నేడు ఏపీ కేబినెట్ భేటీ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం.. ఇక, ఈ కేబినెట్ సమావేశం నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటనలు కొనసాగగా.. ఇప్పుడు రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. రాజధానిలోని పలు ప్రాజెక్టులకు ఎస్పీవీకి అమోదం తెలపనుంది కేబినెట్.. అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోద ముద్ర వేయబోతోంది.. కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు అమోదం తెలపబోతోంది మంత్రివర్గ సమావేశం.. రాజధాని ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని వాటిపై భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్.. ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టంకు కూడా అనుమతి ఇవ్వబోతోంది ఏపీ కేబినెట్..
లిక్కర్ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించిన సిట్.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!
సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు చూపిస్తోంది.. లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది సిట్.. చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన మరింత కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.. నిన్న తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో సోదాలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. హైదరాబాద్ లో ఇషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు.. కంపెనీలో సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాముగా ఉన్నట్టుగా గుర్తించింది.. తిరుపతిలో పలు కంపెనీల పేర్లతో చెవిరెడ్డి లావాదేవీలు నిర్వహించినట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారు.. మోహిత్ రెడ్డి 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సిట్ గుర్తించింది.. చిత్తూరులో విజయానందరెడ్డి కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించి.. మోహిత్ రెడ్డితో ఆయన భాగస్వామ్యంపై ఆధారాలు గుర్తించింది సిట్.. ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ దొరికినా ఆధారాలతో కలిపి మిగిలిన సమాచారం ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది.. తుమ్మల గుంటలో చెవిరెడ్డి ఇంటి తాళం వేసి ఉండటంతో రాత్రి వరకు చూసి వెనుతిరిగారు సిట్ అధికారులు.
డేంజర్‌లో యమునా నది.. మునిగిన ఢిల్లీ లోతట్టు ప్రాంతాలు
దేశ రాజధాని ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటగా.. ప్రస్తుతం 207.41 మీటర్ల దగ్గర నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇలా జరగడం ఇది మూడోసారి కావడం విశేషం. అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్‌లోకి వరద నీరు ప్రవేశించింది. మరింత నీటి మట్టం పెరిగితే కార్యక్రమాలు నిలిచిపోతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నది ఒడ్డున ఉన్న నివాసాలన్నీ మునిగిపోయాయి. అలాగే వాణిజ్య ప్రాంతాలు కూడా నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మయూర్ విహార్ – ఫేజ్ 1 సమీపంలో ఏర్పాటు చేసిన కొన్ని సహాయ శిబిరాలు కూడా మునిగిపోయాయి. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరడం ఇది మూడోసారి. గతంలో 1978, 2023లో రెండు సార్లు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహించింది. 2023లో నగరం తీవ్రమైన వరదలకు గురైనంది. అప్పట్లో యమునా నది నీటి మట్టం 208.66 మీటర్లకు చేరింది. ఇక 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరింది. తాజాగా 2025లో అంతే స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది.
భారత్‌పై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. మరిన్ని దశలు ఉన్నాయని హెచ్చరిక
భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌పై మరిన్ని దశలు ఉన్నాయని.. రెండు లేదా మూడో దశ సుంకాలు ఉంటాయని సూచించారు. వైట్‌హౌస్‌లో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకితో ట్రంప్ భేటీ అయ్యారు. అనంతరం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. రష్యాపై చర్యలేవీ అంటూ ప్రశ్నించారు. దీంతో ట్రంప్ రుసరుసలాడారు. చర్య లేదని మీకెలా తెలుసు? రష్యాతో సంబంధాలు పెట్టుకున్న భారత్, చైనాపై ద్వితీయ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. దీని కారణంగా రష్యాకు వందల బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయని చెప్పారు. ఇది చర్య కాదంటారా? ఇక తాను రెండు లేదా మూడో దశ ఇంకా చేయలేదని.. అది కూడా త్వరలోనే ఉంటుందని ట్రంప్ ఎదురుదాడికి దిగారు.
అతిపెద్ద స్మార్ట్ టీవీ.. 116.5-అంగుళాల డిస్‌ప్లేతో.. థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్
ఎలక్ట్రానిక్ కంపెనీలు వినియోగదారులకు స్మార్ట్ ఫీచర్లు, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ తో స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు స్వదేశీ కంపెనీ అతి పెద్ద స్మార్ట్ టీవీని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఏకంగా 116.5-అంగుళాల డిస్‌ప్లేతో రానున్నట్లు తెలిపింది. ఇండ్కల్ టెక్నాలజీ తన అతిపెద్ద స్మార్ట్ టీవీని ప్రవేశపెట్టింది. కంపెనీ తన ఇన్-హౌస్ బ్రాండ్ వోబుల్ డిస్ప్లే బ్యానర్ కింద ఈ టీవీని ప్రవేశపెట్టింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్ టీవీ అని బ్రాండ్ పేర్కొంది. కంపెనీ వోబుల్ మాగ్జిమస్ సిరీస్‌లో మూడు స్క్రీన్ సైజుల ఆప్షన్‌ను ఇచ్చింది. ఈ సిరీస్‌లోని అతిపెద్ద మోడల్ 116.5-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ 5.0 పై పనిచేస్తుంది. కంపెనీ ఇంకా ఈ టీవీని విడుదల చేయలేదు. బ్రాండ్ దాని కీ ఫీచర్లను ఆవిష్కరించింది. వోబుల్ మాగ్జిమస్ సిరీస్‌లో QLED + MiniLED డిస్ప్లే టెక్నాలజీ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది . ఈ టీవీలు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా గూగుల్ టీవీ 5.0 తో వస్తాయి. ఇండ్కల్ టెక్నాలజీ ప్రకారం, ఈ టీవీలు 2000 Nits గరిష్ట ప్రకాశంతో వస్తాయి.
చౌకగా మారనున్న చికిత్స.. ఈ మందులపై నో జీఎస్టీ..
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తొలిరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతోన్న 12, 28శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీటిపై 18% జీఎస్టీ ఉండేది. దీంతో సామాన్యులకు ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు.. అనేక రకాల మందులు, వైద్య పరికరాలపై ఉపశమనం లభించింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత, బీమా సేవలపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని రెండు-మూడు వేర్వేరు వర్గాలుగా విభజించనున్నట్లు సీతారామన్ చెప్పారు. టర్మ్ లైఫ్, యులిప్ లేదా ఎండోమెంట్ పాలసీ, వాటి రీఇన్సూరెన్స్, అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ విధించబడదని స్పష్టం చేశారు. ఇది సామాన్యులకు బీమాను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తుంది. దేశంలో బీమా పరిధి పెరుగుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 33 రకాల రోగులకు ఉపయోగపడే మందులపై జీఎస్టీని సున్నాకి తగ్గించింది. గతంలో వీటిపై జీఎస్టీ రేటు 12 శాతంగా ఉండేది. ఈ మందులలో అస్కిమినిబ్, మెపోలిజుమాబ్, పెగిలేటెడ్ లిపోసోమల్ ఇరినోటెకాన్, డరతుముమాబ్, అగల్సిడేస్ ఆల్ఫా, అలిరోకుమాబ్, ఎవోలోకుమాబ్ మొదలైనవి ఉన్నాయి. వీటిలో క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి. అనేక మందులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనితో పాటు, థర్మామీటర్లు, మెడికల్ ఆక్సిజన్, డయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళద్దాలపై జీఎస్టీ రేటును 5%కి తగ్గించారు. గతంలో, వీటిపై 12 నుంచి 18 శాతం జీఎస్టీ వసూలు చేసేవారు.
9 ఏళ్లు పూర్తి చేసుకున్న జియో.. యూజర్ల కోసం బంపరాఫర్లు.. ఫ్రీ అన్ లిమిటెడ్ 5G డేటా!
టెలికాం రంగంలో సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో అప్పుడే 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉచిత సిమ్, ఉచిత డాటా ఆఫర్లతో అడుగుపెట్టి కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. జియో ఇటీవల 50 కోట్ల వినియోగదారుల సంఖ్యను తాకింది. జియో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, కంపెనీ యూజర్ల కోసం బంపరాఫర్లను ప్రకటించింది. అందరికీ 3 రోజుల పాటు ఉచిత అపరిమిత డేటా.. జియో ఒక నెల రీఛార్జ్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. 50 కోట్ల జియో వినియోగదారులకు దీని ప్రయోజనం లభిస్తుంది. జియో సిమ్ వాడుతున్న వినియోగదారుల కోసం కంపెనీ మూడు సెలబ్రేషన్ ప్లాన్స్ తీసుకువచ్చిందని జియో NBT టెక్‌తో సమాచారాన్ని పంచుకుంది. దీని కింద, జియో తన 5G వినియోగదారులందరికీ సెప్టెంబర్ 5, 7 మధ్య అంటే రాబోయే వారాంతంలో, వారి ప్లాన్‌తో సంబంధం లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది. మరోవైపు, ప్రస్తుతం 4G స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులు రూ.39 డేటా యాడ్-ఆన్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా రోజుకు 3GB 4G డేటాను ఆస్వాదించగలరు.
ఘాటీ ఇన్ సైడ్ టాక్.. ‘స్వీటీ’ అంటే ‘స్వీట్’ అనుకుంటివా?
అనుష్క హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెండేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ అయినా కూడా ఆచి తూచి సినిమాలు చేస్తోంది అనుష్క. భాగమతి ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఇన్ సైడ్ గురించి టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అందిన సమాచారం ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ రోలర్ కోస్టర్ గా సాగుతుంది, హై-ఆక్టేన్ రైల్వే స్టేషన్ సన్నివేశం, గుహలో సాగే ఫైట్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇస్తుంది. ఇక ఇంటర్వెల్ ప్రేక్షకులకు సూపర్ ట్విస్ట్ ఇస్తుంది. కానీ స్టోరీ పరంగా స్లో గా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో కథ యొక్క ప్రధాన భాగం ప్రారంభమవుతుంది. బాధితురాలి నుండి నేరస్థురాలిగా, పురాణగాథగా మారిన శీలవతి అనే మహిళగా అనుష్క ఛేంజోవర్ ఆడియెన్స్ కు గూస్ బంప్ కలిగించేలా ఉంటాయి. ఫైనల్ గా స్వీటీ నుండి సూపర్ సినిమా చూశామని ఫీలింగ్ తో ప్రేక్షకులు థియేటర్ల నుండి బయటకు వస్తారని తెలుస్తోంది. భావోద్వేగాలతో కూడిన కథ యాక్షన్ మరియు కెరీర్‌ను స్వీట్ అద్భుతమైన నటనతో ఘాటి హిట్ సినిమాగా నిలుస్తుందని టాక్. క్వీన్ అనుష్కశెట్టిని వేదం లో చూపించిన దానికి బిన్నంగా స్వీటీ అంటే స్వీట్ కాదని కత్తి పట్టి వీరవిహారం చూపించిన విధానం మెప్పిస్తుందని సమాచారం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది, U/A సర్టిఫికేట్ తో 2 గంటల 37 నిమిషాల నిడివితో మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానుంది ఘాటీ.
నాగవంశీపై నెగిటివ్ కామెంట్స్ కు ఇచ్చిపడేసిన వెంకీ అట్లూరి
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ‘కొత్త లోక 1: చంద్ర’ పేరుతో విడుదల చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “సినిమా నేను చూశాను. నాకు చాలా నచ్చింది. టెక్నికల్ గా బ్రిలియంట్ మూవీ. రూ. 30 కోట్లతో రూ. 300 కోట్ల రేంజ్ సినిమా తీశారని అందరూ అంటున్నారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళ సినిమా పరంగా రూ. 30 కోట్లు అనేది చాలా ఎక్కువ. ఈ సినిమాని నమ్మి నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్ గారిని ముందుగా అభినందించాలి. అలాగే సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ లను ప్రత్యేకంగా అభినందించాలి. మలయాళం పరిశ్రమలో అందరూ గొప్పగా నటిస్తారు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. కళ్యాణి ప్రియదర్శన్ గొప్పగా నటించింది. తాను నాకు తెలుసని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు తను చేసిన తీరుకి హ్యాట్సాఫ్. రచన అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఇంత గొప్పగా మలిచిన దర్శకుడు డొమినిక్ అరుణ్ ప్రతి ప్రశంసకు అర్హుడు. నాగవంశీ ఆగస్టులో ఓ సినిమా వలన మాట పడ్డాడు. అదే నెల చివర్లో హిట్ సినిమాతో సమాధానం ఇచ్చాడు. దటీజ్ నాగవంశీ అని ” అన్నారు.
