Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

టీటీడీ గోవిందరాజస్వామి ఆలయంలో వ్యక్తి హల్‌చల్.. మహా ద్వారం గోపురం పైకి ఎక్కి..!
తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించే ఘటన చోటుచేసుకుంది. స్వామివారి ఏకాంత సేవ ముగిసిన అనంతరం, విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మద్యం మత్తులో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఆలయం వెనుక భాగం గోడ దూకి లోపలికి ప్రవేశించిన అతడు, భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే మహా ద్వారం లోపలి గోపురం పైకి ఎక్కి, గోపురంపై ఉన్న పవిత్ర కలశాలను లాగేందుకు ప్రయత్నించాడు. అయితే, విజిలెన్స్, ఆలయ భద్రతా సిబ్బంది గమనించేలోపే పరిస్థితి అదుపు తప్పడంతో, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. గోపురం పైనున్న వ్యక్తిని కిందికి దించేందుకు ఐరన్‌ నిచ్చెనలు ఏర్పాటు చేసి, సుమారు 3 గంటలపాటు తీవ్రంగా శ్రమించారు. అయితే, గోపురం నుంచి దిగేందుకు అతడు విచిత్రమైన షరతు పెట్టాడు. “క్వార్టర్‌ మద్యం బాటిల్‌ ఇస్తేనే కిందికి దిగుతాను” అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. చివరకు ఫైర్‌ సిబ్బంది సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆలయం నుంచి కిందికి దించి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లా, కూర్మవాడ, పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతిగా పోలీసులు గుర్తించారు. విచారణలో మద్యం డిమాండ్ చేసిన విషయాన్ని అతడే అంగీకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం స్పందిస్తూ.. ఆలయంలోకి ఎలా ప్రవేశించాడు? భద్రతా వైఫల్యం ఎక్కడ జరిగింది? అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తాం అని తెలిపారు.

రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం కల్పించి టీటీడీ మరోసారి చరిత్ర సృష్టించింది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న వేళ, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సామర్థ్యానికి అదనంగా 15 వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని పులకించిపోయారు. ఇది ఇటీవలి కాలంలో అత్యధిక దర్శన సంఖ్యగా నిలిచింది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణ, అన్నప్రసాదం, వైద్య, భద్రతా సేవలను సమన్వయం చేస్తూ టీటీడీ నిరంతరం పర్యవేక్షించింది. ఇక, స్వామివారికి మొక్కుగా 27,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కళ్యాణకట్ట వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించారు. ఇదే సమయంలో భక్తుల కానుకలతో ఆలయ హుండి ఆదాయం రూ.4.1 కోట్లకు చేరుకుంది. ఇది ఒక్కరోజు లెక్కల్లో చెప్పుకోదగిన మొత్తంగా టీటీడీ పేర్కొంది. మరోవైపు, ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తూ, ఆధ్యాత్మిక అనుభూతిని మరింత ప్రత్యేకంగా మార్చింది టీటీడీ. అయితే ఇవాళ పౌర్ణమి సందర్భంగా నిర్వహించాల్సిన గరుడ వాహన సేవను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణ, భారీ భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

నేటి నుంచి తెలుగు మహాసభలు..
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు 2026కు గుంటూరులో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న మహాసభలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చనతో ప్రారంభమయ్యే ఈ వేడుకను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్‌ రవీంద్ర కలిసి ప్రారంభించబోతున్నారు.. ప్రధాన వేదికతో పాటు మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన నాలుగు ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు ఇలా ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.. రాత్రి 11 గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని మహాసభల నిర్వాహకుడు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్ పేర్కొన్నారు.. ఇక, మహాసభల్లో ఆధ్యాత్మిక వేదికపై ప్రవచనాలు, హోమాలు, కల్యాణాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.. తెలుగు భాష ఔన్నత్యాన్ని ఆధ్యాత్మిక కోణంలో ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష ప్రాచీనతను ప్రతిబింబించేలా పురాతన సాహిత్య గ్రంథాలు, ప్రాచీన తెలుగు నాణేలు, సంప్రదాయ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. శనివారం సాయంత్రం జరిగే ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల ప్రదాన సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.హెచ్‌. మానవేంద్రనాథ్‌రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొనబోతున్నారు.

అంతర్వేది రథ శకలాల నిమజ్జనం నిలిపివేత
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో దగ్ధమైన పాత రథం శకలాల నిమజ్జన కార్యక్రమాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇవాళ నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిమజ్జనాన్ని నిలిపివేసినట్లు ఆలయ ఈవో ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. శాస్త్రోక్త విధానాలు, ఆగమ నియమాల ప్రకారం మరింత చర్చించి, సరైన ముహూర్తంలో అత్యంత శాస్త్రబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అయితే, 2020 సెప్టెంబర్ 5న స్వామివారి కళ్యాణోత్సవ రథం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా, దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాత రథం శకలాలను ఆలయ ప్రాంగణంలో అలాగే ఉంచడం అరిష్ట సూచకమని, ఆగమ పండితులు, ఆలయ అర్చకులు సూచించడంతో, రథ శిథిలాలను నిమజ్జనం చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, దగ్ధమైన రథం స్థానంలో దేవస్థానం కొత్త రథాన్ని ఏర్పాటు చేసింది. పాత రథ శకలాల నిమజ్జనంపై దేవాదాయ శాఖ కార్యాచరణ ప్రకటించినా, ఆగమ నియమాలు, ముహూర్తాలపై విస్తృత చర్చలు జరిపిన అనంతరం, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నిమజ్జనాన్ని మరో ముహూర్తానికి వాయిదా వేశారు.

తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీలో కృష్ణా నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో నదీ జలాల వివాదంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా కృష్ణా నదీ జలాల వివాదం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ప్రకటించింది. దీంతో అటూ అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా నదీ జలాల వివాదంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు (జనవరి 3) ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో గులాబీ పార్టీ శ్రేణులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలపై పార్టీ తీసుకున్న నిర్ణయాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. నేటి అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా.. దీనికి కౌంటర్ గా తెలంగాణ భవన్‌లోనే కృష్ణా నదీ జలాల వివాదం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.

నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు (జనవరి 3న) తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజయ్య స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 7:45కి మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న పవన్.. 8:35 గంటలకి గన్నవరం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు పయనం కానున్నారు. ఉదయం 9:20కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని.. 9:30కి బేగంపేట నుంచి ప్రత్యక హెలికాప్టర్‌లో కొండగట్టుకు పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. ఇక, ఉదయం 10:30 నుంచి 11:30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా JNTU దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగనున్నారు. హెలిప్యాడ్ వద్ద పవన్ కు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలకనున్నారు. JNTU కళాశాల నుంచి రోడ్ మార్గంలో కొండగట్టుకు ఆయన చేరుకోనున్నారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొండగట్టు ఘాట్ రోడ్డులో టీటీడీ నిధులతో రూ. 35.19 కోట్లతో 96 గదుల సత్రం నిర్మాణానికి, మాల విరమణ మండపానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ శంకుస్థాపన చేయనుండగా.. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొననున్నారు. అలాగే, బృందావనం రిసార్ట్ లో జనసేన కార్యకర్తలు, నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు డిప్యూటీ సీఎం.

ప్రియాంకాగాంధీ కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు వైరల్
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా-స్నేహితురాలు అవివా బేగ్‌కు సంబంధించిన నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజస్థాన్‌లోని రణథంబోర్‌లోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఇద్దరి నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రైహాన్ వాద్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ నిశ్చితార్థానికి అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియాలో పంచుకున్నాయి. ఇద్దరూ చిన్నప్పుడు కలిసి ఉన్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశారు. జంట చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. రైహాన్ తెల్లటి కుర్తా-పైజామా ధరించగా.. అవివా బేగ్ పసుపు రంగు సూట్ ధరించి కనిపించారు. ఇక నిశ్చితార్థ వేడుకలో కూడా సాంప్రదాయ భారతీయ దుస్తులనే ధరించారు. రైహాన్ ముదురు రంగు షేర్వానీ ధరించగా.. అవివా బేగ్‌ ప్రత్యేకమైన చీరలో కనిపించారు. ఒక ఫొటోలో కొత్త జంటతో అవివా తల్లి నందితా బేగ్, తండ్రి ఇమ్రాన్ బేగ్, సోదరుడు రియాన్ బేగ్‌లు ఉన్నారు. ఇంకొక ఫొటోలో రాబర్ట్ వాద్రా-ఇమ్రాన్ బేగ్ కనిపించారు. రైహాన్ వాద్రా-అవివా బేగ్ ఏడేళ్ల నుంచి స్నేహం నడుస్తోంది. ఇటీవల కాలంలో రైహాన్ వాద్రా పెళ్లి ప్రపోజ్ చేయగా.. వెంటనే అవివా బేగ్ అంగీకరించింది. త్వరలోనే వివాహం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవివా బేగ్‌ ఢిల్లీలోనే నివాసం ఉంటుంది. తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త. తల్లి నందితా బేగ్ ఇంటీరియల్ డిజైనర్. నిందిత-ప్రియాంకాగాంధీ మధ్య చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది. ఆ కారణంతోనే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ఇంటీరియర్ డిజైన్‌లో నిందిత పనిచేశారు.

అమెరికాలో ఐసిస్ భారీ కుట్ర భగ్నం.. యువకుడు అరెస్ట్
అగ్ర రాజ్యం అమెరికాలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. నార్త్ కరోలినాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాడులకు పాల్పడాలని ఐసిస్ కుట్ర చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 18 ఏళ్ల క్రిస్టియన్ స్టర్డివాంట్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసిందని యూఎస్ డీవోజే తెలిపింది. ప్రస్తుతం కస్టడీలో యువకుడిని విచారిస్తున్నారు. అతడి దగ్గర నుంచి చేతితో రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న మేటర్ ప్రకారం విచారిస్తున్నారు. కత్తి, సుత్తి దాడులకు ప్లాన్ చేసినట్లుగా డీఓజే పేర్కొంది. రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడాలని భావించినట్లుగా అధికారులు తెలిపారు. నిందితుడు క్రిస్టియన్ స్టర్డివాంట్ నార్త్ కరోలినాలోని మింట్ హిల్స్ వాసి. ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో నిత్యం రహస్యంగా మంతనాలు జరిపినట్లుగా అధికారులు కనిపెట్టారు. డిసెంబర్ 18న ఐసిస్ నుంచి దాడులకు సంబంధించిన సంకేతాలు అందినట్లుగా అధికారులు కనుగొన్నారు.

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక నేడే
న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ఈరోజు ( జనవరి 3న) ఎంపిక చేయనున్నారు. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారమే జట్టును సెలక్ట్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ మీటింగ్ తర్వాతి రోజు జరుగుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్థిక్ పాండ్యలకు ఈ సిరీస్‌ నుంచి రెస్ట్ ఇవ్వానున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్, హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ల వన్డే భవితవ్యంపై సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ఈ సిరీస్‌కు పంత్, సిరాజ్ ఎంపిక కాకుంటే వన్డేల్లో వీరి కెరీర్‌ దాదాపుగా ముందుకు సాగడం కష్టమనే విషయం తేలిపోతుంది. ఈ ఫార్మాట్లో వీరి ఫామ్‌ అంత గొప్పగా లేదు.. ఈ ఇద్దరూ తుది జట్టులో ఆడి కూడా చాలా ఏళ్లైంది. దేశవాళీల్లో సత్తా చాటుతున్న సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ.. కివీస్‌తో సిరీస్‌కు సెలక్ట్ అవుతాడనే ఆశాభావంతో ఉన్నాడు. న్యూజిలాండ్ తో మూడు వన్డేలు ఈ నెల 11, 14, 18 తేదీల్లో జరగనున్నాయి. జనవరి 21వ తేదీ నుంచి జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేశారు.

‘వామ్మో వాయ్యో’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతి స్పెషల్ మాస్ బీట్ రెడీ
రవితేజ హీరోగా కిశోర్‌ తిరుమల డైరెక్షన్ లో రూపొందించిన మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయాతి హీరోయిన్స్ గా.. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. ఈనెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు వరంగల్‌లో ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. ‘‘వామ్మో వాయ్యో’’ అంటూ సాగిన ఈ జానపద పాటకు భీమ్స్‌ సెసిరోలె స్వరాలు సమకూర్చగా.. దేవ్‌ పవార్‌ సాహిత్యం అందించారు. స్వాతి రెడ్డి పాటను ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు అందించారు. ఈ పాటలో రవితేజ, ఆషికా, డింపుల్‌ వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ సందర్భంగా డైరెక్టర్ కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ.. ‘‘ఇది ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కుటుంబ కథా సినిమా.. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. థియేటర్లకు వచ్చి ఈ చిత్రాన్ని ఆస్వాదించండి’’ అన్నారు. ఇక, చాలా రోజుల తర్వాత ‘వామ్మో వాయ్యో’ లాంటి మాస్‌ పాట చేశా.. ఇది మాకెంతో ప్రత్యేకమైన సాంగ్ అని నటి డింపుల్‌ హయాతి చెప్పుకొచ్చింది. అలాగే, ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. థియేటర్లో ఈ పాట అందర్నీ అలరిస్తుంది. చాలా ఎనర్జీతో నిండిన మాస్‌ సాంగ్ ఇది.. ఈ పాట కోసం నేను.. డింపుల్‌ చాలా కష్టపడి డ్యాన్స్‌ చేశామని వెల్లడించింది.

Exit mobile version