Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

గుడ్‌న్యూస్‌.. ఇవాళే వారి ఖాతాల్లో సొమ్ము జమ..
రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సూపర్‌-6 హామీల అమలులో భాగంగా – అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది.. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 838 మంది రైతులు ఈ స్కీమ్​ ద్వారా లబ్ధిపొందనున్నారు.. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5,000 చొప్పున మొత్తం 2,342.92 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది.. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్‌’ పథకం కింద మొదటి విడతగా రూ.2,000 చొప్పున 831.51 కోట్ల రూపాయలను రైతులకు సాయం అందించనుంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.7,000 జమ కానున్నాయి.. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో కలిపి ఏడాదికి రూ.20,000 అందించనున్నట్టు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఆ హామీ అమలుకు సిద్ధమైంది.. ఇవాళ ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.. దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. ప్రతి రైతుకు ఏడాదికి 20వేల చొప్పున మూడు దపాలుగా ఆర్థిక సహాయం అందజేయనుంది ప్రభుత్వం.. తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల నగదును జమ చేయనున్నారు..

వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన.. వైసీపీ నేతలపై మరో కేసు నమోదు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. నెల్లూరు జిల్లాలో పర్యటించారు.. నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించిన ఆయన.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డికి ఇంటికి వెళ్లారు.. అయితే, జగన్‌ నెల్లూరు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్‌ కూడా చేయాల్సి వచ్చింది.. మరోవైపు.. జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.. జగన్‌ను చూసేందుకు వెళ్తూ ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారంటూ వైసీపీ నేతలపై దర్గామిట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. ఇప్పటికే ప్రసన్నకుమార్‌ రెడ్డిపై రెండు కేసులు నమోదు అయ్యాయి.. అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని వైసీపీ నేతలపై మరో కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశారు దర్గామిట్ట పోలీసులు..

రైతులకు గుడ్న్యూస్.. బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోడీ
దేశంలోని రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6,000 పెట్టుబడి సాయంగా అందిస్తుంది. దీన్ని మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడతల సాయం అన్నదాతలకు అందించగా.. ఈరోజు (ఆగస్టు 2) 20వ విడత పీఎం కిసాన్ నిధులను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. సుమారు 9.7 కోట్ల మంది రైతులకు సుమారు రూ.20,500 కోట్లకు పైగా నిధులను వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి మేజిస్ట్రేట్, కుమారుడు మృతి
జమ్మూకాశ్మీర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రియాసి కొండచరియలు విరిగిపడి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్యకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రాజిందర్ సింగ్ రాణా తన సొంత గ్రామానికి వెళ్తుండగా ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజిందర్ సింగ్ రాణా.. రియాసి జిల్లాలో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. రాజిందర్ సింగ్ రాణా తన కుటుంబంతో కలిసి ధర్మరి నుంచి తన స్వస్థలమైన పట్టియాన్‌కు వెళుతుండగా సలుఖ్ ఇఖ్తర్ నల్లా ప్రాంతంలో గురువారం రాత్రి కొండచరియల భాగంలో ఒక పెద్ద బండరాయి వాహనంపై పడింది. దీంతో కారులో ఉన్న రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్యకు గాయాలయ్యాయి. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

భారత్ గురించి ఆ మాట విన్నాను.. అలా చేస్తే మంచిదే
రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకోవడాన్ని అమెరికా ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం కారణంగానే ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ నిత్యం రుసరుసలాడుతూనే ఉంటున్నారు. భారత్ మంచి స్నేహితుడే గానీ.. రష్యాతో సంబంధాలు కారణంగానే 25 శాతం సుంకాలు విధించాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఆగస్టు 1 నుంచి భారత్‌పై 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. తాజాగా భారత్ గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తున్నట్లు విన్నానని.. అలా చేస్తే ఇది చాలా మంచి అడుగు అని ట్రంప్ ప్రశంసించారు. భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోదని అర్థమవుతుందన్నారు. ఈ మాటే తాను విన్నానని చెప్పుకొచ్చారు. తాను విన్నాది సరైందో కాదో తనకు తెలియదు గానీ.. ఒక వేళ అలా చేస్తే మాత్రం మంచి పరిణామం అన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం అని వ్యాఖ్యానించారు.

బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్ళమంటారా.. అంపైర్ పై కేఎల్ రాహుల్ ఫైర్..
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్, భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మధ్య మాటల తూటాలు కొనసాగాయి. రూట్ బౌండరీ కొట్టిన తర్వాత ప్రసిద్ధ్‌ను ఎగతాళి చేయగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక, పరిస్థితి తీవ్రతరమవడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్లు అహ్సాన్ రజా, కుమార్ ధర్మసేన జోక్యం చేసుకుని ఇరువురితో మాట్లాడారు.

స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ నుంచి.. మెలోడీ ట్రీట్
భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్ ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్‌కి రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించగా, మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాత‌లు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో స్పష్టమైంది. ఇందులో భాగంగా తాజాగా శుక్రవారం ఈ మూవీ నుంచి ‘గిబిలి గిబిలి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.

71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు చిరంజీవి శుభాకాంక్షలు..
భారతదేశ సినీ రంగానికి ఎంతో గౌరవదాయకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది” అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ప్రతి విజేతపై ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Exit mobile version