Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

కోనసీమలో వద్దు కాకినాడ ముద్దు.. నేడు బంద్‌కు జేఏసీ పిలుపు
నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండగా, కాకినాడకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందని వారు తెలిపారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వని వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామనే ధోరణి నేతల్లో కనిపిస్తున్నదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కొత్త జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం విదితమే.. ఇప్పటికే ఏర్పడిన జిల్లాల్లో కొన్ని మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉంది.. ఇప్పటికే పలు మార్లు దీనిపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించింది.. ఈ తరుణంలో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రాంత డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకుంటుందా? లేదా? అనేది చూడాలి..

నేడు కావలికి మంత్రి నారా లోకేష్‌.. ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ..!
కావలి రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నేడు మంత్రి నారా లోకేష్ కావలి నియోజకవర్గంలోని దగదర్తికి పర్యటనకు రానున్నారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే, ఈ పర్యటన వెనుక రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కావలి టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు లోకేష్ పుల్‌స్టాప్ పెట్టబోతున్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో మాలేపాటి వర్గం మరియు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనుచరుల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. మాలేపాటి ఉత్తరక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన కావ్యను ఆ వర్గం అడ్డుకోవడం, ఆ తర్వాత జరిగిన వాగ్వాదం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మాలేపాటి మానసిక క్షోభకు కారణం కావ్య వేధింపులేనని ఆయన అనుచరులు ఆరోపించిన నేపథ్యంలో, ఈ రోజు లోకేష్ పర్యటనకు మరింత ప్రాధాన్యత లభించింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి లోకేష్ దగదర్తికి రావడం, సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించడం, ఆ తరువాత రెండు వర్గాల మధ్య పంచాయతీ జరగనుందనే ప్రచారం కావలి టీడీపీలో ఉత్కంఠ వాతావరణాన్ని మరింత పెంచింది.

మరో బస్సు ప్రమాదం.. రన్నింగ్‌ బస్సులో మంటలు.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు..
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది.. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది.. చేవెళ్ల దగ్గర మరో ప్రమాదంలో 19 మంది మృతిచెందిన ఘటన.. ఇప్పటికీ అందరినీ కలచివేస్తుండగా.. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి జైపూర్ (ఒడిశా) వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమయస్ఫూర్తితో డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు వెంటనే క్రిందకు దిగి ప్రాణాపాయం తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది… ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు..

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. కత్తితో పొడిచి దారుణ హత్య.. కేసులో బిగ్‌ట్విస్ట్ ..!
హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డులో యువకుడిపై కత్తి దాడి కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో బిగ్‌ట్విస్ట్ బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్‌ కి చెందిన రోషన్‌సింగ్‌(25) ఓ రౌడీషీటర్‌. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి(23) సైతం పాత నేరస్థుడు. రోషన్‌సింగ్‌ 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్‌జెండర్‌ను మాట్లాడుకుని రంగారెడ్డినగర్‌లోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. డబ్బులు చెల్లించే విషయంలో ఇరువురి మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఆ ట్రాన్స్‌జెండర్ బాలానగర్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం రోషన్, అతని మిత్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన శత్రువు బాలశౌరెడ్డి ట్రాన్స్‌జెండర్‌తో కేసు పెట్టించాడని రోషన్ అనుమానం వ్యక్తం చేశారు. ఎలాగైన చంపేస్తానని మిత్రులతో చెప్పేవాడు. ఈ విషయం కాస్త బాలశౌరెడ్డికి తెలిసింది. వాడు నన్ను చంపడం ఏంటి నేనే వాడిని చంపేస్తానని బాలశౌరెడ్డి ఫిక్స్‌ అయ్యాడు.

భారీ సంఖ్యలో పాల్గొనండి.. బీహార్ యువతకు రాహుల్‌గాంధీ విజ్ఞప్తి
బీహార్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా.. మొదటి విడతగా 121 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడత పోలింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ బీహార్ యువతకు కీలక విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బీహార్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా మహాఘట్‌బంధన్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే బీహార్ పోలింగ్‌కు ఒక రోజు ముందు బుధవారం రాహుల్‌గాంధీ ‘‘ఓట్ చోరీ’’ కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. హర్యానాలో పెద్ద ఎత్తున ఓట్ల దొంతనం జరిగిందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను స్క్రీన్‌పై వేసి చూపించారు.

హర్యానా ఓటర్ జాబితాలో బ్రెజిలియన్ మోడల్ ఫొటో..! ఈ అంశంపై స్పందించిన మోడల్
హర్యానాలో 2.5 మిలియన్ల నకిలీ ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ నవంబర్ 5న జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బ్రెజిలియన్ మోడల్ ఫోటోను ఉటంకిస్తూ.. ఆ చిత్రాన్ని వేర్వేరు పేర్లతో 22 సార్లు ఉపయోగించారని ఆరోపించారు. ఓటర్ల జాబితా కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తావించిన బ్రెజిలియన్ మోడల్ ఓ ప్రకటన విడుదల చేసింది. తనకు భారత రాజకీయాలతో సంబంధం లేదని ఆమె పేర్కొంది. ఎవరో ఆమె ఫోటోను స్టాక్ ఇమేజ్ నుంచి కొనుగోలు చేసి దుర్వినియోగం చేశారని తెలిపింది. ఈ మహిళ అసలు పేరు లారిస్సా. ఆమె ఒకప్పుడు మోడలింగ్ చేసేది. కానీ ఇప్పుడు ఆ వృత్తికి దూరంగా ఉంది. అయితే, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. నిన్న రాహుల్‌గాంధీ ప్రస్తవించిన తరువాత తనకు భారతీయ జర్నలిస్టుల నుంచి డజన్ల కొద్దీ సందేశాలు వచ్చాయని లారిస్సా చెబుతోంది. బ్రెజిలియన్‌లో భాషలో ఓ వీడియో విడుదల చేసింది.

ఈరోజు మరోసారి చర్చలు.. విఫలమైతే యుద్ధమేనన్న పాక్ రక్షణమంత్రి ఖవాజా
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య గురువారం మరొకసారి శాంతి చర్చలు జరగనున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్‌లో చివరి విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పలు మార్లు రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి గానీ చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధమేనని ప్రకటించారు. తమ ఎదుట చాలా ఆప్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. చర్చలు ప్రారంభం కాకముందే జియో టీవీలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ యుద్ధం బెదిరింపులు చేశారు. కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని.. సరిహద్దు దాడులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ పౌరులపై డ్రోన్ యుద్ధానికి దిగుతోందని పేర్కొన్నారు. తాలిబన్లు ఎదుర్కోవడానికి ఏకైక మార్గం యుద్ధమేనని ప్రకటించారు. అయితే ఖవాజా ఆరోపణలను ఆప్ఘనిస్థాన్ తీవ్రంగా ఖండించింది.

ఉత్కంఠభరిత పోరుకు సర్వం సిద్ధం.. ఆధిక్యం సాధించేది ఎవరు..?
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు చెరో ఒక్క మ్యాచ్ గెలవడంతో సిరీస్‌లో ఆధిక్యం సాధించడానికి నాల్గవ టీ20 మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ నేడు (నవంబర్ 6) భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు వేదికగా ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలోని బిల్ పిప్పెన్ ఓవల్ మైదానం ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ స్టేడియంలో పిచ్ నుండి మొదట ఓవర్లలో బౌలర్లకు మంచి సహాయం లభిస్తుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ మైదానంలో అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. పిచ్ రిపోర్ట్ ప్రకారం మొదట్లో బంతి కదలిక కారణంగా బ్యాట్స్‌మెన్‌లు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ముందుకు సాగేకొద్దీ పిచ్ బ్యాటింగ్ కు సులభమవుతుంది. చివరి ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌లు పరుగులు రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ హై-స్కోరింగ్ గేమ్‌గా మారే అవకాశం ఉంది.

అమ్మకానికి ఐపీఎల్ ఛాంపియన్ టీం.. ధర ఎంతంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీని విక్రయానికి ఉంచారు. ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండింటిలోనూ పాల్గొంటున్న ఈ జట్టును ప్రస్తుతం కలిగి ఉన్న డియాజియో (Diageo) సంస్థ విక్రయ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఈ విక్రయాన్ని మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2008 నుంచి ఐపీఎల్‌లో భాగమైన RCB జట్టు 2025లో మొదటిసారిగా పురుషుల అగ్రశ్రేణి ఫ్రాంచైజీ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే 2024లో WPL టైటిల్‌ను కూడా సాధించారు. RCB జట్టులో విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.

అలాంటి పాత్రలో నటించడం చాలా కష్టం..
అందాల తార రాశీ ఖన్నా ఎప్పుడూ తన పాత్రలో కొత్తదనం కోసం ప్రయత్నించే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన ‘120 బహదూర్‌’ సినిమా కూడా అలాంటి ఓ ప్రయోగాత్మక ప్రయత్నమే. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ ఫర్హాన్‌ అక్తర్‌తో కలిసి రాశీ నటించింది. రెజాంగ్ లా యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్‌ షైతాన్‌ సింగ్‌ భాటి గారి జీవితంపై ఈ చిత్రం ఆధారంగా రూపొందింది. భారత సైనికుల ధైర్యసాహసాలు, వారి కుటుంబాలు ఎదుర్కొనే భావోద్వేగ క్షణాలు ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు. కాగా ఇందులో రాశీ షాగున్‌ సింగ్‌ అనే సైనికుడి భార్య పాత్రలో నటించింది. ఈ పాత్ర చాలా లోతైన భావోద్వేగాలతో నిండి ఉందని ఆమె చెబుతోంది. ‘‘ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా కెరీర్‌లో చాలా సవాలుతో కూడుకున్నది. యుద్ధానికి వెళ్తున్న తన భర్త తిరిగి రాకపోవచ్చనే వాస్తవాన్ని అంగీకరిస్తూ ఒక స్త్రీ జీవించడం ఎంత కష్టమో ఆ భావనను నేను అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. కొన్ని సన్నివేశాల్లో నిజంగా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను’’ అని ఆమె తెలిపింది. అలాగే, ‘‘ఒక సైనికుడి భార్య గర్వంగా కూడా ఉంటుంది, భయంతో కూడా జీవిస్తుంది. ఈ రెండు భావాలు ఒకే సమయంలో అనుభవించడం చాలా కష్టమైన విషయం. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చాలా నిజమైన భావోద్వేగంతో రాశారు. అందుకే ఆ పాత్రలో జీవించాల్సి వచ్చింది, నేను కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే చేయగలనని అనుకునే వారు ఈ సినిమాతో నా మరో వైపు చూస్తారు’’ అని రాశీ చెప్పారు. ఈ నెల 21న విడుదల కానున్న ‘120 బహదూర్‌’ సినిమా యాక్షన్, దేశభక్తి, భావోద్వేగాలతో నిండిన హృదయాన్ని తాకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీ ఖన్నా తన నటనతో మళ్లీ ఒకసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుందనే నమ్మకం ఆమె అభిమానుల్లో కనిపిస్తుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి.. సంసార సాగరంలో స్టార్ హీరోకు కష్టాలు…
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మ‌హారాజ. లేటెస్ట్ గా భాను భోగ‌వర‌పు ద‌ర్శక‌త్వంలో నటించిన ‘మాస్ జాత‌ర’ అక్టోబరు 31న రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మాస్ హీరో ఆశలన్నీ కిషోర్ తిరుమలపైనే. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమ‌ల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రవితేజతో సినిమా చేస్తున్నాడు. మాస్ రాజా కెరీర్ లో 76వ సినిమాగా వస్తున్న ఈ సినిమా కోసం ఓ క్యాచీ టైటిల్ ను అనుకుంటున్నారట మేకర్స్. కిషొర్ తిరుమల సినిమాలకు ఉండే సాఫ్ట్ టైటిల్ అలాగే రవితేజ సినిమాలలో ఉండే తింగరితనం కలిపి ఉండేలా ఈ సినిమాకు “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ విషయాన్నీ ఈ నెల 10న అఫీషియల్ గా ప్రకటించేందుకు ముహూర్తం పెట్టారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సంసార సాగరంలో భర్తలు అనుభవించే కష్టాలు, భార్య భర్తల మధ్యవచ్చే తగాదాలు వంటి అంశాలతో రాబోతుంది. అటు ఫ్యాన్స్ కూడా రవితేజ నుండి ఇలాంటి సినిమాలనే కోరుకుంటున్నారు. ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ నెలాఖరుకు టోటల్ షూటింగ్ ఫినిష్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్‌పై  సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.

Exit mobile version