NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు జగన్‌.. వాతావరణం అనుకూలించక ఆలస్యంగా అనుమతులు..!
కడప జిల్లా పర్యటన ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. జిల్లాలో మూడు రోజుల పర్యటనలో బిజీ బిజీగా గడిపారు జగన్… జమ్మలమడుగు, కడప నియోజకవర్గాలకు సంబంధించిన నేతల మధ్య ఉన్న విభేదాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అయితే, ఈ రోజు ఉదయమే బెంగళూరు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కారణంగా మాజీ సీఎం హెలికాప్టర్ కు ఎయిర్ కంట్రోల్ నుంచి అనుమతులు త్వరగా రాలేదు.. వాతావరణం అనుకూలించకపోవడంతో జగన్‌ బెంగళూరు ప్రయాణం కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది.. ఇక, మొదటిరోజు సాయంత్రం వరకు జమ్మలమడుగు ఇంఛార్జ్‌ వ్యవహారంపై సుదీర్ఘంగా జిల్లా నేతలతో పాటు జమ్మలమడుగు నేతలతో ఆయన చర్చించారు వైఎస్‌ జనగ్‌.. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మధ్య కుదిరించడానికి కృషి చేశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మూడు మండలాలు ,ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మూడు మండలాలు ఇన్చార్జిగా ఉండాలని ఆయన ఆదేశించారు. రెండవ రోజు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజా సమస్యలను సానుకూలంగా విని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మూడవరోజు తెల్లవారుజామునే పులివెందుల నుంచి ఇరుగులపై చేరుకొని మరో మారు జమ్మలమడుగు నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కలిసికట్టుగా పని చేయాలని పార్టీ క్యాడర్ కు ఆయన ఆదేశించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయలుదేరి వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.

గూగుల్ క్లౌడ్ సీఈవోతో మంత్రి లోకేష్‌ భేటీ.. విశాఖలో డాటా సెంటర్‌ ఏర్పాటుకు ఆహ్వానం
అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రంలో పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతుండగా.. తన పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శించారు లోకేష్‌.. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, బికాస్ కోలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ నెట్ వర్కింగ్), రావు సూరపునేని (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్స్), చందు తోట (వైస్ ప్రెసిడెంట్, గూగుల్ మ్యాప్స్) లతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మాట్లాడుతూ… ఆన్‌లైన్ రీసెర్చి, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఏఐ, అటానమస్ టెక్నాలజీలో వెంచర్లతో పురోభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆల్ఫాబెట్ (గూగుల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా $2.01 ట్రిలియన్‌లుగా ఉందని వెల్లడించారు.. ఇక, విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అమలుచేస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌరసేవలు అందించేందుకు ఏఐ టూల్స్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించండి. స్టార్ట్ సిటీల్లో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్‌తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడం కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయండి. ఏపీలో డిజిటల్ ఎడ్యుకేషన్, యువత నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించండి. డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్మార్ట్ సిటీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. ఏపీ ప్రతిపాదనలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు స్పందిస్తూ… సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..

సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్‌లో లోకేష్‌ భేటీ..
ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు.. ఇప్పటికే పలు కీలక సంస్థలు, పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ.. పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.. ఇక, శాన్ ఫ్రాన్సిస్కో లో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వివరిస్తూ… సేల్స్‌ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (CRM) , క్లౌడ్-ఆధారిత సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ గా ఉందని.. కస్టమర్ ఇంటరాక్షన్‌లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లను నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుందన్నారు.. ఇక, సేల్స్ ఫోర్స్ యొక్క కస్టమర్ 360, ఐన్ స్టీన్ ఏఐ వంటి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్, అప్ డేటేడ్ అప్లికేషన్లలో సేల్స్ ఫోర్స్ పురోభివృద్ధి సాధిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సేల్స్ ఫోర్స్ మార్కెట్ క్యాప్ $224.14 బిలియన్ డాలర్లు ఉండగా, ఆదాయం $36.46 బిలియన్ డాలర్లుగా నమోదైందని సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని లోకేష్‌ టీమ్‌కు వివరించారు.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఈ-గవర్నెన్స్, పబ్లిక్ సెక్టార్ లలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది మా లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా CRM సొల్యూషన్‌లు, ఏఐ-డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నాం. డాటా సేవల రంగానికి అనువైన వాతావరణ కలిగిన విశాఖపట్నంలో ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటుచేయండి. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఏపీలో సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు మాకు ఉపకరిస్తాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

ఉద్యోగులకు డీఏను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ను 3.64 శాతం పెంచుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ జీతంతో పాటు ఈ పెరిగిన డీఏ చెల్లించనున్నారు. 2022 జులై 1 నుండి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగులకు డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలలో 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు, మిగిలిన 90 శాతం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లించబడనుంది. అలాగే, రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. ఈ చర్యలు ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించడంలో దోహదం చేయనున్నాయి.

దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పీఎం మోడీ..
ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యమైన పండగ సందర్భంగా ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కాంక్షించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిక పోస్ట్‌ని పంచుకున్నారు. ‘‘ దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దివ్యమైన దీపాల పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, అదృష్టవంతంగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ మాత, శ్రీ గణేషుని అనుగ్రహంతో ఆశీర్వదించబడాలి’’ అని ట్వీట్ చేశారు. ఇదే కాకుండా ఈ రోజు భారతరత్న, దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘ భారతభారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళి. దేశం యొక్క ఐక్యత మరియు సార్వభౌమత్వాన్ని రక్షించడం అతని జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన వ్యక్తిత్వం, పని దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.’’ అని ఎక్స్ పోస్టులో చెప్పారు.

బ్యూటీషియన్ మిస్సింగ్.. 6 ముక్కలుగా శరీరం..
రాజస్థాన్‌లో రెండు రోజలు క్రితం అదృశ్యమైన 50 ఏళ్ల బ్యూటీషియన్ శరీర భాగాలు ఒక ప్లాస్టిక్ బ్యాగులో కనిపించాయి. మహిళను ఆమెకు తెలిసిన వ్యక్తి హత్య చేసి, ఆమె శరీర భాగాలను ఆరు ముక్కలు చేసిన నిందితుడు, ఇంటి సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 28న బాధితురాలు అనితా చౌదరి మధ్యాహ్నం తన బ్యూటీ పార్లర్ మూసేసిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆమె భర్త మన్మోహన్ చౌదరి జోధ్‌పైర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అనిత బ్యూటీ పార్లర్ ఉన్న భవనంలోనే నిందితుడు గులాముద్దీన్ అలియాస్ గుల్ మహ్మద్ దుకాణం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరికి పరిచయం ఏర్పడింది. బాధితురాలి ఫోన్ కాల్ డేటా ప్రకారం.. నిందితుడు గుల్ మహ్మద్ గురించి పోలీసులకు తెలిసింది. సర్దార్‌పురా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ దిలీప్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ అనిత కనిపించకుండా పోయే ముందు ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయిందని, అనితను తీసుకెళ్లిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించగా, నిందితుడు ఉంటున్న గాన్‌గానా వద్దకు తీసుకెళ్లాడని చెప్పాడు.

అమెరికాకు 60 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా.. కారణం ఇదే..
పీక్ ట్రావెల్ పిరియడ్‌లో ఎయిర్ ఇండియా అమెరికాకు 60 విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. నిర్వాహణ సమస్యల కారణంగా, ఎయిర్ క్రాఫ్ట్‌లు అందుబాటులోని కారణంగా ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మద్య భారత్ – అమెరికా రూట్లలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్స్‌కి చెందిన సంబంధిత వర్గాలు తెలిపాయి. శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోతో పాటు అమెరికాలోని వివిధ నగరాలకు సర్వీసులు రద్దు అయ్యాయి. భారీ నిర్వహణ, సప్లై చైన్ పరిమితుల నుంచి కొన్ని విమానాలు తిరిగి రాకపోవడంతో నవంబర్-డిసెంబర్ మధ్య తక్కువ సంఖ్యలో విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్లకు ఈ మేరకు సమచారం అందించామని, ఎయిర్ ఇండియా గ్రూప్ ద్వారా నడపబడుతున్న ఇతర విమానాల్లో, తర్వాతి రోజులకు సర్వీసుని ఆఫర్ చేసినట్లు సంస్థ తెలిపింది.

అమరన్ ప్రీమియర్ ట్విట్టర్ రివ్యూ
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో మలయాళ భామ సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నేడు థియేటర్స్ లోకి వస్తున్న ఆ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో స్పెషల్ ప్రీమియర్స్ కంప్లిట్ చేసుకుంది. ప్రీమియర్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ గా శివకార్తికేయన్ అద్భుతంగా నటించాడు. బయోపిక్ తీయడం అంటే కత్తి మీద సాములాంటిది. ఏమంత్రం సినిమాటిక్ లిబర్టీ వంటివి తీసుకున్న కూడా రిజల్ట్ తేడా కొడుతుంది. కానీ అమరన్ విషయంలో దర్శకుడు ఎక్కడ అనవసరపు హంగులు జోడించకుండా ముకుంద్ జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలని రోమాలు నిక్కబొడిచేలా తెరపై మలిచాడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి. ఇక ముకుంద్ వైఫ్ పాత్రలో సాయి పల్లవి నటన అద్భుతం. ముఖ్యంగా ముకుంద్ ను ప్రేమించి పెళ్లి చేసుకునే జర్నీ తాను ఎదుర్కున్న అవరోధాలు, కాశ్మిర్ లోయలో భీకర యుద్ధంలో అసువులు బాసిన మేజర్ ముకుంద్ వార్త తెలియాగానే తన జీవితంలో కమ్ముకున్న కారుచీకట్లను దాటి జీవనం సాగిస్తున్న మేజర్ ముకుంద్ భార్యగా సాయి పల్లవి అద్భుత నటన మనసుని బరువెక్కిస్తుందని, GV ప్రకాష్ సంగీతం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టిందని టాక్ ఓవర్సీస్ నుండి వినిపిస్తుంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి విడుదల చేసారు. “క” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడుతూ “క అనే మంచి సినిమాతో మీ ముందుకు ఈ నెల 31న రాబోతున్నాం. “క” సినిమా బ్యాడ్ మూవీ అని మీలో ఎవరైనా అంటే నేను సినిమాలు చేయడం మానేస్తా. ఎవరెవరికి ఎంత నచ్చుతుందో తెలియదు గానీ మంచి ప్రయత్నం అని మాత్రం అంటారు. నేను ప్రామిస్ చేస్తున్నా” అని అన్నారు. కాగా దీపావళి కానుకగా నిన్న రాత్రి ‘క’ స్పెషల్ ప్రీమియర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించారు. సినిమా చూసినా ఆడియెన్స్ కిరణ్ అబ్బవరం చెప్పినట్టుగానే క్లైమాక్స్ అదిరింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగా ఆకట్టుకుంది. హీరో చెప్పినట్టుగా ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో అలరించాడని ‘క’  సినిమాతో కిరణ్ అబ్బవరం హిట్టు కొట్టేసాడని  క్రిటిక్స్ సైతం యూనిట్ ను అభినందిస్తున్నారు.

ఎన్టీఆర్-నీల్ మూవీలో రుక్మిణి వాసంత్.. కాస్త క్లారిటీ ఇవ్వండయ్యా !
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా ప్రారంభించారు. ఇక రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేందుకు కూడా యూనిట్ సిద్ధం అవుతుంది. అయితే, గతకొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్‌పై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దేవర హంగామా దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగా ప్రస్తుతం హృతిక్ రోషన్ కాంబినేషన్లో నటిస్తున్న వార్ 2 చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. దాంతో పాటే ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామానాయుడు స్టూడియోలో అతి కొద్ది మంది సమక్షంలో పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా నవంబర్ లాస్ట్ వీక్ నుండి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ మొదలు కాబోతుంది. కొంత గ్యాప్ తీసుకుని ప్రశాంత్ నీల్ సినిమా కోసం లుక్ మార్చి జనవరి చివరలో ఈ సినిమా సెట్స్ లో అడుగుపెడతాడు.