పోలీస్ కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణ.. పూర్తి వివరాలివే..!
పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడం జరిగింది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దేందుకు పలు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్(CURE), ప్యూర్(PURE), రేర్(RARE) అని మూడు భాగాలుగా విభజించి, ప్రతీ ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహం, ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసింది. ఈ వ్యూహం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించారు. ఇదే విధంగా ఇతర శాఖలను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్ పరిసరాల్లో BEST బస్సు రివర్స్ తీస్తున్న సమయంలో అదుపు తప్పి పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే ముంబై అగ్నిమాపక శాఖ, పోలీసులు, BEST సిబ్బంది, 108 అంబులెన్స్‌లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు, ఉద్యోగాలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వారు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రజలను అదుపులోకి తీసుకురావడంలో పోలీసులకు శ్రమించాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్‌లో విషాదం.. మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధినేత్రి ఖలీదా జియా (80) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుది శ్వాస విడిచారు. ఖలీదా జియా బంగ్లాదేశ్‌లో రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు. భర్త జియావుర్ రెహమాన్ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, జైలు శిక్ష అనుభవించినా ప్రజాస్వామ్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. 17 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత 2024లో జైలు నుంచి విడుదలయ్యారు. ఖలీదా జియా 1945లో దినాజ్‌పూర్ జిల్లాలోని జల్పైగురిలో జన్మించారు. (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్). ఐదుగురు సంతానంలో ఖలీదా జియా మూడో సంతానం. తండ్రి ఇస్కందర్ అలీ, తల్లి తైయాబా మజుందర్. 1947లో భారతదేశ విభజన తర్వాత దినాజ్‌పూర్ (బంగ్లాదేశ్)కు వెళ్లిపోయారు. 1960లో పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా ఉన్న జియాపూర్ రెహమాన్‌ను వివాహం చేసుకుంది. భర్త మొదటి పేరును ఇంటిపేరుగా ఖలీదా జియాగా మార్చుకుంది. 1965లో భర్తతో కలిసి ఉండటానికి పాకిస్థాన్‌కు వెళ్లింది. 1969లో తూర్పు పాకిస్థాన్‌కు మారారు. భర్త పోస్టింగ్ కారణంగా కుటుంబం చిట్టగాంగ్‌కు మారింది. ఖలీదా జియా మొదటి కుమారుడు తారిఖ్ రెహమాన్ 1967లో జన్మించారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. రెండో కుమారుడు అరాఫత్ రెహమాన్ 1969లో జన్మించాడు. 2015లో గుండెపోటుతో జన్మించాడు.
ముక్కోటి ఏకాదశి రోజునే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..?
శ్రీ మహా విష్ణువు వైకుంఠ ఏకాదశి రోజు మూడు కోట్ల దేవతలకు, భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తాడు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ రోజు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు విశేషంగా కొనసాగుతాయి. తిరుమలలో శ్రీనివాసుడి ఆలయం, శ్రీరంగంలో రంగనాథుని ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామాలయంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో ఇస్తున్నారు. ఈ దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు పోటెత్తుతారు. అసలు ఉత్తర ద్వార దర్శనానికి ఎందుకంత పవిత్రమైన రోజు? ఏడాదిలో ఒక్క ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? వంటి అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం.. అయితే, ‘ముర’ అనే రాక్షసుడు వరగర్వంతో దేవతలను ఇబ్బంది పెడుతుండగా దేవతలు శ్రీ మహా విష్ణువుని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి యుద్ధానికి వస్తున్నాడని తెలిసి ముర సముద్రంలోకి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు విష్ణువు మురను వెతుక్కుంటూ వెళ్లి అలిసిపోయి ఒక గుహలో పడుకుంటాడు. ఇంతలో ముర ఆ గుహలోకి వెళ్లిన.. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక శక్తి వచ్చి మురను హతమారుస్తుంది. ఆ చర్యకు సంతోషించిన విష్ణువు తన శరీరం నుంచి వచ్చిన ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి ఆమెను ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఏకాదశి మురను చంపిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టమని శ్రీనివాసుడిని కోరుతుంది. దానికి స్వామి తథాస్తు అని, వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని వరం ప్రసాదిస్తాడు.
Zepto, Blinkit, Flipkartలకు షాక్.. సమ్మె చేయనున్న గిగ్ వర్కర్స్..!
ఇంట్లో పాలు లేవా? రేషన్ అయిపోయిందా?.. కేవలం 10 నిమిషాల్లో ఆన్‌లైన్‌లో తెప్పించుకుందాం.. ఇలాంటి మాటలు ఈ రోజుల్లో సాధారణమైపోయాయి. కానీ, ఈసారి డిసెంబర్ 31న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. నూతన సంవత్సరానికి ఒక రోజు ముందు గిగ్ వర్కర్స్, ముఖ్యంగా క్విక్ ఈ-కామర్స్ అండ్ ఫుడ్ డెలివరీ కంపెనీల డెలివరీ బాయ్స్ భారీ సమ్మెకు పిలుపునిచ్చారు. దీని ప్రభావంతో 8 నుండి 10 నిమిషాల్లో సరుకులు అందే సేవలు తీవ్రంగా అంతరాయం కలిగే అవకాశం ఉంది. డిసెంబర్ 31 అనేది ఆన్‌లైన్ ఆర్డర్లకు పీక్ డే. పార్టీలు, సెలబ్రేషన్ల కోసం ఆహారం, కిరాణా, పానీయాలు భారీగా ఆర్డర్ అవుతాయి. ఇలాంటి కీలక రోజునే గిగ్ వర్కర్స్ సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ సమ్మెలో జెప్టో, బ్లింక్ఇట్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌ల డెలివరీ బాయ్స్ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. గిగ్ వర్కర్స్ అంటే శాశ్వత ఉద్యోగం కాకుండా కాంట్రాక్ట్ లేదా ఫ్రీలాన్స్ విధానంలో పనిచేసే కార్మికులు. వీరిలో చాలామంది తక్కువ జీతాలు, భద్రత లేని పని పరిస్థితులు, అధిక పని గంటలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే డిమాండ్లతో డిసెంబర్ 25న కూడా గిగ్ వర్కర్స్ సమ్మె చేశారు. ఇప్పుడు మళ్లీ డిసెంబర్ 31ను ఎంచుకోవడంతో ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ సేవలపై పెద్ద ఎత్తున ప్రభావం పడనుంది.
కొత్త ఏడాదిలో ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు, డీఏ ఎంత పెరుగుతాయంటే..?
2025 సంవత్సరం ముగియబోతోంది.. కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కానుంది.. దీంతో, జనవరి 1, 2026 నుండి ఎనిమిదవ వేతన సంఘం వివిధ నియమాల మార్పులతో అమలు చేసే అవకాశం ఉంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు తర్వాత వారి జీతాలు ఎంత పెరుగుతాయో, వారి కరువు భత్యం (DA)లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో.. పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఎప్పుడు చెల్లించబడతాయో.. తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఉన్నారు. అయితే, దీనిపై నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గణనీయమైన మార్పులను తీసుకురానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం సంవత్సరం చివరి రోజు, డిసెంబర్ 31, 2025న ముగుస్తుంది మరియు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 8వ వేతన సంఘం జనవరి 1, 2026న అమలు చేయబడుతుంది. అధికారిక సిఫార్సులు ఇంకా ఎదురుచూస్తున్నప్పటికీ, దాని గురించి చర్చలు విస్తృతంగా ఉన్నాయి. అయితే, తుది నివేదిక విడుదలయ్యే వరకు ఈ గణాంకాలు అంచనాలు మాత్రమే అని గుర్తించుకోవాలి.. 8వ వేతన సంఘం అమలు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితమైన జీతం పెరుగుదల అనేక ఆర్థిక మరియు ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు కర్మ మేనేజ్‌మెంట్ గ్లోబల్ కన్సల్టింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రతీక్.. అంచనాలు సాధారణంగా గత ధోరణులు మరియు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల ద్వారా ప్రభావితమవుతాయని.. 6వ వేతన సంఘం సగటు జీతంలో దాదాపు 40 శాతం పెరుగుదలకు దారితీసిందని, 7వ వేతన సంఘం 23-25 శాతం పెరుగుదలకు దారితీసిందని పేర్కొన్నారు. ఇక, 8వ వేతన సంఘం అమలు తర్వాత, జీతంలో 20 శాతం నుండి 35 శాతం పెరుగుదల ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. అయితే, ఇది జీతం గణనలలో కీలక పాత్ర పోషిస్తున్న ఫిట్‌మెంట్ కారకంపై ఆధారపడి ఉంటుంది.. ఇది 2.4 నుండి 3.0 వరకు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.
కన్నడ టీవీ నటి నందిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
బెంగళూరులో కన్నడ టీవీ నటి నందిని సీఎం (26) ఆత్మహత్య చేసుకుంది. కెంగేరిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో నందిని సీఎం బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. కెంగేరి పోలీసులు BNSS చట్టం, 2023లోని సెక్షన్ 194 కింద అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 28, 2025 రాత్రి 11:16 గంటల నుంచి డిసెంబర్ 29, 2025 అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కెంగేరిలోని పీజీ హాస్టల్‌లోని రెండవ అంతస్తులో ఆత్మహత్య చేసుకుంది. ఎఫ్ఐఆర్ ప్రకారం… నందిని 2018లో బళ్లారిలో పీయూసీ విద్యను పూర్తి చేసింది. తర్వాత హెసరఘట్టలోని ఆర్ఆర్ ఇన్స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ కోర్సులో చేరింది. అయితే నటనపై ఆసక్తి ఉండడంతో రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లడం మానేసింది. రాజరాజేశ్వరి నగర్‌లో నటనపై శిక్షణ పొందింది. 2019 నుంచి అనేక కన్నడ టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. ఆగస్టు 2025లో బెంగళూరులోని కెంగేరిలో పీజీ వసతి గృహానికి మారింది. 2023లో తండ్రి మరణం తర్వాత నందినికి కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ.. నటనపై ఆసక్తి ఉండడంతో ఉద్యోగాన్ని వదులుకుంది. దీంతో కుటుంబంలో విభేదాలు కూడా తలెత్తాయి.
తెలుగు సినిమాకు ఎప్పుడు రుణపడి ఉంటా..
బుల్లితెర మీద చిన్న చిన్న సీరియల్స్ తీసి.. అలా అలా బాలీవుడ్ పలు చిత్రాలో సైడ్ క్యారెక్టర్‌లు చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది మృణాల్ ఠాకూర్. ప్రజంట్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో సమానంగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తెలుగులో ‘సీతారామం’ సినిమాలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా ఆమె కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’తో తెలుగులో మరోసారి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. మూడో సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, మృణాల్‌పై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ మృణాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నిజానికి తాను ఎప్పుడూ దక్షిణాది సినిమాల్లో నటిస్తానని అనుకోలేదని, అది తన జీవితంలో అనుకోకుండా దొరికిన అదృష్టమని చెప్పింది. ‘సీతారామం’ తర్వాత బాలీవుడ్‌లో తనను చూసే చూపే మారిపోయిందని, అందుకే తెలుగు సినిమాకు ఎప్పుడు రుణపడి ఉంటానని మృణాల్ తెలిపింది. ఇక త్వరలో ‘డెకాయిట్’ సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక స్వీట్ షాక్‌లా ఉంటుందని, తన పాత్ర పూర్తిగా కొత్తగా, ఊహించని విధంగా ఉంటుందని మృణాల్ ధీమాగా వ్యాక్తం చేస్తోంది.
