లండన్‌లో 3 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి
లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్‌లోని మేఫెయిర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) మరియు ఐవోడీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో భువనేశ్వరికి ఈ గౌరవాలు లభించాయి. ప్రజా సేవా రంగం, సామాజిక ప్రభావం, నాయకత్వం అంశాల్లో విశిష్టమైన సేవలందించినందుకు గాను నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఐవోడీ సంస్థ ప్రదానం చేసింది. అలాగే, కార్పొరేట్ పరిపాలనలో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లభించింది. ఈ అవార్డును కూడా నారా భువనేశ్వరి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో నిలుస్తున్న తీరు పట్ల గర్వం వ్యక్తం చేశారు. ఇక లండన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలాగే విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు.
తాజా రాజకీయ పరిణామాలపై మంత్రి లోకేష్ సీరియస్..! మీరు ఏం చేస్తున్నారు..?
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలు తగిన విధంగా స్పందించకపోవడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేష్.. అందుబాటులో ఉన్న కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సమర్థవంతంగా ప్రతిస్పందించకపోవడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “నకిలీ మద్యం కేసులో అరెస్టైన వైసీపీ నేత జోగి రమేష్ బీసీ కార్డు వాడుకుంటున్నా, మన సీనియర్ నేతలు ఎందుకు స్పందించడంలేదు?” అని లోకేష్ ప్రశ్నించినట్టు సమాచారం. ఇక, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పై కూడా మంత్రి లోకేష్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. “మీ కోసం సుబ్బనాయుడు గారు సీటు త్యాగం చేశారు, ఆయన మరణించినప్పుడు ఎందుకు వెళ్లలేదని” కావ్యను ప్రశ్నించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే, టీడీపీలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం రచ్చగా మారిన నేపథ్యంలో, ఇద్దరు నేతలు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. కమిటీ కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నివేదికను మంత్రి లోకేష్‌కు, ఆపై చంద్రబాబుకు అందజేయనుంది. ఆ నివేదిక ఆధారంగా ఇద్దరు నేతలపై పార్టీ తీసుకునే చర్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కార్తీక పౌర్ణమి ఎఫెక్ట్.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని, పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానం ఎంతో పవిత్రమని నమ్మే భక్తులు గంగా దేవిని స్మరిస్తూ పుణ్యస్నానంలో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో భక్తులు వేలాది దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో మల్లన్నను ప్రార్థించారు. సాయంత్రం సమయానికి దీపాలతో కాంతులీనిన శ్రీశైలం ఆధ్యాత్మిక క్షేత్రం అద్భుత దృశ్యాన్ని సంతరించుకుంది. ఇక, భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీస్వామి, అమ్మవారి అలంకార దర్శనానికి అందరికీ అనుమతి ఇవ్వగా, భక్తులు రెండు నుండి మూడు గంటల సమయం వేచి దర్శనం పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం క్షేత్రం ఈ రోజు మరింత పవిత్రంగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ ఉత్సవం ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇక, శ్రీశైలం మల్లన్న ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి.. సాయంత్రం గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణ మహోత్సవం నిర్వహించనున్నారు.. ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు..
విద్యార్థులతో టెంట్ సామాన్లు మోయించిన టీచర్లు.. పేరెంట్స్ ఆగ్రహం..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. మలికిపురం మండలం బట్టేలంక హై స్కూల్‌లో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఒక రోజు ఆటల పోటీలు నిర్వహించే క్రమంలో, స్కూల్ టీచర్లు విద్యార్థుల చేత టెంట్ సామాన్లు మోయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానిక యువకులు తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోగా.. ఆ వీడియో ప్రకారం.. విద్యార్థులు టెంట్ గిన్నెలు, కుర్చీలు, బరువైన వస్తువులు మోసేందుకు ప్రయత్నిస్తూ మధ్య మధ్యలో ఆ బరువులు నేలపై దింపుతూ ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకోడానికి స్కూల్‌కి పంపిన పిల్లల చేత బరువులు మోయించడం సరికాదని.. తల్లిదండ్రులు మండిపడుతున్నారు.. విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీచర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థులను శారీరక శ్రమకు గురిచేయడం పాఠశాల నియమావళి ఉల్లంఘన అని వ్యాఖ్యానించారు. విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.
భార్యను చిత్రహింసలు పెట్టిన 85 ఏళ్ల భర్తకు జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు
భార్యపై చిత్రహింసలు, మానసిక వేధింపులకు పాల్పడిన 85 ఏళ్ల భర్తకు మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఆరు నెలల జైలు శిక్షతో పాటు నెలకు రూ.20 వేల భరణం చెల్లించాలని ఆదేశించింది. రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన ఇంద్ర అనే మహిళ తన భర్త ధనశీలన్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని స్థానిక కోర్టును ఆశ్రయించింది. భర్త ప్రవర్తన పైన ప్రశ్నించినందుకు, అతని వివాహేతర సంబంధంపై ఆరా తీసినందుకు, తనను మూడు సంవత్సరాలుగా ఫోన్ వాడనీయకుండా, తిండి ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక కోర్టు విచారణ జరిపి, ధనశీలన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కానీ, భర్త జిల్లా కోర్టులో అప్పీల్ చేయగా, “ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు” అని పేర్కొంటూ కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో ఇంద్ర హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం భారత సంప్రదాయంలో పవిత్ర బంధమని, కానీ అది భార్య భరించాల్సిన బాధల సంకెళ్ళుగా మారకూడదని పేర్కొంది. వృద్ధురాలైన ఇంద్ర కుటుంబ గౌరవం కోసం మౌనం పాటించినా, ఇప్పుడు న్యాయం కోరడం ప్రతీకార చర్య కాదని వ్యాఖ్యానించింది.
భారీ విజయం దిశగా డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ
అగ్ర రాజ్యం అమెరికాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అన్ని చోట్ల డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోయారు. రిపబ్లికన్ పార్టీ చతికిలపడింది. వర్జీనియా గవర్నర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బెర్గర్ విజయం సాధించగా.. న్యూజెర్సీ గవర్నర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి మికి షెర్రిల్ విజయం సాధించారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఓడించిన తర్వాత స్పాన్‌బెర్గర్ వర్జీనియాకు తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్ సృష్టించారు. ఇక న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దానీ భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థి కంటే ఎక్కువగా భారీ గెలుపు దిశగా వెళ్తున్నారు. మమ్దానీకి ఓటు వేయొద్దని ట్రంప్ కోరారు. ట్రంప్ వ్యాఖ్యలను ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఓటర్లంతా.. మమ్దానీ వైపే మొగ్గుచూపారు. ట్రంప్ మాటలకు భయపడేది లేదని.. నగర ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యత అని మమ్దానీ పేర్కొన్నారు. ఇక న్యూయార్క్ మేయర్ అభ్యర్థి ఎవరు గెలిచినా వచ్చే ఏడాదే ప్రమాణస్వీకారం ఉంటుంది. జనవరి 1, 2026న ప్రమాణస్వీకారం చేస్తారు. ఒకవేళ మమ్దానీ గెలిస్తే మాత్రం.. న్యూయార్క్‌లో తొలి ముస్లిం మేయర్‌గా రికార్డ్ సృష్టించనున్నారు.
7000mAh బ్యాటరీ, MIL-810H మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Snapdragon 7s Gen 2తో నేడే Moto G67 Power 5G లాంచ్..!
మోటరోలా (Motorola) కొత్త స్మార్ట్‌ఫోన్ Moto G67 Power 5G ను భారత మార్కెట్లో నేడు (నవంబర్ 5) అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మోటరోలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. మిడ్ రేంజ్ విభాగానికి చెందిన ఈ ఫోన్ ముఖ్యంగా భారీ బ్యాటరీ, ప్రాసెసర్, మంచి కెమెరా పనితీరుతో ఆకట్టుకోనుంది. ఇక పనితీరు పరంగా చూస్తే Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 (4nm) ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 8GB ర్యామ్ తో వస్తుంది. అలాగే 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. వీటితోపాటు RAM బూస్ట్ ఫీచర్ సహాయంతో ర్యామ్‌ను 24GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UX పై పనిచేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌ను కంపెనీ హామీ ఇస్తోంది. ఈ ఫోన్ లో 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది దాదాపు 58 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని మోటరోలా తెలిపింది. ఫోన్ 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విభాగంలో Moto G67 Power 5Gలో 50 మెగాపిక్సెల్ (f/1.8) సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనికి AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ సపోర్ట్ ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2-ఇన్-1 ఫ్లికర్ కెమెరా కూడా ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ (f/2.2) సెల్ఫీ కెమెరా హోల్-పంచ్ డిజైన్‌లో అమర్చబడింది. అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను అందిస్తాయి.
నేడు మోడీని కలవనున్న భారత మహిళల క్రికెట్ ప్లేయర్స్..
ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత అమ్మాయిల క్రికెట్ జట్టు ఈరోజు ( నవంబర్ 5న) సాయంత్రం 6 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నట్లు తెలుస్తుంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరగనున్న ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులను మోడీ సన్మానించనున్నారు. ప్రధానితో సమావేశం తర్వాత ప్లేయర్లు అందరూ తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోనున్నారు. అయితే, భారత అమ్మాయిల జట్టు ముంబై నుంచి ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ లో మంగళవారం నాడు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంది. ప్రపంచ కప్ విజయం తరువాత జట్టు రాక నేపథ్యంలో రాజధానిలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ‘ఉమెన్ ఇన్ బ్లూ’ తొలి ఐసీసీ ట్రోఫీని దక్కించుకుంది. భారత్ చారిత్రక విజయం సాధించిన వెంటనే ప్రధాని మోడీ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా అభినందించారు. “ఫైనల్స్‌లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది.. ఫైనల్‌లో వారి ప్రదర్శన గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో కూడిందన్నారు. ఈ టోర్నమెంట్ మొత్తం జట్టు అసాధారణమైన ప్రదర్శనలు చేసిందన్నారు. ఈ చారిత్రక విజయం భవిష్యత్తులో మరికొందరు అమ్మాయిలు క్రీడల వైపు మొగ్గు చూపేందుకు ప్రేరణగా నిలుస్తుందని #WomensWorldCup2025 అని ప్రధాని మోడీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
వాటితో సెల్ఫీ దిగాలి..అదే అసలు విజయం
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరోగా టాలీవుడ్‌కి పరిచయమైన సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నా, యాక్సిడెంట్ తర్వాత ఆయన సరైన హిట్టు అందుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. చేసిన ‘రిపబ్లిక్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ‘బ్రో’ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ప్రస్తుతానికి ఈ సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్, సుమారు 150 కోట్లతో ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో ఎక్కువగా సాయి ధరమ్ తేజ్ సోషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌కి హాజరవుతున్నాడు. అందులో భాగంగానే ఒక ప్రోగ్రామ్‌కి హాజరైన నేపథ్యంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “అసలైన సక్సెస్ అంటే నీతో ఫోటోలు దిగడం కాదు, నీ కటౌట్‌తో ఫోటోలు దిగటం” అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలా దిగినప్పుడే దాన్ని అసలైన స్టార్‌డమ్ అంటారంటూ సాయిధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని రోహిత్ డైరెక్షన్లో, ‘హనుమాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
చరణ్ కొత్త సాంగ్ కోసం ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్‌మెంట్ – “చికిరి చికిరి” అర్థం నేడు రివీల్!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చిత్రం “పెద్ది” ప్రస్తుతం సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మాస్ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని “ఉప్పెన” ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సినిమా టీమ్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను ప్రకటించింది. “చికిరి చికిరి” అనే టైటిల్‌తో రాబోయే ఈ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. టైటిల్ కొత్తగా, ఆసక్తికరంగా ఉండటంతో పాటు పై అంచనాలు బాగా పెరిగాయి. ఇక ఈ లిరిక్‌కి అర్థం ఏంటన్నదానిపై కూడా అభిమానుల్లో మంచి కుతూహలం నెలకొంది. అయితే చిక్కి అంటే ఆది పల్లీ చిక్కి అనే అర్ధం.. సినిమా అంతా విజయనగరం నేపథ్యం కావడంతో, విజయనగరం యాసలో పల్లీ పట్టిని చిక్కి అని అంటారు. కాగా మేకర్స్ ఈ రోజు ఆ వివరాలను రివీల్ చేయనున్నారని ప్రకటించడంతో అందరి చూపు ఇప్పుడు ఆ అప్‌డేట్‌పైనే ఉంది. మ్యూజిక్ మాస్ట్రో ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాలో సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఈసారి ఎలాంటి కొత్త ప్రయోగం చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఇక “పెద్ది” సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ కెరీర్‌లో మరో పాన్-ఇండియా స్థాయి సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని 2026 మార్చి 27న గ్రాండ్ రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
అలాంటి వారికీ అవార్డులు అవసరం లేదు – మమ్ముట్టి పై ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు!
ఇటీవల కేరళ ప్రభుత్వం ప్రకటించిన 55వ రాష్ట్రీయ చలనచిత్ర పురస్కారాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అవార్డుల్లో ప్రముఖ నటుడు మమ్ముట్టి తన నటనతో మరోసారి దుమ్ము రేపారు. దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే ఈ అవార్డు ప్రకటన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రకాశ్ రాజ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. “జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో జ్యూరీ సభ్యులు కొన్నిసార్లు రాజీ పడుతున్నారని చెప్పడంలో నాకు ఎటువంటి సంకోచం లేదు. కానీ కేరళ రాష్ట్ర అవార్డుల కమిటీ మాత్రం చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించింది. వాళ్లు నన్ను సంప్రదించి ‘మేము జోక్యం చేసుకోం, మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోండి’ అని చెప్పారు. అందుకే నేను ఆ బాధ్యత తీసుకున్నాను” అన్నారు. అయితే ఆయన జాతీయ అవార్డుల విధానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ “జాతీయ అవార్డుల విషయంలో పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నిర్ణయాలతో కొంతమందికి అవార్డులు లభిస్తున్నాయి. కానీ మమ్ముట్టి లాంటి గొప్ప కళాకారులకు అలాంటి అవార్డులు అవసరం లేదు. ఆయన ప్రతిభకు అవార్డులు కాదు, ప్రజల ప్రేమే నిజమైన గుర్తింపు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
