ల్యాండ్ పూలింగ్‌కి భూములు.. రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఇటీవల ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం.. రాజధాని అమరావతి జోన్-8 ప్రాంతంలోని 4 గ్రామాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం టెండర్లు ఖరారు చేసింది.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్‌కు స్వచ్ఛందంగా భూములిచ్చిన గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భూములు ఇచ్చిన రైతులు, గ్రామాల ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు ప్రారంభించనుంది. జోన్-8లో 4 గ్రామాలకు భారీ నిధులు కేటాయించింది సర్కార్.. అమరావతి జోన్-8 పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. ఈ గ్రామాల లేఅవుట్‌లలో సమగ్ర మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.1,358 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు.. ఈ అభివృద్ధి పనుల L1 బిడ్‌ను ఆమోదించిన అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక ఆమోదం తెలిపింది. దీంతో, ఈ పనుల కాంట్రాక్ట్‌ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా (MEIL) సంస్థకు అప్పగించారు.
సామాన్య భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం..
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారికి అభిషేక సేవ నిర్వహిస్తున్న సమయంలోనూ సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి సేవలు, దర్శనం అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయ లక్ష్యంగా పేర్కొంది. వైకుంఠ ద్వార దర్శనాన్ని మరింత మంది భక్తులకు కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగా, శుక్రవారం రోజున అదనంగా 5,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైనులో వేచి ఉన్నారు. ప్రస్తుతం సుమారు 28,000 మంది సర్వదర్శన భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. సర్వదర్శన భక్తులకు సగటున 20 గంటల దర్శన నిరీక్షణ సమయం పడుతోంది. టీటీడీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నిన్న శ్రీవారిని 65,225 మంది భక్తులు దర్శించుకున్నారు.. 31,106 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ఇదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా వెల్లడించింది టీటీడీ.. అయితే, మూడు రోజుల్లో వైకుంఠ ద్వారం ద్వారా 2,02,000 పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. ఇక, అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించేందుకు టీటీడీ ఇవాళ నుంచి టోకెన్ లేకుండానే సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భక్తులను అవుటర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.
అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక వరద నియంత్రణ ప్రాజెక్టు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జోన్–8 పరిధిలోని ఉండవల్లి గ్రామం వద్ద పంపింగ్ స్టేషన్–2 నిర్మాణానికి సంబంధించిన టెండర్లను అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఖరారు చేసింది. వరదల సమయంలో 8,400 క్యూసెక్కుల నీటిని పంపింగ్ ద్వారా కృష్ణా నదిలోకి తరలించే లక్ష్యంతో ఈ పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాజధాని ప్రాంతంలో నీటి నిల్వలు ఏర్పడకుండా ముందస్తు శాశ్వత పరిష్కారం కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. టెండర్లలో L1 బిడ్‌గా నిలిచిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా (MEIL) సంస్థకు ఈ ప్రాజెక్టు పనులు అప్పగిస్తూ ADCL తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.443.76 కోట్ల అంచనా వ్యయంతో పంపింగ్ స్టేషన్–2 నిర్మాణాన్ని MEIL సంస్థ చేపట్టనుంది. ఈ పనుల్లో సర్వే, డిజైన్, నిర్మాణం మాత్రమే కాకుండా 15 ఏళ్ల పాటు స్టేషన్ కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు కూడా ఇదే సంస్థ నిర్వర్తించనుంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధులను క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA), ప్రపంచ బ్యాంక్ (World Bank), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) సహకారంతో సమీకరించనుంది. రాజధాని మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఈ ఫండింగ్‌ను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైలంలో చిరుత కలకలం.. ఓ ఇంటి ప్రాంగణంలో సంచారం..
శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం సృష్టించింది.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.. శ్రీశైలంలోని పాతాళగంగ సమీపంలో మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. స్థానికులు, భక్తులకు అలర్ట్ జారీ చేశారు.. శ్రీశైలం వచ్చే భక్తులు.. ముఖ్యంగా పాతాళ గంగలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేశారు.. అయితే, శ్రీశైలంలోని ఆదే గృహంలో గతంలో కూడా పలు సార్లు చిరుత సంచరించినట్టు అధికారులు చెబుతున్నారు.. దీంతో, స్థానికులు, భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ పునఃప్రారంభం.. కేసీఆర్ సభకి వస్తారా..?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ( జనవరి 2న) పునఃప్రారంభం కానున్నాయి. తొలి రోజు జరిగిన స్పల్పకాలిక చర్చలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఇక, ఇవాళ్టి సమావేశంలో ముఖ్యంగా ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరపనున్నారు. MNREGA పథకంలో మార్పులకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించుకోవడం ద్వారా రాష్ట్రాలపై పెను భారం మోపడానికి వ్యతిరేకంగా తెలంగాణ సర్కార్ ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. అలాగే, ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లోకి మున్సిపల్ శాఖ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం అంశంపై ప్రధానంగా చర్చతో పాటు తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ సవరణ బిల్లు కూడా అసెంబ్లీ ముందుకు రానుంది. ఇక, మోటార్ వెహికల్ ట్యాక్స్ సవరణ బిల్లుపై కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. రిజిస్ట్రర్ లో సంతకం చేసి, కాసేపటికేలో సభ నుంచి వెళ్లిపోయారు. ఇక, ఈరోజు నుంచి జరిగే సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లను ప్రకటించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ ఎంపిక చేసింది.
ఇండోర్‌లో జల విషాదం.. 11 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా పిలువబడే పట్టణంలో కలుషిత నీరు కారణంగా దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,400 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. 10 పదేళ్ల తర్వాత జూలై 8న ఒక బిడ్డ జన్మించాడు. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. కానీ కలుషిత నీరు కారణంగా మృత్యువు వెంటాడింది. పాలల్లో కలుషిత నీరు కలవడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పరిశుభ్రతకు మారుపేరు ఇండోర్ నగరం. అలాంటిది మంచి నీళ్ల పైప్‌లైన్‌లో డ్రైనేజీ వాటర్ కలిసింది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీళ్ల పైప్‌లైన్‌లో కలుషిత నీరు కలుస్తుందని ప్రజలు మొర్ర పెట్టుకున్నా పట్టించుకోలేదు. వాస్తవంగా భగీరత్‌పుర పైప్‌లైన్‌ను మార్చడానికి 2025 ఆగస్టులోనే టెండర్ దాఖలు చేయబడిందని వర్గాలు తెలిపాయి. రూ. 2.4 కోట్ల అంచనా వ్యయంతో దాఖలైంది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
అంతులేని విషాదం.. 47 మంది సజీవదహనం.. 115 మందికి గాయాలు
న్యూఇయర్ వేళ స్విట్జర్లాండ్‌లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో ఊహించని విపత్తు సంభవించడంతో పెను విషాదం చోటుచేసుకుంది. లగ్జరీ స్కీ రిసార్ట్ బార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 47 మంది చనిపోగా.. 115 మంది గాయాలు పాలైనట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి ‘ఫ్లాష్ ఓవర్’ కారణంగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నూతన సంవత్సరం వేళ క్రాన్స్-మోంటానాలోని ఆల్పైన్ రిసార్ట్‌లోని వందలాది మంది వినోదంలో మునిగిపోయారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తప్పించుకునేందుకు అందరూ ఒకే దగ్గరకు చేరారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొని కేకలు, అరుపులతో గడిబిడి జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి కాలిపోయారు. దాదాపు 47 మంది సజీవదహనం అయ్యారు. 115 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు.
తక్కువ చార్జీలు, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ప్రభుత్వ కొత్త Bharat Taxi రైడ్–హైలింగ్ సేవ..!
ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ (Bharat Taxi) పేరుతో కొత్త రైడ్–హైలింగ్ సేవను త్వరలో ప్రారంభించనుంది. న్యాయమైన చార్జీలు, పారదర్శక వ్యవస్థ, డ్రైవర్ సంక్షేమం, ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ సేవ రాబోయే కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాల్లో బీటా వెర్షన్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పంచకులాలో కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ‘భారత్ ట్యాక్సీ’ ప్రారంభాన్ని ధృవీకరించారు. ప్రైవేట్ ట్యాక్సీ యాప్‌లు డ్రైవర్ల ఆదాయంలో పెద్ద శాతం తీసుకుంటున్నాయనే దీర్ఘకాలిక ఫిర్యాదులకు ఈ కొత్త వ్యవస్థ పరిష్కారమని ఆయన అన్నారు. ఈ సేవ ద్వారా లాభమంతా డ్రైవర్ సోదరులకే దక్కుతుందని షా స్పష్టం చేశారు. డ్రైవర్ల ఆర్థిక భద్రత, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్ ట్యాక్సీ పూర్తిగా డ్రైవర్ ఫస్ట్ ప్లాట్‌ఫామ్‌గా రూపుదిద్దుకుంది. సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఈ సేవను నిర్వహించనుండగా.. అముల్, ఇఫ్కో (IFFCO), నాబార్డ్ (NABARD) వంటి ప్రముఖ సహకార సంస్థల మద్దతు ఉంది. మధ్యవర్తులను తొలగించి, రైడ్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం నేరుగా డ్రైవర్లకే అందేలా ఈ మోడల్ రూపొందించారు. రైడ్ చార్జీలతో పాటు వాహనాల్లో ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కూడా డ్రైవర్లకు కల్పించనున్నారు. ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే 51,000కు పైగా డ్రైవర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం.
2026లో విరాట్ కోహ్లీ ముందు మూడు భారీ రికార్డులు.. సాధిస్తాడా..?
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2025 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా 17 ఏళ్ల నిరక్షణకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో కలిసి ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు.. భారత జట్టుతో కలిసి చాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకున్నాడు. అంతేకాదు ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీనితో ఇప్పుడు 2026లో కోహ్లీ ముందర మరో మూడు కీలక మైలురాళ్లు సవాలుగా మారనున్నాయి. మరి ఆ సవాళ్లు, రికార్డుల సంగతేంటో చూద్దామా.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలవడానికి ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీకి కేవలం 339 పరుగులే కావాలి. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 259 ఇన్నింగ్స్‌ల్లో 8,661 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్ ఆల్‌టైమ్ టాప్ స్కోరర్ కూడా కోహ్లీనే. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 267 ఇన్నింగ్స్‌ల్లో 7,046 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే జట్టు ఆర్సీబీకి మాత్రమే ఆడాడు. గత మూడు ఐపీఎల్ సీజన్‌ల్లో ఏ సీజన్‌లోనూ అతను 600 పరుగుల కంటే తక్కువ చేయలేదు. ఇది చాలు అతని స్థిరత్వానికి నిదర్శనంగా చెప్పుకోవడానికి.
రో–కో దెబ్బకి 8 నిమిషాల్లోనే IND vs NZ తొలి వన్డే టికెట్స్ సోల్డ్ అవుట్..!
టీమిండియా జట్టును.. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడాలనే అభిమానుల ఉత్సాహం మరోసారి రుజువైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ (IND vs NZ 1st ODI) టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయాయి. 2026లో రోహిత్, కోహ్లీలు ఆడనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం, అలాగే 2025 డిసెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ తర్వాత వీరిద్దరూ కలిసి ఆడుతున్న తొలి మ్యాచ్ కావడం వల్ల ఆసక్తి మరింత పెరిగింది. జనవరి 1న బుక్‌మైషో వెబ్‌సైట్, యాప్‌లో IND vs NZ తొలి వన్డే టికెట్ల ఆన్‌లైన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే కేవలం 8 నిమిషాల్లోనే అన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయని నివేదికలు వెల్లడించాయి. ఇది రోహిత్, కోహ్లీ జోడీకి ఉన్న అపారమైన అభిమానాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ టికెట్లే పూర్తిగా అమ్ముడుపోయినప్పటికీ.. ఆఫ్‌లైన్ టికెట్ల అమ్మకాల తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన తాజా సిరీస్‌లలో అద్భుతమైన ప్రదర్శనలతో రోహిత్–కోహ్లీ తమ ఫామ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. 2027 ప్రపంచకప్ విషయంలో సందేహాలు వ్యక్తం చేసిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వ్యాఖ్యలను కూడా వీరి ఆటతో తిప్పికొట్టారు.
టీమిండియాకు కొత్త కోచ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
భారత మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జట్టుకు త్వరలో కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ వస్తారని పేర్కొంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) తర్వాత ఈ కోచ్ నియమితులవుతారని సమాచారం. కోచ్‌గా బీసీసీఐ ఒక విదేశీ అనుభవజ్ఞుడిని తీసుకొస్తుంది. WPL 2026 తర్వాత, భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో జట్టుకు కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అదనపు బలాన్ని తీసుకొస్తాడని బీసీసీఐ ఆశిస్తుంది. ఇంతకీ ఆ విదేశీ కోచ్ ఎవరు, ఆయనకు ఉన్న అనుభవం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇంగ్లాండ్‌కు చెందిన నికోలస్ లీని టీమిండియా మహిళా జట్టు కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నియమించాలని నిర్ణయించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ముగిసిన తర్వాత ఆయన జట్టులో చేరనున్నారు. ఈ సంవత్సరం WPL జనవరి 9న ప్రారంభమై ఫిబ్రవరి 5 వరకు కొనసాగుతుంది. ఇది ముగిసిన వెంటనే, భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరుతుంది. ఇక్కడ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9 వరకు వివిధ ఫార్మాట్లలో సిరీస్‌లు జరుగుతాయి.
2026లో అక్కినేని ఫ్యామిలీ నుండి డిఫరెంట్ జోనర్ మూవీస్
2022 బంగ్రారాజు హిట్ తర్వాత అక్కినేని హీరోలు నాగార్జున, చైతన్య, అఖిల్ సరైన హిట్ లేక స్ట్రగుల్ చేశారు. కానీ తండేల్ సక్సెస్ ట్రాక్ ఎక్కి… మూడేళ్ల ఫ్లాప్స్‌కు చెక్ పెట్టాడు చైతూ. నాగార్జున కూలీ, కుబేరలో నెగిటివ్ రోల్ చేసి అభిమానుల్ని కొంచెం శాటిస్పాక్షన్ చేయగలిగాడు. ఇక అఖిల్.. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మూడేళ్లుగా ఫ్యాన్స్‌తో టచ్ కోల్పోయాడు. 2025లో ఫ్యాన్స్‌ను అక్కినేని హీరోలు కాస్త కూస్తో శాటిస్పాక్షన్ చేసినా అది సరిపోలేదు. అందుకే 2026లో మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇయర్ నాగ్‌కు స్పెషల్ ఇయర్ కాబోతోంది. ఇప్పటి వరకు 99 సినిమాలు కంప్లీట్ చేసిన కింగ్ నెక్ట్స్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. తమిళ దర్శకుడు రా కార్తీక్ టేకప్ చేస్తున్న ఈ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నాగ్ స్పెషల్ మూవీ కావడంతో మనం తరహాలో చైతూ, అఖిల్ కూడా ఇందులో కీ రోల్ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య తండేల్ తర్వాత కార్తీక్ వర్మ దండు దర్వకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ వృష కర్మ చేస్తున్నాడు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత బెదురులంక ఫేం క్లాక్స్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడట. ఇక హలో తర్వాత సరైన హిట్ లేక ఏజెంట్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత మూడేళ్లుగా గ్యాప్ తీసుకున్న అఖిల్ కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ లెనిన్‌తో కంబ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా అక్కినేని హీరోలు త్రీ డిఫరెంట్ జోనర్స్‌తో ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
