అనుకూలించని వాతావారణం.. గాల్లో విమానం చక్కర్లు
దట్టమైన పొగమంచు రవాణా వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతోంది.. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కారణంగా.. కొన్ని విమానాలు ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు మళ్లించిన విషయం విదితమే కాగా.. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా.. విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.. ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్ పోర్టు (గన్నవరం) కు చేరుకోవాల్సిన విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా, ఎయిర్ బస్ విమానం గాల్లో అరగంటకు పైగా చక్కర్లు కొట్టింది.. వాతావరణంలో దట్టమైన పొగ మంచు ఏర్పడటంతో ఏటీసీ క్లియరెన్స్ లేక సేఫ్ ల్యాండింగ్‌కు ఇబ్బంది పడాల్సి వచ్చింది.. దీంతో ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఎ 320_251ఎన్ గాల్లో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత కొంత వాతావరణం అనుకూలించడంతో.. విమానాన్ని ల్యాండ్ చేశారు..
మరోసారి పోలవరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టిసారించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పలు మార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి.. నిర్మాణ పనులను పర్యవేక్షించి.. కీలక ఆదేశాలు ఇస్తూ వచ్చిన ఆయన.. ఈ నెల జనవరి 7న పోలవరం ప్రాజెక్టును మరోసారి సందర్శించనున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు ఎల్లుండి ఉదయం 10.20 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా పోలవరం బయలుదేరనున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను నేరుగా పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై సీఎం ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై సమగ్ర సమీక్ష జరుపుతారు. పోలవరం డ్యామ్, స్పిల్‌వే, కాలువలు, నిర్వాసితుల పునరావాస పనులు తదితర అంశాలపై సీఎం ఫోకస్ పెట్టనున్నారు. సమీక్ష ముగిశాక మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం సీఎం విజయవాడలోని సిద్దార్థ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి సంబరాల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో సీఎం ప్రసంగించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి, రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనతో ప్రాజెక్టు పనులకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ‘మరో చరిత్ర’.. సహజీవనం చేస్తున్న మైనర్లు!
హైదరాబాద్‌లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లు సహజీవనం చేస్తున్న విషయం బయటపడడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ పరిధిలో నివాసం ఏర్పరుచుకుని కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం ప్రకారం… పాల్వంచ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారి తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు. బాగా చదువుకోండని, పెద్దయ్యాక పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు కలవొద్దని షరతులు కూడా విధించారు. తల్లిదండ్రుల మాటలను పట్టించుకోని మైనర్లు.. ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలో మరోచరిత్ర సినిమా తరహాలో సహజీవనం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు.
అస్సాంలో 5.1 తీవ్రతతో భూకంపం.. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో ప్రకంపనలు
ఇటీవల సంభవిస్తున్న భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అస్సాంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఆ సమయంలో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, భూకంప కేంద్రం 26.37 ఉత్తర అక్షాంశం, 92.29 తూర్పు రేఖాంశం వద్ద 50 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. మిడిల్ అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో స్వల్పంగా ప్రకంపనలు అనుభవించినప్పటికీ, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అస్సాంతో పాటు, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్యంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఈ ప్రకంపనలు చాలా తేలికపాటివి కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అక్క ప్రేమ.. తమ్ముడిపై దాడి చేసిన వీధి కుక్కలతో 8 ఏళ్ల బాలిక పోరాటం.. ఆ తర్వాత..
అక్క-తమ్మడి మధ్య బాండింగ్ ఎంతో ప్రత్యేకం.. తమ్ముడి కోసం ఏదైనా చేసే అక్క.. తన అక్క కోసం ఎంత వరకు అయినా వెళ్లే తమ్ముడు ఇలా ఘటనలు చూస్తుంటాం.. అయితే, ఎనిమిదేళ్ల వయస్సులోనూ.. తన ఐదేళ్ల తమ్ముడి కోసం వీధి కుక్కలతో పోరాటానికి దిగింది ఓ అక్క.. మూడు నిమిషాల పాటు కుక్కతో పోరాటం చేసి.. తరిమేసింది.. ఇక, అప్పటికే తన తమ్ముడు.. కుక్కల దాడిలో గాయపడడం.. రక్తస్రావం అవుతుండడాన్ని తట్టుకోలేకపోయింది.. తన టీషర్ట్‌ను విప్పి.. తమ్ముడికి కట్టింది.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన 5 ఏళ్ల సోదరుడు ప్రమాదంలో ఉండటం చూసి, 8 ఏళ్ల సోదరి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, క్రూరమైన కుక్కతో పోరాడింది. ఆమె మూడు నిమిషాలు పోరాడి తన సోదరుడిని కాపాడింది. ఇంకా, దాడి తర్వాత, చలిలో, తన సోదరుడి తల నుండి రక్తస్రావం అవుతుండటం చూసి, ఆమె తన టీ-షర్టును తీసి అతని తలకు కట్టి, రక్తస్రావం ఆపింది. ఈ ఘటనతో తోబుట్టువుల మధ్య ఈ ప్రేమ గురించి అంతా చర్చించుకుంటున్నారు.. రాజ్‌గఢ్ జిల్లాలోని ఖిల్చిపూర్ పట్టణంలోని సోమవారియాలోని వార్డ్ నంబర్ 3లో ఈ సంఘటన జరిగింది..
నేడు ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ.. వెనిజులా వ్యవహారంపై చర్చ
వెనిజులా వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం వెనిజులాపై అమెరికా భీకరమైన సైనిక చర్యకు దిగి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను.. అతని భార్య సిలియా ఫ్లోర్స్‌ను కారకాస్‌లో బంధించి అమెరికా తరలించింది. పెద్ద ఎత్తున బాంబ్ దాడులు చేసింది. ముందుగానే దేశమంతా విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీంతో అంధకారం అలుముకుంది. అనంతరం అధ్యక్షుడి కుటుంబాన్ని బంధించింది. ఈ బాంబు దాడుల్లో 40 మంది దాకా చనిపోయినట్లుగా వెనిజులా అధికారి తెలిపారు. తాజాగా ఇదే వ్యవహారంపై సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుందని ఐక్యరాజ్యసమితికి సోమాలియా శాశ్వత ప్రతినిధి ఖాదీజా అహ్మద్ తెలిపారు. కౌన్సిల్‌లో శాశ్వత సభ్యదేశమైన కొలంబియా అభ్యర్థన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశాలైన చైనా, రష్యా మద్దతు తెలిపాయి.
నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు.. రష్యా చమురుపై ట్రంప్ వ్యాఖ్య
ప్రపంచ వ్యాప్తంగా వెనిజులా వ్యవహారం కాకరేపుతున్న వేళ్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోడీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. ‘‘నేను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు. మోడీ చాలా మంచి వ్యక్తి. నన్ను సంతోషపెట్టడం ముఖ్యం. వారు వ్యాపారం చేస్తారు. మేము సంకాలు విధిస్తాం.’’ అని అన్నారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపాలి.. దిగుమతులు కొనసాగిస్తే మాత్రం భారతదేశంపై కొత్త సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంలో తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసు అని చెప్పుకొచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గతేడాది ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారతదేశంపై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాజాగా మరోసారి భారత్‌ను ట్రంప్ హెచ్చరించారు. చమురు కొనుగోలు ఆపకపోతే మరోసారి భారత్‌పై సుంకం విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఐ ఫోన్ లవర్స్‌కు షాక్..!
ఒక్కసారి ఐఫోన్‌కు మారితే చాలు.. మార్కెట్‌లోకి వచ్చే కొత్త మోడల్‌ను కొనుగోలు చేస్తుంటారట ఐఫోన్ లవర్స్.. కొత్త మోడల్ ఎప్పుడు వస్తుందా? అని వేచి చూస్తుంటారు.. లాంచ్‌కి అనుగుణంగా దానిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ కూడా చేసుకుంటారు.. అయితే, ఈ సంవత్సరం యాపిల్ తన దీర్ఘకాల సంప్రదాయాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది.. ఈ సంవత్సరం కంపెనీ ఐఫోన్ 18 ను లాంచ్ చేయదని నివేదికలు సూచిస్తున్నాయి. బదులుగా, ఇది తన వార్షిక ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌ను పూర్తిగా మార్చవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా, కంపెనీ తన ప్రో మరియు స్టాండర్డ్ మోడళ్లను ఒకేసారి విడుదల చేస్తూ వచ్చింది.. అయితే, యాపిల్ కంపెనీ ఇప్పుడు ఈ నమూనాను బ్రేక్ చేయవచ్చు.. ఐఫోన్ 17 లైనప్‌కు అద్భుతమైన స్పందన ఉన్నప్పటికీ, కంపెనీ ఐఫోన్ 18 లాంచ్‌ను ఆలస్యం చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.. ఆ నివేదికల ప్రకారం.. కంపెనీ 2026లో ఐఫోన్ 18ని లాంచ్ చేయడం లేదు.. ఐఫోన్ 18 లాంచ్ ఆలస్యం అవుతుందని గతంలో నివేదికలు వచ్చాయి. మాక్‌రూమర్స్ తన తాజా నివేదికలో కంపెనీ ఐఫోన్ 18ను 2027 నాటికి లాంచ్ చేయవచ్చని సూచించింది. అప్పటి వరకు, ఐఫోన్ 17 కంపెనీ పోర్ట్‌ఫోలియోలో తాజా నాన్-ప్రో స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుంది. యాపిల్ తన స్టాండర్డ్ లైనప్‌ను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా రిఫ్రెష్ చేయకపోవడం ఇదే మొదటిసారి అవుతుంది. గత దశాబ్ద కాలంగా, కంపెనీ ప్రతి సెప్టెంబర్‌లో తన లైనప్‌ను ప్రారంభించింది. ఇది కొన్ని మోడళ్లను భర్తీ చేసినప్పటికీ, దాని స్టాండర్డ్ మోడల్‌ను ఎప్పుడూ దాటవేయలేదు.
రాజస్థాన్ రాయల్స్‌లో కెప్టెన్సీ హీట్.. ఆర్ఆర్ పోస్ట్ వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) శిబిరంలో కెప్టెన్సీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ అనంతరం నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై అటు అభిమానుల్లోనూ, ఇటు క్రికెట్ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ పేర్లు ముందుకొస్తున్నప్పటికీ.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజానే తదుపరి కెప్టెన్‌గా ఉండాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అంటున్నారు. ఈ స్పెక్యులేషన్ల మధ్య రాజస్థాన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్టు ఒకటి అభిమానుల్లో మరోసారి ఉత్కంఠను పెంచింది. రాజస్థాన్ రాయల్స్ తన ఎక్స్‌లో రవీంద్ర జడేజా ఫొటోను పంచుకును.. ‘దళపతి’ అనే కాప్షన్ ఇచ్చింది. దాంతో రాయల్స్‌ను నడిపించేది జడేజానే అని ఖాయమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ట్రేడ్ డీల్‌లో భాగంగా జడేజా రాయల్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 ఆవరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్ చెన్నైకి వెళ్లిపోయాడు. జడేజా 2008–09 మధ్యలో రాజస్థాన్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆ ఫ్రాంచైజీలోకి రావడమే కాదు.. కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ హోం మ్యాచ్‌ల వేదిక విషయంలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం రాయల్స్ హోం గ్రౌండ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. గత నవంబర్‌లో ఐఏఎన్‌ఎస్ కథనం ప్రకారం.. రాయల్స్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పుణె వేదికపై ఆసక్తి చూపాయి.
టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కు రుక్మిణీ వసంత్ గట్టి పోటీ.. సుకుమార్ సినిమాలో ఛాన్స్ ఎవరికో?
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల రేసు రసవత్తరంగా మారింది. భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ‘దేవర’తో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ‘దేవర’లో గ్లామర్‌కే పరిమితమైనా, రామ్ చరణ్ సినిమాతో తన నటనను నిరూపించుకోవాలని జాన్వీ ఆరాటపడుతోంది. అయితే, ఇప్పుడు జాన్వీ కి గట్టి పోటీనిస్తూ కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ రేసులోకి వచ్చింది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రంతో రుక్మిణి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ‘సప్త సాగరదాచె ఎల్లో’ సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈ భామ, ఇప్పుడు టాప్ డైరెక్టర్ల కళ్లలో పడింది. తాజాగా సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న RC17 కోసం రుక్మిణి పేరును పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలోని ‘పెద్ది’లో జాన్వీ నటిస్తుండగా, అదే వరుసలో రుక్మిణికి కూడా చరణ్ సరసన ఛాన్స్ వస్తే జాన్వీకి ఈమె గట్టి పోటీదారుగా మారడం ఖాయం. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ ‘కనకవతి’కి సుకుమార్ గనుక ఛాన్స్ ఇస్తే టాలీవుడ్‌లో ఆమె రేంజ్ మరో లెవల్‌కు చేరుతుంది.
వరప్రసాద్ గారు.. బాబీ కథ కూడా మారిందా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ఈ సినిమా విడుదల కానుంది. నయన తార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలవగా.. చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. నిన్న తిరుపతిలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. నెక్ట్స్ జనవరి 7న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు బాబీతో తన కెరీర్ లో 158వ సినిమా మొదలు పెట్టనున్నారు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ.. ఈసారి అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. చివరగా బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు బాబీ. ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌తో మాసివ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు కథ మారినట్టుగా తెలుస్తోంది. ముందు అనుకున్న కథ అదిరిపోయినప్పటికీ ఇంచు మించు అలాంటి కథతోనే రీసెంట్‌గా ఓ సినిమా వచ్చిందట. దీంతో.. మరో కొత్త కథతో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బాబీ మాత్రం మెగాస్టార్‌తో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్ ను ముఖ్య పాత్ర కోసం తీసుకోబోతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
