Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

బెంగళూరు తొక్కిసలాటలో ఏపీకి చెందిన బాలిక మృతి.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు..
ఐపీఎల్-25 లో ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీమ్‌కు నిర్వహించిన సన్మాన కార్యక్రమం.. తీవ్ర విషాదాన్ని నింపిన విషయం విదితమే.. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏకంగా 11 మంది మృతిచెందగా.. ఇంకా చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనలో అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడి గ్రామం యర్రగట్టవాండ్లపల్లెకు చెందిన బి.దివ్యాంశి (14) అనే బాలిక మృత్యువాత పడ్డారు. యర్రగట్టవాండ్లపల్లె చెందిన శివకుమార్ బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. భార్య అశ్విని, ఇద్దరు పిల్లలతో కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా స్టేడియం వద్దకు శివకుమార్ భార్య అశ్విని తన కుమార్తెలు దివ్యాంశి, రచనను వెంట తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో స్టేడియం గేట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో దివ్యాంశి ఊపిరాడక మృతి చెందింది. బాలిక దివ్యాంశి మృతితో స్వగ్రామంలో విషాదం నెలకొంది. నేడు స్వగ్రామంలో దివ్యాంశి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.. పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతిస్తారు… కానీ, ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ నిబంధన అమలు చేస్తున్నారు. కాకినాడలో 6 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.. 41,107 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.. విక, విజయనగరంలో ఐదు పరీక్షా కేంద్రాల్లో 36,495 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు.. సీతం కాలేజ్‌, ఐయాన్ డిజిట‌ల్‌, లెండి ఇంజ‌నీరింగ్, ఎంవిజిఆర్ ఇంజ‌నీరింగ్‌, అవంతి క‌ళాశాల‌ల్లో ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఏలూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు.. పరీక్షా కేంద్రాలుగా వట్లూరు సిద్ధార్థ క్విస్ట్ సిబిఎస్ఈ స్కూల్, వట్లూరు సర్ సి ఆర్ ఆర్ ఇంజ‌నీరింగ్ కళాశాల ఉండగా.. 17,584 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, గడియారాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడవు.. సందేహాలు, వివరణల కోసం అభ్యర్థులు డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు 90307 23444, 95056 44555 సంప్రదించవచ్చు..

నెల్లూరులో కరోనా కలకలం.. ఒకేసారి ఆరు కేసులు
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దగ్గు జలుబుతో ఆసుపత్రికి చేరిన వారికి కరోనా టెస్టులు చేయడంతో ఒకేసారి 6 కేసులు బయటపడ్డాయి. కరుణ లక్షణాలు తక్కువగా ఉండడంతో ఐదుగురిని హోమ్ ఐసోలేషన్ పంపిన వైద్యులు.. మరో ఒకరికి నెల్లూరులోని కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక, ఒకేసారి ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. పల్మనాలజీ విభాగంలో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది.. మహిళకు, పురుషులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు అధికారులు.. కేరళ నుంచి వచ్చిన నర్సింగ్ స్టూడెంట్ కి కరోనా లక్షణాలు ఉండడంతో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు.. మళ్లీ కరోసా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు.. కాగా, దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వరుసగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి..

వైసీపీ మాజీ ఎంపీటీసీ దారుణ హత్య
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీది వేముల వద్ద  వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ ను దారుణంగా హత్య చేశారు. దుండగులు బండ రాయితో తలపై కొట్టి చంపారు. కర్నూలు నుంచి బైక్ పై సొంతూరు మీదివేములకు వెళ్తుండగా కాపుకాచి హత్య చేశారు. హత్యకు రాజకీయపరమైన కారణాల, వ్యక్తిగత కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ హత్య స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. మీదివేములలో శాంతి, భద్రతలను ఎస్పీ సమీక్షించారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్పీ. వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడును చంపింది టీడీపీ నాయకులేనని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని. వైసీపీ కి గ్రామంలో పట్టున్నందుకు సహించలేక హత్య చేశారన్నారాయన.. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైసీపీ వాళ్ళను హత్య చేయడమేనా అని ప్రశ్నించారు కాటసాని. కాగా, రమేష్ నాయుడు 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందాడు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మీది వేముల ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు. రమేష్ నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

నేటి నుంచి ప్రారంభం కానున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానున్నది. ఈరోజు ఉదయం 11:30 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలను క్రాస్ ఎగ్జామింగ్ చేయనున్నారు. గతంలో ఈటెల నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నావళి సిద్దం చేసింది కమిషన్. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు జస్టిస్ చంద్ర ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థికపరమైన ప్రశ్నలు కమిషన్ అడుగనున్నది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.

యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం, తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. మీటింగ్ అనంతరం చాపర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్. సీఎం టూర్ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలాపూర్ లో భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. ప్రజ్ఞాపూర్ – భువనగిరిల మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. భువనగిరి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వాహనాలను మళ్లించనున్నారు పోలీసులు.

నేడు జమ్మూకాశ్మీర్‌లో మోడీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని
ప్రధాని మోడీ శుక్రవారం జమ్ముూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనను మోడీ ప్రారంభించనున్నారు. రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. చీనాబ్ రైలు వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. ఐఫెల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ఈ చీనాబ్ వంతెన 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని తట్టుకునే విధంగా నిర్మించారు. చీనాబ్ రైల్వే వంతెన జమ్మూకాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో నిర్మించారు. శ్రీనగర్ రైల్వే లైన్‌పై ఇంజనీరింగ్ విభాగం అద్భుతంగా నిర్మించింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ ప్రాంతం భూకంప జోన్ 5లోకి వస్తుంది. మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించే యాత్రికుల కోసం ఈ వంతెనను నిర్మించారు.  ఇక ప్రారంభించబోయే ఇతర ప్రాజెక్టుల్లో 272 కి.మీ. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ కూడా ఉంది.

సెక్స్ స్కామ్ నిందితుడితో ట్రంప్‌‌కు సంబంధాలు.. మస్క్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. గత కొంత కాలంగా ట్రంప్ ప్రభుత్వంపై మస్క్ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ట్యాక్స్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన మస్క్.. తాజాగా ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో మస్క్ పోస్ట్ చేశారు. సెక్స్‌ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్‌ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బహిరంగంగా బయటపెట్టలేదని విమర్శించారు. భవిష్యత్తులో నిజానిజాలు బయటపడతాయని తెలిపారు. ఎప్‌స్టైన్‌ 2019లో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడికి క్లింటన్‌, ట్రంప్‌, ప్రిన్స్ ఆండ్రూ, మిషెల్‌ బ్లూమ్‌బెర్గ్‌ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కోర్టు పత్రాల్లో వెల్లడైంది. ఈ క్రమంలో జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను బయటపెట్టాలని కొంతమంది డిమాండ్‌ చేశారు. అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఇక నుంచి ఇంగ్లండ్‌లో టెండ్యూలర్-అండర్సన్‌ ట్రోఫీ!
త్వరలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. జూన్‌ 20 నుంచి లీడ్స్‌ వేదికగా మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇంగ్లండ్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. తొలి టెస్ట్‌ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్‌ జట్టును ఈసీబీ ప్రకటించింది. అయితే ఇంగ్లండ్, భారత్‌ మధ్య టెస్టు సిరీస్‌ విజేతకు ఇచ్చే ట్రోఫీకి టెండ్యూలర్-అండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేశారు. త్వరలోనే ఈ ట్రోఫీని ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ఇంతకుముందు ఇంగ్లండ్, భారత్ జట్లు ఇంగ్లండ్ గడ్డపై పటౌడీ ట్రోఫీ కోసం టెస్టు సిరీస్‌లో తలపడేవి. భారత మాజీ కెప్టెన్లు ఇఫ్తికార్‌ అలీ ఖాన్‌ పటౌడీ, మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీల గౌరవార్థం ట్రోఫీకి ఆ పేరు పెట్టారు. అయితే ఆ పేరును ఇప్పుడు రిటైర్‌ చేయాలని ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. ఈ మేరకు గత మార్చిలో పటౌడీ కుటుంబానికి లేఖ రాసింది. దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండ్యూలర్, జేమ్స్‌ అండర్సన్‌ల పేరుతో ట్రోఫీ ఇవ్వనున్నారు. టెండూల్కర్ అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన రికార్డును కలిగి ఉండగా.. అండర్సన్‌ అత్యధిక వికెట్స్ తీసిన పేసర్‌గా ఉన్నాడు.

జనం ప్రాణాలు అన్నింటికన్నా ముఖ్యం.. రోడ్‌ షోలు అవసరం లేదు!
ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు సంబరాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్‌ దేశాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ విషాద ఘటనపై ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంబరాల కంటే జనం ప్రాణాలు ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడా విజయాలను ఉత్సవంగా జరపడానికి రోడ్‌ షోలు అవసరం లేదన్నారు. ఇంగ్లండ్‌తో భారత్ టెస్టు సిరీస్‌ నేపథ్యంలో ముంబైలో కెప్టెన్‌ శుభ్‌మ‌న్ గిల్‌తో కలిసి గౌతమ్ గంభీర్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో ఆర్సీబీ సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందడం గురించి ఓ విలేకరి ప్రశ్నించగా.. గౌతీ స్పందించారు. ‘జనం ప్రాణాలు అన్నింటికన్నా ముఖ్యం. ఎప్పుడూ నేను ఇదే చెబుతూనే ఉంటా. రోడ్ షోలు నిర్వహించడం గురించి మనం అవగాహన ఉండాలి. వేడుకలు స్టేడియంలో నిర్వహించుకోవచ్చు. ఇది చాలా విషాదకరం. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇలాంటివి మరలా జరగకూడదని కోరుకుంటున్నా. ఇక ముందైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి రోడ్‌ షోలు చేయొద్దు’ అని గంభీర్‌ పేర్కొన్నారు.

వివాహబంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేనే అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్‌బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. ప్రియురాలు జైనబ్‌ ను పెళ్లాడి ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్‌ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇరుకుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇండస్ట్రీ నుంచి మెగా స్టార్‌ చిరంజీవి- సురేఖ, రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, హీరో సుమంత్‌ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. జూన్‌ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్‌ జరగనుంది. అక్కినేని అఖిల్ దంపతులకు ఫ్యాన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version