వ్యాపారితో పోలీసుల ఘర్షణ.. సీఎం సీరియస్, చర్యలకు ఆదేశాలు
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి, పోలీసులకు జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి పట్టణంలో అవినాష్ అనే వ్యాపారికి, పట్టణ ఎస్సై వేమనకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో షాప్ వద్ద లారీ నుంచి ఎరువులను అన్‌లోడ్ చేసే క్రమంలో వెంటనే లారీని అక్కడ నుంచి తొలగించాలని పోలీసులు కోరిన సందర్భంలో వివాదం రేగింది. తరువాత రోజు క్రిస్మస్ పండగ సందర్భంగా రోడ్లపై రద్దీ కారణంగా ట్రాఫిక్ ను క్లియర్ చేసే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో తమపై లాఠీతో దాడి చేశారని అవినాష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎస్ఐపై ఆరోపించారు. దీనిపై వ్యాపార వర్గాలు తీవ్ర అభ్యంతరం వక్తం చేస్తూ ఆందోళన చేయడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమనను వీఆర్ కు పంపుతూ రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారు. ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వంగలపూడి అనితతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఘటనపై ఇప్పటికే మంత్రులు, అధికారులు స్పందించారని వివరించారు.
ఏపీలో నేటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు..
రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రంపచోడవరం హెడ్ క్వార్టర్‌గా పోలవరం జిల్లా ఏర్పాటైంది. మార్కాపురం హెడ్ క్వార్టర్‌గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ్టి నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయి. పోలవరం, మార్కాపురంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. మొదట మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, అభ్యంతరాలు రావడంతో.. అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్‌ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చింది. ప్రజలకు వేగంగా పాలన అందించడం, సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లనూ ఏర్పాటు చేసింది. పలు మండలాల సరిహద్దులనూ మార్చింది. కొత్తగా రెవెన్యూ డివిజన్లుగా అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల సరిహద్దులకు సంబంధించిన తుది ప్రకటననూ ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు 77 రెవెన్యూ డివిజన్లుండగా.. కొత్తగా ఏర్పాటు చేసిన ఐదింటితో కలిపితే వాటి సంఖ్య 82 చేరింది. అలాగే.. మండలాల సంఖ్య కూడా 679 నుంచి 681కి పెరిగింది. పెనుగొండ మండలాన్ని వాసవీ పెనుగొండగా మార్చారు. నందిగామను పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి మార్చారు. సామర్లకోటను కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురానికి మార్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొన్ని మండలాలను మార్చారు. గూడురు నియోజవర్గంలోనిలోని 3 మండలాలను నెల్లూరుకు తీసుకువచ్చారు. 17 జిల్లాల్లో 25 మార్పులు చేస్తూ క్యాబినెట్లో ఆమోదం తెలపగా వాటన్నింటికీ సంబంధించి తుది ప్రకటన జారీ అయింది.
మాదాపూర్‌లో హిట్ అండ్ రన్.. ట్రాఫిక్ హోమ్ గార్డ్‌ను ఢీకొట్టి పరారీ అయిన కారు డ్రైవర్
హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. మాదాపూర్ పర్వత నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ నయీం (45)ను ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టి పరారైంది. ఘటనలో నయీం తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం నయీం కాలు విరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ట్రాఫిక్ అదనపు డీసీపీ హనుమంత్ రావు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న హోమ్ గార్డ్ నయీంను పరామర్శించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
ఎంజాయ్ చేయండి.. కానీ, రూల్స్ ఫాలో అవ్వకపోతే అంతే..!
తెలుగురాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా రెడీ అయింది.2025కి గ్రాండ్‌గా బై బై చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం సిద్ధమయ్యారు. వేడుకల కోసం హోటళ్లు, రిసార్ట్లు, పబ్‌లు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. నూతన ఏడాదిలో కొత్త ఆశలు, ఆశయాలతో ప్రయాణం ప్రారంభించే యువత క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తారు. శాంతిభద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు ఆంక్షలు అమల్లో ఉంటాయి.ఇప్పటికే పబ్‌లు, హోటళ్లు, బార్ల నిర్వాహకులకు నిబంధనల అమలుపై కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. వేడుకల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవంటున్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, స్థానికులకు ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్, వాహనాల నియంత్రణ చేయాలన్నారు. హాజరైన వారిలో మద్యం తాగిన వాళ్లను సురక్షితంగా ఇల్లు చేర్చేందుకు పబ్‌ల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరాత్రి దాటాక సంబరాలు, శుభాకాంక్షలు చెప్పే ఉద్దేశంతో ఇష్టానుసారం యువత రోడ్లపైకి రావద్దన్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు.
మద్యం ప్రియులకు శుభవార్త.. మద్యం సేవించినవారికి ఉచిత రవాణా సేవలు..!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు టీజీపీడబ్ల్యూయూ (Telangana Gig and Platform Workers Union) ఆధ్వర్యంలో ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (TGFWDA)తో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఉచిత క్యాబ్, బైక్ రైడ్స్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ సేవలు కొనసాగనున్నాయి. న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరగకుండా ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2025 ఏడాది వేడుకలలో కూడా ఈ కార్యక్రమం కింద మొత్తం 789 ఉచిత క్యాబ్, బైక్ రైడ్స్ అందించినట్లు టీజీపీడబ్ల్యూయూ వెల్లడించింది. మద్యం సేవించిన వారు బాధ్యతగా వ్యవహరించి ఈ ఉచిత రవాణా సేవలను వినియోగించుకోవాలని, సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.
మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం
దివంగత అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ మనవరాలు టటియానా ష్లోస్‌బర్గ్ (35) హఠాన్మరణం చెందింది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణాన్ని జేఎఫ్‌కే లైబ్రరీ ఫౌండేషన్ ధృవీకరించింది. తీవ్రమైన మైలోయిడ్ లుకేమియాతో చనిపోయినట్లుగా పేర్కొంది. రెండవ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మే 2024లో తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ష్లోస్‌బర్గ్‌కు భర్త జార్జ్ మోరన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్ నగరంలో పుట్టి పెరిగింది. కరోలిన్ కెన్నెడీ- ఎడ్విన్ ష్లోస్‌బర్గ్ దంపతులకు జన్మించింది. జాకీ-జాన్ ఎఫ్. కెన్నెడీల మనవరాలు. యేల్ విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది. పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పు, సైన్స్ జర్నలిజంపై విద్యను అభ్యసించింది.
పాన్ – ఆధార్ లింక్ గడువును మరోసారి పొడిగిస్తారా..?
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులను లింక్ చేయాలి. ఈ లింకింగ్ ప్రాసెస్ ఉచితంగా చేసుకోవడానికి ఇవాళే ఆఖరురోజు. ఈ గడువు దాటితే పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవు. నిర్ణీత గడువులోగా లింక్ చేయకపోతే పాన్ కార్డ్ సేవల్లో అంతరాయం ఏర్పడటం గానీ, ఆర్థిక లావాదేవీల నిలుపుదల, ఇతర సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ వుంది. అక్టోబర్ 1, 2024న లేదా ఆ తరువాత పాన్ కార్డులు పొందిన వారు డిసెంబర్ 31, 2025 లోపు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. నిర్ణీత తేదీ కంటే ముందుగా పాన్ కార్డ్ తీసుకున్న వారికి లింక్ కోసం గడువును మే 31, 2024 వరకు మాత్రమే ఇచ్చింది ఆదాయపు పన్ను శాఖ. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఆధార్-పాన్ కార్డు లింక్ చేయకపోవడం ఆర్థిక పరమైన లావాదేవీలు నిలిపివేయడం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి యాక్సెస్ ఉండదు. అలాగే గడువు ముగిసిన తరువాత పాన్-ఆధార్ లింక్ చేయడానికి రూ. 1000 ఛార్జీ చేస్తారు. గడువులోగా లింక్ చేసుకోవడానికయితే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, గడువు ఇవాళ్టితో ముగియనుండడంతో.. మరోసారి.. పాన్ – ఆధార్ లింక్ గడువు పొడిగిస్తారా? అని ఇప్పటికీ ఈ ప్రాసెస్ చేయనివారు ఎదురుచూస్తూనే ఉన్నారు.. మరి, దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..
హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్… శ్రీలంకపై భారత్ 5-0 క్లీన్‌స్వీప్..!
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు సాగింది. ఛేదన మొదట్లో భారత జట్టు కష్టాల్లో పడినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయాన్ని అందించింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు పోరాడినా, కీలక సమయంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి విజయం సాధించారు. దీంతో టీమిండియా సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలి 3 వికెట్లను కేవలం 41 పరుగులకే కోల్పోయింది. అలాగే 77 పరుగుల వద్దే సగం జట్టు పెవిలియన్ చేరింది. ఈ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ బాధ్యత తీసుకుని జట్టును ఆదుకుంది. ఆమె 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 68 పరుగులు చేశారు. ఆమెకు తోడుగా అరుంధతి రెడ్డి 11 బంతుల్లో 27 పరుగులు చేయగా, అమంజోత్ కౌర్ 21 పరుగులు జోడించారు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక బౌలింగ్‌లో కవిషా దిలహారి 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. రష్మిక సేవ్వండి, చమరి అటపట్టు తలా 2 వికెట్లు సాధించారు. నిమాషా మీపేజ్ 1 వికెట్ తీసింది.
2025 ప్లాప్ హీరోయిన్స్ వీరే.. వచ్చే ఏడాదైనా హిట్ అందుకుంటారా ?
లాస్ట్ ఇయర్ కిస్సిక్ బ్యూటీనంటూ ఐటమ్ సాంగ్‌తో కట్టిపడేసి టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ అటెన్షన్ గ్రాబ్ చేసిన శ్రీలీల.. ఈ ఏడాదికొచ్చేసరికి ఆ గ్రేస్ పదిలం చేసుకోవడంలో తడబడింది. 2025లో ఒక్కటి కాదు రెండు కాదు.. త్రీ హ్యాట్రిక్ ఫ్లాప్ నమోదు చేసింది వైరల్ వయ్యారీ. నితిన్‌తో నటించిన రాబిన్ హుడ్ భారీ నష్టాలను మిగల్చగా.. వైరల్ వయ్యారీ అని హడావుడి చేసినా కూడా జూనియర్‌ను పట్టించుకోలేదు ఆడియన్స్. ధమాకాతో హిట్టిచ్చిన రవితేజతో కలిసి మాస్ జాతరతో సక్సెస్ ట్రాక్ ఎక్కుదామనుకుంటే బొమ్మ భారీ డిజాస్టర్. శ్రీలీల తరహాలోనే భాగ్య కూడా త్రీ ఫ్లాప్స్ మూటగట్టుకుంది. కింగ్ డమ్ మినహాయించి కాంత, ఆంధ్రా కింగ్ తాలూకాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. పైసల్ వసూలు చేసుకోవడంలో తడబడ్డాయి. దీంతో ఇప్పటి వరకు కెరీర్‌లో ఒక్క హిట్ కూడా చూడని అన్ లక్కీ హీరోయిన్‌గా మారింది. మరో యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్.. కన్నప్పలో అందాలు ఆరబోసినా ఫలితం దక్కలేదు. అటు మలయాళంలో మైనే ప్యార్ కియా అన్నా ఆడియన్స్ పట్టించుకోలేదు.
కోలీవుడ్‌లో పూజా–శ్రీలీల కెరీర్‌కు గట్టి పరీక్ష..
ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ప్రతి సినిమా పరిక్షలాంటిదే. ఎందుకంటే కంటిన్యూగా రెండు ఫ్లాప్‌లు పడ్డయంటే దర్శకనిర్మాతలు వారిని పక్కప పెట్టేస్తారు. అదృష్టం.. ఫేమ్‌ని బటి అవకాశాలు వచ్చిన హిట్ దక్కకోతే మాత్రం కష్టం. ప్రజెంట్ ఇప్పుడు శ్రీ లీల, పూజా హెగ్డే అదే పరిస్థితిలో ఉన్నారు. టాలీవుడ్ గ్లామర్ డాల్స్ పూజా హెగ్డే, శ్రీలీలకు ప్రస్తుతం అవకాశాలకైతే కొదవ లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ తగిలి చాలా కాలమైంది. ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్‌ను ఏలిన ఈ ముద్దుగుమ్మలు, ఇప్పుడు తమ క్రేజ్‌ను మళ్లీ టాప్‌కు తీసుకెళ్లే ఒక్క సాలిడ్ బ్రేక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఆశలు కోలీవుడ్‌పైనే ఉన్నాయి. బుట్ట బొమ్మ పూజా హెగ్డే, దళపతి విజయ్ సరసన నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉంది. విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఈ మూవీలో తన నటనతో మెప్పించి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోవాలని పూజా భావిస్తోంది.
మన శంకర వర ప్రసాద్ గారు.. అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చిరంజీవిని అత్యంత స్టైలిష్‌గా చూపిస్తూ అనిల్ రావిపూడి కట్ చేసిన ప్రోమోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినిమాపై అంచనాలు పెంచడంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా చిరంజీవి-నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ అభిమానుల్లో జోష్ నింపింది. ఇందులో మెగాస్టార్‌తో కలిసి విక్టరీ వెంకటేష్ స్టెప్పులేయడం థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉంది. అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్‌లో మంచి సక్సెస్ రేట్ ఉండటం, దానికి మెగాస్టార్ క్రేజ్ తోడవ్వడంతో ఈ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తూ US లో 15 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించేశారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని, ఓవర్సీస్‌లో ‘సరిగమ సినిమాస్’ జనవరి 11నే గ్రాండ్ ప్రీమియర్ల ద్వారా విడుదల చేస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
