NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పెన్షన్‌దారులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. ఇయర్‌ ఎండ్‌లో ఒకరోజు ముందుగానే పెన్షన్‌దారులకు డబ్బులు అందబోతున్నాయి.. పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది… డిసెంబర్ 31వ తేదీ సంవత్సర చివరలో , పెన్షన్ పండుగలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాస్తవానికి 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, లబ్ధి దారులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది.. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావులు పర్యవేక్షించారు.. సీఎం చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి నివాసం నుండి పల్నాడు జిల్లాకు బయలుదేరుతారు.. 10:50 గంటలకు నరసరావుపేట మండలం యలమంద గ్రామానికి చేరుకుంటారు.. అనంతరం 11 గంటల నుంచి 11:30 వరకు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేస్తారు.. ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:35 వరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు.. ఆ తర్వాత మధ్యాహ్నం 12:40కి పలనాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు.. అనంతరం ఒంటిగంట 45 నిమిషాలకు ,కోటప్పకొండ లోని త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు ముఖ్యమంత్రి … ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అటు కట్టుదిట్టమైన భద్రతతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.

భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో కొత్త మెథడ్.. పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!
ఏపీలో భూమి రిజిస్ట్రేషన్‌ విలువ పెంపుపై గత కొంతకాలంగా ప్రచారం సాగుతూ వచ్చింది.. జనవరి 1వ తేదీ నుంచి ధరలు పెరుగుతాయని సంకేతాలు వచ్చాయి.. అయితే, భూముల విలువ పెంపుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం… ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది.. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే పెంపుదల చేయాలన్నది నియమంగా పెట్టుకుంది.. సగటున 15 నుండి 20 శాతం వరకు పెంపుదల ఉండే అవకాశం ఉంది.. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో తగ్గింపుకు కూడా కసరత్తు జరుగుతోంది.. రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు, రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారాల నేపథ్యంలో కొంతవరకూ కొన్ని చోట్ల భూముల ధరలు కూడా తగ్గనున్నాయి.. భూమి రిజిస్ర్టేషన్ విలువలు పెరుగుతాయని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్‌ అండ్ స్టాంప్స్ శాఖపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన విచ్చల విడి అప్పుల భారం నుండి రాష్ర్టం ఇప్పుడిప్పుడే కోలుకోంటోందని, అయితే రాష్ర్టానికి రెవెన్యూ కూడా అవసరమని, ఈ నేపథ్యంలోనే రిజిస్ర్టేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు మంత్రి అనగాని. అయితే ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ర్టేషన్ విలువలను పెంచుతామని చెప్పారు.

మందుబాబులకు ఏపీ సర్కార్‌ శుభవార్త.. అర్ధరాత్రి వరకు లిక్కర్‌ అమ్మకాలు
మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. 2024కు గుడ్‌బై చెప్పి.. 2025కి స్వాగతం పలికేందుకు అంతా స్వాగతం సిద్ధం అవుతోన్న తరుణంలో.. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయనే అంచనాలు ఉన్నాయి.. అయితే, మద్యం అమ్మకాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వరకు లిక్కర్ సేల్స్‌కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్‌ శాఖ పెంచింది. మద్యం షాపులు, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతిచ్చింది. సాధారణంగా ప్రతీరోజు రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో.. మద్యం షాపులు, బార్లు అందుబాటులో లేకపోతే మందుబాబులు బెల్టు షాపుల్లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని భావించిన ప్రభుత్వం.. అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది.. డిసెంబర్‌ 31వ తేదీతో పాటు.. జనవర్‌ 1వ తేదీన కూడా అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది సర్కార్.. అయితే, ఇప్పటికే బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిగితే బెల్ట్‌ తీస్తానంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం విదితమే..

సీఎం గారూ.. మా లేఖలను కూడా ఆమోదించండి!
తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగుజాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని తిరుమల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై తిరుమలలో దర్శనంకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు తెలిపారు. అలానే తెలంగాణలో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లేఖలను కూడా ఆమోదించాలని ఏపీ సీఎంను కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని మీడియా ద్వారా మనవి చేశారు. ఈరోజు తాను లేఖ రాస్తా అని, అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కూడా లేఖ రాయమని విజ్ఞప్తి చేస్తా అని జగ్గారెడ్డి చెప్పారు. ఈ విషయంలో ఏపీ సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నుంచి ప్రతివారం రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్‌ దర్శనం (రూ.500/- టికెట్‌) కోసం రెండు లేఖలు, రూ.300/- టికెట్‌పై ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలు తిరుమలలో అనుమతిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కో లేఖతో ఆరుగురు భక్తులను దర్శనానికి సిఫార్సు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లపై టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను ఆమోదించే అవకాశం ఉంది.

అమెరికా ఖజనాపై చైనా సైబర్ దాడి.. ఖండించిన డ్రాగన్ కంట్రీ
తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై చైనా సైబర్ దాడులకు పాల్పడినట్లు గుర్తించామని అమెరికా ఆరోపించింది. వర్క్‌ స్టేషన్లలో ఉన్న కీలకమైన పత్రాలను దొంగిలించేందుకు యత్నించినట్లు పేర్కొనింది. కాంగ్రెస్‌కు రాసిన లేఖలో ఈ విషయాలను వాషింగ్టన్ వెల్లడించింది. అయితే, డిసెంబర్‌ ప్రారంభంలో ఈ సైబర్‌ దాడి జరిగినట్లు తేలిపింది. థర్డ్‌ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ప్రొవైడర్‌ బియాండ్‌ ట్రస్ట్‌ నెట్‌వర్క్‌ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు వర్క్‌స్టేషన్లు, కీలకమైన పత్రాలను యాక్సెస్ చేసినట్లు చెప్పుకొచ్చింది. డిసెంబర్‌ 8వ తేదీన బియాండ్‌ ట్రస్ట్‌ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని యూఎస్ ట్రెజరీ విభాగం అధికారి చెప్పుకొచ్చారు. అనంతరం సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్‌బీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అయితే, దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు ఇంకా రియాక్ట్ కాలేదు. కాగా, వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మాపై అమెరికా చేస్తున్న ఆరోపణలను గట్టిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చింది. మరోవైపు జార్జియాలోని బియాండ్‌ ట్రస్ట్‌ సైతం ఈ సైబర్‌ దాడిపై రియాక్ట్ కాలేదు. వారి వెబ్‌సైట్‌లో.. ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పు వాటిల్లిందని పేర్కొనింది. దీనిపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. బియాండ్‌ ట్రస్ట్‌ తెలిపిన భద్రతా సంఘటన ట్రెజరీ నివేదించిన హ్యాకింగ్‌ ఘటనకు దగ్గరగా ఉందని గుర్తించాం. అయినా ఈ ఘటనపై విచారణ జరగాలని సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అధికారి చెప్పారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడికి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్ట్
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు బిగ్ షాక్ తగిలింది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్‌ను అరెస్టు చేసేందుకు అక్కడి న్యాయస్థానం వారెంట్‌ జారీ చేసింది. అయితే, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్‌ జారీ చేయాల్సిందిగా విచారణ అధికారులు కోర్టును కోరడంతో.. పోలీసుల విజ్ఞప్తిని అంగీకరించి వారెంట్ ఇచ్చింది. దీంతో యోల్‌ను త్వరలోనే అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. యోల్‌ డిసెంబర్‌3వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో పెనూ సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడి యూన్ ని పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన బృందం ఎంక్వైరీ చేస్తోంది. కాగా, ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు పిలిచినప్పటికీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ విచారణకు రాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్‌ వారెంట్‌ ఇవ్వాలని కోరారు. ఇక, విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు దేశంలో మార్షల్‌లా విధించినందుకు యూన్ కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో విపక్షాలు అభిశంసన తీర్మానం పెట్టాయి. కాగా, ఈ తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారు. దీంతో యోల్‌ తన అధ్యక్ష బాధ్యతలను ప్రధానికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్‌ రాజ్యాంగ న్యాయస్థానానికి పంపుతుంది. యోల్‌ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేల్చనుంది.

స్టన్నింగ్ లుక్స్‌తో భారత మార్కెట్లో విడుదలైన కవాసకి డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్‌
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు కవాసాకి (Kawasaki) భారత మార్కెట్లో తన కొత్త KLX 230 డ్యూయల్-స్పోర్ట్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. KLX 230, కవాసాకి బ్రాండ్‌లోని రోడ్-లీగల్ డ్యూయల్-స్పోర్ట్ సెగ్మెంట్‌లో అత్యంత చిన్న బైక్. కవాసాకి KLX 230 బైక్ స్లీక్, మంచి డిజైన్‌తో అందుబాటులో ఉంది. దీని స్టైలింగ్‌లో హెక్సాగోనల్ హెడ్‌లైట్, దాని చుట్టూ ప్లాస్టిక్ కౌల్ ఉంటాయి. దీని పొడవైన ఫ్రంట్ ఫెండర్ దీనిని ఆఫ్ రోడర్‌గా వీలు కల్పిస్తుంది. బైక్ స్లిమ్ సీటింగ్, పైకి ఉన్న ఎగ్జాస్ట్‌లతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. డిజిటల్ LCD డిస్ప్లే, స్విచ్ చేయగల డ్యూయల్-చానల్ ABS వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక KLX 230లో 233cc సామర్థ్యం కలిగిన సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అందించబడింది. ఇది 18.1bhp పవర్, 18.3Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. దీని ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ దీర్ఘకాల ప్రయాణాల కోసం మెరుగైన హ్యాండ్లింగ్‌ను అందిస్తాయి.

డాక్యుమెంట్ స్కాన్ ఫీచర్ అందుబాటులోకి తీసుకరాబోతున్న వాట్సాప్
వాట్సాప్ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ తన వినియోగదారులకు కొత్త ఆప్షన్స్ ని అందించేందుకు తరచూ కొత్త అప్డేట్స్ ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే, “డాక్యుమెంట్ స్కాన్” అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకరావడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ కెమెరా సహాయంతో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి వాటిని తేలికగా షేర్ చేయవచ్చు. ముఖ్యంగా తరచూ డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేయాల్సిన లేదా పంపాల్సిన వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్, వాట్సాప్ డాక్యుమెంట్ షేరింగ్ మెనూలో భాగంగా అందుబాటులో ఉంది. ఇది యూజర్లకు ఫోన్ కెమెరా ద్వారా ఫిజికల్ డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి పంపించే సౌలభ్యం కల్పిస్తుంది. ఇప్పటి వరకు, డాక్యుమెంట్ ఫోటో తీసి, దానిని డాక్యుమెంట్ ఫార్మాట్‌లో మార్చి పంపాల్సి వచ్చేది. ఇది చాలా సమయం తీసుకోవడం తోపాటు ఫోటో నాణ్యత కూడా అంత బాగుండేది కాదు. కానీ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి పంపడం ద్వారా సమయం కూడా ఆదా అవుతుంది. ఇంకా మరియు డాక్యుమెంట్ నాణ్యత మెరుగ్గానే ఉంటుంది.

విశ్వనాథన్‌ ఆనంద్‌ అనర్హుడు.. కార్ల్‌సన్‌ తీవ్ర విమర్శలు!
భారత చెస్ దిగ్గజం, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్‌ ఆనంద్‌పై ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ఆనంద్‌ ఫిడె పదవిలో ఉండడానికి అనర్హుడని పేర్కొన్నాడు. గేమ్ నిబంధనలకు విరుద్ధంగా జీన్స్‌ వేసుకురావడం, మార్చుకోవాలి సూచించినా వినకపోవడంతో.. కార్ల్‌సన్‌ను ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి నిర్వాహకులు అర్ధంతరంగా తప్పించారు. అంతేకాదు జీన్స్‌ వేసుకున్నందుకు 200 అమెరికన్‌ డాలర్ల జరిమానా కూడా విధించారు. ర్యాపిడ్‌ టోర్నీ సమయంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ వ్యవహరించిన తీరును మాగ్నస్‌ కార్ల్‌సన్‌ తప్పుబట్టాడు. ‘నాకు సంబందించిన ఘటనలో ఫిడె నుంచి సరిగా వ్యవహరించలేకపోయారు. నేను టోర్నీ నుంచి వెళ్లిపోవాలనుకున్నా. అయితే ఫిడె అధ్యక్షుడు ఆర్కాడేతో మాట్లాడే వరకు ఎదురుచూడాలని మా నాన్న చెప్పారు. ఆనంద్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపినా.. ఫలితం లేకపోయింది. నిజానికి ఆర్బిటర్లకు ఎలాంటి పాత్ర లేదు. నేను నిజంగానే గేమ్ నిబంధనలను అతిక్రమించానా? అన్నది ఇక్కడ ప్రశ్న. సాధారణంగా టోర్నీలో జీన్స్‌ను అనుమతించరని చెప్పారు. సాధారణంగా అంటే.. మినహాయింపులు ఉంటాయనే కదా?’ అని కార్ల్‌సన్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో ఫిడె నిబంధనలను సడలించింది. జీన్స్‌ వేసుకున్నా క్రీడాకారులను టోర్నీలోకి అనుమతించేలా మార్పు చేసింది. దుస్తుల విషయంలో తాము కాస్త సరళంగా వ్యవహరించాలని భావించామని, ఇప్పటికీ అధికారిక డ్రెస్‌ కోడ్‌ను పాటించాల్సిందే అని ఫిడె అధిపతి ఆర్కాడీ ద్వొర్కోవిచ్‌ పేర్కొన్నాడు. ప్రపంచ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు కార్ల్‌సన్‌ పాల్గొంటున్నాడని ఆయన స్పష్టం చేశాడు.

కెప్టెన్‌ కావడం వల్లే రోహిత్ ఇంకా ఆడుతున్నాడు: ఇర్ఫాన్
కెప్టెన్‌ కావడం వల్లే రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటున్నాడని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. కెప్టెన్‌గా లేకపోతే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో రోహిత్ స్థానం ప్రశ్నార్థకంగా మారేదన్నాడు. హిట్‌మ్యాన్ బ్యాటర్‌గా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. రోహిత్‌ గత కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ మినహా రాణించలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో కనీసం 20, 30 పరుగులు కూడా చేయట్లేదు. గత 15 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ సగటు 10.93 ఉందంటే.. అతని ఫామ్‌ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న రోహిత్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. హిట్‌మ్యాన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ అనంతరం రోహిత్‌ టెస్ట్ రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. తాజాగా హిట్‌మ్యాన్ ఫామ్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌లో స్పందిస్తూ విమర్శలు కురిపించాడు. రోహిత్ కెప్టెన్ కాకపోతే ఇప్పుడు జట్టులో ఉండేవాడు కాదన్నాడు.

‘డాకు మహారాజ్’ పై ఎక్స్ లో నాగవంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్నా ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నాగవంశీ ‘ ఇప్పుడే డాకు మహారాజ్’ సినిమా చూసాను. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ భీబత్సమ్. జనవరి 12వరకు వేచి ఉండండి. ఈ సినిమా కోసం తమ్ముడు తమన్ ఎవరూ ఊహించలేని లైఫ్ టీమ్ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ ఇచ్చాడు. థియేటర్స్ లో శివ తాండవమే అమ్మా’ అని రాసుకొచారు. నాగవంశీ ట్వీట్ తో బాలయ్య అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా అమెరికాలోని డల్లాస్ లో జనవరి 4న సాయంత్రం 6.00 గంటలకు నిర్వహిచబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. డాకు మహారాజ్ ఈవెంట్ ను ఎన్నడూ చూడని విధంగా ఎవరు చూడని విధంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత నాగవంశీ.

దెయ్యంగా పొడుగు కాళ్ల సుందరి..
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్ హిట్ సాధించింది. చాలా కాలంగా దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్న లారెన్స్, తాజగా కాంచన -4 ను ప్రకటించాడు. కాంచన -4 కు సంబంధించి కథ మొత్తం పూర్తయిందని, గత సినిమాల మాదిరిగానే ఈ  సినిమా కూడా అలరిస్తుందని ఆ మధ్య ఓ ఇంటర్వూలో తేలిపాడు. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్ డేట్ ఇచ్చాడు లారెన్స్. ఈ సినిమాలో హీరోయిన్ ముంబై భామ టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేను ఎంపిక చేసారని తెలుస్తోంది. కాంచన -4 ను దాదాపు రూ. 100 కోట్లు బడ్జెర్ట్ లో నిర్మిస్తున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ లారెన్స్ హీరోగా హంటర్ సినిమాను నిర్మిస్తుంది. మొదట ఈ సినిమాలో నయనతారకు హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఇప్పుడు పూజ వచ్చి చేరింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి

Show comments