NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ప్రత్యేక, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కోనే రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు. ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 9 రోజులలో శ్రీవారు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తే… రథ సమప్తమి పర్వదినం రోజున ఒక్కే రోజు శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు. సకల జీవకోటికి వెలుగు ప్రదాత.. చైతన్య కారకుడైన సూర్యభగవానుడు జనులకు ప్రత్యక్ష నారాయణుడు.. ఆ ఆదిత్యుని జన్మదినమైన సూర్యజయంతి రోజున రథసప్తమి వేడుకలును టీటీడీ నిర్వహించడం ఆనవాయితి. ఇవాళ సూర్యోదయాన సుర్యప్రభ వాహనంతో ప్రారంభమైన గోవిందుడి వాహన సంరంభం రాత్రికి జరిగే చంద్రప్రభ వాహనంతో ముగియనున్నది. శ్రీనివాసుడు ఒక్క రోజే సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల,చంద్రప్రభ వాహనాలపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.

ఇంఛార్జ్‌ మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ బాధ్యత మీదే..!
పాలనపై మరింత ఫోకస్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అయితే అదేసమయంలో.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే పలుదపాలుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం ఉండాలని ఇంచార్జి మంత్రులకు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు – అధికారులు మధ్య గాప్ బాగా ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా ఇంచార్జి మంత్రులు కీలక బాధ్యతలు తీసుకోవాలని సీఎం చెబుతున్నారు. ఇక నుంచి పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం మాత్రమే గ్రీవెన్స్ ఉంటుంది. ఇక్కడ మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలి. అర్జీలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జిల్లా ఇంచార్జి మంత్రులుగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలన్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసే విధంగా నియోజకవర్గ ఇంచార్జిలు వ్యవహరించాలన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజక వర్గ ఇంచార్జిలు ముగ్గురు కలిసి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.. పార్టీకి ప్రాధాన్యత.. అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు…..

నేడు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ భేటీ.. ఆ పథకాలపై సీఎం కసరత్తు..
మరికొన్ని పథకాలపై ఫోకస్‌ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. రైతులకు రుణాలు.. బ్యాంకర్ల పాత్రపై ముఖ్యంగా చర్చించబోతున్నారు.. ఇక, తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టడంతో.. బ్యాంకర్లకు కీలక సూచనలు ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు.. సంక్షేమ కార్యక్రమాలు.. రైతులకు రుణాలు విషయంలో బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేయబోతున్నారట.. బ్యాంకర్లు సహకరిస్తేనే.. ఏపీ అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. ఏ పథకం కొనసాగాలన్నా.. బ్యాంకర్ల సపోర్ట్ అవసరం. రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో.. బ్యాంకర్లతో సమావేశానికి రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు..

నేడు ఢిల్లీకి మంత్రి లోకేష్‌..
ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి వెళ్లనున్న నారా లోకేష్.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఈ రోజు రాత్రికి భేటీ కానున్నారు. ఇటీవల రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలపనున్నారు. కొత్తగా రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది.. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాన్ని వివరించనున్నారు. విశాఖను ఐటీ హబ్‌గా, రాలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రోత్సహకాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు మంత్రి నారా లోకేష్‌..

బీసీ రిజర్వేషన్‌, ఎస్సీ వర్గీకరణపై సర్కర్‌ ఫోకస్‌.. నేడు కేబినెట్‌, అసెంబ్లీలో చర్చ
ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు విషయంలో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడుతో ముందుకుపోతోంది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం లెక్క ఎంత అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. రాష్ట్రంలో 3 కోట్ల 54 లక్షల మంది ఇచ్చిన వివరాలు సర్కారు దగ్గరున్నాయి. మొత్తంగా కోటీ 12లక్షల 15వే కుటుంబాల వివరాలు నమోదు చేశారు. కులగణనలో 96 శాతానికి పైగా జనాభా పాల్గొంది. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతమని లెక్క తేలింది. ముస్లిం మైనారిటీల్లో బీసీ జనాభా 10.08 శాతంగా ఉంది. ముస్లిం మైనారిటీల్లో బీసీలు కలిపి మొత్తం బీసీల జనాభా 56.33 శాతంగా తేలింది. రాష్ట్రంలో ఓసీ జనాభా 15.79 శాతం ఉంటే.. ముస్లిం మైనారిటీల్లో ఓసీ జనాభా 2.48 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీ జనాభా 12.56 శాతమని సర్వే లెక్క తేల్చింది. ఇక ఎస్సీ జనాభా 17.43 శాతం ఉండగా.. ఎస్టీ జనాభా 10.45 శాతం ఉంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం కసరత్తు పూర్తయింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులతో పాటు, ఏకసభ్య జ్యూడిషియల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందాయి. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికలను కేబినెట్ మీటింగ్‌లో ప్రవేశపెడతారు. ఇవాళ శాసనసభ ప్రత్యేక సమావేశంలో చర్చిస్తారు. ఉభయ సభల్లో ఈ రెండింటిపై డిస్కస్ చేస్తారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలంటూ ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణే అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటను కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈసారైనా మాజీ సీఎం కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ పిలుస్తోంది! గులాబీ బాస్ వస్తారా? రారా అన్నది ఆసక్తికరంగా మారింది.

బాయ్‌ఫ్రెండ్ విషయంలో రోడ్డుపై గొడవపడ్డ స్కూల్ విద్యార్థినులు
బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ అబ్బాయిపై ప్రేమ పెంచుకున్న ఇద్దరు స్కూల్ విద్యార్థినులు తన బాయ్ ఫ్రెండ్ కోసం బహిరంగంగా గొడవకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో రెండు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు. ఈ విషయం ఒకరికి తెలియడంతో ఇద్దరూ ముందుగా వాగ్వాదానికి దిగారు. గొడవ జరగక ముందు ఇద్దరూ తమ సహచరులను తీసుకుని రోడ్డుపై వచ్చారు. తొలుత మాటల యుద్ధంగా మొదలైన ఈ గొడవ, కొంతసేపటికి హింసాత్మకంగా మారింది. స్కూల్ యూనిఫామ్‌లోనే ఉన్న విద్యార్థినులు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకోవడం, జుట్టును పట్టుకొని లాగడం మొదలుపెట్టారు. ఈ గొడవ బహిరంగంగా రోడ్డుపై బహిరంగంగా జరగడంతో అక్కడి వారి ఆశ్చర్యపోయారు. చాలామంది విద్యార్థినులు ఈ ఘర్షణలో పాల్గొన్నారు. ఇది చూసిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థినులను శాంతింపజేశారు. దీంతో గొడవ అదుపులోకి వచ్చింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఘటనపై మరింత చర్చ మొదలైంది.

రెండేళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు.. నా కూతురు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో యువ కెరటం తెలుగమ్మయి గొంగిడి త్రిష దేశ ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పింది. అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.32 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ సత్తా చాటి మూడు వికెట్లను ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది గొంగిడి త్రిష. మేము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. మ్యాచ్ లో ఎలాంటి ఒత్తిడి తీసుకోలేదన్నారు. ప్రతి మ్యాచ్ లోనూ తన వంతు పాత్ర ఏంటి? జట్టు విజయంలో అండగా నిలవాలని మాత్రమే ఆలోచించానని తెలిపింది. ఇక మరో ప్లేయర్ ద్రితి గురించి మాట్లాడుతూ.. తను కూడా టాలెంటెడ్ ప్లేయర్, కానీ ఈ సారి తనకు అవకాశం రాలేదు. అవకాశం వస్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక నుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్ లో చోటు సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. ఇక తన తండ్రి గురించి చెప్తూ.. నా సక్సెస్ లో మా నాన్న ఉన్నారు. తన అందించిన ప్రోత్సాహం మరువ లేనిది. నా కెరీర్ కోసం నాన్న ఎంతో కష్టపడ్డారు. తన వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అని అన్నారు. త్రిష తండ్రి రామిరెడ్డి మాట్లాడుతూ.. తనకు రెండేళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు మళ్లించాను అని అన్నారు. నా కూతురు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. సీనియర్ జాతీయ టీంలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తోందని వెల్లడించారు. మరో క్రికెటర్ ధృతి మాట్లాడుతూ.. భారత్ గెలుపులో త్రిష పోరాటం మరువలేనిది అని చెప్పింది. తనకు ప్లేయింగ్ 11లో చోటు దక్కనప్పుడు కాస్త బాధగా అనిపించిందని, కానీ, దేశానికి వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో నేను ఉండడం చాలా గర్వంగా ఉందని అన్నారు.

ఆ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పై టాలీవుడ్ నిర్మాతల గరం గరం
టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖ నిర్మాతలు ఆ డిస్ట్రిబ్యూటర్ పై గుర్రుగా ఉన్నారా అంటే అవును అనే సంధానం వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ఉత్తరాంధ్ర కు చెందిన ఎల్వీర్( ఎల్ వెంకటేశ్వరరావు). వెస్ట్ గోదావరి సినిమా పంపిణిలో ఈ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఎల్వీర్ చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు దారితీసింది. ఎల్వీర్ మాట్లాడుతూ ‘ గత రెండెళ్లుగా ఏడిస్ట్రిబ్యూటర్ కూడా కనీసం కమిషన్ కళ్ల చూడలేదని, సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక్కటే తమకు భారీ లాభాలు తెచ్చిపెట్టినదని, రెండేళ్లుగా ఏ స్టార్ హీరో సినిమా కూడా కమిషన్ ఇచ్చే రేంజ్ హిట్ కాలేదని, ఒరిజినల్ కలెక్షన్స్ బయటకు చెప్పలేము అని అలా చెబితే, ఆ నిర్మాత తరువాత తమకు సినిమా ఇవ్వరని’ అని అన్నారు. అయితే ఎల్వీర్ చేసిన వ్యాఖ్యలు గతేడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన కొందరు స్టార్ హీరోలనుద్దేసించి ఉన్నాయని టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. పోయిన సంవత్సరం దేవర, కల్కి, పుష్ప 2 వంటి సూపర్ హిట్స్ సినిమాలు వచ్చాయి. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. పుష్ప ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కానీ ఎల్వీర్ చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాలు కూడా నష్టాలు తెచ్చినట్టే. నష్టాలు వచ్చాయో లాభాలు వచ్చాయో మాకు తెలుసు, స్టేజ్ ఎక్కించారు మైక్ ఇచ్చారు కదా అని ఆపుకోలేక ఇష్టానురీతీగ మాట్లాడం సరికాదని, సదరు డిస్ట్రిబ్యూటర్ కారణంగా ఎంత మంది ఎగ్జిబిటర్లు నష్టాలు చూసి సినిమా వ్యాపారం వదిలేసారో తమకు తెలుసనీ, ఇక్కడ కొన్ని చూసి చూడనట్టు ఉండాలి తప్ప ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం సబబు కాదని నిర్మాతల సర్కిల్స్ లో వినిపిస్తోంది.

‘రానా నాయుడు 2’ టీజర్ రిలీజ్.. మొత్తానికి వెంకీ మామా బలే స్కెచ్ వేశాడుగా
రానా, వెంకటేష్ కలిసి నటించిన బోల్డ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ . 2023 మార్చిలో విడుదలైన ఈ సిరీస్ భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది. కానీ విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి. ఎందుకంటే మొత్తం బూతులు మాటలు బోల్డ్ సీన్స్ తో నింపేశారు, అందులోను వెంకీ లాంటి ఫ్యామిలీ హీరో నుంచి ఇలాంటివి ఆశించలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. ముఖ్యంగా వెంకటేష్ వల్గర్ గా మాట్లడటం కూడా ఫ్యాన్స్ ని బాగా హట్ చేశాయి.ఈ నేపథ్యంలో ‘రానా నాయుడు 2’ కూడా రాబోతుందని తెలిసిందే. అయితే మొదటి సిరీస్ వచ్చిన టాక్ ని దృష్టిలో పెట్టుకుని వెంకటేష్ రెండో సీజన్ లో డోస్ తగ్గించేలా జాగ్రత్తలు తీసుకున్నామని ఇటీవలి ప్రెస్ మీట్‌లో తెలిపగా.. తాజాగా ‘రానా నాయుడు2’ కి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. కాగా రానా మరో పోరాటానికి సిద్ధమైనట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.టీజర్‌ ప్రారంభమవగా పెద్దగా ఆసక్తికర సన్నివేశాలు లేకున్నా.. తండ్రీకొడుకుల పాత్రలో కనిపిస్తున్న వెంకీ, రానా మధ్య పోరాటం ప్రధానంగా ‘సీజన్‌ 2’ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఈ ప్రపంచంలో రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే’ అని వెంకటేశ్‌ వార్నింగ్‌ ఇస్తున్న సీన్‌ హైలెట్‌గా నిలిచింది. అయితే ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ చాలా ఏళ్ళ తర్వాత ఎంతో గొప్ప విజయం సాధించారు. థియేటర్లకు రావడం మానేసిన ఎందరో ప్రేక్షకులు ఈ సినిమా కోసం బయటికి కదిలారు.ఇక ఈ ఫేమ్ ‘రానా నాయుడు 2’కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేష్ కనిపించబోయే ఫ్రెష్ రిలీజ్ ఇదే. కనుక ఆడియన్స్ చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఎలాగో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు తగ్గించామని హామీ ఇచ్చారు కనక చూడోచ్చు. ఇంకా సీజన్2 స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనేది లాక్ చేయలేదు. వేసవిలో రావొచ్చు.

నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటు తెలుగు అటు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులో ప్రస్తుతం నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో ‘మజాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కిన ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అటు తమిళ్ లో స్టార్ హీరో విజయ్ విజయ్ కొడుకు జాసన్ విజయ్ డెబ్యూ డైరెక్షన్ మూవీలోను సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ ఓ వెబ్ సిరీస్‌ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంటెర్నేషల్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తొలి సారిగా స్ట్రయిట్ తెలుగు వెబ్ సిరీస్‌ ను నిర్మిస్తోంది. Next On Netflix India సిరీస్​లో భాగంగా ‘సూపర్ సుబ్బు’ టైటిల్ తో వస్తోంది. ఈ వెబ్ కు టిల్లు 2 దర్శకుడి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్‌ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. సెన్సిటివ్ టాపిక్​ అయిన సెక్స్ ఎడ్యుకేషన్ కథా నేపథ్యంలో ఈ సిరీస్​ రానున్నట్టు తెలుస్తోంది. హీరో సందీప్ కిషన్.. కామేడి కింగ్ బ్రహ్మనందం ప్రధాన పాత్రలో నటిస్తుండగా మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ శర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌ను త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.