నేడు ‘సేనతో సేనాని’ సభ.. పవన్ కల్యాణ్ ప్రసంగంపై ఆసక్తి..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఓవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. విశాఖ వేదికగా ‘సేనతో సేనాని’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. రెండురోజుల పాటు సాగిన ఈ సమావేశాలు.. ఇవాళ బహరంగసభతో ముగియనున్నాయి.. సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యా్ణ్ ప్రసంగించనున్నారు.. సభ వేదికకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేసింది జనసేన.. పార్టీ భవిష్యత్తు, కూటమి నేతల మధ్య సఖ్యత, సుపరిపాలన వంటి అంశాలపై పవన్ ప్రసంగం కొనసాగనుండగా.. కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యా్ణ్.. ప్రసంగంలో తన దూకుడు చూపిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది..
కుప్పానికి కృష్ణాజలాలు.. జల హారతి ఇవ్వనున్న సీఎం
కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగుపెట్టింది. హంద్రీ – నీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ గుండా కృష్ణా జిల్లాలు కుప్పంలో అడుగుపెట్టాయి. పరమ సముద్రం అనే గ్రామం వద్ద నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పంకు వెళ్లి పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు హారతులు పట్టి స్వాగతం పలకనున్నారు. తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇప్పటికే కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఈ రోజు ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.. కుప్పం బ్రాంచి కాల్వలో కృష్ణాజలాలు బిరబిరా ప్రవహిస్తున్నాయి. హంద్రీనీవా కాల్వకు కొత్త కళ తెచ్చింది. శాంతిపురం మండలంలోని పరమసముద్రం చెరువు కృష్ణాజలాలతో తొణికసలాడుతోంది. కృష్ణా జలాలకు హారతి, సారె సమర్పించడానికి రెండు రోజుల పర్యటన కోసం సీఎం చంద్రబాబు సతీసమేతంగా కుప్పం చేరుకున్నారు.. నేడు పరమసముద్రం చెరువు వద్ద జలహారతి ఇస్తారు. ఈ చెరువు నుంచి కుప్పం, పలమనేరులోని 110 చెరువులను అనుసంధానం చేయడానికి మార్గం ఏర్పడిందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామం సమీపంలో కాల్వ వద్ద ప్రత్యేకంగా ఘాట్ ఏర్పాటుచేశారు. దీనికి దగ్గరలోనే 18 అడుగుల చిరస్మరణీయ జ్ఞాపకంగా పైలాన్ నిర్మించారు. కాల్వలో నీటి లోతు పరిశీలించడం, పరిసర ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాయలసీమ వరప్రసాదినిగా భావించే హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వకు నంద్యాల సమీపంలోని మల్యాల ఎత్తిపోతల వద్ద జులై 17న కృష్ణా జలాలను విడుదల చేశారు. ఆగస్టు 23న కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలం వరికుప్పం వద్దకు కృష్ణాజలాలు చేరాయి. చివరి మజిలీగా పరమసముద్రంలోకి 25వ తేదీ చేరాయి. ప్రస్తుతం ఈ చెరువులు కృష్ణా జలాలతో కళకళలాడుతున్నాయి. సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చే సమయానికి హంద్రీనీవా కాల్వ వెంబడి నియోజకవర్గంలోని 25 ప్రదేశాల్లో రైతులతో పూజలు చేయించడానికి కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ఈ ఏడాది రూ.3,850 కోట్లు వెచ్చించి కృష్ణాజలాలను కుప్పం నియోజకవర్గానికి తెచ్చేందుకు వెచ్చించారు. 110 చెరువులను అనుసంధానం చేసి, 6,400 ఎకరాల ఆయకట్టుకు, నాలుగు మండలాల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి (ఆగస్టు 30) ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 3 రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. తెలంగాణ క్యాబినెట్ ఇటీవలే ఈ రిపోర్టును ఆమోదించింది. పూర్తి స్థాయిలో రూపొందించబడిన రిపోర్టు మొత్తం 600 పేజీలకు పైగా ఉంది. అసెంబ్లీ సభ్యులకు ఈ రిపోర్టును అందజేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను సవివరంగా తెలుసుకొని, తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు నిర్వహించడం లక్ష్యంగా ఉంది. చర్చల అనంతరం, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రభుత్వానికి ముందుకు ఎలా అడుగులు వేయాలో నిర్ణయించుకోవడం జరుగనుంది. ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డికి మండలిలో సంతాపం ప్రకటించి తొలిరోజు సభను వాయిదా వేయనున్నారు. ఆ తరువాత బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో సమావేశాల అజెండా, సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ పండగ ఉండడం, ఆ తరువాత శనివారం నిమజ్జనం ఉండటంతో పోలీస్ బందోబస్తు, ఇతర ఏర్పాట్ల నేపథ్యంలో గురువారం వరకే సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు
జమ్మూకాశ్మీర్‌ను వరదలు విడిచిపెట్టడం లేదు. కనీసం తేరుకోకముందే దెబ్బ మీద దెబ్బతో క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలను బెంబేలెత్తించేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు.. వరదలతో తిండి తిప్పలు లేక అల్లాడిపోతుంటే.. వరుస క్లౌడ్ బరస్ట్‌లతో ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. తాజాగా శనివారం కూడా మరో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. రాంబాన్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఏడుగురు చనిపోగా.. పలువురు గల్లంతైనట్లుగా సమాచారం. ఇక ఇళ్లులు ధ్వంసమయ్యాయి. ఇక జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్మీ సాయంతో సహాయ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ట్రంప్కి షాక్.. ఆ సుంకాలు చట్ట విరుద్ధమని కోర్టు ఫైర్
సుంకాల విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. ట్రంప్ విధించిన టారిఫ్‌లు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు వెలువరించింది. యూఎస్ అధ్యక్షుడు తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి ఎక్కువ సుంకాలను పెంచినట్లు చెప్పుకొచ్చింది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు ఇచ్చింది. భారీగా విధించిన పన్నులు పలు దేశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి జడ్జిలు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అప్పీల్ల కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాటం చేయనున్నారు.
జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించిన మోడీ
ప్రధాని మోడీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం జపాన్ చేరుకున్నారు. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తలతో సమావేశం అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఇక పర్యటనలో భాగంగా శనివారం జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి మోడీ బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. రైల్లోంచి కొత్త ఆల్ఫా-ఎక్స్ రైలును కిటికీ నుంచి గమనించారు. ఇక రైలు గురించి జేఆర్ ఈస్ట్ ఛైర్మన్ వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇషిబా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సెండాయ్‌లోని తోహోకు షింకన్‌సెన్ ప్లాంట్‌ను కూడా మోడీ పరిశీలించనున్నారు. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ‘బుల్లెట్ ట్రైన్’ ప్రాజెక్ట్ కోసం 2030లో ఇండియాకు తరలించనున్న E-10 కోచ్‌లను పరిశీలించనున్నారు. అనంతరం ఒక ఒప్పందంపై సంతకం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
పోర్నోగ్రఫీ వెబ్‌సైట్‌లో ప్రముఖ మహిళల మార్ఫింగ్ ఫోటోలు.. ఇటలీ ప్రధాని ఫైర్
ఇటలీ దేశంలో మార్ఫింగ్ ఫోటోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మార్ఫింగ్ ఫోటోల్లో ఇటలీ ప్రధాన మంత్రి మెలోని సోదరి అరియానాతో పాటు ప్రతిపక్ష నాయకురాలు ఎల్లీ ష్లీన్, ఇన్‌ఫ్లుయెన్సర్ చియారా ఫెర్రాగ్ని, ఈయూ చట్టసభ్యురాలు అలెశాండ్రా మోరెట్టి లాంటి ప్రముఖ మహిళల ఫోటోలు ‘ఫికా’ అనే పోర్నోగ్రఫీ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. ఈ మార్ఫింగ్ చేసిన ఫోటోల్లో మహిళల శరీర భాగాలతో పాటు సంభోగం చేస్తున్న వీడియోలను రూపొందించారు. ఈ విషయంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా మండిపడింది. ఈ మార్ఫింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో హాట్ బ్యూటీ కన్ఫర్మా..!
తెలుగులో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయికల్లో నేహా శెట్టి ఒకరు. ఆకాశ్ పూరి హీరోగా వచ్చిన ‘మెహబూబా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, డీజే టిల్లులో ‘రాధిక’ పాత్రతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. ఆ రాధిక క్యారెక్టర్ ఆమెకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు, నేహా మరో పెద్ద అవకాశాన్ని అందుకుంది. తాజాగా జరిగిన ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న నేహా.. తాను పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘OG’లో భాగం అయినట్లుగా అధికారికంగా ధృవీకరించింది. పవన్‌తో కలిసి ఒక సర్‌ప్రైజ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నానని ఆమె చెప్పింది. అయితే అది స్పెషల్ సాంగ్ లోనా? లేక సినిమాలో చిన్న కానీ క్రేజీ రోల్ లోనా? అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ ఏదైనా అభిమానులకు మస్త్ సర్‌ప్రైజ్ అవుతుందని హింట్ ఇచ్చింది. ఇకపోతే, ఈ OG సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా, ఇది పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ లుక్, యాక్షన్ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద హడావిడి సృష్టించాయి. ఈ నేపథ్యంలో నేహా ఎంట్రీ సినిమాకు అదనపు హైలైట్ కానుందని ఫిలిం నగర్ టాక్. ఇక నేహా శెట్టికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్నందున, ఒక స్పెషల్ సాంగ్ అయినా, లేదా కేమియో రోల్ అయినా, ఆమె ప్రెజెన్స్ OGకి గ్లామర్ అడ్డ్ చేయబోతోంది. దీనికి ఉదాహరణగా, పూర్వం పవన్ నటించిన పంజాలోని “వెయ్యి రా చెయ్యి వెయ్యి రా” సాంగ్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అదే తరహా క్రేజ్ ఇప్పుడు నేహా సాంగ్‌కి కూడా వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది.
అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత
మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చుతూ అల్లు రామలింగయ్య గారి సతీమణి, అల్లు అరవింద్ మాతృమూర్తి, అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ (94) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో ఆమె చివరి శ్వాస విడిచారు. రాత్రి 1.45 గంటలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్లు కనకరత్నమ్మ గారి భౌతికకాయం ఉదయం 9 గంటలకు అల్లు అరవింద్ నివాసానికి తరలించనున్నారు. మధ్యాహ్నం అనంతరం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హైదరాబాదుకు చేరుకుంటున్నారు. రామ్ చరణ్ మైసూర్ నుంచి, అల్లు అర్జున్ (బన్నీ) ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకోనున్నారు. అంత్యక్రియలు ఏర్పాట్లను అల్లు అరవింద్, చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబు వైజాగ్‌లో జరుగుతున్న ఒక పబ్లిక్ మీటింగ్‌లో ఉన్నందున, వారు రేపటికి హైదరాబాదుకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలపనున్నారు. కాగా అల్లు కనకరత్నమ్మ గారి మృతి పట్ల సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
