NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రహదారులపై ఫోకస్‌.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న రోడ్లపై ఫోకస్‌ పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల దుస్థితిపై చర్చించనున్నారు.. వర్షాకాలం రహదారులు మరింత దెబ్బతినే అవకాశం ఉన్నందున, ప్రజలు ఇబ్బంది పడకుండా.. ముందు గుంతలు పూడ్చేలా చర్యలకు ఆదేశించనున్నారు సీఎం.. అయితే, గత ఐదేళ్లు కాలంగా రహదారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. దాంతో.. రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయనే విమర్శలు లేకపోలేదు.. ఇక, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉందంటూ.. గతంలో.. టీడీపీ, జనసేన వివిధ సందర్భాల్లో ప్రత్యేక క్యాంపెయిన్‌లు కూడా నిర్వహించింది.. రోడ్లు దుస్థితిపై జనసేన సోషల్‌ మీడియా వేదికగా ఓ క్యాంపెయిన్‌ నిర్వహించిన విషయం విదితమే.. ఇప్పుడు రోడ్ల పరిస్థితిపై దృష్టిసారించారు సీఎం చంద్రబాబు.. ఈ రోజు జరిగే సమావేశంలో రహదారి మౌలిక వసతుల నిధితో విస్తరించాల్సిన రోడ్డు.. తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాకినాడ జిల్లాలో రెండోరోజు డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన..
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్‌.. తొలిరోజు పర్యటనను పెన్షన్ల పంపిణీతో ప్రారంభించారు.. నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం రెండో రోజు పర్యటన కొనసాగనుంది.. కాకినాడ కలెక్టరేట్ లో ఈ రోజు కీలక సమీక్షా సమావేశం నిర్వమించబోతున్నారు.. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూ ఎస్, అటవీశాఖ, పొల్యూషన్ అధికారులతో విడివిడిగా రివ్యూలు నిర్వహించనున్నారు పవన్‌ కల్యాణ్‌.. అయితే, ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులకు ఇప్పటికే కీలక సూచనలు చేశారు జిల్లా కలెక్టర్‌.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిర్వహించే సమావేశానికి పెండింగ్ ప్రాజెక్టులు, శాఖాపరమైన సమగ్ర సమాచారంతో రావాలని ఆదేశాలు ఇచ్చారు.. మరోవైపు.. సాయంత్రం గొల్లప్రోలులోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. నేడు నామినేషన్‌ వేయనున్న ఆ ఇద్దరు
ఆంధ్రప్రదేశ్‌.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు కూటమి నేతలు.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఈ కాంబినేషన్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది.. చెప్పినట్టుగానే ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ప్రయార్టీ ఇస్తున్నారు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జనసేన నుంచి అభ్యర్థి ఫైనల్ అవుతారని ఎవ్వరూ ఊహించ లేదంటున్నాయి కూటమి వర్గాలు. భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టుల్లోనూ జనసేన, బీజేపీలకు ప్రయార్టీ ఖాయమని సంకేతాలు ఇచ్చారు.. బలిజ – కాపు కాంబినేషన్‌తో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశారు.. అంతేకాదు.. కడపపై మరింత ఫోకస్ పెట్టింది టీడీపీ.. బలిజ సామాజిక వర్గం పెద్దగా గుర్తింపుఉన్న సీనియర్‌ లీడర్‌ సి రామచంద్రయ్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు చంద్రబాబు.. మరోవైపు.. గత కొన్నేళ్లుగా జనసేనలో కీలకంగా వ్యవహరిస్తోన్న కాపు సామాజిక వర్గానికి చెందిన హరి ప్రసాద్‌కు అవకాశం కల్పించారు.. దీంతో.. శాసన మండలిలోనూ జనసేనకు ప్రాతినిధ్యం లభించబోతోంది.. శాసన మండలిలో జనసేన తొలి సభ్యుడిగా హరి ప్రసాద్ అడుగుపెట్టబోతున్నారు. ఇక, నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు సి.రామచంద్రయ్య, హరిప్రసాద్‌.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ దాఖలకు నేడు చివరి రోజు కాగా.. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది.. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్.. అయితే, వారిలో సి.రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన తెలుగుదేశం. మరో స్థానo జనసేనకు కేటాయించింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ కు అవకాశం ఇచ్చారు.. శాసనసభలో కూటమికి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా.. సి.రామచంద్రయ్య, హరిప్రసాద్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌.. కేబినెట్ విస్తరణ పై క్లారిటీ వచ్చే ఛాన్స్..
అధిష్టానం పిలుపు మేరకు నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పయనం కానున్నట్లు సమచారం. ఇవాళ సాయంత్రానికి కేబినెట్ విస్తరణ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది. అధిష్టానం పిలుపు కోసం సీఎం, డిప్యూటీ వెయిటింగ్ లో వున్నట్లు తెలుస్తుంది. అధిష్టానం నుండి పిలుపు వస్తే ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత సీఎం..డిప్యూటీ ల ఢిల్లీ పర్యటన పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 4 న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని టాక్. ఆషాడం వస్తుండటంతో 4వ తేదీ లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంచనా. మార్పులు చేర్పులపై పార్టీలో చర్చ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీలో సీనియర్ నేత ఉత్తమ్ ఉన్నారు. అంతేకాకుండా.. పీసీసీ చీఫ్ పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ ఆశావహులు అంతా ఢిల్లీలోనే మకాం వేశారు. కాగా.. ఇవాళ ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ కి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అన్ని శాఖల సెక్రెటరీలతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. శాఖల పనితీరు.. ప్రభుత్వ లక్ష్యాలు లాంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు.

నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం అమలు..
భద్రాద్రి రామ మందిరంలో బ్రేక్ దర్శనం జరగనుంది. నేటి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9:30 వరకు, మళ్లీ రాత్రి 7 నుంచి 7:30 వరకు భక్తులకు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. విరామ దర్శన సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. ఆలయ కౌంటర్లు, ఆలయ వెబ్‌సైట్‌లో బ్రేక్ దర్శన టిక్కెట్‌లను విక్రయిస్తారు. బ్రేక్ దర్శనం టికెట్ ధర రూ. 200గా ఆలయ అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనం, ఇతర సేవలను నిలిపివేస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. అలాగే ప్రధాన ఆలయం, అన్నదాన సత్రం వద్ద 90 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ను ఈఓ ప్రారంభించారు. మరోవైపు దక్షిణ అయోధ్యగా మారుతున్న భద్రాచలం క్షేత్రంలో రామనారాయణపై దశాబ్ద కాలంగా వివాదం కొనసాగుతోంది. సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ చర్చ తెరపైకి వచ్చింది. భద్రాద్రిలో జరిగేది శ్రీరామ కల్యాణమా లేక లక్ష్మీనారాయణ కళ్యాణమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ దశాబ్దంలో చాలా సార్లు శ్రీరామ నవమికి ​​ముందు ఈ విషయం ప్రస్తావనకు వచ్చి ఆ తర్వాత మాయమైపోతుంది.

పుణెలో జికా వైరస్‌ కలకలం.. వెలుగులోకి ఆరు కేసులు.. రోగుల్లో ఇద్దరు గర్భిణులు
మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ విజృంభిస్తోంది. నగరంలో ఆరు ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉండడం విశేషం. పూణెలోని ఎరంద్‌వానే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల గర్భిణీ స్త్రీకి జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు కనుగొన్నట్లు ఆరోగ్య శాఖ అధికారుల తెలిపారు. మహిళ రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. ఇది కాకుండా మరో 12 వారాల గర్భిణికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వాస్తవానికి, గర్భిణీ స్త్రీలు జికా వైరస్ బారిన పడినట్లయితే, పిండంలో మైక్రోసెఫాలీ సంభవించవచ్చు. మెదడు అసాధారణంగా అభివృద్ధి చెందడం వల్ల తల చాలా చిన్నదిగా మారే పరిస్థితి ఇది. పూణేలో జికా వైరస్ సంక్రమణ మొదటి కేసు ఎరంద్‌వానే ప్రాంతంలోనే నమోదైంది, 46 ఏళ్ల వైద్యుడి నివేదిక పాజిటివ్ గా వచ్చింది. డాక్టర్ తర్వాత అతని 15 ఏళ్ల కుమార్తె నమూనా కూడా పాజిటివ్‌గా తేలింది. ఇది కాకుండా, ముండ్వా ప్రాంతంలో ఇద్దరు సోకిన వ్యక్తులు కనుగొనబడ్డారు, వారిలో ఒకరు 47 ఏళ్ల మహిళ, మరొకరు 22 ఏళ్ల వ్యక్తి. పూణె మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆరోగ్య విభాగం రోగులందరినీ పర్యవేక్షిస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుజాగ్రత్త చర్యగా దోమల బారిన పడకుండా ఫాగింగ్, ఫ్యూమిగేషన్ వంటి చర్యలు తీసుకుంటున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాదచారులను ఢీకొట్టిన కారు.. తొమ్మిది మంది మృతి
దక్షిణ కొరియాలో దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సెంట్రల్ సియోల్‌లోని ట్రాఫిక్ లైట్ వద్ద వేచి ఉన్న పాదచారులను కారు ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించారు.. నలుగురు గాయపడ్డారు. దక్షిణ కొరియా అత్యవసర అధికారులు తెలిపారు. పాదచారులను ఢీకొనే ముందు ప్యాసింజర్ కారు రాంగ్ సైడ్ వెళ్లి మరో రెండు కార్లను ఢీకొట్టిందని మీడియా నివేదికలు వెల్లడించాయి. కారు డ్రైవర్ (60)ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, సియోల్ పోలీసులు ఈ నివేదికలను వెంటనే ధృవీకరించలేదు. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అత్యవసర అధికారి కిమ్ చున్-సు బ్రీఫింగ్‌కు తెలిపారు. ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ తన భద్రతా మంత్రి, అత్యవసర ఏజెన్సీ చీఫ్‌ను బాధితులకు సహాయం చేయడానికి మెరుగైన ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సియోల్ పోలీసులు తెలిపారు. కారు రాంగ్‌ సైడ్‌లో వెళుతోందని, అప్పటికే రెండు వాహనాలను ఢీకొట్టి పాదచారులను తొక్కుకుంటూ వెళ్లిందని స్థానిక మీడియా పేర్కొంది.

‘గేమ్ ఛేంజర్’కు ఆ అవకాశం లేదు: శంకర్
మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, డైరెక్టర్ ఎస్ శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ చిత్రీకరణ తుది దశలో ఉంది. అయితే ఈ చిత్రం నుంచి అప్‌డేట్‌ వచ్చి చాలా రోజులవుతోంది. తాజాగా డైరెక్టర్ శంకర్‌ స్వయంగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. భారతీయుడు 2 ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో గేమ్ ఛేంజర్‌ గురించి శంకర్‌ మాట్లాడారు. ‘గేమ్ ఛేంజర్ చిత్రంకు సంబంధించి మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. భారతీయుడు 2 విడుదలైన వెంటనే షూటింగ్ మొదలెడతాం. గేమ్ ఛేంజర్, భారతీయుడు చిత్రాలకు అస్సలు పోలికే లేదు. భారతీయుడుకి పార్ట్ 3 కూడా ఉంటుంది. గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం రెండో భాగం ఉండదు. గేమ్ ఛేంజర్ స్టోరీకి స్కోప్ లేదు’ అని డైరెక్టర్ ఎస్ శంకర్‌ చెప్పారు. శంకర్‌ తీసిన రోబో, భారతీయుడు చిత్రాలకు సీక్వెల్ ఉన్నాయి. ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ చిత్రాలకు సమయం వచ్చినపుడు సీక్వెల్‌ తీస్తానని శంకర్‌ పేర్కొన్నారు.

మరోసారి సీమ యాస, ఆహార్యంతో సందడి చేయనున్న రష్మిక మందన్న!
కన్నడ సోయగం ‘రష్మిక మందన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో యిట్టే ఒదిగిపోతారు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్ర ఆమె కోసమే పుట్టుందేమో అనిపిస్తుంది. శ్రీవల్లి పాత్రలో అంతలా రష్మిక ఆకట్టుకున్నారు. సీమ యాస, ఆహార్యం ఆమెకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. పుష్ప-2లోనూ మళ్లీ ఆ పాత్రలోనే రష్మిక కనిపించనున్నారు. అయితే పుష్ప-2 తర్వాత మరోసారి సీమ యాస, ఆహార్యంతోనే నేషనల్ క్రష్ తెరపై సందడి చేయనున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా, రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా రష్మిక మందన్న దాదాపుగా ఖాయమైనట్టే. రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని అని తెలుస్తోంది. సీమ కథ, అందులోనూ పీరియాడిక్‌ నేపథ్యం కావడంతో… హీరోహీరోయిన్ల పాత్రలు కూడా ఆ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఉంటాయట. అంటే రష్మిక మరోసారి సీమ పాత్రలో ఒదిగిపోన్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. యానిమల్ హిట్ కావడంతో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్‌, కుబేర, సికందర్‌ తదితర చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. విజయ్‌ దేవరకొండతో కలిసి రష్మిక ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో ఇద్దరు నటించారు.

టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేశ్‌!
విక్టరీ వెంకటేశ్ కథానాయకుడుగా, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తాత్కాలికంగా ‘SVC 58’ అనే టైటిల్‌ను పెట్టారు. సోమవారం బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును స్వామి పాదాల వద్ద ఉంచి.. పూజలు చేశారు. ఆపై సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. SVC 58లో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో నాయిక పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. ‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో వెంకటేశ్‌ భార్యగా ఐశ్వర్య రాజేశ్‌, ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. జులై 3 నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. నవంబరులో పూర్తిచేసి.. 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం’ అని చెప్పారు. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్య తెలుగు సినిమా చేస్తున్నారు. కౌసల్య కృష్ణ మూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ సినిమాల్లో ఐశ్వర్య నటించారు.