కర్రలతో కాదు.. గొడ్డలితో తిరిగి వస్తారు.. వైసీపీ నేత హాట్ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశిస్తూ.. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. గతంలో కర్ర పట్టుకుని వచ్చే వాళ్లు.. రేపు గొడ్డలితో వస్తారన్నారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. మాచవరంలో బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఈ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ నాయకుల వేధింపులతో ఇప్పుడు ఊర్లు వదిలిపెట్టి వెళ్లినవారు.. మళ్లీ తిరిగి వస్తారని తెలిపారు.. మీరు గ్రామం దాటించారని.. రేపు రాష్ట్రం దాటి వెళ్లే పరిస్థితి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.. తెగించే వరకూ తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. వైసీపీ నాయకులు తెగిస్తే టీడీపీ తట్టుకోలేరని హెచ్చరించారు.. వీధి వీధిలో పరుగెత్తించి తంతారంటూ సీరియస్ కామెంట్లు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. ఇక, పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలు పూర్తి చేయాలి.. అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.. గతంలోనూ పార్టీ కమిటీల్లో అందరికీ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేస్తానని చేయకుండానే ముగించారని విమర్శించారు.. ఇక, ప్రస్తుతం కూడా సాధ్యంకానీ హామీలు ఇచ్చి తూతూమంత్రంగా చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, వైసీపీ నాయకులపై కూటమి నాయకులు లేని పోని అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు కాసు మహేష్ రెడ్డి..
వినాయకుడి విగ్రహంపై రప్పా.. రప్పా..!
ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరగాల్సిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్రలో వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయి. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పెద్దనపాడు గ్రామంలో వినాయకుని నిమజ్జనంలో వింత పోకడలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని వీధుల్లో నిమజ్జనానికి బయలుదేరిన వినాయక విగ్రహం వెనుక వైపున 2.0, రప్పా రప్పా వైఎస్సార్ అక్షరాలతో పాటు ఎర్రటి రంగులో ఉన్న గొడ్డలి గుర్తును వేశారు. ఇంతటితో ఆగకుండా వినాయక విగ్రహాన్ని పైకి ఎగురవేస్తూ రప్పా, రప్పా వైఎస్సార్ అని కేకలు వేస్తూ నిమజ్జనానికి వీధుల గుండా తీసుకెళ్లడం గ్రామస్థులను విస్మయానికి గురిచేసింది. ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే సంవత్సరం వినాయక చవితికి ఎవరికీ చందాలివ్వకూడదని గ్రామానికి చెందిన కొందరు చెబుతున్నారు.. కాగా.. పెద్దనపాడు వినాయక విగ్రహ నిమజ్జన విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, శాంతి భద్రతల దృష్ట్యా ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.
నేడు నారా లోకేష్‌తో వంగవీటి రాధా భేటీ.. విషయం ఏమై ఉంటుంది..?
వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో సమావేశం కాబోతున్నారు.. 11 నెలల తర్వాత నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ జరుగుతోన్న నేపథ్యంలో.. విషయం ఏమై ఉంటుంది? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.. మంత్రి నారా లోకేష్ కార్యాలయం నుంచి సమాచారం రావటంతో ఇవాళ కలవటానికి హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరారు వంగవీటి రాధా.. తాజా భేటీ అజెండా ఏంటి అనే అంశంపై రకరాలుగా చర్చలు జరుగుతున్నాయి.. ఇప్పటికే తమ నేతకు ఎమ్మెల్సీ సహా ఏ పదవి దక్కలేదనే ఆవేదన వంగవీటి రాధా వర్గంలో ఉంది.. గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం.. విస్తృతంగా ప్రచారం చేశారు వంగవీటి.. తనకు సీటు కేటాయించకపోయినా.. కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు.. అయితే, ఇప్పుడు లోకేష్-రాధా భేటీలో ఏం చర్చిస్తారు? వంగవీటి రాధాకు ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? అది ఎలాంటి పదవి కావొచ్చు..? అనే చర్చ మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి.. 11 మంది మృతి
కరేబియన్ సముద్రంలో వెనిజులా మాదకద్రవ్య నౌకపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది మృతి చెందారు. అంతర్జాతీయ జలాల ద్వారా అమెరికా వైపు మాదకద్రవ్యాలను రవాణా చేస్తుండగా ఈ దాడి జరిగింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో సంబంధాలున్న నార్కో టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ట్రంప్ అన్నారు. ట్రెన్ డి అరగువా కార్టెల్‌కు చెందిన 11 మంది అనుమానితులను చంపినట్లు మంగళవారం వెల్లడించారు. అమెరికా దళాలకు ఎటువంటి హాని జరగలేదని వెల్లడించారు. అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలించే వారందరికీ ఇదే హెచ్చరిక అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. TDA అని పిలువబడే ట్రెన్ డి అరగువాను విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ అభివర్ణించారు. ట్రెన్ డి అరగువా సంస్థ నికోలస్ మదురో నియంత్రణలో పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ పేర్కొన్నారు. ఇది సామూహిక హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లైంగిక అక్రమ రవాణా, యునైటెడ్ స్టేట్స్, పశ్చిమ అర్ధగోళంలో హింస, ఉగ్రవాద చర్యలకు బాధ్యత వహిస్తుందని ట్రంప్ వివరించారు.
భారత్ టారిఫ్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్‌హౌస్‌లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!
అమెరికాపై భారతదేశమే భారీగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది చాలా సంవత్సరాలుగా ఈ సంబంధం ఏకపక్షంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌పై విధించిన కొన్ని సుంకాలను తొలగించాలని ఆలోచిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు. భారతదేశంతో తాము బాగా కలిసి పోతామని చెప్పారు. చాలా సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య సంబంధం ఏకపక్షంగా ఉండేదని.. తాను బాధ్యతలు స్వీకరించాకే అది మారిందని చెప్పారు. భారతదేశం.. అమెరికాపై దారుణంగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది ప్రపంచంలోనే అత్యధికం అని పేర్కొన్నారు. అందువల్లే అమెరికా.. భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదని చెప్పుకొచ్చారు. కానీ వారు మాత్రం మాతో బాగా వ్యాపారం చేస్తున్నారని.. ఎందుకంటే వారి దగ్గర నుంచి మేము పెద్దగా వసూలు చేయడం లేదు కాబట్టే ఇలా జరుగుతుందని వివరించారు. అందుకే భారత్ ఉత్పత్తులను అమెరికాలో కుమ్మరిస్తోందని తెలిపారు. పైగా భారత్ నుంచి వచ్చే వస్తువులు అమెరికాలో తయారు కావు కాబట్టే ఇలా జరుగుతుందని పేర్కొన్నారు. ఉదాహరణకు.. హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ భారతదేశంలో అమ్మలేకపోయిందని.. దానికి కారణం మోటార్ సైకిల్‌పై 200 శాతం సుంకం ఉందని గుర్తుచేశారు. హార్లే-డేవిడ్సన్ భారతదేశానికి వెళ్లి మోటార్ సైకిల్ ప్లాంట్ నిర్మించిందని.. ఇప్పుడు వారు సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను ట్రంప్ పూర్తిగా సమర్థించారు.
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి, 30 మందికి గాయాలు!
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 14 మంది మరణించగా.. దాదాపుగా 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమ్మితం సమీప ఆస్పత్రికి తరలించారు. బలోచిస్థాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రావిన్షియల్ ముఖ్యమంత్రి సర్దార్ అతావుల్లా మెంగల్ వర్ధంతిని పురస్కరించుకుని బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సమావేశం నిర్వహించగా.. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి హంజా షఫాత్ ఓ ప్రకటనలో తెలిపారు. క్వెట్టాలోని షావానీ స్టేడియంలో జరిగిన బీఎన్‌పీ సమావేశంకు వందలాది మంది బలోచ్ మద్దతు దారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా..స్టేడియం పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు స్టేడియం ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి.
నేడు ఢిల్లీలో జీఎస్టీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పయ్యావుల కేశవ్ పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సీబీఈసీ ఛైర్ పర్సన్ హాజరుకానున్నారు. మొత్తం 33 మంది సభ్యులతో కూడిన ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జీఎస్టీ స్లాబ్‌లను రద్దు చేసి సంబంధిత ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం స్లాబ్‌లోకి మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టుబాకో, లగ్జరీ ఉత్పత్తులపై మాత్రం 40 శాతం జీఎస్టీ కొనసాగనుంది. ఈ సవరణలతో ఆటోమొబైల్ రంగం ప్రధాన లబ్ధిదారు కానుంది.
టైటిల్ స్పాన్సర్ వేటలో బీసీసీఐ.. ఆ కంపెనీలకు నో ఛాన్స్!
ఆన్‌లైన్ గేమింగ్ చట్టం 2025 పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నేపథ్యంలో టీమిండియా టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి ‘డ్రీమ్ 11’ వైదొలిగిన విషయం తెలిసిందే. దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే వేటలో పడింది. ఇందులో భాగంగానే మంగళవారం దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. టీమిండియా స్పాన్సర్ షిప్ కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసక్తి గల కంపెనీలు పలు నియమ, నిబంధనలకు లోబడి ఉండాలని షరతులు విధించింది. టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు ఆన్‌లైన్ గేమింగ్ చట్టం నియమ, నిబంధనలకు లోబడి ఉండాలని బీసీసీఐ షరతులు విధించింది. కంపెనీలకు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధాలు ఉండకూడని తెలిపింది. భారత్ సహా ప్రపంచంలో ఎక్కడా కూడా అలాంటి సేవలు అందించకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థల్లో పెట్టుబడులు కూడా ఉండకూడని పేర్కొంది. క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్ఛేంజ్, క్రిప్టో టోకెన్స్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో కూడా కంపెనీలు పాలు పంచుకోకూడదు. పొగాకు, మద్యం, అశ్లీల బ్రాండ్లు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధం విధించింది.
ఇకపై అతను లేకుండా సినిమా చేయను.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎప్పుడూ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా కథలు రాయనని, నా భావనకు తగ్గట్టే చేస్తాను అంటూ స్పష్టం చేశారు. ఇకపోతే, లోకేష్ మరో పెద్ద నిర్ణయాన్ని కూడా తెలిపాడు. అదేంటంటే.. ఇకపై భవిష్యత్తులో తాను అనిరుధ్ లేకుండా ఒక్క సినిమాకూడా చేయనని తెలిచి చెప్పాడు. ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేస్తేనే నేను ఇతర ఆప్షన్స్ గురించి ఆలోచిస్తాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాకు పాటల్లో AI అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర అనిరుధ్ ఉన్నాడు అంటూ ఘాటుగా స్పందించాడు. ఇప్పటికే ఖైదీ (కార్తి హీరోగా) చిత్రానికి సంగీతం సమ్ CS అందించారు. కానీ, లోకేష్ చెప్పిన ప్రకారం ఖైదీ 2కి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ ఫిక్స్ అయ్యినట్టే అని అర్థమవుతుంది.
