NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ.. ఏపీని సందర్శించండి..!
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది.. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలతో భేటీ అయిన ఆయన.. తాజాగా ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు.. రెడ్‌మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్‌ టీమ్‌.. మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి చేరుకున్నారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఎఎస్ అధికారిగా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేషంగా కృషిచేశారు. కృత్రిమ మేధ (ఎఐ), క్లౌడ్ కంప్యూటింగ్ లో లోతైన ఆసక్తి కలిగిన సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఆ సంస్థ పురోభివృద్ధికి కృషిచేస్తున్నారు. ఇక, లోకేష్ తో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ… మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉందని చెప్పారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ $3.1 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ కలిగి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ -డ్రైవెన్ సొల్యూషన్‌ రంగంలో బలమైన వృద్ధితో $211.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు. అయితే, విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటీ హబ్ గా రూపుదిద్దుకున్న విషయం మీకు తెలుసు. ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు వివరించారు మంత్రి నారా లోకేష్‌.. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నాం. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి మావద్ద అందుబాటులో ఉన్నాయి. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి మేం అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నాం అని వివరించారు.

అసిస్టెంట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ అనుమానాస్పద మృతి
తిరుపతిలో ఓ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. తిరుపతి రూరల్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న వెంకటప్రసాద్‌.. స్థానికంగా శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.. 2012లో తిరుపతికి చెందిన మాధురిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు వెంకట ప్రసాద్ .. అయితే, సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు వెంకట ప్రసాద్.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడం.. ఎంతకీ తిరిగి రాకపోవడం.. కనీసం సమాచారం కూడా లేకపోవడంతో.. చివరకు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.. అయితే, తనపల్లి దగ్గర ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. లాడ్జిలో ఉరికి వేలాడుతూ మృతదేహం కనిపించింది.. కానీ, వెంకట ప్రసాద్‌ మృతదేహంపై రక్తపు మరకలను గుర్తించారు పోలీసులు.. దీంతో.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. అయితే, కుటుంబ వ్యవహారాలతో వెంకటప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? లేదా? ఎవరైనా హత్య చేశారా? అనే అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..

ఇంట్లో టపాసులు పేలి అగ్నిప్రమాదం.. దంపతులు మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెయిన్‌ బజార్‌లోని ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వ ఉంచారు. ప్రమాదవశాత్తు వాటికి నిప్పంటుకోవడంతో ఉన్నట్టుండి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న మోహన్‌లాల్(55), ఉష(50) కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అక్రమంగా పెద్ద ఎత్తున ఇంట్లో టపాసులు నిల్వ చేసినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫార్మసీ కోర్సులకు10,436 సీట్లు కేటాయింపు
2024-25 విద్యా సంవత్సరానికి గాను బీ-ఫార్మసీ/ ఫార్మ్ డీ/ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి దశ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌లో మొత్తం 10, 436 సీట్లను కేటాయించారు. TGEAPCET (B) పరీక్షలో అభ్యర్థులు అర్హత సాధించారు. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 82, 163 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, మొత్తం 16, 500 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరుకాగా, 16, 145 మంది అభ్యర్థులు తమ ఆప్షన్‌లను వినియోగించుకున్నారు. మొత్తం 10, 854 సీట్లు ఉండగా, మొదటి దశలో 10, 436 సీట్లు కేటాయించగా, 418 సీట్లు భర్తీ కాలేదు. బయో మెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో 100 శాతం సీట్ల కేటాయింపు జరగగా, ఫార్మ్ డి కోర్సులో 98.7 శాతం సీట్లు, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్‌లో 95.9 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. బి ఫార్మసీలో 95.6 శాతం సీట్లు భర్తీ అయ్యాయి మరియు 392 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.

అమెరికాలో బ్యాలెట్ బాక్స్ ఫైర్.. విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ
అమెరికాలో బ్యాలెట్ బాక్స్‌లో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ ప్రాంతంలో రెండు బ్యాలెట్ పేపర్ డ్రాప్ బాక్స్ మంటలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదనంగా, వాషింగ్టన్ సమీపంలోని వాంకోవర్ ప్రాంతంలో జరిగిన రెండవ అగ్ని ప్రమాదంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఒరెగాన్‌లో బ్యాలెట్ బాక్స్ అగ్నిప్రమాదంపై వచ్చిన నివేదికపై అధికారులు స్పందించారని పోర్ట్‌ల్యాండ్ పోలీస్ బ్యూరో తెలిపింది. ఎఫ్ బీఐ సీటెల్ కార్యాలయ ప్రతినిధి స్టీవ్ బెర్ండ్ మాట్లాడుతూ.. ఫెడరల్ అధికారులు రాష్ట్ర, స్థానిక చట్ట అమలు సహాయంతో ఈ సంఘటనలను దర్యాప్తు చేస్తున్నారు. Multnomah కౌంటీ ఎన్నికల డైరెక్టర్ టిమ్ స్కాట్ బాక్స్ లోపల ఉన్న ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ దాదాపు మొత్తం బ్యాలెట్ పేపర్‌ను రక్షించిందని ధృవీకరించారు. శనివారం మధ్యాహ్నం, సోమవారం మధ్యాహ్నం మధ్య తమ బ్యాలెట్ పత్రాలను సమర్పించిన ఓటర్లు స్కాట్ చెప్పారు. వారికి ఏవైనా ఆందోళనలు ఉంటే వారు ముల్ట్‌నోమా కౌంటీ ఎన్నికల విభాగాన్ని సంప్రదించాలి. తమ బ్యాలెట్ పేపర్లు ప్రభావిత పెట్టెలో ఉన్నప్పటికీ, వారి ఓట్లు ఇప్పటికీ లెక్కించబడతాయని స్కాట్ ఓటర్లకు భరోసా ఇచ్చారు. తమ బ్యాలెట్ పేపర్లు ప్రభావిత పెట్టెలో ఉన్నప్పటికీ, వారి ఓట్లు ఇప్పటికీ లెక్కించబడతాయని ఓటర్లకు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు. వాంకోవర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. సోమవారం ఉదయం బస్ స్టేషన్‌లో మరో బ్యాలెట్ బాక్స్‌కు నిప్పు పెట్టారు. కాలిపోతున్న పెట్టె పక్కనే అనుమానాస్పద పరికరం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వందలాది బ్యాలెట్ పత్రాలు దెబ్బతిన్నాయని క్లార్క్ కౌంటీ ఎన్నికల కార్యాలయం తెలిపింది.

నీకు ఏమీ తెలియదు అంటూ.. ధోనీకే క్రికెట్‌ రూల్స్‌ నేర్పించిన సాక్షి!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్‌ కీపర్లలో ఒకడు, మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ కూడా. అంతేకాదు భారత్‌కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత అతడి సొంతం. అలాంటి లెజెండరీ ధోనీకే ఆయన సతీమణి సాక్షి క్రికెట్‌ రూల్స్‌ నేర్పించారట. ఈ విషయాన్ని స్వయంగా మహీనే వెల్లడించారు. ‘ఓరోజు నేను, సాక్షి ఇంట్లో క్రికెట్ మ్యాచ్‌ చూస్తున్నాం. మేం టీవీ చూస్తున్నపుడు క్రికెట్‌ గురించి మాట్లాడుకోము. ఆ రోజు మ్యాచ్‌లో బౌలర్‌ వైడ్‌ బాల్‌ వేశాడు. బ్యాటర్‌ షాట్‌ ఆడేందుకు క్రీజ్ నుంచి ముందుకు రాగా.. కీపర్‌ బంతిని అందుకుని స్టంపౌట్‌ చేశాడు. సాక్షి మాత్రం బ్యాటర్‌ అవుట్‌ కాదంది. అప్పటికే బ్యాటర్‌ పెవిలియన్‌కు వెళ్లిపోతున్నాడు. అయినా కూడా అంపైర్లు అతడిని వెనక్కి పిలుస్తారని, వైడ్‌ బాల్‌కు స్టంపౌట్‌ ఎలా ఇస్తారని నాతో వాదించింది. వైడ్‌ బాల్‌కి స్టంపౌట్‌ చేయొచ్చని, నో బాల్‌ వేసినపుడు మాత్రమే బ్యాటర్‌ స్టంపౌట్‌ కాడని సాక్షికి చెప్పాను’ అని ఎంఎస్ ధోనీ తెలిపాడు.

అన్ స్టాపబుల్ లో తొడకొట్టిన భాస్కర్.. ఫోటోస్ వైరల్
అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చారు. బావ బావమరుదులు కలిసి అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాలేజ్ స్టూడెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వరకు తన ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మిలియన్ వ్యూస్ ఈ ఎపిసోడ్ రన్ అవుతోంది. కాగా అన్‌స్టాపబుల్ రెండవ ఎపిసోడ్ ను దీపావళి కానుకగా స్ట్రీమింగ్ కు తీసుకురానుంది ఆహా. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ ను షూట్ చేసి రెడీ గా ఉంచింది అన్‌స్టాపబుల్ యూనిట్. అందులో దుల్కర్ సల్మాన్, సూర్య, అల్లు అర్జున్ ఎపిసోడ్స్ ఉన్నాయి, కాగా ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ గా దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ తీసుకురానున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో అన్ స్టాపబుల్ స్టేజి పై దుల్కర్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. అందుకు సంభందించి ఫొటోస్ రిలీజ్ చేసారు మేకర్స్.  బాలయ్య ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరని, అసలు అయన టాక్ షో హోస్ట్ గా, హాస్పిటల్ ఛైర్మెన్ గా, సినిమాలలో హీరోగా, హిందూపురం ఎమ్మెల్యే గా బ్యాలెన్స్ చేయడం మాములు విషయం కాదని టాక్ షో అనంతరం నటుడు దుల్కర్ సల్మాన్ తెలిపారు.

విజయ్ దేవరకొండ ‘పెళ్ళి చూపులు’.. అమ్మాయి ఎవరంటే..?
విజయ్ దేవరకొండా టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదట చిన్న చితక క్యారెక్టర్స్ చేసుకుంటూ పలు సినిమాల్లో నటించాడు. కానీ విజయ్ దేవరకొండ కెరీర్ కు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే పెళ్ళి చూపులు అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకోండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రౌడీ బాయ్ గా విజయ్ కు అమ్మాయిలలో విపరీతమైన ఫ్యాన్ బేస్ కలిగేలాచేసింది. గీత గోవిందంతో మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరాడు విజయ్. కానీ ఇటీవల కాలంలో వరుస ఫ్లోప్స్ తో విజయ్ కెరీర్ లో రేస్ లో వెనుకబడ్డాడు విజయ్. దింతో తన కెరీర్ కు ఫస్ట్ హిట్ ఇచ్చిన పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ కూడా కిడాకోలా సినిమా తరువాత సినిమాలు ఏవి చేయలేదు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించాలని తరుణ్ భాస్కర్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకు సంబంధించి ఇరువురి మధ్య కథ చర్చలు జరిగాయని విజయ్‌కి కథను వినిపించగా, అందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది. విజయ్ కు జోడిగా కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని సమాచారం. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో VD12 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కాప్ పాత్రలో కనిపించనున్నాడు అని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల శ్రీలంకలో శరవేగంగా జరుగుతోంది.

ఆదిత్య హాసన్ తో చిన్నకొండ.. షూట్ ఎప్పుడంటే..?
ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, తొలి చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ పుష్పక విమానం’ పర్వాలేదనిపించాడు. ఆ వచ్చిన ‘బేబీ’ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. హిట్ తో పాటు పలు అవార్డులు సైతం తెచ్చి పెట్టింది బేబీ. అదే జోష్ కానీ ఆ వెంటనే వచ్చిన ‘గంగం గణేశా’ చిన్నకొండకు నిరాశమిగిల్చింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్యతో మరోసారి జోడిగా ‘డ్యూయెట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇవే కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిన్న కొండ. తనతో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వినోద్ ఆనంతో మరో సినిమా అవకాశం ఇచ్చాడు ఆనంద్. ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమాను కూడా సైన్ చేసాడు ఈ హీరో. #90s వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ చెప్పిన కథకు ఆనంద్ పచ్చజెండా ఊపాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి లో మొదలెట్టనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆనంద్ దేవరకొండకు బేబీ కంటే బిగ్ హిట్ గా నిలుస్తుంది టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకుంటున్నాను ఆనంద్ దేవరకొండ.

Show comments