విశాఖ సెంట్రల్ జైలులో అవాంఛనీయ ఘటనలు..! ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు..
అవాంచనీయ ఘటనలకు కేంద్రంగా మారిందంటూ విశాఖ సెంట్రల్ జైల్‌పై ఆరోపణలు వచ్చితన తరుణంలో ప్రక్షాళన ప్రారంభించింది ప్రభుత్వం.. గంజాయి ఖైదీలతో మిలాఖత్ ఆరోపణలు రుజువవ్వడంతో ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు పడింది. పర్యవేక్షణ లోపం కారణంగా పరిస్థితులు అదుపుతప్పడానికి బాధ్యులైన సూపరింటెండెంట్ ఎస్.కిషోర్‌కుమార్, అదనపు కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు ఇటీవల జరిగిన బదిలీల్లో ఒకరు అనంతపురం, మరొకరు నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్ళారు. తదుపరి ఉత్తర్వులు తదుపరి వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. అప్పటి వరకు సీనియర్ అధికారులు హెడ్‌క్వార్టర్స్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖ కేంద్ర కారాగారంలోవరుస అవాంఛనీయ ఘటనలను రాష్ట్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి నిజమని తేలడంతో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. వీరిద్దరి సీడీఆర్(కాల్ డేటా రికార్డు) ఆధారంగా మొబైల్ ఫోన్‌లను చాలా సార్లు ఉపయోగించినట్లు తేలింది. జైలు నుంచి రాత్రి వేళల్లో ఫోన్ కాల్స్ బయటకు వెళ్లినట్టు నిర్ధారణ అయ్యింది. ఖైదీ ఉప్పాడ గౌరీశంకర్ వాష్ రూమ్‌లో ఉరివేసుకుని ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఓ రౌడీషీటర్ కోసం లంచ్ బాక్స్ లో గంజాయి తరలిస్తూ ఫార్మాసిస్టు పట్టుబడ్డాడు. ఇవి కాకుండా భద్రతలో కీలకమైన సెక్యూరిటీగార్డుల షిఫ్ట్ విధానాన్ని అమలు చేయడంలో ఇద్దరూ విఫలమైనట్లు శాఖ పరమైన విచారణలో తేలింది.. దీంతో చర్యలకు దిగింది ప్రభుత్వం..
నేడు ముంబైకి సీఎం చంద్రబాబు.. అక్కడి నుంచి నేరుగా విశాఖకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విశాఖపట్నం రానున్నారు.. ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ముంబైలోని ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర సీఎంగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఫడ్నవీస్.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ నేతలు హాజరుకానున్నారు.. అయితే, ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ముంబై నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు చంద్రబాబు నాయుడు.. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి.. ముంబై చేరుకున్నారు సీఎం చంద్రబాబు.. అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఇక, తిరిగి ముంబై నుంచి రాత్రి 7.30 గంటలకు విమానంలో బయల్దేరనున్న ఆయన.. రాత్రి 9.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 10.05 గంటలకు ఎన్టీఆర్ భవన్‌కు చేరుకొని బస చేయనున్నారు.. ఇక, రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు సీఎం చంద్రబాబు.. సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడు.. ఆ తరువాత..
ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ పట్ల ఓ ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన కలకలం రేపింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తించారు. దీంతో విసుగు చెందిన ఎయిర్ హోస్టెస్ విమానం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాగానే ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రయాణికుడ్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వ్యక్తి నరసింహులుగా గుర్తించారు. నరసింహుల్ని ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఆమె పట్ల అసభ్య ప్రవర్తన చేసినందుకు కేసు నమోదు చేశారు. ప్రయాణికుడు మద్యం మత్తులో వున్నాడా? లేక ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ఎందుకు ప్రవర్తించాడనే దానిపై ఆరా తీస్తున్నారు.
నేడు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్న సీఎం..
నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సెక్రటేరియట్‌లో మొబైల్ యాప్‌ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన – విజయోత్సవాల్లో రవాణా శాఖ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మాదాపూర్ లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది ప్రజాపాలన ఉత్సవంలో భాగంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను సీఎం ఆవిష్కరించిన తర్వాత రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది.
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న ప్రధాని
మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన 11 రోజుల తర్వాత ఉత్కంఠకు తెరపడి బుధవారం జరిగిన కీలక సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎంపిక చేసినట్లు బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం ఈరోజు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రి కానున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులందరూ ఆజాద్ మైదాన్‌కు చేరుకుంటారు. మహాయుతి ముఖ్యమంత్రిగా నామినేట్ అయిన తర్వాత, దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఈ రోజు (డిసెంబర్ 5) సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు.
భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్
స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా బుధవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. “భగత్ సింగ్‌కు భారతరత్న ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. అది జరిగితే ఈ దేశంలోని రాబోయే తరాలు ఈ సభను (రాజ్యసభ) కీర్తిస్తాయి.”అని అన్నారాయన. బెంగళూరులో తాగునీటి ఎద్దడిని ప్రభుత్వం పరిశీలించాలని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోరారు.రాజ్యసభలో జేడీ (ఎస్) నాయకుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీటి కొరత కారణంగా ప్రజలు బెంగళూరులోని ప్రైవేట్ ఆపరేటర్ల నుండి నీటిని కొనుగోలు చేయవలసి వచ్చిందన్నారు. “ఈ సమస్యను పరిష్కరించాలని నేను ముకుళిత హస్తాలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను” అని మాజీ ప్రధాని అన్నారు. నగరంలో నీటి సరఫరా కోసం ప్రైవేట్ ఆపరేటర్లు విపరీతంగా వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేడీ సభ్యుడు సస్మిత్ పాత్ర ఒడిశాకు ప్రత్యేక హోదాను కోరారు.వివిధ ప్రకృతి వైపరీత్యాల కారణంగా రాష్ట్రం నష్టపోయిందని, దీని వల్ల రాష్ట్రానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్‌ను ఓడించి వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన భారత్
పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా మూడోసారి గెలుచుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్లో యంగ్ లయన్స్ ఆఫ్ ఇండియా 5-3తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్ తరఫున అరిజిత్ హుండాల్ సింగ్ అత్యధికంగా నాలుగు గోల్స్ చేశాడు. దిల్‌రాజ్ సింగ్ స్టిక్ నుంచి ఒక గోల్ వచ్చింది. కాంటినెంటల్ టోర్నీలో భారత్‌కు ఇది ఐదో టైటిల్. ఇంతకు ముందు భారత్ 2004, 2008, 2015, 2023లో ఈ టైటిల్‌ను గెలుచుకుంది. కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ టోర్నమెంట్ 2021లో నిర్వహించబడలేదు. అంతకుముందు సెమీస్‌లో మలేషియాను 3-1తో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు జపాన్‌ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. 4, 18, 54 నిమిషాల్లో లభించిన మూడు పెనాల్టీ కార్నర్‌లను హుండాల్ గోల్‌గా మలిచాడు. 47వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేశాడు. భారత్‌కు మరో గోల్ దిల్‌రాజ్ సింగ్ (19వ నిమిషం) అందించాడు. పాకిస్థాన్ తరఫున సుఫియాన్ ఖాన్ (30వ మరియు 39వ నిమిషంలో) రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మార్చగా, హన్నన్ షాహిద్ మూడో నిమిషంలో ఫీల్డ్ గోల్ చేశాడు. మ్యాచ్‌ను చక్కగా ప్రారంభించిన పాకిస్థాన్ మూడో నిమిషంలోనే షాహిద్ ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. పాకిస్తాన్ గోల్‌కీపర్ కుడివైపున శక్తివంతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో హుండాల్ స్కోరును సమం చేయడంతో భారత్ కేవలం సెకన్ల తర్వాత వారి మొదటి పెనాల్టీ కార్నర్‌ను సంపాదించింది. రెండో క్వార్టర్‌లో భారత్ తన ఆటను మెరుగుపరుచుకుంది. 18వ నిమిషంలో రెండో పెనాల్టీ కార్నర్‌ను హుండాల్ గోల్‌గా మార్చాడు. ఒక నిమిషం తర్వాత, దిల్‌రాజ్ చేసిన అద్భుతమైన ఫీల్డ్ గోల్ భారత్ ఆధిక్యాన్ని 3-1కి పెంచింది.
అమెరికా నుండి అనకాపల్లి వరకు నీ యవ్వ తగ్గేదేలే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా పుష్ప స్పెషల్ ప్రీమియర్స్ తో గ్రాండ్ గా రిలీజ్ అయింది పుష్ప- 2. మూడేళ్ళుగా సెట్స్ పై ఉన్న పుష్ప మొత్తానికి థియేటర్స్ లోకి వచ్చింది. అనేక సార్లు రిలీజ్ వాయిదా పడుతూ గురువారం రాత్రి 9: 30 గంటల ఆటతో రిలీజ్ విడుదల అయింది. భారీ ఎత్తున రిలీజ్ అయిన ప్రీమియర్స్ కు అద్భుత స్పందన లభించింది. అటు అమెరికా నుండి ఇటు అనకాపల్లి వరకు ఎక్కడ విన్న ఒకటే మాట పుష్ప -2 ఊహించిన దాని కంటే కూడా బాగుంది. బన్నీ ఎంట్రీతో మొదలైన హై చివరలో ఎండ్ కార్డ్ పడేవరకు కూడా తగ్గేదేలే అనేలా సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులని కట్టిపడేసింది. ప్రతి సీన్ లో తన బాడీ లాంగ్వేజ్ తో నటనతో అల్లు అర్జున్ మెస్మరైజ్ చేసేసాడు. మరి ముఖ్యంగా చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగ్స్ కు థియేటర్స్ లో చప్పట్లతో మోతమోగిపోయాయి. ఇక సాంగ్స్ లో ఆయితే డాన్స్ గురించి చెప్పక్కర్లేదు. కిస్సిక్ సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల వేసిన స్టెప్పులకు కుర్రకారు హుషారెత్తారు.మొత్తానికి బన్నీ పడిన కష్టానికి ఆయన ఫాన్స్ ఎదురుచూపులకు తగ్గ ఫలితం దక్కిందనే చెప్పవచ్చు. ఇక మొదట రోజు పుష్ప -2 వారల్డ్ వైడ్ గా ఎంత మేరకు రాబడుతుందో చూడాలి.
జాతర ఎపిసోడ్ కు జాతీయ అవార్డు గ్యారెంటీ
అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ గురువారం రాత్రి 9.30 గంటలకుస్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది పుష్ప -2. ఎటు చుసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే టైటిల్ కార్డు నుండి ఎండ్ కార్డు వరకు ఒకే ఒక్కడు సినిమాను భుజాలపై మోశాడు. బన్నీ నటనతో ఆద్యంతం సినిమాను నిలబెట్టాడు అని చెప్పడంలో సందేహమే లేదు. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే గంగమ్మ జాతర ఎపిసోడ్ కు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు అల్లు అర్జున్. ఆ ఎపిసోడ్ లో బన్నీ నటనను చూసిన ఏవైరైనా చెప్పేది ఒకటే మాట అల్లు అర్జున్ కు మరోసారి జాతీయ అవార్డు రావడం గ్యారెంటీ. చీర కట్టుకుని గాజులు ధరించి నాట్యం చేస్తుంటే అల్లు అర్జున్ కు అమ్మవారు పూనారేమో అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఆ రేంజ్ లో అద్భుత నట విశ్వరూపం కనబరిచాడు పుష్ప రాజ్. ఈ సినిమా కోసం బన్నీ పడిన పడిన కష్టం తెరపై క్లియర్ గా కనిపించింది. ప్రతి సీన్, ప్రతి షాట్ లో బన్నీ చేస్తున్నట్టు ఉండదు. నిజంగా పుష్ప రాజ్ అనేవాడు ఇలానే ఉంటాడెమో అనేలా జీవించాడు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం పక్కా.