నిద్రిస్తున్న వీఆర్‌ఏ.. మంచం కింద బాంబులుపెట్టిన పేల్చి చంపేశారు..!
కడప జిల్లా వేముల మండలంలోని వేముల కొత్తపల్లిలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామ వీఆర్ఏ ఇంట్లో బాంబులు పేల్చారు గుర్తు తెలియని దుండగులు… ఆరుబయట వీఆర్‌ఏ నరసింహులు నిద్రిస్తుండగా.. ఆయన మంచం కింద జిలేటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారు.. గ్రామ వీఆర్ఏ నరసింహులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ఘటనలో వీఆర్ఏ ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయినట్టు చెబుతున్నారు. పాత కక్షలే హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, మృతి చెందిన వీఆర్ఏ మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. అయితే, బాబు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తోంది మృతుడి కూతురు పుష్పావతి.. మా అమ్మ.. బాబుతో మాట్లాడలేదన్న కసితోనే మా నాన్నను చంపాడు.. గతంలో కూడా మా నాన్నను చంపేందుకు బాబు ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు.. బాబు కుటుంబానికి.. మా కుటుంబానికి మధ్య గతంలో గొడవలు జరిగాయి.. రాత్రి మా అమ్మానాన్న నిద్రిస్తున్న సమయంలో కరెంటు తీసి.. బాంబులు పెట్టి.. మా నాన్నను బాబు చంపాడని ఆరోపించించారు వీఆర్ఏ నరసింహ కూతురు పుష్పావతి.
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. దర్యాప్తులో సిట్ దూకుడు.. టీమ్‌లు విడిపోయి..!
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. దీనిపై విమర్శలు, ఆరోపణల పర్వాలు కొనసాగుతుండగా.. కల్తీ నెయ్యిపై వ్యవహారంపై దర్యాప్తులో వేగం పెంచింది సిట్.. ఏఆర్ డైరీకి సహా గత బోర్డులో కోందరూ బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.. నేడు బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సిట్.. నిన్న టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళి కృష్ణను పోలీస్ గెస్ట్ హౌస్ పిలిపించి.. విచారించింది సిట్ బృందం.. ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.. మార్కెట్ విలువ కంటే తక్కువ ధరను కోడ్ చేసినప్పటికీ ఈ టెండర్ ని ఎందుకు టీటీడీ బోర్డు ఆమోదించిందో తెలపాలంటూ అప్పటి అధికారులు, బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది సిట్.. నేడు ఏఆర్ డైరీ ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను పరిశీంచడానికి తమిళనాడులోని దుండిగల్ వెళ్లనుంది ఓ సిట్ అధికారుల బృందం.. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడిసరుకులను పరిశీలించడంతో పాటు.. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించనుంది.. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది.. ఇలా మొత్తంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం వేగం పెంచింది..
హిందుత్వంపై పవన్ కల్యాణ్ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు.. ఇక, ఈ తరుణంలో ఆయన తిరుమలలో జరగుతోన్న వ్యవహారంపై అంతా నోరువిప్పాలని పిలుపునిచ్చారు.. మరోవైపు. తాజాగా ఆధ్యాత్మికత.. హిందుత్వంపై సోషల మీడియా వేదికగా.. ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పోస్టు పెట్టారు.. దేవాలయాలు, సైన్స్ మధ్య ఉన్న బంధాన్ని భారత దేశ చరిత్ర, దేశ సంస్కృతుల్లో కనపడుతూనే ఉంటాయన్న ఆయన.. ఆలయాలకు.. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధం స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు.. వివిధ ప్రదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనల్ని అనుసంధానం చేస్తుందన్నారు.. దేవాలయాలు.. వాటి గోడలలో కూడా తరతరాలుగా జ్ఞానం నిక్షిప్తమై ఉందన్నారు.. సంస్కృతి, విజ్ఞానానికి కేంద్రాలుగా దేవాలయాలు భాసిల్లేవనే గుర్తుచేశారు.. దేవాలయాలు సైన్స్, ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేసేవి.. అంతరాలను తగ్గించేవి అంటూ తన ట్విట్టర్ హ్యాడిల్‌లో ఓ వీడియోను షేర్ చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం.. కొత్త ఫ్యూచర్ సిటీకి ఏర్పాటు
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకు మెట్రో సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో కొత్త కారిడార్లను చేపడుతోంది. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్ల పొడవునా రెండు దశల్లో మెట్రోను నిర్మించనున్నారు. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ మెట్రో రైలు పనులు చేపట్టనున్నారు. రెండవ దశలో, కొత్త ఫ్యూచర్ సీటీ కోసం మెట్రో ఏర్పాటు చేయబడుతుంది. విమానాశ్రయం నుండి స్కిల్ యూనివర్సిటీకి 40 కి.మీ. మేర మెట్రో లైన్ నిర్మిస్తారు. మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌లను ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం మెట్రో అలైన్‌మెంట్ మార్చబడింది. ఆరాంఘర్-బెంగళూరు హైవేపై కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రోను ఖరారు చేశారు. నాగోల్ – శంషాబాద్ విమానాశ్రయానికి 36.6 కి.మీ మార్గాన్ని ఆయన ఆమోదించారు. విమానాశ్రయ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో భూగర్భంలోకి వెళ్లనుంది. రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో నాలుగో నగరానికి మెట్రో ఏర్పాటు కానుంది. మెట్రో రెండో దశ డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం త్వరలో పంపనున్నారు. మొదటి దశలో 3 కారిడార్లలో 69 కి.మీ. మేరా మెట్రో నడుస్తుంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కి.మీ. మేరా మెట్రో ప్రయాణం చేస్తుంది. రెండో దశ పూర్తయితే 9 కారిడార్లలో మొత్తం 185 కి.మీ. మెట్రో పరుగులు పెడుతుంది.
కోల్‌కతా డాక్టర్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రచురించిన కారణాల జాబితా ప్రకారం, భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు విచారించనుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అభ్యర్థనపై బెంచ్ గత వారం సెప్టెంబర్ 27న జరగాల్సిన విచారణను వాయిదా వేసింది. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. రాత్రి వేళల్లో మహిళా వైద్యులను నియమించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై గతంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీని తరువాత, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అటువంటి షరతు విధించబడదని, ఇది ప్రాథమిక రాజ్యాంగ సూత్రమైన లింగ సమానత్వానికి విరుద్ధమని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. విచారణ సందర్భంగా అత్యాచారం, హత్య ఘటనలో ‘పూర్తి నిజం’, ‘కొత్త నిజం’ వెలికితీయడమే సీబీఐ దర్యాప్తు లక్ష్యం అని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ తాజా స్టేటస్ రిపోర్టు తర్వాత, సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, ‘సీబీఐ ఏమి చేస్తుందో ఈరోజు వెల్లడి చేయడం దర్యాప్తు దిశను ప్రభావితం చేస్తుంది. సీబీఐ తదుపరి దర్యాప్తు మొత్తం నిజం, కొత్త వాస్తవాలను వెలికితీసే లక్ష్యంతో ఉంది.’ అని పేర్కొంది. ప్రధాన నిందితుడితో పాటు ఎస్‌హెచ్‌ఓని కూడా అరెస్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి.
నేడు ఫ్రాన్స్‌కు అజిత్ దోవల్.. రాఫెల్ డీల్ ప్రధాన అజెండా!
సోమవారం నుంచి రెండు రోజులపాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అక్కడి కీలక అధికారులతో ఆయన భేటీలో రాఫెల్ డీల్ ప్రధాన అజెండాగా ఉంటుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన చర్చల్లో రాఫెల్ డీల్‌కు సంబంధించిన తుది వివరణాత్మక ప్రతిపాదనను ఫ్రాన్స్ సమర్పించిన వెంటనే ఈ సమావేశం జరుగుతుందని వారు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి చర్చలను ముగించి, ఒప్పందాన్ని పూర్తి చేయాలని భారత్ వైపు ఆసక్తిగా ఉంది. ఒప్పందం కుదిరితే, డస్సాల్ట్ ఏవియేషన్‌కు చెందిన రాఫెల్ మెరైన్ జెట్‌లు ప్రస్తుతం మోహరించిన మిగ్-29లను భర్తీ చేస్తాయి. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఈ సంస్థ నుంచి గతంలో 36 యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు నావికాదళానికి కూడా ఈ యుద్ధవిమానాలను సమకూర్చాలనే ఆలోచనతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ 26 విమానాలను తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్‌ను కోరింది రక్షణ శాఖ. సేకరణలో 22 సింగిల్-సీట్ రాఫెల్ మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్, నాలుగు ట్విన్-సీటర్ ట్రైనర్ వెర్షన్‌లు ఉన్నాయి. భారత నావికాదళం విమానాలు, జలాంతర్గాముల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో, దాని అవసరాలను తీర్చవలసిన ఆవశ్యకత నేపథ్యంలో కొనుగోలు చర్చలు జరుగుతున్నాయి.
భారీ వరదలు.. 170 మంది మృతి, 42 మంది గల్లంతు
నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, అలాగే కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు 42 మంది గల్లంతైనట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వరదల కారణంగా 111 మంది గాయపడ్డారని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరేల్ తెలిపారు. తూర్పు, మధ్య నేపాల్‌లోని చాలా ప్రాంతాలు శుక్రవారం నుంచి మునిగిపోయాయని, దేశంలోని అనేక ప్రాంతాలలో ఆకస్మిక వరదలు వచ్చినట్లు నివేదికలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అన్ని భద్రతా సంస్థల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని రిషిరామ్ పోఖరేల్ చెప్పారు. నేపాల్ ఆర్మీ దేశవ్యాప్తంగా 162 మందిని విమానంలో రప్పించింది. వరదల కారణంగా ప్రభావితమైన 4,000 మందిని నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు ఫోర్స్ సిబ్బంది రక్షించారని పోఖరేల్ చెప్పారు. రక్షించబడిన వారికి ఆహార పదార్థాలతో పాటు అవసరమైన అన్ని సహాయ సామగ్రిని అందించినట్లు అధికారులు తెలిపారు. ఖాట్మండు శివార్లలోని బల్ఖు ప్రాంతంలో సామాజిక కార్యకర్తల సహాయంతో 400 మందికి ఆహారం పంపిణీ చేసినట్లు ప్రతినిధి తెలిపారు.
వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (52; 40 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. యస్తిక భాటియా (24), స్మృతి మందాన (14) రన్స్ చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులకే పరిమితమైంది. చీనిల్ హెన్రీ (59; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసింది. అఫీ ఫ్లెచర్ (21), షెమైన్ కాంప్బెల్లే (20) రన్స్ చేశారు. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత జట్టులో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత జట్టు మంగళవారం రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళలతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మహిళలు తలపడనున్నారు. అక్టోబర్ 4న భారత్ తన ప్రయాణం మొదలెట్టనుంది.
ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడగలిగా.. రోహిత్ శర్మ ఘాటు వ్యాఖ్యలు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆటతో పాటుగా ఫిట్‌నెస్ పరంగానూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. లావుగా ఉన్నాడని, పొట్ట వచ్చేసిందని.. చాలాసార్లు రోహిత్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వడా పావ్, సాంబార్ అంటూ తరచూ ట్రోల్స్‌కి గురవుతుండేవాడు. తాజాగా ఈ విమర్శలపై రోహిత్ ఘాటుగా స్పందించాడు. తాను 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయికి చేరువలో ఉన్నానని, ఫిట్‌నెస్ లేకుండానే ఇన్ని మ్యాచ్‌లు ఎలా ఆడగలిగా అంటూ ప్రశ్నించాడు. ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో జితేంద్ర చౌక్సేతో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ’17 ఏళ్ల పాటు క్రికెట్ ఆడుతున్నా. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లకు చేరువ కావడం చిన్న విషయం కాదు. చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే ఈ మైలురాయి అందుకున్నారు. సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే.. జీవన శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. ఫిట్‌నెస్ చూసుకోవడం, మెదడును నియంత్రణలో ఉంచుకోవడం.. ఇలా చాలా విషయాలు ఉంటాయి. మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యామనేది అన్నింటిలోకెల్లా ముఖ్యమైంది. మ్యాచ్ కోసం 100 శాతం సిద్ధంగా ఉండి విజయం సాధించేందుకే కృషి చేయాలి. వీటి వెనకాల ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కీలక పాత్ర పోషిస్తుంది’ అని అన్నాడు.
నెట్ ఫ్లిక్స్ లో సరిపోదా శనివారం తాండవం..!
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయల కాంబోలో వచ్చిన ద్వితీయ చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. అటు ఓవర్సీస్ లో నార్త్ అమెరికాలో నాని కెరియర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ $2.05 మిలియన్ రాబట్టిన సినిమాగా నిలిచింది సరిపోదా శనివారం. సరికొత్త కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో నాని, SJ సూర్యల అద్భుత నటన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గతంలో నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ నిరాశపరిచినా ‘సరిపోదా శనివారం’ తో ఆ బాకీ తీర్చేసాడు. కాగా ఇటీవల ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన సరిపోదా శనివారం ఓటీటీ లో అదరగొడుతూ మిలియన్ వ్యూస్ రాబడుతోంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో నంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ విషయమై సంతోషాన్ని పంచుకుంటూ నాని తన అఫిషియల్ X ఖాతాలో పోస్టర్ ను షేర్ చేసారు. కాగా సరిపోదా శనివారంకు కూడా నేచురల్ స్టార్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకుంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దేవర గ్రాండ్ సక్సెస్ మీట్… ఎప్పుడంటే..?
దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను రూ. 243 కోట్లు రాబట్టి ప్రీరిలీజ్ బిజినెస్ లో ఆల్మోస్ట్ 70 % రికవరీ సాదించేసాడు దేవర. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండడంతో దేవరకు భారీ ఓపెనింగ్స్ దక్కిచుకున్నాడు. హై ఇచ్చే ఎలివేషన్స్ లేవని ఫ్యాన్స్ కంప్లయింట్ చేసిన సాధారణ ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది దేవర. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ సక్సెస్ మీట్ జరపాలని ఆలోచిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నోవాటెల్ లో చేసినప్పుడు రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవరకు ముందు యూనిట్ కనీసం ప్రెస్ మీట్ నిర్వహించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కు కనీసం ఈవెంట్ కూడా నిర్వహిచకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ ఆవేదన చెందారు. కాగా దేవర బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టనుండడంతో భారీ సక్సెస్ మీట్ నిర్వహించాలని నిర్మాతలతో పాటు దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్లు నాగవంశీ, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ను అక్టోబరు 2న నిర్వహించాలని ఆలోచన చేయగా మరలా ఆ రోజు కాదని మరో రోజు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై యూనిట్ తర్జన భర్జన పడుతుంది.ఏపీ లో పెట్టాలని లేదు అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో చేయాలని ఆలోచిస్తున్నారు.