ప్రేమకు అడ్డుగా మారిన వయస్సు.. యువకుడు ఆత్మహత్య..
విజయవాడ నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలు తన ప్రేమను అంగీకరించలేదన్న మనోవేదనతో యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడ చిట్టీనగర్ ప్రాంతంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, యశ్వంత్ గత రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే యువతికి యశ్వంత్ కంటే రెండు సంవత్సరాలు వయసు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రేమను ఇరువురు కుటుంబాలు అంగీకరించలేదు. ఈ క్రమంలో యువతికి ఇటీవల వివాహం ఖరారు కావడంతో యశ్వంత్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో యశ్వంత్ తన స్నేహితుడు తేజకు లేఖ రాసి, తన మృతికి ఎవరూ కారణం కాదని, తాను ప్రేమించిన యువతిని ఎవరూ నిందించవద్దని పేర్కొన్నాడు. అలాగే, కొంతమందికి తాను అప్పులు ఉన్న విషయాన్ని కూడా లేఖలో వెల్లడించాడు. అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యశ్వంత్ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన తల్లి స్థానికంగా ఓ టిఫిన్ హోటల్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సమాచారం అందుకున్న విజయవాడ కొత్తపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–1 ఉద్యోగాల నియామకాల తుది ఫలితాలను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. 2023 డిసెంబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 12/2023కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. మొత్తం 89 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి 2023లో నోటిఫికేషన్ జారీ చేయగా, ఇందులో 87 పోస్టులకు తుది ఫలితాలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు 2 స్పోర్ట్స్ కోటా పోస్టుల ఫలితాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఎపీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలను ఎపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్ ద్వారా ఫలితాలను పరిశీలించుకోవచ్చని ఎపీపీఎస్సీ సూచించింది.
నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర నేటితో ముగియనుంది. అయితే, సమ్మక్క- సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మేడారం మహా జాతర మొత్తం జనసంద్రమైంది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారం (బెల్లం)తో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక, శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనం మొత్తం ఇసుక వేసినా రాలనంత ప్రజలు ఉన్నారు. దీంతో తాడ్వాయి- మేడారం రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. మూడు రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు నిన్నటి నుంచే తిరుగు ప్రయాణం అవుతున్నారు. అయితే, శుక్రవారం నాడు సక్కమ- సారలమ్మలను దర్శించుకున్న భక్తులు తిరుగు పయనం అవుతున్న సమయంలో ఆర్టీసీ బస్సులు లేక నిన్న సాయంత్రం నుంచి బస్టాండ్ లలో వేచి ఉన్నారు. సరిపడిన బస్సులు లేకపోవడంతో భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు అదనంగా మరిన్నీ బస్సులను మేడారం జాతరకు పంపుతున్నారు. అలాగే, గురువారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో సమ్మక్క తల్లి గద్దె పైకి వచ్చింది. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు మూడు నుంచి నాలుగు రోజులుగా వేచి చూసిన భక్తులు ఒక్కసారిగా గద్దెల ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో టీటీడీ భవనం పక్కనున్న సాధారణ, వీఐపీ, వీవీఐపీ క్యూలైన్ల నుంచి జంపన్న వాగు, ఆర్టీసీ జంక్షన్ వైపు స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఇదే సమయంలో రెండు సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో పిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అలాగే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ వచ్చి భక్తుల మధ్య చిక్కుకుని ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. రద్దీ నుంచి వెళ్తున్న వీఐపీ వాహనాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
1వ క్లాస్ బాలికపై లైంగిక వేధింపులు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరెస్ట్..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమ్‌గఢ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మొదటి తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం మైనర్ బాలిక పాఠశాలకు వెళ్లిన సమయంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల నుంచి ఇంటికి తిరిగివచ్చిన బాలిక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, కొంతమంది గ్రామస్తులతో కలిసి పలేరా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంతో పాటు BNSలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై తికమ్‌గఢ్ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. పలేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టం, BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించాం అని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
నేడే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం.. శాఖలు ఇవే..?
మహారాష్ట్ర దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ తొలి మహిళా డిప్యూటీ సీఎం కానున్నారు. ఆమె ఈరోజు ( జనవరి 31న) ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉందని ఎన్సీపీ (అజిత్) పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక, సునేత్రాకు ఎక్సైజ్, క్రీడల శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. కాగా, ముంబైలో ఇవాళ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై సునేత్రను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకునే ఛాన్స్ ఉందని ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. సాయంత్రం వరకు ఆమె ఉపముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేస్తారని పేర్కొన్నారు. అయితే, అజిత్ పవార్ ఆకస్మిక మృతి నేపథ్యంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీలిక వర్గాల పునరేకీకరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. చీలిక వర్గాల కలయికకు కసరత్తు కొనసాగుతున్న విషయం నిజమేనని, ఇందుకు సంబంధించి అజిత్ పవార్ జీవించి ఉండగానే జరిగిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పుణె, చించ్వాడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు వర్గాలు కలిసి పోటీ కూడా చేసేశాయి. రెండు చీలిక వర్గాలను విలీనం చేయాలని గత కొంతకాలంగా అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్‌తో అనేక సార్లు సమావేశం అయ్యారని సమాచారం. శరద్ పవార్ వర్గానికి చెందిన సుప్రియా సూలే, జయంత్ పాటిల్‌తో కూడా చర్చలు కొనసాగించారు. బీజేపీ సీనియర్ నేతలకు ఈ విషయం తెలుసని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నేడే భారత్ వర్సెస్ కివీస్ చివరి టీ20.. సొంతగడ్డపై సంజు శాంసన్‌కు ఛాన్స్?
హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు నాలుగో టీ20లో న్యూజిలాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో ఏకంగా 50 పరుగుల తేడాతో ఓడిపోవటంతో, ఈరోజు (జనవరి 31న) జరగనున్న ఐదో టీ20పై ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఓడితే వరల్డ్ కప్‌కు ముందు జట్టు ఆత్మవిశ్వాసానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4వ టీ20లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్‌పై గెలిచింది. అదే జోరును కొనసాగించి సిరీస్‌ను గౌరవప్రదంగా ముగించాలని కివిస్ ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు టీమిండియా బౌలర్లపై ఎదురు దాడి చేయడంతో 216 పరుగుల భారీ లక్ష్యా్న్ని పెట్టింది. ఓపెనర్లు సీఫర్ట్, డెవాన్ కాన్వేతో పాటు మిచెల్, ఫిలిప్స్ అద్భుతంగా ఆడారు. ఈ నలుగురిని కట్టడి చేయడంపైనే భారత గెలుపు ఆధారపడి ఉంది. కాగా, గత మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లు భారీగా రన్స్ ఇచ్చారు. కానీ, ఇవాళ జరిగే మ్యాచ్‌లో బౌలర్లు ఎలా రాణిస్తారు అనేది కీలకం. ఇక, న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, శాంట్నర్‌లు టీమిండియా బ్యాటర్లకు ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంది.
రూ.5 వేలతో కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య రాయ్.. ఎలా కోటీశ్వరురాలు అయ్యింది..?
నీటి బిందువులు సముద్రాన్ని నింపుతాయని అంటారు. ప్రతి చిన్న ఆరంభానికి ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుందనే దానికి నిలువెత్తు ఉదాహరణ ఐశ్వర్య రాయ్. నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ అయినప్పటికీ, ఆమె కెరీర్ ఆరంభం మాత్రం చాలా సాధారణం.. తన కెరీర్ కూడా అంతా సులువుగా సాగింది ఏమీ లేదు.. వినోద రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఐశ్వర్య రాయ్ తన మొదటి మూడు వాణిజ్య ప్రకటనల ద్వారా కేవలం రూ.5 వేల రూపాయలు మాత్రమే సంపాదించింది. గ్లామర్, అవార్డులు, అంతర్జాతీయ గుర్తింపుకు ముందే ఆమె ప్రయాణం ఇలా చిన్న అడుగులతో మొదలైంది. నిర్మాత శైలేంద్ర సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య.. తన కెరీర్ తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. ఐశ్వర్య అప్పటికి 18 లేదా 19 ఏళ్ల వయసు ఉంటుంది. మెరైన్ డ్రైవ్‌లో తన తల్లిదండ్రులతో కలిసి రాత్రి 8:30 సమయంలో మమ్మల్ని కలవడానికి వచ్చింది. ఆమె మా మొదటి మూడు ప్రకటనలను కేవలం ఐదు వేల రూపాయలకే చేసింది అని ఆయన తెలిపారు. అయితే, ఆమె చేసిన మొదటి వాణిజ్య ప్రకటన ముకేష్ మిల్స్‌లో చిత్రీకరించారని, అందులో ఆమెను ఒక స్తంభానికి కట్టిన సీన్ ఉందని శైలేంద్ర సింగ్ వివరించారు. ఆ తర్వాత మాళవిక తివారీతో కలిసి కలబంద హెయిర్ ఆయిల్ ప్రకటన, అర్జున్ రాంపాల్‌తో మరో యాడ్ చేసింది. ఈ వినయపూర్వకమైన ఆరంభమే ఆమె అద్భుతమైన కెరీర్‌కు పునాది వేసింది.
