NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తిరుమలలో పవన్‌ కల్యాణ్‌ దీక్ష విరమణ
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఇక, ఉదయం శ్రీవారిని దర్శించుకోని ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు పవన్‌ కల్యాణ్‌.. దర్శనాంతరం నేరుగా తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. అక్కడ అన్నప్రసాద సముదాయంలో అన్నప్రసాదాల తయారిని పరిశీలించనున్నారు.. అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాని స్వీకరించనున్నారు.. ఇక, లడ్డూ ప్రసాదం తయారు చేసే బూందీ పోటుని కూడా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పరిశీలించే అవకాశం ఉంది.. కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంగా మారిన నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం విదితమే.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఇప్పటికే ఆయన తిరుమల చేరుకున్నారు.. మంగళవారం రాత్రి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.. నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ ముందుకు సాగారు.. మొత్తంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు దీక్ష విరమించనున్నారు..

గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజీలో చీటింగ్‌.. దర్యాప్తు ముమ్మరం..
గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన చీటింగ్ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు… ఇప్పటికే ఈ వ్యవహారంలో కోల్డ్ స్టోరేజ్ కు చెందిన నాగిరెడ్డి, రామచంద్ర రావు, వెంకటేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగి.. కోల్డ్ స్టోరేజ్ రికార్డులను పరిశీలించారు… రైతులకు చెందిన కోట్ల రూపాయల విలువైన మిర్చిని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం అమ్మేసుకుందని, కొంత భాగం మిర్చిని బ్యాంకులో తనాక పెట్టిందని, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై అధికారులు చర్యలు ప్రారంభించారు… మరోవైపు రైతులకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు.. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్య నిర్వాకంతో, గుంటూరు, పల్నాడు, నంద్యాల వంటి ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే రామాంజనేయులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.. ఈ నేపథ్యంలో అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఆస్తులు జప్తు చేసి అయినా రైతులకు న్యాయం చేస్తామని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది..

వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతం.. అర్ధరాత్రి దాటినా కొనసాగిన ఆందోళన..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డకునేందుకు ప్రత్యక్ష ఆందోళనలు మొదలయ్యాయి. నిత్యం కార్మికులు, ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. గత శనివారం ఉన్నట్టుండి 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయాన్నే ప్లాంట్ వద్దకు కుటుంబ సభ్యులతో సహ చేరుకున్న కార్మికులు ఈడీ ఆఫీసును ముట్టడించారు. కొద్దిసేపు ఆ ప్రాంతం నిరసనలతో, నినాదాలతో దద్దరిల్లి పోయింది. అయినప్పటికీ ఈడీ ఆఫీసు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన కార్మికులు ఆఫీసు అద్దాలు ధ్వంసం చేశారు. అధికారులను బయటికి రాకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ వద్ద, ఈడీ ఆఫీసు వద్ద భారీగా పోలీసు, సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. కాంట్రాక్టు పీరియడ్ ఉన్నంత వరకైనా కార్మికులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఇలా అర్థాంతరంగా తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని పలు యూనియన్లు సంస్థను కోరాయి.

నేటి నుంచి పూల పండుగ.. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఇది ప్రకృతితో మమేకమైన పండుగ. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జానపద పాటలతో ఆడుతూ పాడుతు చేసుకునే గొప్ప పండు. తెలంగాణలోని ప్రతి గ్రామం రంగురంగుల పూలతో సుందరంగా మారుతోంది. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. రాష్ట్ర పండుగ అయిన ‘బతుకమ్మ’ ఉత్సవాలు జరుపుకునేందుకు తెలంగాణ ఆడపడుచులు సిద్దమయ్యారు. తెలంగాణలోని పల్లెల్లో బతుకమ్మ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తారు. పెళ్లైన ఆడవాళ్లు పుట్టింటికి వచ్చి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మను పేర్చేందుకు మగవాళ్లు పొలాలకు పోయి తంగేడు, మందారం, బంతి, సీతజడలు, తామరపూలతో పాటు ఇంకా ఎన్నో రకాల పూలను తీసుకొస్తే.. వాటితో ఆడవాళ్లు బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మకు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం పెడతారు. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, బెల్లం, పాలతో చేసినవి సమర్పిస్తారు. బతుకమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగ ఏటా ‘పెత్రమాస’కు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. దీన్ని పెత్తర అమావాస్య అని ఎందుకు అలా పిలుస్తారో తెలుసా? సాధారణంగా పూలను చేయి లేదా కత్తెరతో కట్ చేస్తాం. కానీ, కొందరు నోటితో కూడా తుంచి బతుకమ్మను తయారు చేస్తారు. ఆ విధంగా మొదటిరోజు చేసే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అని ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో పండుగకు పెద్దపీట వేసింది. వారి నుండి ఇది క్రమంగా రాష్ట్రం వెలుపల నుండి వచ్చే ప్రయాణికులలో ఆదరణ పొందుతోంది. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళల చేతుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఇక రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బియ్యం బతుకమ్మ, ఆరో రోజున అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదోరోజు బతుకమ్మ అని పిలుచుకుంటారు.

నేడే మహాలయ అమావాస్య! ఎందుకు జరుపుకుంటారు? నవరాత్రులకు సంబంధం ఏమిటి?
హిందూ మతంలో మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే., ఈ రోజున తల్లి దుర్గా కైలాస పర్వతానికి వీడ్కోలు పలికింది. అమ్మవారి ఆగమనాన్ని ‘మహాలయ’ అంటారు. ఇది దుర్గా పూజ పండుగ ప్రారంభానికి గుర్తుగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం 2024లో మహాలయ అమావాస్య ఎప్పుడు, దాని ప్రాముఖ్యత, తిథి, శుభ సమయం గురించి చూద్దాం. మహాలయ అమావాస్య 2 అక్టోబర్ 2024. హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాలయ అమావాస్య పితృ పక్షం (చివరి రోజు) ముగింపు. అలాగే శారదీయ నవరాత్రుల ప్రారంభానికి గుర్తుగా పరిగణించబడుతుంది. అమావాస్య అక్టోబర్ 01 రాత్రి 09.38 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 02 మధ్యాహ్నం 12.19 గంటలకు ముగుస్తుంది. మహాలయ అంటే దేవి యొక్క గొప్ప నివాసం. సర్వ పితృ అమావాస్య నాడు పూర్వీకుల శ్రాద్ధ కర్మలను ఆచరించిన తరువాత, పూర్వీకులు వారి లోకానికి తిరిగి వస్తారు. దీని తరువాత, శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి.

భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్‌లోని భారతీయులకు అడ్వైజరీ జారీ
పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధం అంచున నిలిచింది. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం కురిపించింది. నివేదికల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్‌పై 200 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్‌ దాడిపై అమెరికా అంతకుముందే అలర్ట్‌ చేసింది. ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారతదేశం ఒక అడ్వైజరీ జారీ చేసింది. ముందుజాగ్రత్తగా అక్కడ నివసిస్తున్న భారతీయులను సురక్షిత ప్రదేశాలలో ఉండాలని భారతదేశం కోరింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం టచ్‌లో ఉందని, యుద్ధ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని భారత్ తెలిపింది. భారత్‌ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో 32 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్ క్షిపణి దాడికి ముందు పౌరులందరూ బాంబు షెల్టర్లకు వెళ్లినట్లు సమాచారం. ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ను రక్షించడంలో, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కూల్చివేయడంలో సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ మిలిటరీని ఆదేశించారు. ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు గతంలో పేర్కొన్నారు. ఎలాంటి ప్రతీకార చర్యకైనా టెహ్రాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

టిమ్‌ సౌథీ షాకింగ్‌ డెసిషన్.. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు కెప్టెన్ ఎవరంటే?
న్యూజిలాండ్‌ కెప్టెన్ టిమ్‌ సౌథీ షాకింగ్‌ డెసిషన్ తీసుకున్నాడు. కివీస్ టెస్టు కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఘోర ఓటమిని చవిచూసిన నేపథ్యంలో సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారిస్తానని చెప్పాడు. 2022లో కేన్‌ విలియమ్సన్‌ నుంచి జట్టు పగ్గాలను అందుకొన్న సౌథీ.. న్యూజిలాండ్‌ జట్టుకు 14 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. సౌథీ కెప్టెన్సీలో కివీస్ 6 మ్యాచ్‌లు గెలవగా.. 6 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక టామ్ లాథమ్‌ మరోసారి టెస్టు కెప్టెన్‌ పగ్గాలు అందుకోనున్నాడు. తనకు కెప్టెన్సీ అవకాశం ఇచ్చిన న్యూజిలాండ్‌ మేనేజ్‌మెంట్‌కు టిమ్‌ సౌథీ ధన్యవాదాలు తెలిపాడు. ‘న్యూజిలాండ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు. జట్టు విజయం కోసం చాలా కృషి చేశా. జట్టే నా తొలి ప్రాధాన్యతగా భావించా. ఇక నుంచి నా వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టిసారిస్తా. కివీస్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తా. సహచరులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. యువ బౌలర్లను ఎప్పటిలానే ప్రోత్సహిస్తాను. టామ్‌ లాథమ్‌కు ఆల్‌ ది బెస్ట్. అతడు విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని 35 ఏళ్ల సౌథీ పేర్కొన్నాడు. అక్టోబర్‌ 16 నుంచి భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు లాథమ్‌ నాయకత్వం వహిస్తాడు.

100కు ఆలౌట్ అయినా పర్లేదనుకున్నాం: రోహిత్
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించేందుకు తాము చాలా రిస్క్ తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ చెప్పాడు. బ్యాటర్లు రిస్క్‌ తీసుకుని దూకుడుగా ఆడే క్రమంలో 100 పరుగులకు ఆలౌటైన ఫర్వాలేదనే మైండ్‌సెట్‌తో ఉన్నామని తెలిపాడు. పిచ్‌ పెద్దగా సహకరించకున్నా.. టీమిండియా బౌలర్లు గొప్పగా రాణించారని ప్రశంసించాడు. రెండో టెస్టు విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. డ్రా అవుతుందనుకున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్.. సంచలన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత్ దూకుడుగా ఆడటం వెనకున్న వ్యూహాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ‘మ్యాచ్‌లో ఎలా ముందుకెళ్లాలనే దాని గురించి చాలా ఆలోచించాం. గౌతమ్ గంభీర్, నేను కలిసి ఆడాం. అతడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆటను కోల్పోయాం. నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసి.. మా బ్యాటింగ్‌పై దృష్టిసారించాలనుకున్నాం. ప్రత్యర్థి జట్టు ఎన్ని పరుగులు చేస్తుందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. బంగ్లాను తక్కువ పరుగులకు కట్టడి చేసి.. వీలైనంత ఎక్కువ రన్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయాలని ప్లాన్‌ వేసుకున్నాం’ అని హిట్‌మ్యాన్ చెప్పాడు.

విశ్వంభర సినిమాకు అనుకోని కష్టాలు.. రిలీజ్ డౌటే..?
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ మెగాస్టార్ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. పిరిడికల్ బ్యాక్డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా తమిళ స్టార్‌ హీరోయిన్‌ త్రిష మరియు ఆషిక  రంగనాధ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి  సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ అవార్డ్ గ్రహీత MM. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని గతంలో ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చక చక చేస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు తర్జన భజనలు నడుస్తున్నాయి. సంక్రాంతికి చిరు తనయుడు నటిస్తున్న గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేసి సమ్మర్ కు విశ్వంభర రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. అందుకు కారణం ఈ సినిమా ఓటీటీ డీల్ ఇప్పటికి క్లోజ్ కాలేదని అందుకే రిలీజ్ పోస్ట్ పోన్ అనే వార్తలు వినిపించాయి. కానీ విశ్వంభర ఓటీటీ డీల్ అయినా కాకపోయినా సరే ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి డేట్ మాత్రం మిస్సయ్యే సమస్యే లేదని నిర్మాణ సంస్థ యువి ఫిలింస్ నుండి క్లారిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ను డిసెంబరు 25న రిలీజ్ చేయాలనే ఫిక్స్ అయ్యారు నిర్మాత దిల్ రాజు. విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు.

బాలయ్య సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయనున్న విజయ్..?
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయలల్లో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించాడు కూడా.విజయ్ సినీ కెరీర్ లో చివరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఖాకి, తునీవు వంటి సినిమాలు తెరకెక్కించిన H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ సినిమాగ రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించబోతున్నట్టు అధికారంగా ప్రకటించారు మేకర్స్. ఇప్పడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకెళితే తెలుగులో గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ దర్శకుడి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇటీవల సైమా, ఐఫా వంటి వేడుకల్లో ఉత్తమ చిత్రంగా అవార్డులు సైతం గెలుచుకుంది. అసలు విషయం ఏంటంటే ఇప్పడు ఈ సినిమాను H. వినోద్ దర్శకత్వంలో విజయ్ రీమేక్ చేయబోతున్నాడని కోలీవుడ్ కోడై కూస్తోంది. చివరి సినిమాగా హిట్ సినిమాతో సినీ కెరీర్ ముగించాలని అందుకే సేఫ్ గా రీమేక్ చిత్రం ఎంచుకున్నారని విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకేక్కిస్తారని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతుందోననేది నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందేమో చూడాలి. విజయ్ కు జోడిగా బాలీవుడ్ భామ పూజ హెగ్డే నటిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.