అమరావతిలో ఏ సంస్థకు ఎంత భూమి..? తేల్చనున్న కేబినెట్ సబ్‌కమిటీ
రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది.. రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ఇక, రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించే భూముల విషయంపై ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ సబ్ కమిటీ.. పలు భూ కేటాయింపులపై ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది.. రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు ఇచ్చే భూముల కేటాయింపు పై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. అమరావతి పనులు మరింత ముమ్మరంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వివిధ సంస్థలకు ఇవ్వాల్సిన భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఏపీ సర్కార్.. మంత్రివర్గ ఉప సంఘంలో భూ కేటాయింపులపై తీసుకున్న నిర్ణయాలపై ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి.. వాటికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది..
టీడీపీలో విషాదం.. సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత
అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు కన్నుమూశారు.. 80 ఏళ్ల పాలకొండరాయుడు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు.. రెండు రోజుల క్రితం అనారోగ్యపాలైన సుగవాసి పాలకొండరాయుడును బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.. ఒకసారి రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుగవాసి పాలకొండరాయుడు.. రాజకీయాలలో తనకంటూ ఓ స్థానం దక్కించుకున్నారు.. ఇక, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంపీ, ఎమ్మెల్యే గా పనిచేశారు.. అయితే, పాలకొండరాయుడు మృతి విషయం తెలుసుకుని షాక్ కు గురయ్యారు టీడీపీ శ్రేణుల, ఆయన అభిమానులు.. దీంతో, రాయచోటి నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. మరోవైపు, సుగవాసి పాలకొండరాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి.. పాలకొండ రాయుడు మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు… పాలకొండ రాయుడు మృతి ఆయన కుటుంబానికి, రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, టిడిపి కార్యకర్తలకు తీరని లోటని పేర్కొన్నారు.. రాయచోటి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, రాజంపేట ఎంపీగా ఒకసారి గెలిచిన పాలకొండ రాయుడుకు రాయచోటి ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, దేవుని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి..
సుజనా చౌదరికి తీవ్ర గాయం.. లండన్ నుంచి హైదరాబాద్‌కు తరలింపు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయ్యింది.. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్‌లో జారిపడటంతో కూడి చేయి విరిగినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. లండన్‌లో ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆయన్ను మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.. సర్జరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు సుజనా చౌదరి.. లండన్ నుంచి తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సుజనా చౌదరిని.. బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టుగా చెబుతున్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, లండన్ పర్యటనలో ఉన్న సుజనా చౌదరి ఒక సూపర్ మార్కెట్‌లో ప్రమాదవశాత్తూ కిందపడిపోయారని.. ఘటనలో ఆయన కుడి భుజానికి బలమైన గాయం అయ్యింది.. ఎముక విరిగినట్లు సమాచారం. దీనిపై బీజేపీ శ్రేణులు, సుజనా చౌదరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది.. అయితే, సంబంధిత ఆస్పత్రి సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేస్తే.. అసలు సుజనా చౌదరికి ఏం జరిగింది? అనేదానిపై క్లారిటీ రానుంది..
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఛార్జీలు పెంపు..
హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను పెంచే అవకాశాలపై తాజాగా సంకేతాలు వెలువడ్డాయి. మెట్రో వర్గాల సమాచారం ప్రకారం, మే రెండో వారంలో సవరించిన టికెట్ రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన భారత్‌కు చేరిన తర్వాతే ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ ఈ టారిఫ్ సవరణలతో వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు ఆదాయం పొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఛార్జీలు పెంచే అంశంపై ఇప్పటికే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠ టికెట్ ఛార్జీ రూ.10 కాగా, గరిష్ఠ ఛార్జీ రూ.60గా ఉంది. ఈ గరిష్ఠ ధరను రూ.75 వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం, మెట్రో రైలు సేవలతో పాటు ప్రకటనలు, షాపింగ్ మాల్స్ అద్దె లాంటి ఇతర మార్గాల ద్వారా ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ ఏటా సుమారు రూ.1500 కోట్ల ఆదాయాన్ని నమోదు చేస్తోంది. అయితే మెట్రో నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, బ్యాంకు రుణాల వడ్డీలు వంటి ఖర్చులతో కలిపి సంస్థకు వార్షికంగా సుమారు రూ.2000 కోట్ల వ్యయం జరుగుతోందని వర్గాలు తెలిపాయి.
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు, నియామక వివరాలను అప్ లోడ్ చేసింది. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యకు పూనుకుంది. జడ్జీల సంబంధిత వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలనే పూర్తి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా, సుప్రీంకోర్టు సోమవారం తన వెబ్‌సైట్‌లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ 1న పూర్తిస్థాయి ధర్మాసనం తీసుకున్న నిర్ణయం మేరకు న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలను తన వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మరికొందరు న్యాయమూర్తుల నుంచి ఆస్తుల వివరాలు అందిన వెంటనే వెబ్‌సైట్ లో అప్ లోడ్ చేస్తామని కోర్టు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు నియామకాల పూర్తి ప్రక్రియను, హైకోర్టు కొలీజియంకు కేటాయించిన బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత యూనియన్ నుంచి వచ్చిన వివరాలు, ఇన్‌పుట్‌లు, సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలనతో సహా, ప్రజల జ్ఞానం, అవగాహన కోసం అత్యున్నత న్యాయస్థానం తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
పాక్ కు చెమటలు పట్టిస్తున్న భారత్.. దేశవ్యాప్తంగా రేపు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్..
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకునే నిర్ణయాలు పాక్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దౌత్యదాడికి దిగిన భారత్ మరో వైపు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తుండడంతో పాక్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం 2025 మే 7న దేశవ్యాప్తంగా 244 గుర్తించబడిన పౌర రక్షణ జిల్లాల్లో భారీ మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. క్షిపణి దాడులు లేదా వైమానిక దాడులు వంటి యుద్ధం లాంటి పరిస్థితులలో సాధారణ ప్రజలు ఎంత త్వరగా, సమర్థవంతంగా స్పందించగలరో పరీక్షించడం దీని ఉద్దేశ్యం. ఈ మాక్ డ్రిల్ నిజ జీవిత దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. వైమానిక దాడుల సైరన్లు మోగడం, నగరాల్లో విద్యుత్తు అంతరాయం, ప్రజలు ఆశ్రయం పొందడంలో ప్రాక్టీస్ చేయడం, అత్యవసర సేవలు త్వరగా స్పందించడం వంటివి ఇందులో ఉంటాయి. ఈ మాక్ డ్రిల్ ఉద్దేశ్యం భయాందోళనలను నివారించడం, గందరగోళాన్ని తగ్గించడం, ప్రాణాలను కాపాడటం. మే 7న జరగనున్న ఈ జాతీయ స్థాయి రిహార్సల్ కోసం, హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మే 2, 2025న సూచనలను జారీ చేసింది. స్థానిక పరిపాలన, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, హోంగార్డ్లు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC), నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS), నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS), పాఠశాల-కళాశాల విద్యార్థులు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొంటారు.
ఎన్టీఆర్ ఇంట్లో ఆ దర్శకుడి కోసం ప్రత్యేక కుర్చీ !
ఎన్టీ రామారావు.. ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది.. కాదు కాదు ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ అపురూపమైన గ్రంథాన్ని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకోని వారంటూ ఉండరు. 1951లో విడుదలైన పాతాళ భైరవి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో “వంద రోజులు” పూర్తి చేసుకున్న సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే తాజాగా రామారావు గురించి ‘అన్న ఎన్టీఆర్’ యూ ట్యూబ్ ఛానల్‌తో సీనియర్ నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘దర్శకుడు కేవీరెడ్డి గారిని ఎన్టీఆర్ గురువుగా భావించేవారు. గౌరవించేవారు. ఎన్టీఆర్ గారి ఇంట్లో ఒక కుర్చీ ఉండేది… అది కేవీరెడ్డి గారి కోసమే వేయించేవారు. ఆ కుర్చీలో కేవీ రెడ్డిగారు తప్ప వేరొకరు కూర్చున్నది లేదు. ఇప్పటికీ ఆ కుర్చీ అలానే ఉంది. కేవీ రెడ్డి చాలా బాధ్యత గల మనిషి. ‘దొంగరాముడు’ సినిమాను 6 లక్షలలో ఇస్తానని ఆయన నిర్మాతలతో చెప్పారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి 6 లక్షల పాతికవేల ఖర్చు అయింది. పైన పాతికవేలు కేవీ రెడ్డి గారు భరించడం ఆయన నిజాయితీకి నిదర్శనం. ఆ సినిమాకు ఆయన పారితోషికం లక్ష రూపాయలైతే, అక్కినేని తీసుకున్నది కేవలం రూ.20 వేలు మాత్రమే. ఆ రోజుల్లో దర్శకుడిగా ఆయనకు గల డిమాండ్ అలాంటిది. ఒకానొక సమయంలో కేవీరెడ్డి గారితో సినిమాలు నిర్మించడానికి, నిర్మాతలు ఆలోచన చేశారు. అలాంటి టైంలో కూడా తన సొంత బ్యానర్లో కేవీ రెడ్డి గారి తో సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు ఎన్టీఆర్. తన వయసు సహకరించదేమోనని కేవీ రెడ్డి అన్న కూడా తాను హెల్ప్ చేస్తూ ఉంటానంటూ ఆయనను ఎన్టీఆర్ ఉత్సాహపరిచారు’ అంటూ చెప్పుకొచ్చారు. అప్పటి విషయాలు ఇలా ఇప్పుడు పంచుకొవడంతో. ప్రజంట్ నిర్మాత ప్రసన్న కుమార్ మాటలు వైరల్ అవుతున్నాయి.
ఓటీటీలోకి వచ్చేస్తున్న రీసెంట్ డిజాస్టర్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాక్. బేబీ బ్యూటీ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోగా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాకావడంతో నిర్మాతకు అడ్వాన్స్ లు గట్టిగానే ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్స్. భారీ ఓపెనింగ్ ఉంటుందని ఊహించారు. కానీ బయ్యర్స్ ని నిండా ముంచేశాడు జాక్. స్పై యాక్షన్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తోలి ఆట నుండే ప్లాప్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. లేదంటే నిర్మాత నిండా మునిగేవారు. ఏప్రిల్ 10 న థియేటర్స్ లో వచ్చిన ఈ సినిమాను నెల తిరిగేలోపే అంటే ఈ నెల 8న స్ట్రీమింగ్ కు తీసుకువస్తుంది నెట్ ఫ్లిక్స్. తెలుగు, తమిళ్, మలయాళం, హింది, కన్నడ భాషాల్లో జాక్ ను స్ట్రీమింగ్ కు తీసుకువస్తుంది నెట్ ఫ్లిక్స్. థియేటర్స్ లో డిజాస్టర్ ఆయిన జాక్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తాడో చూద్దాం. కాగా ఈ సినిమా ప్లాప్ తో బొమ్మరిల్లు భాస్కర్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. అయితే ఈ సినిమా మేకింగ్ లో హీరో సిద్దు జొన్నలగడ్డ వేలుపెట్టాడనే టాక్ టాలీవుడ్ లో గట్టిగా ఉంది.
