NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రెస్టారెంట్‌కు రిమాండ్‌ ఖైదీ.. ఏడుగురు పోలీసులపై వేటు
విధుల్లో నిర్లక్ష్యం వహించిన గుంటూరు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి.. రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల విందు భోజనం అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో హల్‌ చల్‌ చేస్తోన్న విషయం విదితమే.. బోరుగడ్డ అనిల్‌ను మంగళగిరి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. ఆ తర్వాత రాజమండ్రి జైలుకు తరలించే క్రమంలో.. రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‍ను డిన్నర్ కోసం ఏలూరు సమీపంలో ఓ రెస్టారెంట్‍కు తీసుకెళ్లారు పోలీసులు… అయితే, ఆ వీడియోలో కాస్తా వైరల్‌గా మారాయి.. పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.. ఇప్పటికే కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో.. ఇది తెరపైకి వచ్చింది.. దీంతో సీరియస్ గా స్పందించి సస్పెన్షన్ వేటు వేశారు పోలీసు ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు అధికారులు.

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం
రాజమండ్రి విమానాశ్రయంలో తుపాకీ బుల్లెట్లు కలకలం సృష్టించాయి.. విజయవాడకు చెందిన ఎం.సుబ్బరాజు అనే ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్లేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి రాగా.. టెర్మినల్ భవనంలోకి వెళ్తున్న సమయంలో ఆయన వద్ద బుల్లెట్లు ఉన్నట్లు స్కానింగ్ లో తేలింది.. వెంటనే అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది.. సుబ్బరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, సుబ్బరాజుకు లైసెన్సుడు గన్ ఉందని.. తుపాకీ లోడ్ చేసే సమయంలో బుల్లెట్లు తన వద్ద ఉండిపోయాయని పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది.. మొత్తంగా 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకుని, సుబ్బారాజును కోరుకొండ పోలీసుస్టేషన్ కు తరలించారు.. ఇక, పీఎస్‌లో సుబ్బరాజును ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం.. విమానాశ్రయం నిబంధనల ప్రకారం బుల్లెట్లతో ప్రయాణించే క్రమంలో సంబంధిత ప్రయాణికుడి‌పై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు సుబ్బారాజుపై కేసు నమోదు చేయనట్టుగా తెలుస్తుండగా.. ఈ కేసులో పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు.. ఎలా ముందుకు వెళ్తారు అనేది చర్చగా మారింది..

మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు.. అర్ధరాత్రి వరకు సోదాలు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఇంట్లో, వ్యాపార సంస్థల్లో దాడులు నిర్వహించారు ఆదాయపన్నుశాఖ అధికారులు.. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు.. ఈ రోజు కూడా ఆయనకు సంబంధించిన వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్న వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించనున్నారని సమాచారం.. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో గ్రంధిపై ఆరోపణలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాల్లో నిన్న ఏకకాలంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేశారు. కేంద్ర పోలీసు బలగాల భద్రత నడుమ ఐటీ అధికారులు భీమవరంలోని గ్రంధి శ్రీనివాస్‌ ఇంటికి చేరుకుని.. రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రొయ్యల వ్యాపారంలో గ్రంధి శ్రీనివాస్‌కు ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఉన్నాయి. భీమవరంలోని ఇతర రొయ్యల వ్యాపారులతో లావాదేవీలు సాగించినట్టు తెలుస్తోంది.. మొత్తంగా.. గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి..

తెలంగాణను వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
తెలంగాణపై చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌ తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా తెల్లవారుజామున పొగ మంచును కప్పేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 గంటల తర్వాత కూడా ప్రభావం అలాగే ఉంది. దీంతో రోడ్ల పైకి వచ్చే వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో సాధారణ, రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 2024 జనవరి సీజన్‌లో హైదరాబాద్ నగరంలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది, అయితే ఈసారి అది మరింత తక్కువగా ఉండే అవకాశం ఉందని భారత మెట్రాలజీ విభాగం స్పష్టం చేసింది. ఇక.. ఈసారి ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు ఇవే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో రక్తనాళాలు కుంచించుకుపోవడంతో పాటు రక్తం గడ్డ కట్టే సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వేడి పదార్థాలనే ఆహారంగా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వండుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. కనీసం ఏడాదికి ఒక సారైనా బాడీ చెకప్ చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ వయస్సులోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్​, ఫేస్బుక్ నిషేదం
16 ఏళ్లలోపు పిల్లలను సోషల్మీడియాకు దూరంగా ఉండేలా ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తుంది. ఆన్లైన్ నుంచి పిల్లలను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. ఈ ఏడాది చివరిలో ప్రవేశ పెట్టనున్న ఈ కొత్త చట్టం పిల్లలు, టీనేజర్లకు సోషల్మీడియా ప్లాట్ఫామ్స్​ చేస్తున్న నష్టానికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా తాము భావిస్తున్నామని తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలు తమ సైట్లను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి సోషల్మీడియా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల అంగీకారం ఉన్నా.. పిల్లలకు ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ పేర్కొన్నారు. కాగా, యాక్సెస్ను నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఉందని ప్రధాని అల్బనీస్ తెలిపారు. పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని నిర్ధరించడానికి టెక్కంపెనీలను జవాబుదారీగా ఉండాలన్నారు. ఇక, ఆస్ట్రేలియా పార్లమెంట్​లో ఆమోదం పొందిన 12 నెలల తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తుందన్నారు. అయితే, ఈ చట్టం అమల్లోకి వచ్చే సమయానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పిల్లలపై ఎలాంటి నిషేధం ఉండదని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడించారు.

ఆ ఒక్క రాష్ట్రం మినహా భారతదేశం మొత్తం ట్రంప్ గురించి గూగుల్లో సెర్చ్
హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ నేత కమలా హారిస్‌పై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. ఈ క్రమంలోనే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు పలు దేశాల నేతలు, అధ్యక్షులు, ప్రధానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అయితే, అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 6 వరకు గూగుల్ ట్రెండ్స్ డేటా తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రం మినహా మిగతా అన్ని భారతీయ రాష్ట్రాలు కమలా హరీస్ కంటే డొనాల్డ్ ట్రంప్ గురించి గూగుల్ లో ఎక్కువగా శోధించాయని పేర్కొనింది. ఈ విషయాన్ని ఇండియా ఇన్ పిక్సెల్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, ఒహియో, ఫ్లోరిడా, టెక్సాస్, కెంటకీ, టేనస్సీ, ఉటా వంటి రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అలాగే, ట్రంప్ కు 295 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. కమలా హరీస్ కు 226 ఎలక్టోరల్ ఓట్ల వచ్చాయి.

ఈ రోజు మాత్రమే.. చౌకమైన ధరకు 365 రోజుల ప్లాన్.. ఏకంగా 600జీబీ డేటాతో
ఈ దీపావళికి, జియో, ఎయిర్టెల్, Vi వంటి పెద్ద టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ప్లాన్‌లను ప్రారంభించాయి. అయితే, ఈసారి ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా అదే ప్లాన్ అమలు చేసింది. జూలైలో జియో, ఎయిర్టెల్, Vi లు తమ రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పుడు, చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు వచ్చారు. ఈ నేపథ్యంలో దీపావళి రోజున, బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. ఇది దీపావళి తర్వాత కూడా కొనసాగుతుంది. అయితే ఆ ఆఫర్ కు ఈ రోజు ఆఫర్‌కి చివరి తేదీ. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 7 వరకు అమలులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద రూ.1999 రీఛార్జ్ చేసుకుంటే ఫ్లాట్ రూ.100 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.1899 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో మీరు ఏడాది పొడవునా 600GB డేటా, అపరిమిత కాలింగ్ ఇంకా రోజు 100 SMSలను పొందుతారు. బిఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో కొత్త ఆఫర్‌ను షేర్ చేసింది. ఈ ఆఫర్ కింద రూ.1999 రీఛార్జ్ చేసుకుంటే రూ.100 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.1899 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో మీరు ఏడాది పొడవునా 600GB డేటా, అపరిమిత కాలింగ్, మరెన్నో పొందుతారు. ఈ ఆఫర్ నవంబర్ 7 వరకు వర్తిస్తుంది. ఐకమరోవైపు బిఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్‌లను అందించడమే కాకుండా, కొత్త టెక్నాలజీపై కూడా పని చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీపై ‘Viasat’ తో కలిసి పనిచేసింది. దీని ద్వారా ప్రజలు సిమ్ కార్డ్ లేకుండా కూడా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేయగలరు. అత్యవసర పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.

20 పరుగుల వ్యవధిలో 10 మంది బ్యాట్స్‌మెన్స్ ఔట్..
భారత్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ కొనసాగుతోంది. ఎలైట్ గ్రూప్-ఎలో జరిగిన మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ మ్యాచ్‌లో 10 మంది బ్యాట్స్‌మెన్స్ 20 పరుగుల వ్యవధిలో ఔట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఐదుగురు బ్యాట్స్మెన్స్ ఖాతా కూడా తెరవలేదు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 9 మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. దింతో మేఘాలయ మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో, మేఘాలయ జట్టు మొదట బ్యాటింగ్‌కు చేపట్టింది. ఓపెనర్లు బమన్‌భా షాంగ్‌ప్లియాంగ్, అర్పిత్ భతేవారా జట్టుకు శుభారంభం అందించి తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఈ స్కోరుపై బమన్‌భ (21) రూపంలో జట్టుకు తొలి వికెట్ కోల్పోయింది. అతని తర్వాత అర్పిత్ (24) కూడా పెవిలియన్ చేరాడు. ఇక్కడి నుంచి మేఘాలయ ఇన్నింగ్స్ తడబడడంతో జట్టు మొత్తం 73 పరుగులకే కుప్పకూలింది. దింతో మేఘాలయకు మొదటి వికెట్ కోల్పోయినప్పుడు స్కోరు 53 పరుగులు. ఆ తర్వాత 20 పరుగులు చేసేసరికి జట్టులోని 10 మంది బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. మేఘాలయకు చెందిన 5 మంది బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేదు. ఐకమరోవైపు జమ్ముకశ్మీర్‌కు చెందిన ఔకిబ్ నబీ, అబిద్ ముస్తాక్ చెరో 5 వికెట్లు తీశారు.

ఆమె కాళ్లు మొక్కి ఫ్లైట్ ఎక్కిన పంత్.. వీడియో వైరల్!
సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత్.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత రెండు సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ ఐదు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి. కీలక సిరీస్ కాబట్టి భారత ఆటగాళ్లు ముందుగానే కంగారో గడ్డపై అడుగుపెడుతున్నారు. ఇప్పటికే బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లు ఆస్ట్రేలియా చేరుకున్నారు. ప్రాక్టీస్, అక్క‌డి పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగానే వెళ్లారు. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా-ఎతో జరిగే రెండో అనధికార టెస్టులో ఆడనున్నారు. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ కూడా ఫ్లైట్ ఎక్కేశాడు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో తల్లి సరోజ్ పంత్ కాళ్లు మెక్కి విమానాశ్రయం లోపలికి వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరో వివాదంలో నటి కస్తూరి..
నటి కస్తూరి తీరు తమిళనాడు లో తీవ్ర చర్చినీయాంశంగా మారింది. వరుస వివాదాలతో కస్తూరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. రెండు రోజుల క్రితం చెన్నై లోని తెలుగు వారిపై ‘ అప్పట్లో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చేసిన సంగతి తెలిసిందే. అవి కాస్త వివాదానికి దారితీయడంతో తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇస్తూనే అధికార డీఎంకే వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చింది. తాజాగా నటి కస్తూరి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె బ్రాహ్మణేతరులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరంరేపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి మాట్లాడడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాయి. నటి కస్తూరి వ్యాఖ్యలు కొన్ని వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారా అంటూ కస్తూరి పై ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడు రెవెన్యూ అధికారుల సంఘం. తమను కించ పరిచేలా మాట్లాడి తమ మనో భావాలను దెబ్బ తీసేలా మాట్లాడిన కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారుల సంగం కోరింది. ఇలా నటి కస్తూరి నిత్యం రోజుకో వివాదంతో విమర్శలపాలవుతుంది. మరోవైపు కస్తూరి తనను కావాలని డీఎంకే పార్టీ నేతలు టర్గెట్ చేసి నేను ఏది మాట్లాడిన వివాదం అయ్యేలా చేస్తున్నారని, తనపై కక్ష గట్టారని వాపోతుంది. ఉద్యోగ సంఘాలపై చేసిన వ్యాఖ్యలను ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత అవైటెడ్ సిరీస్..
వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన యాక్షన్ ప్యాక్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. సమంత చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఆడియెన్స్ ను పలకరించేందుకు వచ్చేసింది. సినిమాలు సహా ఓటీటీ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సమంత అక్కడ కూడా సాలిడ్ డెబ్యూ అందుకుంది. ఇక తన మొదటి వెబ్ సిరీస్ తర్వాత చేసిన రెండో వెబ్ సిరీస్ “సిటాడెల్ హనీ బన్నీ”. ఈ సిరీస్ నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సిరీస్ ని అమేజాన్ ప్రైమ్ వీడియో.. పాన్ ఇండియా భాషలు సహా మొత్తం 20 భాషల్లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ గా తీసుకొచ్చారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలియాలి అంటే ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే. ఈ సిరీస్ ట్రైలర్ కోసం అభిమానులు కొంత కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు ఇద్దరూ డిటెక్టివ్‌ల పాత్రలో కనిపించబోతున్నారు. దాదాపు రెండు నిమిషాల 51 సెకన్ల నిడివి గల ‘సిటాడెల్: హనీ బన్నీ’ ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. చాలా ఆసక్తికరంగా, యాక్షన్‌తో నిండి ఉంది. అయితే, ఈ ట్రైలర్‌లో వాళ్ళ డైలాగ్స్ కంటే ఎక్కువగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినవచ్చు. ఈ కథలో స్టంట్‌మ్యాన్ బన్నీగా వరుణ్ ధావన్, ఏజెంట్ హనీగా సమంత నటించారు. ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ ని సామ్ కి డెబ్యూ ఇచ్చిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే లు తెరకెక్కించారు.