NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు తిరుపతిలో వారాహి సభ.. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఆసక్తి..
నేడు తిరుపతి వేదికగా వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది.. జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు పవన్‌ కల్యాణ్‌.. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేపట్టిన తొలి సభ కావడం.. వారాహి డిక్లరేషన్‌ ప్రకటించనుండడంతో.. ఆ డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు ఉన్నాయి.. పవన్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.. అసలు వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ ఏమి చేబుతారనే అందరిలోను ఆసక్తి రేపుతోంది.. ఇక, ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కూటమి పార్టీల శ్రేణులు హాజరవుతారని చెబుతున్నారు..

నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కలియుగ వైకుంఠమైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరుగుతుంది. విశేష పర్వదినాలుగా పిలిచే ఈ నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్న మహాలయ అమావాస్యకాగా.. ఇవాళ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. రేపు ధ్వజారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈనెల 8న జరిగే శ్రీవారి గరుడసేవకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం, 11న ర‌థోత్సవం, 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 13న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం, 28న సర్వ ఏకాదశి, 31న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం నిర్వహణ ఉంటుంది.

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 12వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ప్రతి రోజు సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.. అధికారులు. ఇక ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. 4 వేల 500 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మరోవైపు.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోన్న విషయం విదితమే.

ముస్తాబైన ‘బాసర’.. నేడు శైలపుత్రి అలంకరణలో అమ్మవారు
నిర్మల్ జిల్లా బాసరలో నేటి నుంచి శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో వేకువ జామున ఆలయ అర్చకులు శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు మహాభిషేకం, అలంకరణ, మంగళహారతి, మంత్రపుష్పం తదితర పూజలతో మంగళ వైద్యసేవ, గణపతి పూజ, సుప్రభాత సేవలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ, క్షేత్రపూజ, స్వస్తి పుణ్యహ వచనము అంకురార్పణ, కలశస్థాపన (చర్చి ప్రతిష్ఠాపన) పూజలు ప్రారంభిస్తారు. ఈరోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. భక్తులతో పాటు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాసరలో బుధవారం జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన, వసతి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు.

దసరా ఎఫెక్ట్‌.. రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ..
దసరా పండుగల నేపథ్యంలో నగర ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వృత్తి, ఉపాధి రీత్యా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న పొరుగు ప్రాంతాలకు చెందిన వారు భార్యాపిల్లలతో సహా రైళ్లలో తరలివెళుతుండటంతో ప్లాట్‌ఫారమ్‌లన్ని ప్రయాణికులతో కిటకిటలాడాయి. నిన్నటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా సెలవులు ఇవ్వడంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్న రైళ్లలో పలువురు తరలిస్తున్నారు. దీంతో ఏపీ, ఉత్తర భారతదేశం వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ నెలలో దాదాపు 650 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు పండుగ సీజన్లో, భారతీయ రైల్వే ప్రయాణికుల రద్దీని తీర్చడానికి మొత్తం 6,000 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్‌లు ఉండటం..దీనిని పరిష్కరించడానికి, రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో దాదాపు 170,000 మంది ప్రయాణికులు ప్రతిరోజూ 200 రైళ్లలో సికింద్రాబాద్‌ నుంచి ప్రయాణిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

మళ్లీ నోరుజారిన కంగన.. గాంధీ జయంతి నాడు చేసిన పోస్ట్‌పై వివాదం
రాజకీయ నాయకురాలుగా మారిన నటి కంగనా రనౌత్ తన వివాదాస్పద ప్రకటనలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, బుధవారం ఆమె మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొత్త వివాదం సృష్టించారు. అంతకుముందు, రైతుల ఉద్యమం మరియు ఉపసంహరించబడిన వ్యవసాయ చట్టాలపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమె విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా కంగన చేసిన పోస్ట్‌లో.. “దేశానికి జాతిపితలు ఎవరూ లేరు. కేవలం కుమారులు మాత్రమే ఉన్నారు. భారతమాతకు ఇలాంటి కుమారులు(లాల్ బహదూర్‌ శాస్త్రి) ఉండటం అదృష్టం” అని కంగన వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని ఉద్దేశపూర్వకంగా కంగన తక్కువ చేశారని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. మరో పోస్ట్‌లో, దేశంలో పరిశుభ్రతపై గాంధీజీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. కంగనా రనౌత్ పోస్ట్‌పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే తీవ్రంగా మండిపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ఎంపీ కంగనా వ్యంగ్యంగా కామెంట్ చేసింది. గాడ్సే ఆరాధకులు బాపు, శాస్త్రి మధ్య తేడాను చూపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ తన పార్టీ కొత్త గాడ్సే భక్తుడిని మనస్పూర్తిగా క్షమిస్తారా అంటూ ప్రశ్నించారు. పంజాబ్ బీజేపీ సీనియర్ నేత మనోరంజన్ కాలియా కూడా కంగనాను టార్గెట్ చేశారు. గాంధీజీ 155వ జయంతి సందర్భంగా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కాలియా తెలిపారు. తన రాజకీయ జీవితంలో వివాదాస్పద ప్రకటనలు చేయడం కంగనా అలవాటు చేసుకున్నారని ఆయన అన్నారు. రాజకీయం ఆమె రంగం కాదని.. రాజకీయం అనేది తీవ్రమైన అంశమని చెప్పారు. మాట్లాడే ముందు ఆలోచించాలన్నారు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు.

‘పీఎం ఇంటర్న్‌షిప్’ పథకం నేటి నుంచి ప్రారంభం.. దరఖాస్తుతో ఈ ప్రయోజనాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్‌లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఇందుకోసం పోర్టల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇంటర్న్ కోసం ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 12 నుండి ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాబోయే 5 సంవత్సరాలలో, దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇవ్వబడతాయి. ఇంటర్న్‌షిప్ అలవెన్స్ ప్రతి నెలా రూ.5,000.. ఏకమొత్తంలో రూ.6,000 ఇవ్వబడుతుంది. ఉపాధి అవకాశాల కోసం 12 నెలల అనుభవం అందుబాటులో ఉంటుంది. కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఫండ్ నుండి శిక్షణ ఖర్చు, ఇంటర్న్‌షిప్ ఖర్చులో 10 శాతం భరిస్తాయి. 10 వేల కోట్లతో పరిశుభ్రతకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులలో మిషన్ అమృత్, అమృత్ 2.0 కూడా ఉన్నాయి. దీని కింద దేశంలోని అనేక నగరాల్లో నీరు, వ్యర్థాల శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఇజ్రాయెల్‌-ఇరాన్ వివాదంపై జీ-7 అత్యవసర సమావేశం.. బైడెన్ ఏం చెప్పారంటే?
ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పెరుగుతోంది. కాగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత ఛైర్‌పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ7 దేశాల నేతలతో ఫోన్ కాల్‌లో చర్చించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి తర్వాత ఇరాన్‌పై కొత్త ఆంక్షలు కూడా చర్చించబడ్డాయి. జీ-7 దేశాలు ఏకకాలంలో ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించనున్నాయి. వైట్ హౌస్ ప్రకటనలో ఇలా చెప్పింది, “బైడెన్, జీ7 ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని నిస్సందేహంగా ఖండించాయి. అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్, ఆ దేశ ప్రజలకు యునైటెడ్ స్టేట్స్ యొక్క పూర్తి సంఘీభావం, మద్దతును వ్యక్తం చేశారు. అమెరికా బలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఒక రోజు ముందు, బైడెన్ ఇజ్రాయెల్ వైపు వెళ్లే క్షిపణులను కూల్చివేయాలని యుఎస్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం, ఇజ్రాయెల్‌ను రక్షించడానికి మధ్యప్రాచ్యంలో సుమారు 1 లక్ష మంది అమెరికన్ సైనికులు, రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు,వందలాది ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు మోహరించబడ్డాయి.” వైట్‌ హౌస్ ప్రకటించింది.

పంత్‌ను రిటైన్‌ చేసుకుంటాం: పార్థ్‌ జిందాల్
ఐపీఎల్‌ 2025 మెగా వేలంకు ముందు ఫ్రాంఛైజీలు ఎంత మందిని రిటైన్‌ చేసుకోవచ్చనే దానిపై స్పష్టత వచ్చింది. ప్రతి ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్‌ పాలకవర్గం అనుమతిని ఇచ్చింది. ఇందులో ఓ రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఉంది. నవంబర్‌లో వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్‌ చేసుకుంటుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. తమను రిషబ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్‌ చేసుకుంటామని తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్థ్‌ జిందాల్ వెల్లడించారు. పార్థ్‌ జిందాల్ మాట్లాడుతూ… ‘కచ్చితంగా ఆరుగురిని రిటైన్‌ చేసుకుంటాం. ఢిల్లీ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. రిటెన్షన్‌ రూల్స్‌పై ఇప్పుడే స్పష్టత వచ్చింది. జీఎంఆర్‌, మా క్రికెట్‌ ఆఫ్‌ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. రిషబ్ పంత్‌ను మేం రిటైన్‌ చేసుకుంటాం. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెకెర్క్‌, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పొరెల్, ముకేశ్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌.. లాంటి మంచి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వేలంలో ఏం జరుగుతుందో చూడాలి. చర్చలు జరిపిన తర్వాత వేలానికి సిద్ధమవుతాం’ అని అన్నారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఏమన్నారంటే..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ నిన్న సమంత, నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికారం వుంది కదా అని అడ్డు అదుపు లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా తమ స్వార్ధ రాజకీయాల కోసం దిగజారిపోయి మాట్లాడకూడదని పలువురు టాలీవుడు హీరోలు సదరు మంత్రిపై ఘాటుగా స్పందించారు. ఓక మహిళా అయి ఉండి సాటి మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అనేది సదురు మంత్రి గారు ఆలోచించుకోవాలి. కాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘటూగా రియాక్ట్ అయ్యాడు నాగ చైతన్య. తన వ్యక్తిగత X ఖాతలో ” విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన మరియు దురదృష్టకరమైన జీవిత నిర్ణయాలలో ఒకటి. చాలా ఆలోచించిన తర్వాత, నేను మరియు నా మాజీ జీవిత భాగస్వామి విడిపోవాలని పరస్పర నిర్ణయం తీసుకున్నాము. ఇది మన విభిన్న జీవిత లక్ష్యాల కారణంగా మరియు ముందుకు సాగాలనే ఆసక్తితో శాంతియుతంగా తీసుకున్న నిర్ణయం.ఈ విషయంపై ఇప్పటి వరకు అనేక నిరాధారమైన మరియు పూర్తిగా హాస్యాస్పదమైన గాసిప్స్ వచ్చాయి. నా పూర్వపు జీవిత భాగస్వామితో పాటు నా కుటుంబం పట్ల ఉన్న గాఢమైన గౌరవంతో నేను ఇదంతా మౌనంగా ఉన్నాను.నేడు మంత్రి కొండా సురేఖ గారు చేస్తున్న వాదన అబద్ధం మాత్రమే కాదు, ఇది పూర్తిగా హాస్యాస్పదమైనది మరియు ఆమోదయోగ్యం.సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలను మీడియా హెడ్‌లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. అంటూ పోస్ట్ పెట్టారు అక్కినేని నాగ చైతన్య.

మీ నేతలను అదుపులో ఉంచుకోండి రాహుల్ గాంధీ: అమల
సమంత నాగ చైతన్య విడాకులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. సాటి మహిళపై కించిత్ గౌరవం లేకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారం మాట్లాడడం ఏమాత్రం సమ్మతించదగిన విషయం కాదు. కాగా  తమ కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున  భార్య  అక్కినేని అమల  స్పందించారు. “ఒక మహిళా మంత్రి అయి ఉండి ఇంకొక మహిళపై  అలా మాట్లాడటం దారుణం. మీ స్వార్ధ రాజకీయాల కోసం ఇలా దిగజారి మాట్లాడడం  సిగ్గు చేటు. ఒక మహిళా మంత్రి కల్పిత ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం దిగ్భ్రాంతికరం. నా భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుచేటు. రాజకీయ నేతలు మరి ఇంత దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది..? రాహుల్ గాంధీ  మీరు  ఇతరుల గౌరవమర్యాదలను, నమ్మినట్లయితే దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. సదరు మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి, ఆమె చేసిన  వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. భారత దేశ పౌరులను రక్షించండి’’ అని ట్వీట్‌ చేశారు.