిగినప్పటికీ నగలు చేయించుకునేందుకు ఆర్డర్లు వస్తున్నాయని వెల్లడించారు.
మోడీ ప్రసంగాలు వినే ఉద్దేశ్యం లేకనే నేను పార్లమెంట్ కు వెళ్ళలేదు..
మోడీ ప్రసంగాలు వినే ఉద్దేశ్యం లేకనే నేను పార్లమెంట్ కు వెళ్ళలేదని ఎం.ఐ.ఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్ లో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. పిసీసీ చీఫ్ గా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం ఉందని మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర సెక్రటేరియట్ తో పాటు బాపు ఘాట్ ఇంకా ఎన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర పరిపాలన విభాగం ఎఫ్ టి ఎ లో ఉన్నపుడు లేని ఇబ్బంది పేదల ఇల్లు ఉంటే ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు. అభివృద్ధి కి మేం మద్దతు ఇస్తాం .కానీ పేదలు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. నిజామాబాద్ లో మజ్లిస్ పార్టీ నీ బలోపేతం చేసుకుంటామన్నారు. మోడీ పాలనలో ముస్లిం మైనార్టీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
ఇజ్రాయెల్ దెబ్బకి భయపడి గగనతలం మూసి మళ్లీ తెరిచిన ఇరాన్
ఇరాన్‌పై దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమాన్ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ అలర్ట్ అయింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం (అక్టోబర్7) ఉదయం 6 గంటల దాకా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసింది. అయితే విమానాల భద్రతకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత ఈ రోజు విమాన సర్వీసులన్నింటినీ పునరుద్ధరించినట్లు సివిల్ ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. ఇక, అక్టోబర్ 7 సందర్భంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందేమోనన్న భయంతోనే ఇరాన్ తన గగనతలంలో విమానాలను క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్7వ తేదీన ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి వేల మందిని హతమార్చారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ అటు హమాస్ ఇటు హెజ్బొల్లా గ్రూపులపై దాడులు కొనసాగిస్తునే ఉంది. ఈ తీవ్రవాద గ్రూపులన్నీ ఇరాన్ స్నేహితులే కావడంతో అలర్ట్ అయింది. అయితే, హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లాతో సహా దాని ఆ గ్రూపు యొక్క టాప్ కమాండర్లను ఇజ్రాయెల్ చంపినందుకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడికి దిగింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిజ్ఞ చేశారు. ఇక, బీరూట్‌లో వైమానిక దాడిలతో పాటు హిజ్బుల్లాకు చెందిన నేతలను వరుసగా ఇజ్రాయెల్ చంపేస్తూ వస్తుంది. పేజర్లు, వాకీ-టాకీలతో పేళ్లులు జరిపింది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ దళాలు.
అది పెద్ద తలనొప్పి అయ్యింది: సూర్యకుమార్
మైదానంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేది కెప్టెన్‌గా తనకు పెద్ద తలనొప్పి అయ్యిందని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే జట్టులో ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మంచిదన్నాడు. టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు రాణించడంతోనే బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించామని చెప్పాడు. ప్రతీ మ్యాచ్‌లో మెరుగుపర్చుకోవడానికి ఏదో ఒక అంశం ఉంటుందని సూర్య చెప్పుకొచ్చాడు. ఆదివారం గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘మా నైపుణ్యాలకు తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నించాం. జట్టు సమావేశాలలో మేం రచించిన వ్యూహాలను మైదానంలో అమలు చేశాం. ఈ కొత్త మైదానంలో మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. మేం బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేది కెప్టెన్‌గా పెద్ద తలనొప్పి అయ్యింది. అయితే ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మంచిది. ప్రతీ మ్యాచ్‌లో ఏదో ఒక విజయాన్ని నేర్చుకోవచ్చు. అలానే కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంటుంది. దాని గురించి మేం మాట్లాడుకుంటాం. ఇక తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి’ అని చెప్పాడు.
పవన్ సార్ అపాయింట్మెంట్ ఇప్పించండి.. ఓ మంచి పని చేయించాలి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయిదు వారాలను పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా కొత్తగా మళ్లీ ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. వచ్చిన ఎనిమిది మంది కూడా గత బిగ్ బాస్ సీజన్స్ లో పాల్గొన్నవాళ్లే. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో హౌసులో కంటెస్టెంట్లకు టాస్కులు పెట్టేందుకు, తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు కొంతమంది సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ హౌసులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ప్రమోషన్ నిమిత్తం షాయాజీ షిండే, హీరో సుధీర్ బాబు, హీరోయిన్ ఆర్ణా కూడా వచ్చారు. ఈ సినిమాతో మరోసారి వీళ్లంతా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. బిగ్ బాస్ స్టేజిపై సుధీర్ బాబు షాయాజీ షిండే గురించి మాట్లాడుతూ ఖాళీ ప్రదేశం కనిపిస్తే మొక్కలు నాటుతారని అన్నారు. దీంతో నాగార్జున కారణం అడగ్గా షాయాజీ షిండే మాట్లాడుతూ.. మా అమ్మ చనిపోయే ముందు నా దగ్గర ఇంత డబ్బు ఉండి కూడా ఆమెను బతికించుకోలేకపోతున్నాను.. నేనేం చేయగలను అని ఆలోచించాను. అప్పుడు మా అమ్మ బరువుకు సమానమైన విత్తనాలను తీసుకొచ్చి ఇండియా మొత్తం నాటాలని ఫిక్స్ అయ్యాను. అవి పెరిగి పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూస్తుంటే మా అమ్మ నాకు గుర్తొస్తుంది. సాధారణంగా ఆలయాలకు వెళ్తే ప్రసాదం ఇస్తారు. ప్రసాదంతో పాటు ఓ మొక్క కూడా ఇస్తే బాగుంటుంది.
తెలుగు ప్రేక్షకులను కాదు.. తెలుగు భాషను అగౌరవిస్తున్నారు..?
ఇటీవల కాలంలో తెలుగు భాషను తెలుగు ప్రేక్షకులను, తెలుగు భాషను అగౌరవిస్తున్నారు తమిళ చిత్ర నిర్మాతలు. ఇతర భాషలు హీరోల సినిమాలు తెలుగులో రిలీజ్ అయినప్పుడు కనీసం పేరు కూడా మార్చకుండా ఇతర భాష టైటిల్ ను తెలుగులో వాడేస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచి విధానం కాదు. ఈ పద్ధతి ఓక రకంగా తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నట్టే లెక్క. ఒకప్పుడు “డబ్బింగ్” సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమా లో, ఇతర భాషలలో ఉండే బోర్డు లని తెలుగులోకి చక్కగా మార్చేవారు. కానీ ఏ మధ్య కాలంలో కనీసం ఆ చిన్న పని కూడా మానేసి విడుదల చేస్తున్నారు. రజనీ కాంత్ ‘ వేట్టయన్’ టైటిల్ ను కనీసం తెలుగులో మార్చండి అని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు కొందరు పంపిణి దారులు. అదొక్కటే కాదు తునీవు, వలిమై, తంగలాన్, కంగువా అసలు వీటి అర్ధం ఏమిటో సినిమా చూసే ప్రేక్షకుడికి తెలియకుండా ప్రేక్షకుడు చూడాలి అని మనపై రుద్దుతున్నారు. వారి వారి భాష లలో వారి భాష గొప్పదనాన్ని, కళాత్మకతని గౌరవించుకోవాలి, అలాగే తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. తెలుగుని గౌరవించని వాళ్ళని కూడా తెలుగువాళ్లు గౌరవించడం, ఆదరించడం, ఆ చిత్రాలని చూడ్డానికి మన డబ్బులు ఖర్చుపెట్టడం మన గొప్పతనం కాదు. డబ్బింగ్ సినిమా రైట్స్ కొనుగోలు దారులు కూడా చూస్తున్నాం కదా అని ఈ మద్య ఎలా పడితే అలా చేస్తున్నారు. ఎలా ఉన్నా చూస్తారు లే అన్నట్టు చేస్తున్నారు. మనం పర భాష సినిమాలు ఆదర్శిస్తున్నాం అంటే అది మన సంస్కారం . అలాగని పేరు కూడా మార్చకపోవడం, సబబు కాదు.